Pages - Menu

Pages

19, మే 2021, బుధవారం

తీరుతుంది...

వివరం సరిగ్గా వెల్లడైతే

ఆశ చచ్చిపోతుంది

సంసారమన్నా సన్యాసమన్నా

మనుగడన్నా మరణమన్నా


విషయం సరిగ్గా తెల్లమైతే

ఆకలణగి పోతుంది

తిండన్నా అండన్నా

గొప్పలన్నా తిప్పలన్నా


మొత్తం చూసేసినప్పుడు

మోజు తీరిపోతుంది

తనవారన్నా పగవారన్నా

దూరమన్నా దగ్గరన్నా


దారులన్నీ తెలిసినపుడు

దాహమారిపోతుంది

అమృతమన్నా గరళమన్నా

అకృత్యాలన్నా సుకృత్యాలన్నా


కర్మ ఎక్కువైపోయినపుడు

కాటు పడే తీరుతుంది

మోతుబరైనా సాగుబరైనా

మాయకుడైనా అమాయకుడైనా


మాట వినకపోయినపుడు

మూత పడే తీరుతుంది

నోటికైనా తేటికైనా

లోటేలేని చోటుకైనా...