నిత్యజీవితంలో ప్రతిఫలించని జ్ఞానం నిరర్ధకం

4, మే 2021, మంగళవారం

మెక్సికో సిటీ మెట్రో రైలు ప్రమాదం - జ్యోతిష్య విశ్లేషణ

3-5-2021 సోమవారం రాత్రి పదిన్నర ప్రాంతంలో (అంటే ఏడుగంటల క్రితం) మెక్సికో దేశంలోని మెక్సికో సిటీలో ఒక మెట్రో రైల్ ప్రమాదం జరిగింది. మెట్రో రైలు నడవడం కోసం వేసిన బ్రిడ్జిని 'ఓవర్ పాస్' అంటారు. దాని సంభాలలో ఒకటి విరిగిపోయి, మెట్రో ఓవర్ పాస్ కూలిపోయింది. మెట్రో రైలు రెండుముక్కలై రోడ్డును తాకింది.  23 మంది పోయారని 70 కి పైగా గాయాల పాలయ్యారని అంటున్నారు. ఈ లెక్క క్షణక్షణానికీ పెరుగుతోంది. ఇంతపెద్ద ఘోరప్రమాదం పెపంచంలో జరిగాక మనం రంగంలోకి  దిగకపోతే ఎలా? బావుంటుందా అసలు? ఏమైందో చూద్దాం !

శని, సూర్యుడు, రాహువు ఈ సంఘటన వెనుక ఉన్న ముఖ్య గ్రహాలు. శని సూర్యులమధ్యన ఖచ్చితమైన కేంద్రదృష్టి ఉన్నది. ఇది ఘోరప్రమాదాలను సృష్టించే శక్తిని కలిగి ఉంటుంది. ఇకపోతే, శనిరాహువులమధ్యన ఖచ్చితమైన కోణదృష్టి ఉన్నది. ఇది బలమైన శపితయోగాన్ని రేకెత్తిస్తుంది. హఠాత్ సంఘటనలకు, విద్రోహచర్యలకు కారకుడైన యురేనస్ సూర్యుడికి చాలా దగ్గరగా ఉన్నాడు.

యాక్సిడెంట్ జరిగినపుడు మెక్సికో సిటీలో ధనుర్లగ్నం ఉదయిస్తున్నది. యాక్సిడెంట్లకు సూచికగా ఉన్న ఆరవ ఇల్లు వృషభంలో ఉచ్చరాహువు, బుధుడు ఉన్నారు. బుధుడు దశమాధిపతిగా ఆరవ ఇంటిలో ఉంటూ యాక్సిడెంట్ ను సూచిస్తున్నాడు.

దేశాలకు, రాశులకు ముడిపెట్టాలని చాలా పాతకాలం నుంచీ జ్యోతిష్కులు ప్రయత్నించారు. రకరకాల జ్యోతిష్కులు రకరకాలుగా వీటిని చెప్పారు. వీరిలో ఎక్కువమంది పాశ్చాత్య జ్యోతిష్కులున్నారు. కానీ వీరిలో ఏకాభిప్రాయం లేదు. వీరిని గౌరవిస్తూనే, నా లాజిక్ ను కొంత వివరిస్తాను.

మిథునరాశి అనేది అమెరికాకు సూచికని చాలామంది జ్యోతిష్కులు ఒప్పుకున్న విషయం ! దీనిని ఆధారాలు కూడా ఉన్నాయి. అలాంటప్పుడు, అమెరికాకు దక్షిణాన ఉన్న మెక్సికో వృషభం అవ్వాలి. ప్రస్తుతం రాహు బుధులున్నది వృషభరాశిలోనే గనుక నా లాజిక్ దీనికి సరిపోతోంది. పైగా, భారతదేశం యొక్క రాశి మకరమని కూడా ఏకాభిప్రాయమున్నది. భారతదేశమూ, మెక్సికో రెండూ ప్రపంచపటంలో దక్షిణాదిలోనే ఉంటాయి గనుక, మకరానికి కోణరాశియైన వృషభం మెక్సికో రాశి కావడం సమంజసంగానే ఉంటుంది.

యాక్సిడెంట్ జరిగిన సమయంలో గురుహోర జరుగుతున్నది. గురువు దశమంలో ఉండాలంటే అది వృషభమే అవ్వాలి. కనుక మెక్సికో దేశపు రాశి వృషభమని నేను భావిస్తున్నాను. అయితే ఇది అంతిమభావన కాదు. ఇంతకంటే మెరుగైన లాజిక్ దొరికేవరకూ దీనిని మనం అనుసరిద్దాం.

వృషభలగ్నం నుంచే చూచినప్పుడు ప్రయాణాలకు సూచకుడైన చంద్రుడు దూరప్రయాణాలకు సూచికైన మకరంలో బాధకుడైన శనితో కలసి ఉండటం రవాణా ప్రమాదాన్ని సూచిస్తున్నది. అంతేగాక వీరిద్దరి దృష్టి కర్కాటకం పైన ఉన్నది.

ప్రమాదసమయంలో కుజ - రాహు - శనిదశ జరిగింది. ఇది చాలా ప్రమాదకరమైన దశ అనే విషయం నా వ్రాతలు చదివేవారికి బాగా తెలుసు. వృషభం నుంచి చూస్తే, రెండింట ఉన్న కుజుడు స్వదేశంలో ప్రమాదాన్ని సూచిస్తున్నాడు. లగ్నంలోనే ఉన్న రాహువు రవాణా ప్రమాదాన్ని సూచిస్తున్నాడు. నవమంలో ఉంటూ తృతీయాన్ని చూస్తున్న శని మళ్ళీ రవాణా ప్రమాదాన్ని సూచిస్తున్నాడు. చంద్రలగ్నం నుంచి చూస్తే - ఆరవయింట్లో ఉన్న కుజుడు ప్రమాదాన్ని సూచిస్తున్నాడు. రాహువుతో ఆరవ అధిపతి బుధుడు కలసి ఉన్నాడు. శని చంద్రునితోనే ఉంటూ ఏడుపును సూచిస్తున్నాడు. నవాంశలో మిథునంలో కలసి ఉన్న శనిరాహువులు భయంకరమైన యోగాన్ని సృష్టిస్తూ సహజతృతీయ రాశి అయిన మిథునం ద్వారా రవాణాప్రమాదాన్ని సూచిస్తున్నారు.

అష్టమి ఘడియలలో ఈ ప్రమాదం జరిగింది. కొన్ని కొన్ని తిధులు ఇలాంటి సంఘటనలకు చాలా బాగా పనిచేస్తాయన్నది మనకు తెలిసిన విషయమే. అలాంటి వాటిల్లో అష్టమి ఒకటి. అదీ సరిపోయింది.

అదన్నమాట సంగతి !