Pages - Menu

Pages

19, ఏప్రిల్ 2021, సోమవారం

కరోనా రెండవ రాకడ - 2021 - గ్రహాలేమంటున్నాయి?

'యేసు త్వరగా వచ్చుఁచున్నాడు సిద్ధపడుడీ --  పడుడీ' అని క్రైస్తవసోదరులు రెండువేల ఏళ్ళనుంచీ మొత్తుకుంటూనే ఉన్నారు. కానీ ఆయన రావడం లేదు. బహుశా మనల్ని, మనలాంటి మనుషుల్నీ చూసి భయపడి ఉంటాడు. లేదా పాతగాయాలు ఇంకా మాని ఉండవు. మానాక చూద్దాంలే అని జర్నీ పోస్ట్ ఫోన్ చేసుకుని స్వర్గంలో ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉండి ఉండవచ్చు.  లేదా, ఈ మధ్యలోనే ఇంకో వేషంలో వచ్చి  వెళ్ళిపోయినా మనం గుర్తించలేకపోయి ఉండవచ్చు. ఇదెలా సాధ్యమంటూ  ఎక్కువగా హాచ్చర్యపోకండి. తుమ్ము రాగలదు !

'నేనే భగవంతుడి అవతారాన్ని' అని రామకృష్ణుడన్నాడు. ఓపెన్ గా అనకపోయినా తన ఇన్నర్ సర్కిల్ భక్తులతో అన్నాడు. ' ఇంతకుముందు జీసస్ గా, చైతన్య మహాప్రభువుగా వచ్చింది తనేనని ఆయనన్నాడని మహేంద్రనాధ్ గుప్తాగారు వ్రాశారు. ఆ మాట తనతోనే అన్నాడని కూడా ఆయన వ్రాశారు. ఇంకో నూరేళ్ళ తర్వాత మళ్ళీ తానొస్తానని అప్పుడు చాలామంది ముక్తిని పొందుతారని, అటు తర్వాత మాత్రం మానవజాతి చాలాకాలం ఆగవలసి ఉంటుందని కూడా ఆయనన్నాడు. కానీ ఆయన మాటల్ని ఎవ్వరూ నమ్మలేదు. ఏదో పిచ్చెక్కి మాట్లాడుతున్నాడని ఎక్కువమంది అనుకున్నారు.

అప్పటికే పాత అవతారాలైన శ్రీరాముడు శ్రీకృష్ణుల భక్తులున్నారు. వాళ్ళెవరూ ఆయన్ను నమ్మలేదు. 'అప్పుడు నేనేరా వచ్చింది, ఇప్పుడు ఇలా వచ్చాను' అని ఆయన అన్నా కూడా ఎవరూ నమ్మలేదు. విసుగొచ్చి ఆయనెళ్లిపోయాడు.

దాదాపుగా నూరేళ్ళ తర్వాత మెహర్ బాబా వచ్చారు.  'నేనే భగవంతుడి అవతారాన్ని' అంటూ ఓపెన్ గా డిక్లెర్ చేసింది ఈ కాలంలో  ఆయనొక్కడే. కానీ అందరూ నమ్మలేదు. విచిత్రమేమంటే రాముడి భక్తులూ నమ్మలేదు, కృష్ణుడి భక్తులూ నమ్మలేదు. యధావిధిగా రామకృష్ణుని భక్తులూ నమ్మలేదు. ఆయనేమో ' మీరెంత ఎదురుచూసినా, ఇంకో 700 ఏళ్లదాకా ఎవడూ రాడు. ఆ తర్వాత మళ్ళీ నేనే ఇంకో వేషంలో వస్తాను. అప్పటిదాకా ఇలాగే చస్తూ బ్రతుకుతూ ఉండండి' అని చెప్పి చక్కాపోయాడు.

ఈలోపల సందట్లో సడేమియా అన్నట్లు, కొందరు దొంగబాబాలూ, గడ్డంస్వాములూ 'మేమే దేవుడి అవతారాలం' అంటూ ప్రచారాలు చేయించుకుని డబ్బులు పోగేసుకున్నారు. పిచ్చి గొర్రెలు వాళ్ళచుట్టూ చేరి భజనలు చేసి మోసపోయారు. వాళ్ళ టైం అయిపోగానే వాళ్ళెళ్ళి పోయారు. భజన బృందాలకు దిక్కు దివాణం లేకుండా పోయింది.

జీసస్ భక్తులైతే వీళ్ళలో ఎవరినీ నమ్మలేదు. వాళ్ళు ఆయనకోసమే మొండిగా ఎదురుచూస్తున్నారు. డొక్కలో బల్లెం పోట్లతో సహా, ఆయన ఒర్జినల్ వేషంలో ఆయనొస్తే తప్ప, వాళ్ళు ఎవరినీ నమ్మరు. అంటే ఏంటి? దేవుడైనా సరే, మన ఇష్టమైన వేషంలో, డ్రస్సులో రావాలి. అంతేగాని ఆయనిష్టమొచ్చినట్లు కనిపిస్తే మనం నమ్మం. మళ్ళీ అందరూ భక్తులే. దేవుడికి కనీసం డ్రస్సుమార్చుకునే చాన్సు కూడా వీళ్లివ్వరు. భలే ఉంది కదూ !

ఇదంతా చూస్తుంటే నాకొక పాతసామెత గుర్తొస్తోంది. 'అందరూ వైష్ణవులే బుట్టలో చేపలు మాత్రం మాయం !' అనేదే ఆ సామెత. సర్లే, ఈ ఆధ్యాత్మిక సోది ఎప్పుడూ ఉండేదేగాని కాసేపు దాన్నొదిలేసి ప్రస్తుతంలోకి వద్దాం. 

యేసుకోసం ఆకాశంలోకి చూస్తుంటే ఈలోపల పక్కనుంచి కరోనా మళ్ళీ వచ్చి గూబ గుయ్ మనిపించింది.

'నువ్వింకా పోలేదా? వాక్సినన్నారు అదన్నారు ఇదన్నారు. ఇంకా ఉన్నావేంటి?' అంటే 'అబ్బా ఎంతాశో మీకు? ఎక్కడికిరా పోయేది? మిమ్మల్ని తీసుకుపోకుండా నేనెక్కడికి పోతాను?' అంటోంది. అసలేంటి దీనిగోల?

జ్యోతిష్కులేమో డిసెంబరులో పోతుంది, మార్చిలో పోతుంది, మేలో పోతుంది అని రోజుకొక్క నెల పేరు చెబుతున్నారు. ఆదిమాత్రం ఎక్కడికీ పోవడం లేదు. రోజురోజుకీ ఇంకా ఇంకా  ఎక్కువౌతోంది. మళ్ళీ లాక్ డౌన్లు మొదలౌతున్నాయి.

మహారాష్ట్ర ఏరియాలో అకోలా టౌన్లో నా కంట్రోల్లో పనిచేసే ఒక ఇన్స్పెక్టర్ మొన్న ఆదివారంనాడు చనిపోయాడు. శనివారం ఆయన భార్య చనిపోయింది. ఆదివారం ఈయన పోయాడు. రెండే రెండురోజుల్లో ఇద్దరూ పోయారు. గుంటూరులో నాతో  కలసి పనిచేసిన ఒక మెకానికల్ ఇంజనీర్ నిన్న చనిపోయాడు. మా శిష్యురాలి మేనత్త భర్త నాల్రోజులనాడు కరోనాతో హైదరాబాద్లో చనిపోయాడు. ఈ విధంగా ప్రతిరోజూ మళ్ళీ చావువార్తలు వింటున్నాం. ఇక్కడ హైదరాబాద్ లో మా దగ్గర పనిచేస్తున్న స్టాఫ్ లో పదిమందిదాకా గత మూడ్రోజుల్లో పాజిటివ్ వచ్చింది. ప్రస్తుతం అందరూ హౌస్ అరెస్ట్ లో ఉన్నారు. అందరికీ మళ్ళీ గుండెల్లో దడ మొదలైంది. బట్టలు తడుస్తున్నాయి.

ఏంటి ఇలా జరుగుతోంది? ఇదెంటో కొంచం చూడొచ్చుకదా అని కర్ణపిశాచాలు చెవిలో జోరీగల్లా పోరుపెడుతూ అడుగుతున్నాయి. సరే చూద్దాం !

గురువు ఏడాదినుంచీ నీచస్థితిలో ఉన్నాడు. అది పోయాక గురువు కుంభంలోకి వచ్చాక కరోనా పోతుంది అని కొందరు జ్యోతిష్కులు గతంలో అన్నారు. గురువు కుంభంలోకి మారాక కరోనా మళ్ళీ విజృంభించింది, రెండవ రాకడ వచ్చింది. ఇదేంటి గోల? అసలీ జ్యోతిష్కుల లెక్కలు ఎప్పుడు కరెక్ట్ అవుతాయో ఏంటో? ఒక్కసారి కూడా కరెక్ట్ గా చెప్పి చావరు. సరే వినండి !

గురువునీ శనినీ చూసుకుంటూ అసలైన రాహువుని మర్చిపోయారు అందరూ. గ్రహాలన్నింటి లోకీ అతిబలమైన గ్రహం రాహువు. విషవ్యాధులకు కారకుడూ సూచకుడూ ఆయనే.  ఆయన్ని మరచిపోయి ఏవేవో లెక్కలేస్తున్నారు ఘనతవహించిన జ్యోతిషక విదూషకులు. అందుకే ఆ లెక్కలు డొక్కలౌతున్నాయి.

గ్రహస్థితిని కొంచం గమనిద్దాం.

ప్రస్తుతం కుంభరాశిలో వేగంగా ముందుకెళుతున్న గురువుగారు జూన్ 20 న మళ్ళీ వక్రీకరించి వెనక్కు మళ్లుతారు. ఆ విధంగా వెనక్కు ప్రయాణించి సెప్టెంబర్ 14 న మకరంలోకి వస్తారు. అంటే జూన్ 20 నుంచి సెప్టెంబర్ 13 వరకూ ఆయనకు వక్రస్థితి. అక్కడనుంచీ ఋజుగతిలోకి వచ్చిన ఆయన నవంబర్ 19 న మళ్ళీ కుంభంలోకి ప్రవేశిస్తారు. 

ఈ గ్రహస్థితులు ఫలితంగా - జూన్ వరకూ కరోనా విజృంభణ ఇలాగే కొనసాగుతుంది. ఆ తర్వాత పరిస్థితి అదుపులోకి వస్తుంది. సెప్టెంబర్ నుంచీ ట్రెండ్ రివర్స్ అయ్యి నవంబర్లో మళ్ళీ పెరుగుతుంది. ఇదేమీ ఒక నెలా రెండు నెలలలో పోయే మహమ్మారి కాదు.

మరెప్పుడు దీనినుండి మనకు విముక్తి? రాహువు గోచారంలో జవాబు దాగుంది. రాహువు మేక్రో పిక్చర్లో శని గురువుల గోచారాన్ని మైక్రో లెవల్లో అర్ధం చేసుకుంటే కరెక్టుగా విషయం అర్ధమౌతుందిరా పిచ్చి జ్యోతిష్కుల్లారా !

ఏప్రిల్ 13 - 2022 న రాహువు వృషభాన్ని విడచి మేషంలోకి ప్రవేశించేవరకూ కరోనా బెడద మనకు తప్పదు. అంటే ఇంకా ఏడాదిపాటు కరోనా విశ్వరూపాన్ని మనం చూస్తూనే ఉంటాం  -  ఈలోపల  మనం పోకుండా బ్రతికుంటే !

మరి దీనికేమీ రెమెడీలు లేవా? అంటే ఎందుకు లేవూ తప్పకుండా ఉన్నాయ్.

'చేసిన పాపములకు పశ్చాత్తాపపడుడి, మళ్ళీ వాటిని చేయకుండా ఉండుడి, మారుమనస్సు పొందుడి, ప్రార్ధించుడి, మీ ఖర్మను మీరు అనుభవించుడి. టైం వస్తే పోవుడి'

ఇది తప్ప ఎవరికీ వేరే మార్గం ఏదీ లేదు ! రెమెడీ  కూడా లేదు !

చేసే వెధవపనులన్నీ చేసేసి, ఫలితాలు మాత్రం అంటకుండా తప్పించుకుందామని ఎంత దురాశో ఈ మనుషులకి !