Pages - Menu

Pages

31, మార్చి 2021, బుధవారం

సూయజ్ కెనాల్ సంక్షోభం - జ్యోతిష్య విశ్లేషణ


సూయజ్  కాలువ అనేది మధ్యధరా సముద్రాన్ని ఎర్రసముద్రంతో కలుపుతూ కట్టబడిన ఒక కాలువ.  ఇదొక సన్నటి కారిడార్ లాంటిది. దీనిని 1859 - 1869 మధ్యలో పదేళ్ళపాటు నిర్మించారు. ఆఫ్రికా ఖండాన్ని ఆసియా ఖండంతో విడదీస్తున్న ఇది ఈజిప్టు దగ్గరలో ఉంది.

దీనిలో ప్రయాణించే ఓడలు ఆఫ్రికా చుట్టూ తిరిగి రాకుండా, ఉత్తరఅట్లాంటిక్ సముద్రం నుంచి ఉత్తర హిందూమహాసముద్రంలోకి ఈ దగ్గరిదారిలో నుంచి సూటిగా రావచ్చు. ఓడలు ఈ దారిలో ప్రయాణించడం వల్ల దాదాపుగా 7000 కి. మీ దూరం తగ్గుతుంది. దాదాపుగా పదిరోజుల ప్రయాణం కలిసొస్తుంది. ఏడాదికి వేలాది ఓడలు కార్గోని తీసుకుని ఈ దారిలో ప్రయాణిస్తూ ఉంటాయి.

23-3- 2021 న సరిగ్గా ఈ కెనాల్ లో ఒక ఓడ కూరుకునిపోయి ఆగిపోయింది. అటూ ఇటూ ఓడలన్నీ ఆగిపోయాయి. ప్రపంచవ్యాప్తంగా వేలకోట్ల డాలర్ల వ్యాపారం ఆగిపోయింది.  కోట్లాది మనుషుల జీవితాలు వారికే తెలీకుండా ప్రభావితమయ్యాయి. ఒకవారం తర్వాత 29 వ తేదీన ఈ ఓడను కదిలించగలిగారు. సంక్షోభం ముగిసింది. ఓడల రాకపోకలు తిరిగి మొదలయ్యాయి. సరిగ్గా ఒకవారం పాటు ప్రపంచ వ్యాపారం స్తంభించింది.

గ్రహాల పరంగా ఈ వారంలో ఏం జరిగింది? చూడండి.

సరిగ్గా 23 వ తేదీన శుక్రుడు సూర్యుడు మీనరాశి 8 వ డిగ్రీమీదకు వచ్చారు. శుక్రుడు తీవ్ర అస్తంగతుడయ్యాడు. అది ఉత్తరాభాద్ర నక్షత్రం. వింశోత్తరీ విధానం ప్రకారం దానికి అధిపతి శని.  అంటే,స్థంభన, ఆగిపోవడం, ఆలస్యం కావడం, నష్టం వాటిల్లడం మొదలైనవి. శుక్రుడు జలగ్రహం. అంటే ఓడలకు సూచకుడు మీనరాశి జలతత్వ రాశి. అంటే సముద్రానికి, నదులకు, కాలువలకు సూచిక. సరిగ్గా అదే రోజున Ever Given అనే జెయింట్ కంటైనర్ షిప్ సరిగ్గా సూయజ్ కెనాల్లో ఇసుకలో కూరుకునిపోయి ఆగిపోయింది. దీనిని పొడవు 400 మీటర్లు. లోతు 33 అడుగులు. బరువు దాదాపు 2,20,000 టన్నులు. 23 వ తేదీన ఇసుకలో కూరుకుపోయిన ఇది ఆరు రోజుల తర్వాత 29 వ తేదీన కదిలింది. ఈ ఆరు రోజులూ అటూ ఇటూ ఓడల రాకపోకలు ఆగిపోయాయి. ఇది అంతర్జాతీయ వ్యాపారాన్ని స్తంభింపజేసిన ఒక పెద్ద సంఘటనే.

జలరాశియైన మీనంలో శుక్రుని తీవ్ర అస్తంగత్వం, దానిపైన శనిదృష్టి ఈ సంఘటనకు ప్రేరకాలు. గతవారంగా జరుగుతున్న అనేక అంతర్జాతీయ సంఘటనలకు ఈ గ్రహస్ధితే ప్రేరకం.

ఈ క్రింది పట్టికను గమనించండి.

23 వ తేదీన శుక్రుడు తీవ్ర అస్తంగత్వంలో ఉన్నాడు. అదేరోజున ఈ ఓడ ఇసుకలో కూరుకుపోయింది. ఈ స్థితి నాలుగు రోజులపాటు అంటే, 26 వ తేదీవరకూ కొనసాగింది. ఆ నాలుగురోజులూ ఓడ కదలలేదు. 27 వ తేదీన సూర్యుని పట్టునుంచి శుక్రుడు దూరం జరగడం మొదలైంది.  అదే రోజున ఓడ కదిలే సూచనలు కనిపించాయి. మరో రెండు రోజులలో 29 వ తేదీనాటికి ఓడ కదిలి ఇవతలకు వచ్చింది. దాని అడ్డు తొలగడంతో రవాణా ఓడల రాకపోకలు మళ్ళీ మొదలయ్యాయి.

ఇది కాకతాళీయమంటారా? ఇంత స్పష్టంగా గ్రహస్థితికీ ఓడ కదలికలకూ సంబంధం కనిపిస్తుంటే, లేదని కాదని ఎలా అనగలం చెప్పండి?

'Ever Given' Ship

ఈ ఇంగిలీషు పదంలో తొమ్మిది అక్షరాలున్నాయి. నా విధానంలో జ్యోతిష్య - సంఖ్యాశాస్త్రం ప్రకారం తొమ్మిది అంకె చంద్రునికి సూచిక. చంద్రుడు కూడా ఓడలకు సూచకుడే. ఇతడు కూడా జలగ్రహమే. ఈ వారం రోజులలో చంద్రుని పరిస్థితి గమనిద్దామా?

23 వ తేదీన జలరాశియైన కర్కాటకంలో సున్నా డిగ్రీలలో చాలా బలహీనుడుగా ఉన్నాడు. ఓడ ఇసుకలో కూరుకుపోయినది ఆ రోజునే.

24 వ తేదీన బలమైన శనిదృష్టి చంద్రునిపైన ఉన్నది. ఓడలో కదలిక 
ఆగిపోయింది.

25 వ తేదీన చంద్రుడు బలహీనంగా ఉన్నాడు. శనిదృష్టి కూడా బలహీనపడింది.  ఇసుకను త్రవ్వి ఓడను కదిలించే ప్రయత్నాలు మొదలయ్యాయి.

26 వ తేదీన జలతత్వరాశియైన కర్కాటకంలోనుంచి చంద్రుడు బయటపడి సింహరాశిలోకి  అడుగుపెట్టాడు. ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి.

27 వ తేదీన బలమైన బుధదృష్టివల్ల టెక్నీకల్ నిపుణులు రంగంలోకి దిగి ప్రయత్నాలు సాగించారు.

29 వ తేదీన ఊబినుంచి కదిలి ఓడ బయటకొచ్చింది. చంద్రునిస్థితికీ ఈ మొత్తం ఆపరేషన్ కూ సంబంధం ఉందా లేదా మరి?

ఇప్పుడు చెప్పండి గ్రహస్థితులకూ భూమ్మీద జరిగే సంఘటనలకూ సంబంధం లేదంటారా? ఉందని నేనంటాను. లేదని మీరంటే మీకు  లోతైన గమనింపు లేదని అర్ధం.  దీనిని కూడా కాదంటారా? సరే మీ ఇష్టం మరి !