నిత్యజీవితంలో ప్రతిఫలించని జ్ఞానం నిరర్ధకం

12, మే 2021, బుధవారం

రష్యా స్కూల్లో కాల్పులు - అమావాస్య ప్రభావం

11-5-2021 మంగళవారం ఉదయం 9. 20 నిముషాలకు రష్యాలోని కజాన్ సిటీలో ఒక స్కూల్లో, ఒక దుండగుడు జరిపిన కాల్పులలో తొమ్మిదిమంది విద్యార్థులు చనిపోయారు. 18 మంది విద్యార్థులు గాయపడ్డారు. దుండగుడు ఇంతకుముందు అదే స్కూల్లో చదివాడని అంటున్నారు. అతనికి మానసిక సమస్యలున్నాయని కూడా అంటున్నారు. జ్యోతిష్యపరంగా ఏం జరిగిందో చూద్దాం.

నిన్న నిండు అమావాస్య. అమావాస్యరోజున పిచ్చోళ్లకు పిచ్చి ఉద్రేకిస్తుందన్నది ప్రపంచవ్యాప్తంగా రుజువైన సత్యం. మరి అలాంటి అమావాస్య రోజున, మానసిక సమస్యలున్న యువకుడికి, అందులోనూ గన్ చేతులో ఉన్నవాడికి, ఇలాంటి బుద్ధి పుట్టడంలో ఆశ్చర్యమేముంది? 'పిచ్చోడి చేతిలో రాయి' అని మన దేశంలో ఒక సామెతుంది. మనకు తుపాకులు లేవుగనుక ఆ సామెత వచ్చింది. విదేశాలలో అయితే, 'పిచ్చోడి చేతిలో తుపాకీ' అని మార్చుకోవాల్సి వస్తుందేమో మరి !

ఆ సమయంలో కజాన్లో ఉదయిస్తున్న లగ్నడిగ్రీ మిథునం 16 అవుతూ, హింసకు, దుర్ఘటనలు, కోపాలకు ప్రేరకుడైన కుజునికి చాలా దగ్గరగా ఉంది. నిన్న మంగళవారం కూడా. కుజుని కోణదృష్టి కుంభంలో ఉన్న గురువు మీదున్నది. కుంభరాశి రష్యాను సూచిస్తుందని చాలామంది పాశ్చాత్య జ్యోతిష్కులు భావిస్తారు. ఇందులో నిజం ఉండి ఉండవచ్చు. 

కుంభరాశిని రష్యారాశిగా తీసుకుని చూచినప్పుడు, అక్కడనుంచి విద్యాస్థానమైన చతుర్దంలో రాహుబుధులు ఖచ్చితమైన డిగ్రీ కంజంక్షన్ లో 17 వ డిగ్రీమీద, చంద్రనక్షత్రమైన రోహిణిలో ఉన్నారు. బుధుడు విద్యార్థులను సూచిస్తాడు. చంద్రుడు చిన్నపిల్లలను సూచిస్తాడు. రాహువు ప్రమాదాలను, ఘోరమైన చావును సూచిస్తాడు.

ప్రస్తుతం ఖగోళంలో ఉన్న ప్రమాదకరమైన యోగం శనిపైన ఉన్న అష్టమకుజదృష్టి. మకరం నుంచి ఈ దృష్టిప్రభావం  శనియొక్క కోణదృష్టి ద్వారా వృషభం మీద పడుతున్నది.  వృషభం, రష్యాకు విద్యాస్థానమైంది. అంటే, స్కూల్స్ ని సూచిస్తున్నది.  పైగా, వృషభం రెండువైపులా కుజునితోను, అమావాస్య యోగంతోనూ ఆర్గళదోషానికి గురైంది. అమావాస్య తిధి దీనికి ఆజ్యం పోసింది.

ఆ సమయంలో శుక్ర - రాహు - శుక్రదశ నడుస్తోంది. శుక్ర రాహువులిద్దరూ వృషభంలో ఉండటం చూడవచ్చు. కనుక వృషభరాశి ఈ సంఘటనకు కేంద్రస్థానంగా మారింది. అది, రష్యాలోని స్కూళ్లను సూచిస్తోంది. కనుక, రష్యాలోని స్కూల్లో ఈ దుర్ఘటన జరిగింది. అంతేగాక ఆ సమయంలో శుక్రహోర నడుస్తున్నది. కనుక శుక్రప్రాముఖ్యత ఉన్నది.

జ్యోతిష్య విద్యార్థులకు ఉపయోగపడుతుందని, లొకేషనల్ ఎస్ట్రాలజీలో మరొక్క సూత్రాన్ని ఇక్కడ  పరిచయం చేస్తున్నాను.

కుంభరాశి రష్యాను సూచిస్తుంది. ఇది పశ్చిమరాశి. రష్యాను మళ్ళీ నాలుగు ముక్కలు చేస్తే, మొదటి 7. 5 డిగ్రీలు పశ్చిమదిక్కునే సూచిస్తాయి. ఆ భాగంలోనే, అంటే రష్యా పశ్చిమభాగంలోనే కజాన్ సిటీ ఉన్నది. అక్కడే ప్రస్తుతం 5 డిగ్రీల మీద గురువున్నాడు. గురువు కూడా విద్యాకేంద్రాలను, ఉపాధ్యాయులను సూచిస్తాడు. ఈ సంఘటన ఇక్కడే ఎందుకు జరిగింది? అనేదానికి ఈ చిన్న క్లూ చాలనుకుంటాను. అర్ధం చేసుకోగలిగితే అర్ధం చేసుకోండి !

అమావాస్య ప్రభావానికి ఈ సంఘటన మరో నిదర్శనం !