15-4-2021 రాత్రి పదకొండు గంటల సమయంలో అమెరికాలోని ఇండియానా స్టేట్ లో, ఇండియానాపోలిస్ సిటీలో ఒక 19 ఏళ్ల అబ్బాయి, ఫెడెక్స్ షాప్ దగ్గర కాల్పులు జరిపి ఎనిమిది మందిని చంపేశాడు. మరికొంతమంది గాయాలపాలయ్యారు. గ్రహస్థితి ఏమంటున్నదో గమనిద్దాం.
ఆ సమయంలో అక్కడ వృశ్చికలగ్నం ఉదయిస్తున్నది. ఉచ్చ రాహువుతో ఉచ్చచంద్రుడు చాలా దగ్గరగా కలవగా రాహుకేతువుల ఇరుసు లగ్నాన్ని సూటిగా కొడుతున్నది. రాహుచంద్రులకు ఒకవైపున ఉఛ్చసూర్యుడు మరొకవైపున హింసకు సూచకుడైన కుజుడు ఉంటూ అర్గళాన్నిస్తున్నారు. బుద్ధికారకుడైన బుధుడు నీచస్థితిలో ఉంటూ బుద్ధిలేని చర్యలను సూచిస్తున్నాడు. గ్రహాలన్నీ దాదాపుగా మాలికాయోగంలో ఉన్నాయి.
చంద్రుడు మనస్సుకు సూచకుడు. అతని ఉఛ్చస్థితి సామాన్యమానవులలో అయితే మానసిక సమతుల్యతను కోల్పోయేలా చేస్తుంది. ఉఛ్చ రాహువుతో కలయిక దూకుడుతనాన్ని, ఆలోచనలేని చర్యలను సూచిస్తుంది. సూర్యుని ఉఛ్చస్థితి వల్ల అహంకారధోరణి విజృంభిస్తుంది. 'నేను చేస్తున్నది కరెక్టే' అన్న దూకుడు కలుగుతుంది. ఇవన్నీ కలుపుకుని చూడండి. ఏమి జరిగిందో అర్ధమౌతుంది.
ఇదొక్కటే కాదు. చాలామంది జాతకాలలో, ముఖ్యంగా నిన్నటి రోజున, అనుకోని సంఘటనలు చాలా జరిగి ఉంటాయి. దూకుడుగా ప్రవర్తించి ఉంటారు. కొంతమందికి దుర్ఘటనలు జరిగితే కొంతమందికి జరగకపోవచ్చు. అది వారి వారి జాతకాలను బట్టి ఉంటుంది. కానీ, మనస్సు సమతుల్యత కోల్పోవడం, అతిగా ప్రవర్తించడం, ఆలోచనలేని పనులు చెయ్యడం, బుద్ధి దారితప్పడం మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది. మీ జీవితాన్ని గమనించుకోండి. మీకే అర్ధమౌతుంది. అప్పుడు నేను చెబుతున్నది నిజమే అని మీరూ ఒప్పుకుంటారు.