నిత్యజీవితంలో ప్రతిఫలించని జ్ఞానం నిరర్ధకం

27, మే 2021, గురువారం

యాస్ తుఫాన్ భీభత్సం - కుజశుక్రుల ఆచ్చాదనా యోగపు మరో ఫలితం

అతి పెద్ద తుఫాన్ల పట్టికలో చేర్చబడిన 'యాస్' తుఫాను ఇండియాను, బాంగ్లాదేశ్ ను గత మూడు రోజులుగాఎలా వణికించిందో చూసాం. లక్షలాది మంది ప్రజలు దీనివల్ల ఈ మూడు రోజులుగా నానా అగచాట్లు పడ్డారు. కొంతమంది చనిపోయారు కూడా. ఇది కూడా ఆచ్చాదనాయోగపు మరో ఫలితమే. నేనింతకు ముందు కూడా చెప్పాను, ఒకే గ్రహయోగం అనేక దేశాలలో అనేక విధాలుగా ఫలితాలు చూపిస్తుందని. దానికి యాస్ తుఫాను కూడా మరో ఉదాహరణ !

23 వ తేదీన బంగాళాఖాతంలో ఒక డిప్రెషన్ గా ఇది గుర్తించబడింది. ఆరోజునే, శుక్రుడు 23 వ డిగ్రీలోకి ప్రవేశించాడు. జ్యోతిష్యశాస్త్ర పరంగా ఇది తూర్పు దిక్కుకు సూచిక అవుతుంది. అందుకే, అప్పటిదాకా గుజరాత్ ను వణికించిన తుఫాన్ వాతావరణం, ఆ రోజునుంచీ తూర్పు దిశగా మళ్లింది. బెంగాల్ ను, బాంగ్లాదేశ్ ను భయపెట్టడం మొదలుపెట్టింది. 24 తేదీన కుజశుక్రుల మధ్యన ఖచ్చితమైన ఆచ్చాదనాయోగం ఏర్పడింది. కనుక ఆ రోజున దీనిని తీవ్రమైన తుఫాన్ గా గురించి 'యాస్' అని పేరు పెట్టారు. ముందుకు కదులుతున్న శుక్రుని నడకను అనుసరిస్తూ ఇది 25 న బలాన్ని పుంజుకుంది. 26 న ఉదయం తొమ్మిదికి తీరాన్ని తాకింది. ఈ మూడు రోజులూ రెండుదేశాల ప్రధానమంత్రులూ, అధికారులూ, యంత్రాంగమూ, నిద్రలేని రాత్రులను గడిపారు.

ఈ వర్షాలవల్ల బెంగాల్లో మూడులక్షల ఇళ్ళు దెబ్బ తిన్నాయి. అయిదు లక్షలమంది నిరాశ్రయులైనారు. ప్రత్యక్షంగా పరోక్షంగా మొత్తం కోటిమంది దెబ్బతిన్నారు. ప్రకృతి కన్నెర్ర చేస్తే ఏమౌతుందో, మనిషి విర్రవీగుడు ఏమౌతుందో దీనివల్ల అర్ధం చేసుకోవచ్చు. 

శుక్ర కుజుల మధ్యన ఏర్పడిన ఆచ్చాదనాయోగం కుజుని అష్టమ దృష్టిద్వారా మకరం మీదకు పడింది. మకరం ఇండియాకు సూచిక. 26 వ తేదీన పౌర్ణమి, చంద్రగ్రహణం కలసి వచ్చాయి. చంద్రుడు జలతత్వ రాశి అయిన వృశ్చికంలో ప్రవేశించి కేతువుతో కలిశాడు. అక్కడనుంచి వీరి దృష్టి మరో జలతత్వ గ్రహమైన శుక్రునిమీద పడింది. కుజుడున్న మిధునరాశి నుండి వాయుతత్వం వీరితో జత కలిసింది. జలం వాయువూ కలసి విజృంభించి తుఫాన్ ను మకరరాశి సూచిస్తున్న నేలవైపు తీసుకెళ్లాయి. కనుక 26 వ తేదీన తుఫాన్ ఇండియాకు తూర్పుదిశలో నేలను తాకి భీభత్సాన్ని సృష్టించింది.

శుక్ర, కుజుల మధ్యన ఏర్పడిన ఆచ్చాదనాయోగం, చంద్రకేతు సంయోగం, గ్రహణం, పౌర్ణమి - ఇవీ ఈ జనసంక్షోభానికి దోహదం చేసిన కారణాలు.