నిత్యజీవితంలో ప్రతిఫలించని జ్ఞానం నిరర్ధకం

6, మే 2021, గురువారం

స్వామి నిర్మలానంద - ఒక విస్మృత మహనీయుడు -3 (జాతక విశ్లేషణ)


స్వామి జననసమయంలో చంద్ర - రవి - బుధదశ జరిగిందని అన్నాను. ఇందులో అమావాస్యయోగం, బుధాదిత్యయోగం, గృహకలహయోగం కలసి ఉన్నాయి. కనుక ఈయనకు గృహసౌఖ్యం లేదని, జీవితం కష్టాలమయమని, ఈయనకు అమితమైన తెలివితేటలున్నాయని, ఎంతో  లోకప్రసిద్ధి కలుగుతుందని, కానీ చివరకు అనామకంగా ఈయన చరిత్ర ముగుస్తుందని జననకాలదశ చెబుతోంది. ఈ విధంగా జననకాలదశ లోని యోగాలద్వారా జీవితం మొత్తాన్నీ ఒకచూపుతో సింహావలోకనం చెయ్యవచ్చు. ఇది జ్యోతిష్యశాస్త్రంలో కనుమరుగైపోయిన ఒక ప్రాచీనవిధానం.  ఎన్నో ఏళ్ల రీసెర్చిలో దీనిని నేను వెలికితీశాను. కొన్ని వందల జాతకాలలో ఇది రుజువైన సూత్రం. స్వామి జీవితం కూడా అలాగే జరగడాన్ని గమనించవచ్చు.

స్వామి జీవితంలో ఈఈ దశలు జరిగాయి.

పుట్టుకనుంచి 22 - 2 - 1864 వరకూ చంద్ర మహాదశ

22 - 2 -1864 నుంచి 22 - 2 -1871 వరకూ కుజ మహాదశ

22 - 2 - 1871 నుంచి 21 - 2 - 1889 వరకూ రాహు మహాదశ

21 - 2 - 1889 నుంచి 23 - 2 - 1905 వరకూ గురు మహాదశ

23 - 2 - 1905 నుంచి 23 - 2 - 1924 వరకూ శని మహాదశ

23 - 2 - 1924 నుంచి 23 - 2 - 1941 వరకూ బుధ మహాదశ

26-4- 1938 న బుధ - గురు - రాహుదశలో స్వామి మరణించారు.

ఇప్పుడు స్వామి జీవితంలోని ముఖ్యఘట్టాలను గమనిద్దాం.

శ్రీమంతులైన ఒక క్షత్రియ కుటుంబంలో అయిదుగురు అన్నలకు  తమ్ముడిగా స్వామి జన్మించాడు. తల్లిదండ్రులు దేవనాధదత్, తారకామణిదేవి. దేవనాధదత్ గారికి నాడీవిజ్ఞానం తెలుసు. దీర్ఘరోగాలతో బాధపడుతున్న రోగి నాడిని పరీక్షించి అతను  ఇంకా ఎన్నాళ్లు బ్రతుకుతాడో, ఎప్పుడు చనిపోతాడో ఆయన ఖచ్చితంగా చెప్పగలిగేవాడు. అప్పట్లో చాలామంది గంగానదీతీరంలో చనిపోవాలని కోరుకునేవారు. కనుక చివరిఘడియలలో అక్కడకు వెళ్లి నివసించేవారు. అలాంటివారికి దేవనాధ్ దత్త ఒక  దేవుడిలాగా కనిపించేవాడు. ఆయన సూచించిన సమయానికి కాశీకి వెళ్లి అక్కడే వారు తృప్తిగా కన్నుమూసేయారు. ఈ విద్యతో ఆయన చాలా ధనం ఆర్జించాడు. ఆస్తులు సంపాదించాడు. అంతేగాక, ఆముదం మిల్లు, పిండి మిల్లు, లక్క మిల్లు, సల్ఫ్యూరిక్ యాసిడ్ పేక్టరీలు పెట్టి శ్రీమంతుడయ్యాడు. దశమాధిపతి కుజుడు నీచభంగరాహువుతో పంచమంలో ఉండటం వల్ల ఈయన తండ్రిగారికి ఒక విచిత్రవిద్య తెలిసి ఉంటుందన్న సూచన స్వామి జాతకంలో ఉన్నది.

పితృకారకుడైన రవి బుధునితో కలసి సహజనవమస్థానమైన ధనుస్సులో ఉండటం తల్లిదండ్రులకున్న ఆధ్యాత్మిక చింతనను సూచిస్తున్నది. స్వామి పూర్వీకులు కృష్ణభక్తులు. రాధాకృష్ణులను వీరు కులదేవతలుగా ఆరాధించేవారు. అంతేగాక దుర్గాదేవిని కూడా ఆరాధించేవారు. బెంగాల్లో కృష్ణభక్తీ, దేవీభక్తి అధికం. అదే వీరి కుటుంబంలో కూడా ఉండేది. స్వామి జాతకంలో లాభస్థానంలో రెండు గ్రహాలున్నాయి. వృశ్చికంనుంచి రాహుకుజులు చూస్తున్నారు. తృతీయంనుంచి శని చూస్తున్నాడు. మొత్తం అయిదు గ్రహాల ప్రభావం ఏకాదశం మీదున్నది. అందుకే అయిదుగురు అన్నల తర్వాత తమ్ముడిగా స్వామి జన్మించాడు.

వీరికి కలకత్తాలోనే గాక, కాశీలో కూడా ఇల్లుండేది. ఏడాదిలో కొన్ని నెలలు అందరూ కాశీలో నివసిస్తూ  ఉండేవారు. స్వామి చిన్నపుడు బలహీనంగా ఉండేవాడు. ఆరోగ్యం అంత గట్టిది కాదు. కనుక పదకొండేళ్ళవరకూ ఆయన స్కూలుకు పోలేదు. ఇంటిలోనే  చదువుకున్నాడు. సంస్కృతాన్ని కూడా ఇంటిలోనే నేర్చుకున్నాడు. ఈ ప్రజ్ఞతోనే సంస్కృతంలో ఆయన చక్కగా మాట్లాడగలిగేవాడు. అంతేగాక సంస్కృతంలో ఉన్న ఉపనిషత్తులను, బ్రహ్మసూత్రాది వేదాంత మూలగ్రంధాలను ఆయన చదివి ఆకళింపు చేసుకున్నాడు. ఈ జ్ఞానంతోనే, తర్వాత ఏళ్లలో బేలూర్ మఠంలోని బ్రహ్మచారులకు, స్వాములకు  బ్రహ్మసూత్రములు, ఉపనిషత్తులను ఆయన బోధించాడు. దీనికి సూచికగా నవమాధిపతి మరియు సాంప్రదాయ జ్ఞానానికి కారకుడూ అయిన గురువు సొంత ఇంటిని సూచించే చతుర్దంలో శుక్రునితో కలసి ఉన్నాడు. శుక్రుని కలయిక ఇంటిలో ఉంటూ సొంతంగా చదువుకునే రాక్షసప్రవృత్తిని సూచిస్తుంది. అలా కాకపోతే, ఇంకో యోగం ఉన్నట్లయితే, గురుకులంలోనే ఆయన విద్య సాగి ఉండేది.

ఒకానొక సందర్భంలో ఆ విధంగా కాశీలో ఉన్న సమయంలోనే, 30-12-1873 నాడు స్వామి తల్లిగారు కాశీలోనే మరణించారు. అప్పుడు స్వామి జాతకంలో కుజ మహాదశ అయిపోయి రాహు మహాదశ మొదలైంది. అది రాహు - గురు - గురుదశ. ఇది గురుఛండాలయోగపు దశ. చతుర్ధం నుంచి నీచరాహువు, ద్వితీయ మారకస్థానంలో మారకుడైన కుజుని ఇంటిలో కుజునితో కలసి బలంగా ఉన్నాడు. గురువు రోగస్థానాధిపతిగా లగ్నంలోనే ఉన్నాడు. ఇది ఖచ్చితంగా తల్లిగారికి మారకదశ. కనుక తల్లిగారు చనిపోయారు. లగ్నంలో గురుశుక్రుల ప్రభావంవల్ల కాశీవంటి గొప్ప పుణ్యక్షేత్రంలో ఆవిడ మరణం సంభవించింది. అదేవిధంగా,  చంద్రలగ్నాత్ గమనిస్తే - సప్తమ మారకస్థానంలో ఉన్న నీచరాహువు, రోగస్థానంలో ఉన్న గురువు, గురుఛండాలదశలు కనిపిస్తున్నాయి. అలాంటి చెడుదశలో ఆమెకు మరణం రాక మరేమౌతుంది?

మరుసటి సంవత్సరం అక్కడి బెంగాలీ తోలా హైస్కూల్లో సరాసరి ఆయనకు అడ్మిషన్ దొరికింది. అక్కడ హరిప్రసన్న అనే అబ్బాయితో స్నేహం ఏర్పడింది. ఈ హరిప్రసన్న అనే అబ్బాయి తర్వాతికాలంలో శ్రీ రామకృష్ణుల పరమభక్తుడై స్వామి విజ్ఞానానందగా ప్రసిద్ధి గాంచాడు. సివిల్ ఇంజనీర్ గా ప్రభుత్వంలో  ఉన్నతమైన స్థానంలో పనిచేసిన ఆయనే బేలూర్ మఠంలోని శ్రీరామకృష్ణ దేవాలయాన్ని ప్లాన్ గీసి, దగ్గరుండి కట్టించింది. మా గురువుగారైన స్వామి నందానందగారు , స్వామి విజ్ఞానానందగారి శిష్యులే.

స్వామి విజ్ఞానానందగారు రామాయణకాలంలోని జాంబవంతుడు. రామావతార సమయంలో ఈయన రాములవారికి ఎంతో సేవ చేశాడు. రామసేతువుని నిర్మించడంలో ప్రముఖపాత్ర పోషించాడు.  వానరసైన్యంలోని నలుడు, నీలుడు, జాంబవంతుడు సివిల్ ఇంజనీరింగ్ తెల్సినవారు.  అందుకే 13 వేల ఏళ్ళక్రితమే సముద్రం మీద వారధి కట్టగలిగారు. అదే  జాంబవంతుడు ఈ జన్మలో విజ్ఞానానందస్వామిగా పుట్టి సివిల్ ఇంజనీరింగ్ లో ప్రవీణుడై, బేలూర్ మఠంలోని శ్రీరామకృష్ణ దేవాలయం ప్లాన్ ను తానే గీచి, దగ్గరుండి దానిని అద్భుతంగా నిర్మించాడు.

కృష్ణావతారసమయంలో జాంబవంతుడు కృష్ణునితో కుస్తీ పట్టాడు. శ్రీరామకృష్ణుల అవతారసమయంలో ఒకనాడు శ్రీరామకృష్ణులు హరిప్రసన్నను ఇలా అడిగారు 'ఏరా ! నాతో కుస్తీ పట్టగలవా?' ఆయన అప్పటికే నడివయసులో ఉన్నారు. హరిప్రసన్న యువకుడు, ఆరడుగుల ఎత్తుతో మంచి బలంగా ఉండేవాడు. 'ఈయన నాతో ఏమి గెలవగలడులే?' అని లోలోపల అనుకున్నప్పటికీ, ఆయన ఎందుకడిగారో అర్ధంకాని హరిప్రసన్న సరేనన్నాడు.  ఐదడుగుల విగ్రహంతో బలహీనంగా ఉన్న రామకృష్ణులు బలిష్ఠుడైన హరిప్రసన్నను సునాయాసంగా గోడకు అదిమిపెట్టేశారు. ఆయన్ను తాకడంతోనే శరీరంలోని శక్తంతా ఉడిగిపోయి కుప్పకూలినట్లుగా అయిపోయాడు హరిప్రసన్న. 'ఇప్పుడేమంటావ్?' అంటూ నవ్వుతూ శ్రీరామకృష్ణులు అతన్ని వదిలేశారు.

శ్రీరామునితో యుద్ధం చెయ్యాలన్న కోరికను ఒక సందర్భంలో వెలిబుచ్చుతాడు జాంబవంతుడు. 'ఇప్పుడు కాదు, వచ్చే అవతారంలో నీ కోరిక తీరుస్తానని' వరమిస్తాడు శ్రీరాముడు. అది కృష్ణావతారంలో నెరవేరింది. అది పూర్తిగా తీరలేదేమో? లేక, గతాన్ని మరొక్కసారి గుర్తు చేద్దామని అనుకున్నారేమో శ్రీరామకృష్ణులు. ఆ విధంగా హరిప్రసన్నతో సరదాగా కుస్తీ పట్టి, అతన్ని గోడకు నొక్కిపట్టారు. అలాంటి హరిప్రసన్న, తులసీచరణ్ కు కాశీలో క్లాసుమేటయ్యాడు. భవిష్యత్తులో తులసి కార్యరంగంకూడా దక్షిణభారతమే కావడం గమనార్హం. కనుక స్వామి కూడా గతజన్మలో వానరసైన్యం లోనివాడేనా? అందుకేనా, దక్షిణభారతదేశంలోనే ఆయన  దాదాపు 30 ఏళ్ళపాటు తన రక్తాన్ని ధారపోసి శ్రీ రామకృష్ణులు చూపిన మార్గంలో దీనులకోసం, ఆర్తులకోసం, సమాజంలో ఆధ్యాత్మిక చైతన్యాన్ని రగల్చడం కోడం  పనిచేశాడు?

అంతేకాదు. స్వామి ఎప్పుడు త్రివేండ్రం వెళ్లినా కన్యాకుమారికి వెళ్లి జగన్మాత దర్శనం చేసుకుని, కొన్నాళ్ళు అక్కడ ఉండి తిరిగివస్తూ ఉండేవాడు. బహుశా వానరసైన్యంలో ఉన్నపుడు అక్కడి సముద్రతీరంలో తాము చేసినపని గుర్తుకురావడం వల్లనేనా స్వామి అలా చేసేవాడు? ఎవరికి తెలుసు? ఒకవేళ అవన్నీ గుర్తుకొచ్చినా కూడా, వాళ్ళెవరూ ఆ విషయాలు బయటకు చెప్పేవారు కారు. 

స్వామివిజ్ఞానానంద గారికి పూర్వజన్మలో తాను జాంబవంతుడినన్న విషయం బాగా తెలుసు. ఆయన రామభక్తుడు. శ్రీరామకృష్ణులవారిలో శ్రీరాముడిని ఆయన ధ్యానించేవాడు. తన చివరిదశలో అలహాబాద్ (నేటి ప్రయాగరాజ్) రామకృష్ణమఠంలో ఉంటూ ఆయన వాల్మీకి రామాయణాన్ని  అనువాదం చేస్తూ కాలం గడిపారు. మొదటి రెండు కాండాలను అనువాదం చేసిన ఆయన 1938 లో అక్కడే కన్నుమూశారు. ఆ సమయంలో ఆయనకు అనుక్షణం కళ్ళెదురుగా సీతారాములు, ఆంజనేయుల దర్శనం నిరంతరం కలిగేదని నాకు స్వయానా నందానందస్వాముల వారే చెప్పారు. ఆయననోట నేనీ విషయాన్ని స్వయంగా విన్నాను. అంతటి రామభక్తితత్పరుడాయన !

అంతేకాదు, విజ్ఞానానందస్వామికి, నిర్మలానందస్వామికి ఉన్న అనుబంధంలో ఇంకొక్క విచిత్ర విషయం  వినండి. వీరిద్దరూ 1938 లో ఒకే ఒక్కరోజు తేడాతో చనిపోయారు. విజ్ఞానానందస్వామి శ్రీరామకృష్ణ మఠం మిషన్ల సర్వాధ్యక్షునిగా 25-4-1938 న ప్రయాగలో చనిపోతే, చిన్నప్పుడు ఆయన క్లాసుమేటూ, తర్వాతికాలంలో సోదరభక్తుడూ, సోదరస్వామీ అయిన నిర్మలానందస్వామి 26-4-1938 న కేరళలోని ఒట్టపాలెం ఆశ్రమంలో చనిపోయారు. ఒకే ఒక్క రోజు తేడా ! అంతే !

ఇదంతా చూస్తే ఏమనిపిస్తుంది? గతజన్మలలో విజ్ఞానానందస్వామి జాంబవంతుడని రామకృష్ణభక్తులలో అందరికీ తెలిసిన విషయమే. మరి నిర్మలానందస్వామి కూడా వానరసైన్యంలోని వాడేనని నా విశ్వాసం. బహుశా ఆయన, జాంబవంతునికి మంచి స్నేహితుడైన నీలుడై ఉంటాడని నా ఊహ. ఎందుకంటే, నిర్మలానందస్వామి ఎన్నోఏళ్ళు కేరళలోని ఏ నదీతీరంలో నివసించారో, ఆ 'భారత్ పులా' నదికి ఉన్న ప్రాచీన నామం నీలానది ! నీలానదీ తీరాన్నే ఆయన తన ఆశ్రమస్థాపనకు ఎంచుకున్నాడు. చివరకు అక్కడే శ్రీ రామకృష్ణ నిరంజన ఆశ్రమంలో కన్నుమూశాడు.

అంతేకాదు, యువకునిగా ఉన్న రోజులలో అసలైన సన్యాసిగా దేశాటనం చేస్తూ, డబ్బును తాకకుండా, మధుకరంతో జీవిస్తూ, కప్పుకింద నిద్రించకుండా ఆకాశమే కప్పుగా జీవిస్తూ, నిరంతరధ్యానంలో ఏళ్లకేళ్ళు గడిపిన నిర్మలానందస్వామి  ఒకసమయంలో హిమాలయ అడవులలో దారితప్పి ఒక రాత్రంతా దట్టమైన అడవిలో చెట్టుక్రింద ఉండవలసి వఛ్చినపుడు ఒక అడవి కోతుల గుంపు ఆయనకు ఆతిధ్యం  ఇచ్చి , తినడానికి పండ్లు తెచ్చిచ్చి, ఆయన ఎదురుగా చితుకులతో మంటను రాజేసి, రాత్రంతా ఆయనకు కాపలాగా ఉండి ఆయనకు రక్షణగా నిలిచాయన్న అద్భుత సంఘటన మీకు తెలుసా? ఇది నిజంగా జరిగింది. ఎప్పుడు జరిగిందో ఎలా జరిగిందో ముందు ముందు వివరిస్తాను.

ఆయన గతజన్మలో వానరసైన్యంలోని నీలుడు కాకపోతే, శ్రీరామునికి నమ్మినబంటు కాకపోతే, శ్రీ రామకృష్ణుల అనుగ్రహానికి ఎలా పాత్రుడౌతాడు? ఆయనతోబాటుగా ఈ భూమికి ఎందుకొస్తాడు? కోతుల గుంపు హిమాలయ అడవులలో ఆయననెందుకు రక్షించి, తినడానికి తిండి పెట్టి, రాత్రంతా కాపలా కాచి రక్షించాయి? చెప్పండి మరి !

(ఇంకా ఉంది)