శని - కుజ - ప్లుటోల చెడుప్రభావాలు కొనసాగుతున్నాయి.
- నిన్న గురువారం, అమావాస్య సూర్యగ్రహణం. మొన్న బుధవారం రాత్రి 10. 15 గంటలకు ముంబాయ్ లోని మలాడ్ ఏరియాలో ఒక ఇల్లు కూలిపోయి 11 మంది చనిపోయారు. పక్కనున్న ఇళ్లుకూడా దెబ్బతిన్నాయి. ఆగకుండా కురుస్తున్న వర్షాలవల్ల ఇది జరిగిందని అంటున్నారు.
- దక్షిణ కొరియాలో ఒక ఐదంతస్తుల బిల్డింగ్ కూలిపోయి క్రిందనున్న బస్సుమీద పడింది. ఆ బస్సులోని 9 మంది హరీమన్నారు. మరో 8 మంది తీవ్రగాయాల పాలయ్యారు.
- ఇదే సమయంలో మెక్సికో టూర్ కెళ్లిన మెలిస్సా, జార్జియా లారీ అనే బ్రిటిష్ అక్కాచెల్లెళ్లు ఒక మడుగులో ఈతకొడుతుండగా వారిలో ఒకమ్మాయిని మొసలి పట్టుకుంది. జార్జియా ఆ మొసలితో పోరాడింది. ఇద్దరూ బయటపడ్డారు. ప్రస్తుతం క్షేమంగా ఉన్నారు. అది కాదు అసలు విషయం. మెక్సికో కూడా ఇండియాలాగా మకరరాశి అని ఇంతకుముందు వ్రాశాను. మకరమంటే మొసలి. ఈ అక్కాచెల్లెళ్ళిద్దరూ కవలలు, అంటే మిధునరాశిచేత సూచింపబడతారు. కర్కాటకమంటే నీటిమడుగు. కర్కాటకరాశిలో ఉన్న నీచకుజుడు మొసలిని సూచిస్తున్నాడు. అక్కడున్న నీచ కుజునికీ మిధునానికీ (ట్విన్ సిస్టర్స్ కీ) ఆచ్చాదనాదోషం ఉన్నది. మకరం నుంచి శని ప్లూటో ల దృష్టి కర్కాటకం మీద ఉన్నది. ఈ లోపల అమావాస్య వచ్చింది. ఈ అమావాస్య సమయంలోనే ఈ సంఘటన జరిగింది. ఎంత కరెక్ట్ గా జరిగిందో చూడండి ! ఎక్కడో ఇంగ్లాండ్ లో ఉన్న ట్విన్స్ ఇదే సమయానికి మెక్సికోకెళ్లి అక్కడ ఎవడో లైసెన్స్ లేని టూర్ గైడ్ చూపించిన ఒక నీటిమడుగులో దిగి ఈతకొడుతూ మొసలిబారిన పడ్డారు. గ్రహప్రభావాలు లేవని అనగలమా చెప్పండి ! అమావాస్య, పౌర్ణమి సమయాలలో ఇలాంటి సాహసాలు చెయ్యకూడదని మనవాళ్ళు ఊరకే అనలేదు మరి !
- ఇది అంతర్జాతీయ వార్త కాదు. కానీ గ్రహప్రభావాలు మనిషి జీవితం మీద ఎంత సూక్ష్మంగా పనిచేస్తాయో చెప్పడానికి ఈ సంఘటనను వ్రాస్తున్నాను.
- ఇలా చెప్పుకుంటూ పోతే ప్రపంచవ్యాప్తంగా ఎన్నో జరిగాయి. ఇవి మచ్చుకి కొన్ని మాత్రమే.