“అసమర్ధజాతికి ఆత్మగౌరవ అర్హత ఉండదు"

20, ఏప్రిల్ 2021, మంగళవారం

చనిపోయాక ఆత్మకేమౌతుంది?

ఉదయాన్నే రవి ఫోన్ చేశాడు. ప్రస్తుతం నడుస్తున్నది కరోనా టైమ్స్ కాబట్టి, అవే మాటలు నడిచాయి.

తనకు తెలిసినవాళ్లలో ఎంతమందికి కరోనా పాజిటివ్ వచ్చిందీ, వాళ్లలో ఎంతమంది పోయిందీ, ఎంతమంది బయటపడిందీ, హైదరాబాద్లో పరిస్థితి ఎంత దారుణంగా ఉన్నదీ, మిగిలిన చోట్లకూడా ఎలా ఉన్నదీ, ఎంతమందికి పాజిటివ్ వస్తున్నా ఆఫీసులు మాత్రం యధావిధిగా ఎలా నడుస్తున్నదీ, ఉద్యోగులు ఎంత రిస్కుతో పనిచేస్తున్నదీ  అన్నీ మాట్లాడుకున్నాక చివరికిలా అడిగాడు.

'ఇదంతా సరేగాని ఒకటి చెప్పు, మనిషి పోయాక ఏమౌతుందంటావ్?'

నవ్వొచ్చింది. 

'ఏంటి ఉన్నట్టుండి ఈ ప్రశ్న అడుగుతున్నావ్? ప్రపంచంలో టాపిక్స్ ఇంకేం లేనట్టు?' అన్నాను.

'చుట్టూ అవే చూస్తున్నాం, అవే వింటున్నాం, అందుకే ఈ ఆలోచన వచ్చింది' అన్నాడు.

'ఏమీ కాదు. తగలేస్తారు లేదా పాతేస్తారు' అన్నా నవ్వుతూ.

'అంతేనా ఇంకేం చెయ్యరా?' అడిగాడు తనూ చులాగ్గా.

'చెయ్యచ్చు, పార్సీలైతే టవర్ ఆఫ్ సైలెన్స్ లో వదిలేస్తారు. కొందరు జలసమాధికూడా చేస్తారు. ఎవరి పద్ధతి వాళ్ళది' అన్నా.

'సర్లే ఏదో ఒకటి. నేనడిగింది అదికాదని నీకూ తెలుసు. జోకులాపి సమాధానం చెప్పు' అన్నాడు.

'ఏమో నాకేం తెలుసు? నేను చూడలేదు నీకు చెప్పటానికి' అన్నా మళ్ళీ నవ్వుతూ.

'అదే నీ దగ్గర. నీకు తెలీకుండా ఎలా ఉంటుంద? చెప్పు' అన్నాడు.

 నవ్వి ఊరుకున్నా. 

'నిన్న టీవీలో విన్నాను. ఒక ప్రవచకుడు చాలా చక్కగా వివరించాడు చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందో?' అన్నాడు.

'అవునా? ఏం జరుగుతుందిట?' అడిగాను.

'జీవుడు సూక్ష్మశరీరంతో స్వర్గం నరకం ఎలా సందర్శిస్తాడు? పుణ్యపాపాలు ఎలా అనుభవిస్తాడు? అవన్నీ భలే వివరించాడు' అన్నాడు.

'అవునా? చూసొచ్చి చెప్పాడా? చూడకుండా చెబుతున్నాడా?' అడిగాను.

'మళ్ళీ నీ జోకులు ! చూశాక తిరిగి ఎవడొస్తాడు?' అన్నాడు తానే.

'మరి చూడకుండా ఎలా చెబుతున్నాడు? స్వానుభవం కాదా? ఇతరుల అనుభవాలను తనవిగా చెబుతున్నాడా?' అడిగాను.

'పురాణాల్లో ఉందిట. ఋషులు చూసి రాశారట' అన్నాడు అమాయకంగా.

'ఏ ఋషి చూసి తిరిగొచ్చి రాశాడో కొంచం ఆయన అడ్రసు చెప్పమనకపోయావా? వెళ్లి కనుక్కునేవాళ్ళం కదా ?' అన్నాను.

'అదే మరి నీతో ! పురాణాలు రాసిన ఋషులు' అన్నాడు.

'అలాగా ! మరి ఒక్కో పురాణంలో ఒక్కో రకంగా రాశారేంటి ఋషులు?' అన్నాను.

'అదేమో నాకు తెలీదు. అన్నింట్లో ఒకే రకంగా లేదా?' అడిగాడు.

'ఉందని ఆ ప్రవచక విదూషకుడు చెప్పాడా?' అడిగాను.

'అనే అంటున్నాడు' అన్నాడు.

'మరి మన పురాణాలొక్కటేనా? ఎన్నో దేశాలు, ఎన్నో మతాలు, ఎన్నో సంస్కృతులు. వాళ్ళ పుస్తకాలలో ఎక్కడికక్కడ వేరువేరుగా రాసుంది. అదేంటి మరి?' అన్నాను.

'అబ్బా నీతో ఇదే గోల ! ఏదీ చెప్పవు. తెగనివ్వవు. అయితే ఏంటంటావు?' అన్నాడు.

'అదికాదు. చూసినవాళ్లు ఒకే విధంగా వ్రాయాలి కదా? వేర్వేరుగా ఎందుకు రాశారో మరి?' అడిగా.

'అదీ నువ్వే చెప్పు' అన్నాడు.

'అక్కడ ఉన్న విషయం ఒకటే అయితే, ఎంతమంది చూసినా ఒకటే కనిపించాలి. లేదా చూసినవాళ్లు రకరకాలుగా చూసి ఉండాలి. అప్పుడే తేడాలొస్తాయి' అన్నాను.

'లాజిక్ ప్రకారమైతే అక్కడి విషయం ఒకటే ఉండాలి. అయితే చూసినవాళ్లు రకరకాలుగా చూశారన్నమాట' అన్నాడు.

'ఊ ! అంతే అయుండొచ్చు' అన్నా.

'మరి ఈ అన్ని పురాణాలలో పుస్తకాలలో అసలు సత్యమేంటో?' అడిగాడు.

'చూస్తేనేగాని చెప్పలేం. చూసినా చెప్పలేమేమో? అలా చెప్పినవాళ్లు ఎవరూ లేరుగా మరి!' అన్నా నవ్వుతూ.

'మరెలా?' అన్నాడు.

'కరోనాతో పోయినవాళ్ళైతే అందరూ కూడబలుక్కుని 'కరోనా గ్రూప్' అని గూగుల్ గ్రూప్ పెట్టుకోవచ్చు అక్కడ' అన్నా నవ్వుతూ.

'చంపకుండా విషయం చెప్పు' అడిగాడు.

'ఏం లేదు. సింపుల్. దానికేం పురాణాలు చదవక్కర్లేదు. నువ్వు రాత్రిపూట ఏం చేస్తావ్ రోజూ?' అడిగా.

'ఏముంది? నిద్రపోతా?' అన్నాడు.

'తర్వాత?' అడిగా.

'కలలు కంటా' అన్నాడు.

'తర్వాత' అడిగా మళ్ళీ.

'ఏముంది? పొద్దున్నే మేలుకుంటా' అన్నాడు.

'ఇదీ అంతే. నిద్రపోతుంది, కలలు కంటుంది, మళ్ళీ మేల్కొంటుంది. ఆత్మగా కొన్నాళ్ళు ఏవేవో లోకాలలో ఉంటుంది. తర్వాత మళ్ళీ జన్మెత్తుతుంది. నిద్రంటే చావు. కలలంటే స్వర్గనరకాలు. మెలకువ మళ్ళీ జన్మ. కానీ ఇదంతా తెలుసుకుని ఉపయోగం లేదు. టీవీలో, యూట్యూబులో ఇవన్నీ అంత భలేగా చెప్పిన ప్రవచకుడిది ఉత్త పుస్తకజ్ఞానమేగాని అనుభవజ్ఞానం కాదు. ఈ విషయాలు అలా తెలిసేవి కావు. ఆయా లోకాలను చూడగలిగే శక్తి నీకు ఉండాలి. అక్కడికి పోయి తిరిగి రాగలిగే శక్తి, భౌతికంగా కాదు మానసికంగా, నీకుండాలి. అప్పుడు నీకే తెలుస్తుంది. అప్పుడు నువ్వు చెప్పిన పురాణాలలో లేని అనేక క్రొత్త విషయాలు కూడా నువ్వు చూస్తావు, ఇంకా ఎన్నో క్రొత్త విషయాలు తెలుసుకుంటావు' అన్నాను.

'మీ ఛానల్లో నువ్వూ చెప్పొచ్చుగా అవన్నీ' అన్నాడు.

'అవి ఉబుసుపోక ముచ్చటించుకునే ముచ్చట్లు కావు. అనుభవంలో ప్రత్యక్షంగా చూచి గ్రహించవలసినవి. అలా చెప్పి ఉపయోగం లేదు' అన్నాను.

'అర్ధం కాలేదు' అన్నాడు.

'చెప్పేవాడికి తెలియవు. తెలిసినవాడు చెప్పడు' అన్నాను

'ఎందుకలా?' అడిగాడు కుతూహలంగా.

'అదంతే. అన్నీ బజార్లో పెట్టి చెప్పకూడదు. కావాలంటే నువ్వే అక్కడికెళ్లి చూసొచ్చి రాత్రికి ఆఫీసునుంచి ఇంటికొచ్చాక నాకు చెప్పు' అన్నా నవ్వుతూ.

'బాబోయ్ వద్దులే. నాకాఫీసులో చాలా పనుంది. కరోనా పాజిటివ్ వచ్చి అసలే పదిమంది స్టాఫ్ క్వారంటైన్ అయ్యారు. బోలెడంత వర్క్ పెండింగ్లో ఉంది. చేసుకుంటా. ఉంటా' అన్నాడు.

'సరే చేసుకో' అని నవ్వుతూ ఫోన్ కట్ చేశా.