Pages - Menu

Pages

25, ఏప్రిల్ 2021, ఆదివారం

సెల్ఫీ శీను

నిన్న పొద్దున్నే ఫోన్ మ్రోగుతోంది.

ఎవరా అని చూశా. 

మా ఫ్రెండ్ శీనుగాడు. ఎప్పుడో గాని ఫోన్ చెయ్యడు. కానీ సెల్ఫి ఫోటోలు మాత్రం తెగ పంపిస్తూ ఉంటాడు.

ఫోన్ చేతులో లేకుండా తనని మేమెప్పుడూ చూడలేదు. అంతేగాక ప్రతిదాన్నీ ఫోటో తీసి తన ఫ్రెండ్ లిస్ట్ లో ఉన్నవాళ్లందరికీ పంపడం వాడికొక సరదా. తత్ఫలితంగా వాడి జీవితం ఒక ఓపెన్ బుక్ అయిపొయింది. అలాంటివాడు ఏంటా ఫోన్ చేశాడనుకుంటూ హలొ అన్నా.

'ఒరేయ్ ! అయిపోయింది.. ఐసీయూలో ఉన్నా, ఆక్సిజన్ పెడుతున్నారు. బహుశా ఇదే ఆఖరి ఫోన్ కావచ్చు' అన్నాడు నీరసంగా.

'అదేంట్రా ! ఎప్పుడు చేరావ్?' అడిగా.

'కరోనా వచ్చి వారమైంది. ఐసీయూలో నిన్న చేరా. ఇప్పుడే ఆక్సిజన్ పెట్టారు. సెల్ఫీ పంపా చూసుకో' అంటూ కట్ చేశాడు.

ఫోటో చూశా.

నర్సులు వాడికి ఆక్సిజన్ పెడుతుండగా ఒక సెల్ఫీ తీసుకుని దాన్ని పోస్ట్ చేశాడు - 'ఆక్సిజన్ పెట్టించుకుంటున్న నేను' అంటూ.

'ఓరి నీ సృజనాత్మకతో !' అనుకున్నా.

ఏంటో ఈ లోకం. అస్సలు ప్రయివసీ లేకుండా పోయింది. ప్రతిదీ ఫోటోలు తీసుకోవడం, చూసుకోమంటూ నెట్లో పెట్టడం. ఏంటో ఈ గోల ! మొన్నొకరెవరో చెప్పారు. 'మా ఫస్ట్ నైట్' అంటూ ఎవడో వీడియో పెట్టాట్ట. హతవిధీ అనుకున్నా ఈ న్యూస్ విన్నపుడు.

ఆలోచిస్తూ బెడ్ మీద వెనక్కు వాలా. ఎప్పుడు నిద్ర పట్టిందో తెలీదు. ఒకటే కలలు. కలల్లో కూడా మెసేజిలు, ఫోటోలు శీనుగాడినుంచి తెంపులేకుండా  వస్తూనే ఉన్నాయి. అన్నీ సెల్ఫీలే.

'యమదూతలతో నేను'

చెరోపక్కనా ఇద్దరు యమదూతలు, మధ్యలో ఫ్రెండ్ గాడు నిలబడి సెల్ఫీ తీసుకుని పోస్ట్ చేశాడు. 

'వైతరణిలో ప్రయాణిస్తూ నేను'

ఏదో నదిలో స్టీమర్లాంటి పడవలో పోతున్నాడు. యమదూతలు పక్కనే ఉన్నారు. ఇంకో యమదూత డ్రైవ్ చేస్తున్నాడు.  వీడేమో ఇకిలిస్తూ సెల్ఫీకి పోజిచ్చాడు.

'యమధర్మరాజుతో నా మొదటి సెల్ఫీ'

సీరియస్ గా చూస్తున్న యముడు. ఇకిలిస్తున్న వీడు.

'శనగపిండిలో మునుగుతూ' అంటూ ఇంకో సెల్ఫీ.

ఈ సెల్ఫీ చాలా కళాత్మకంగా ఉంది. అక్కడి శిక్షలేమో అవి. వీడిని బజ్జీలాగా శనగపిండిలో ముంచుతున్నారు.  వీడేమో పక్కకి చూస్తూ సెల్ఫీ.

'నూనెలో వేగుతూ నేను\' ఇంకో సెల్ఫీ. ఇది కూడా చాలా బాగా వచ్చింది.

'దోరగా వేయిస్తూ కోరగా చూస్తున్న కింకరబావతో నేను' ఈ సెల్ఫీ చాలా అద్భుతంగా వచ్చింది. ఫ్రెండ్ గాడు, కింకరుడు ఇద్దరూ భలే పోజిచ్చారు. నూనెలో వేగుతున్న బాధకంటే, సెల్ఫీకి ఫోజిచ్చే ఆత్రమే వీడి ముఖంలో ప్రస్పుటంగా కనిపిస్తోంది.

చివరగా వచ్చిన సెల్ఫీ మాత్రం నాకు సూపర్ గా నచ్చేసింది.

'యమదూతగా మొదటి షిఫ్ట్ లో నేను' అంటూ యూనిఫామ్ వేసుకుని ఒక సెల్ఫీ పంపాడు.  ఓహో ప్రొమోషన్ వచ్చి యమదూతయ్యాడన్న మాట ! వెరీ గుడ్ ! సెల్ఫీ బాగుంది.

'ఏమండోయ్ లేవండి లేవండి. మీ ఫ్రెండ్ మళ్ళీ ఫోన్ చేస్తున్నాడు' అంటూ శ్రీమతి నిద్ర లేపుతోంది. ఓహో ఇవన్నీ కలలా అనుకుంటూ లేచి ఫోనెత్తా,. మళ్ళీ వీడే.

'ఏరా ! ఇప్పుడే డ్యూటీలో జాయినయ్యా ! సెల్ఫీలు బాగున్నాయా ! కొత్త జాబు, కొత్త లోకం భలే బాగుందిలే' అంటూ వాడే కాల్ చేస్తున్నాడు.

'ఎక్కణ్ణించిరా ?' భయంతో నా స్వరం నాకే పీలగా వినిపించింది.

'ఇంకెక్కణ్ణించి? యమలోకంనుంచిరా. ఇప్పటిదాకా నీకు కలల్లో పంపించిన సెల్ఫీలన్నీ అక్కణ్ణించే. బాగున్నాయా? నవ్వుతూ అడిగాడు వాడు.

'ఓరి నీ సెల్ఫీ పిచ్చి పాడుగాను. దారంతా సెల్ఫీలు తీసుకుంటూనే పోయావన్నమాట. సర్లే ఫస్ట్ ఎసైన్మెంట్ ఏ ఊర్లో ఇచ్చారు?' అడిగా.

'యమధర్మరాజుగారిని రిక్వెస్ట్ చేసి హైదరాబాద్లోనే ఫస్ట్ డ్యూటీ వేయించుకున్నా. ఎంతైనా మనూరుకదా! అభిమానం అలా ఉంటుంది మరి. దార్లో ఉన్నా! వస్తున్నా' అన్నాడు వికటంగా నవ్వుతూ.

'బాబోయ్ ! వస్తే వచ్చావుగాని చూసిపోదామని ఇటువైపు మాత్రం రాకు' అన్నా.

'అలాగే. అంత టైం కూడా లేదులే. ఒక్క హైదరాబాద్ లోనే బోలెడన్ని హాస్పిటల్స్ తిరగాలి. చాలామంది మాలోకానికి రెడీగా ఉన్నారు. ఫస్ట్ డ్యూటీలోనే రాజుగారు బోల్డు వర్కిచ్చారు. కానీ సెల్ఫీలు మాత్రం పంపిస్తూనే ఉంటా! ఓకేనా? బై మరి !' అన్నాడు.

'ఓరి నీ సెల్ఫీ పిచ్చి పాడుగాను అలాగే కానీయ్' అంటూ ఫోన్ కట్ చేశా.