రాత్రి భోజనం చేస్తూ ఉండగా ఫోన్ మ్రోగింది.
ఎవరా అని చూస్తే రవి. సామాన్యంగా ఉదయంపూట మాత్రమే రవి ఫోన్ చేస్తూ ఉంటాడు. ఆ సమయంలో అమెరికా శిష్యురాళ్ళతో మాట్లాడుతూ ఉంటాను గనుక అతడి ఫోన్ ఎత్తను. అందుకని ఈ టైంలో చేశాడా అనుకుంటూ 'హలొ రవి' అన్నా.
'ఏం చేస్తున్నావ్?' అడిగాడు తాపీగా.
'ఇప్పుడే సాంగ్స్ అయిపోయాయి. డాన్స్ చెయ్యబోతున్నా' అన్నా అంతకంటే తాపీగా.
'అదేంటి డాన్స్ కూడా వచ్చా నీకు? ఇన్నేళ్ల తర్వాత కొత్తకోణాలు కనిపిస్తున్నాయే?' అడిగాడు వింతగా.
'అవును. ఇప్పుడే కదా టీనేజిలోకి అడుగుపెడుతున్నాను. నువ్వెంటి అప్పుడే ముసలాడివై పోయావా? స్పెషల్ చ్యవనప్రాశ్ విత్ గోల్డ్ వాడటం లేదా?' అడిగా నవ్వుతూ.
'సరేలే ఏంటి నముల్తున్నావ్?' అడిగాడు మళ్ళీ.
'ఈ టైంలో ఏం నములుతం చెప్పు? అన్నం తింటున్నా. సరేలేగాని, నువ్వెంటి ఈ టైంలో?' అడిగాను.
'పొద్దున్నే ఫోన్ చేస్తే యోగా అంటావు. కొంచం సేపయ్యాక ఫోన్ చేస్తే అమెరికా శిష్యురాళ్లంటావు. ఆఫీస్ టైంలో పలకవు. సాయంత్రం ఫోన్ చేస్తే మార్షల్ ఆర్ట్స్ అంటావు. అందుకని రాత్రి తొమ్మదికి ఫిక్సయ్యా' అన్నాడు.
'సరే ఏంటి సంగతి చెప్పు' అన్నా.
'ఏం లేదు. అందరూ కరోనా వాక్సిన్ వేసుకుంటున్నారు. మన బాస్ కూడా వేసుకున్నాడు. నన్నూ వేసుకోమంటున్నారు. నువ్వూ వస్తే మనిద్దరం వెళ్ళొద్దాం' అన్నాడు.
'నాకొద్దులే. నువ్వెళ్ళి పొడిపించుకో' అన్నా.
'అదేంటి? అందరూ వేసుకుంటున్నారు. భయమా?' అన్నాడు.
'అదేం లేదులే. క్లాసికల్ హోమియోపత్స్ వాక్సిన్లను నమ్మరు. మాకొద్దు' అన్నా.
'మరి రక్షణ ఎలా?' అడిగాడు.
'అందరికీ ప్రభువే రక్షణ' అన్నా నవ్వుతూ.
'అదికాదు. సీరియస్. మరి కరోనా నుంచి ప్రొటెక్షన్ ఎలా?' అడిగాడు.
'హోమియో వాడేవాళ్ళకి వాక్సిన్ అవసరం లేదు' అన్నా.
'అదేంటి?' అన్నాడు అయోమయంగా.
'అవును. వైద్యజ్యోతిష్యం పుస్తకంలో చూడు. కొన్ని కేసులలో వాక్సిన్ల సైడ్ ఎఫెక్ట్స్ గురించి చర్చించా. నా దృష్టిలో హోమియోపతిక్ ప్రోఫిలాక్టిక్స్ వాడితే చాలు. వాక్సిన్ అవసరం లేదు' అన్నాను.
'ఓరి నీ హోమియో పిచ్చి ! డేంజరేమో ఆలోచించు' అన్నాడు.
'ఓరి నీ వాక్సిన్ పిచ్చి ! ప్రచారాలకు పడిపోకు' అన్నా నవ్వుతూ.
ఆ తర్వాత అదీ ఇదీ మాట్లాడి ఫోన్ పెట్టేశాడు రవి.
భోజనం ముగిసింది. టైం తొమ్మిదిన్నర అయింది. గేట్లు వెయ్యాలి. నేనుండే బంగళాకు రెండు గేట్లుంటాయి. ఒకటి పెద్దగేటు. అది ఇంటికి రెండొందల మీటర్ల దూరంలో ఉంటుంది. దానికి తాళం వేసి వస్తూ వస్తూ చిన్నగేట్టు తాళం వేసి, తోటలోని చెట్లలోనుంచి నడుస్తూ ఇంటి వాకిలి దగ్గరకు రావాలి. ఇది ప్రతిరాత్రీ నా రోజువారీ దినచర్య. నిజం చెప్పొద్దూ? రాత్రిపూట ఈ నిర్మానుష్య కాలనీలో, ఈ బంగళాలో, ఈ చెట్లమధ్యన నడుస్తూ పోతుంటే కొంచం భయంగానే ఉంటుంది. అప్పుడప్పుడూ ఒళ్ళు ఝల్లుమంటూ ఉంటుంది కూడా! అసలైతే, నేనీ బంగళాలో చేరిన కొత్తలో ఇది భూత్ బంగళా అని నన్ను భయపెట్టబోయాడు రవి.
'అవునా ! అలా అయితే మరీ మంచిది. నేను ఇక్కడకు రావడం వల్ల ఇక్కడున్న దయ్యాలకు మోక్షం వస్తుందిలే, నువ్వు భయపడకు' అని నవ్వేశాను. నవ్వానేగాని లోలోపల పీచుపీచుమంటూనే ఉంటుంది మరి ! అయినా సరే, కొన్నిసార్లు రాత్రి పన్నెండువరకూ హాల్లొ ఒక్కడినే కూచుని, గజగజా వణికిపోతూ, నెట్ ఫ్లిక్స్ లో హర్రర్ మూవీస్ చూస్తూనే ఉంటాను. కానీ అదేంటో మరి? మోక్షం ప్రసాదిద్దామంటే, ఒక్క దయ్యం కూడా ఇప్పటివరకూ కనిపించలేదు. బహుశా వాటికి కూడా నన్ను చూస్తే హడలెత్తి ఉంటుంది !
యధాలాపంగా, నిన్న కూడా భోజనం అయ్యాక గేట్లు తాళాలు వేసి వద్దామని బయల్దేరాను. పెద్ద గేటుకు తాళం వేసి చెట్లలోనుంచి నడుస్తూ లోపలకు వస్తున్నాను. వెనుక ఎవరో ఫాలో అవుతున్నట్లు అనిపించి వెనక్కు చూశా. ఎవరో ఒకమ్మాయి మూతికి మాస్క్ వేసుకుని కొంచం దూరంలో నడుస్తూ వస్తోంది. మాస్కున్నా సరే, చూస్తూనే కర్ణపిశాచిని గుర్తుపట్టా. మా బంధం ఇప్పటిది కాదు కదా మరి !
కానీ తెలీనట్లు నటిస్తూ ' ఏయ్ అమ్మాయ్ ! ఎవరు నువ్వు? గేట్ వేసి ఉండగానే లోపలకెలా వచ్చావు? ఎందుకు నా వెంట వస్తున్నావు?' అడిగా.
అదో రకంగా నవ్వింది కర్ణపిశాచి.
'ఎక్కువ నటించకు. ఎవార్డు రాగలదు' అంది గోదారి జిల్లా యాసలో.
'అబ్బో . తూగో నించా రాక? ఏంటి కధ? ఎవర్నువ్వు?' అన్నా మళ్ళీ.
'నీ నాటకాలు నీ శిష్యుల దగ్గర వేసుకో, నమ్ముతారు, నా దగ్గర కాదు' అంది ఇంకా దగ్గరకొస్తూ.
నేనూ నవ్వేస్తూ 'నీ నాటకాలేంటి మరి? ముఖానికి ఆ మాస్కేంటి? ఆగాగు. అక్కడే ఆగు. సోషల్ డిస్టెన్స్ ఉండాలి' అన్నా ఉడికిస్తూ.
'కరోనా వాక్సినే వద్దనేవాడికి సోషల్ డిస్టెన్స్ ఎందుకో?' అడిగింది ఇంకా దగ్గరకొస్తూ మళ్ళీ అదే యాసలో.
'అంతా విన్నావన్న మాట' అన్నా నీరసంగా.
'నా పనే అది కదా ! ఎవరేం చెప్పుకుంటున్నారో వినడమే కదా నా పని. రోజూ నేనుకూడా నీతోపాటు హర్రర్ మూవీస్ చూస్తున్నా నీ పక్క సోఫాలో కూచుని, తెలుసా నీకు?' అడిగింది.
'నీ నాటకాలు మీ పిశాచాల దగ్గర వేస్కో. నా దగ్గర కాదు' అన్నా ఉడికిస్తూ.
'నిజ్జం, నీమీదొట్టు' అంది ఇంకా దగ్గరకొస్తూ.
'అవునా? అయితే చెప్పు, ప్రస్తుతం ఏం చూస్తున్నానో నెట్ ఫ్లిక్స్ లో?" అడిగాను.
'పరీక్షలా మాకు ! 'యాష్ వెర్సస్ ఈవిల్ డెడ్' సీరీస్ సెకండ్ సీజన్ చూస్తున్నావ్' అంది.
'ఆమ్మో. కనిపించొచ్చు కదా మరి ! నాతోబాటు నీకూ టీ ఇచ్చేవాడిని కదా' అన్నా నవ్వుతూ.
'మాకు టీ ఎక్కడ సరిపోతుంది? మీ శిష్యురాలు తెచ్చిచ్చిన బాటిల్ ఇస్తే బాగుంటుంది' అంది నవ్వుతూ.
' ఆ బాటిల్ సంగతి నీకూ తెలిసిపోయిందా?' అన్నా ముని స్టైల్లో నటిస్తూ.
' ఇక చాల్లే ఆపు నీ నాటకాలు. పాపం మీ ఫ్రెండ్ భయస్తుడు. అతనికోసమన్నా వేసుకోరాదు వాక్సిన్?' ప్రాధేయపడింది.
'ఆ ! నువ్వూ రా తోడు. మనిద్దరం వేసుకుందాం వాక్సిన్' అన్నా నవ్వుతూ.
తనూ నవ్వేసింది.
'ఏంటి ఈ మధ్య బిజీనా? అస్సలు దర్శనాల్లేవు? మీ చెల్లెలు కన్నెపిశాచి కూడా కనిపించడం లేదు?' అడిగా నడుస్తూ.
'మేం బిజీ కానిదెప్పుడు? క్షణం తీరికలేదు దమ్మిడీ ఆదాయం లేదంటే మా బ్రతుకే' అంది నిట్టూరుస్తూ నడుస్తూనే.
'సర్లే బాధపడకు. మీకూ మంచిరోజులొస్తాయి. పడ్డవాళ్ళు చెడ్డవాళ్లు కారు, నవ్విన నాపచేనే పండుతుంది' అంటూ ఇంకా ఏదో చెప్పబోయా
'ఆపుతావా సోది సామెతలు. అలాంటివి నన్ను చెప్పమంటే లక్ష చెబుతా నీకు వినే ఓపికుంటే' అన్నది.
'సర్లే ఏంటి ఇలా వచ్చావ్?' అడిగా..
'నువ్వంటే దిగులు పుట్టింది. ఒకసారి చూసిపోదామని వొచ్చా' అంది.
'ఛా! నిజమా' అడిగా హాశ్చర్యపోతూ !
'అదే మరి ! రాజమండ్రి నుంచి నార్త్ ఇండియాకు పోతున్నా. దార్లో క్రిందికి చూస్తే నువ్వు గేటు వేస్తూ కనిపించావు. సర్లే ఒకసారి పలకరిద్దామని దిగా. సరదాగా మాస్క్ వేస్కుని కనిపించా. అంతే, సింపుల్' అంది.
'ఓ అదా సంగతి ! ఏంటి కబుర్లు?' అడిగా నడుస్తూనే.
'ఏమున్నాయి. నడుస్తోంది ప్రపంచం' అంటూ మా శిష్యుల గురించీ, మా బంధువుల గురించీ, కొన్ని చాడీలు చెపింది తను.
'అవునా' అంటూ తెగ ఆశ్చర్యపోయా మళ్ళీ.
'ఆ నటనే వద్దనేది. సర్లే నే పోతున్నా, మీ ఆవిడ ఇటే చూస్తోంది అనుమానంగా. ఆవిడకి ఎమ్ చెప్పుకుంటావో చెప్పుకో. వస్తా పనుంది. బై' అంటూ గాల్లోకి నిలువుగా ఎగిరిపోయి చీకట్లో మాయమైపోయింది.
చిన్నగేటుకు కూడా తాళం వేసి, చెట్లలోనుంచి గార్డెన్లో నడుచుకుంటూ ఇంట్లోకి వచ్చా. మా ఆవిడ అక్కడే నిలబడి నావైపే తీక్షణంగా చూస్తోంది.
'ఏంటి?' అన్నా సాధ్యమైనంత మామూలుగా ఉండటానికి ప్రయత్నిస్తూ.
'ఏంటది? చీకట్లో మీలో మీరే చేతులు తిప్పుకుంటూ మాట్లాడుకుంటూ వస్తున్నారు. మధ్యలో ఆకాశంలోకి చూస్తూ నిలబడిపోయారు ?' అడిగింది అనుమానంగా.
నా వేషాలు మొదట్నుంచీ చూస్తున్నా కూడా, ఈనాటికీ ఇంకా కొన్ని అనుమానాలున్నాయి తనకి.
'అదా ! ఆబ్బె అదేం లేదు. కరోనా గురించి రవితో ఇందాక మాట్లాడా కదా ! బ్రెయిన్ కి కరోనా ఎక్కినట్లుంది. పిచ్చి పిచ్చిగా ఉంది. రేప్పొద్దున వాక్సిన్ పొడిపించుకుంటా'. అన్నా నవ్వుతూ.
'మీ నాటకాలు నా దగ్గర కాదు. మీ శిష్యుల దగ్గర వేసుకోండి నమ్ముతారు' అంది శ్రీమతి సీరియస్ గా.
'ఖర్మరా బాబు ! భార్యా నమ్మక, శిష్యులూ నమ్మక, మనుషులూ నమ్మక చివరికి పిశాచాలు కూడా నమ్మకపోతే నేనేం చెయ్యాలి? ఇలా లాభం లేదు. రేప్పొద్దున్నే వెళ్లి కరోనా వాక్సిన్ బ్రెయిన్ కి పొడిపించుకోవాల్సిందే' అని గట్టిగా నిర్ణయించుకుని, 'అసలిదంతా నీ వల్లే జరిగింది. నువ్వు కనిపించకపోతే నీతో మాట్లాడేవాడినే కాను. ఇప్పుడు చూడు మా ఆవిడ ! నాకు పిచ్చనుకుంటోంది' అని కర్ణపిశాచిని తిట్టుకుంటూ దుప్పటి ముసుగేసి నిద్రకుపక్రమించాను.
నిద్రలోకి జారుకుంటున్న నాకు 'ఆపు నీ నాటకాలు ! నా దగ్గరకాదు. నీ శిష్యులదగ్గర వెయ్యి నమ్ముతారు' అని నవ్వుతున్న కర్ణపిశాచి స్వరం క్లియర్ గా వినిపించింది.