నిత్యజీవితంలో ప్రతిఫలించని జ్ఞానం నిరర్ధకం

1, జూన్ 2021, మంగళవారం

కెనడాలో బయటపడిన విద్యార్థుల సామూహిక సమాధి - బుధుని రాశిసంధి చెప్పిన నిజం

28-5-2021 న కెనడాలో ఒక సమాధి బయటపడింది. అందులో 215 మంది పిల్లల అస్థిపంజరాలున్నాయి. పశ్చిమ కెనడాలోని బ్రిటిష్ కొలంబియాలో కాంలూప్స్ ఇండియన్ రెసిడెన్షియల్ స్కూల్ అని ఒక స్కూలుంది. అది 1890 లో మొదలై 1969 దాకా నడిచింది. 1950 లో అందులో 500 మంది పిల్లలుండేవారు. ఇప్పుడుకూడా ఆ భవనం ఇంకా ఉంది. దాని ఆవరణలోనే ఈ నేలమాళిగ సమాధి బయటపడింది.

ఈ స్కూల్ పేరులో ఉన్న ఇండియన్ అనే పదం చూసి అదేదో మనదనుకోకండి. అదొక పొరపాటు. యూరోపియన్లు కెనడాని కనుక్కున్నపుడు దానిని ఈస్ట్ ఇండియా అనుకున్నారు. అందుకని, అప్పటికే అక్కడ ఉన్న ప్రజలను ఇండియన్స్ అన్నారు. కొలంబస్ అమెరికాను కనుక్కున్నపుడు కూడా దానిని ఇండియా అనుకున్నాడు. అందుకే అక్కడి వాళ్ళను రెడ్ ఇండియన్స్ అన్నారు. కెనడాలో ఈ పొరపాటును తరువాత సరిదిద్దుకున్నారు. ఎందుకంటే, తర్వాత్తర్వాత ఎంతోమంది మనవాళ్ళు కెనడాకెళ్లి స్థిరపడ్డారు గనుక.

బ్రిటిష్ వాళ్ళు ఆక్రమించడం మొదలుపెట్టిన రోజులలో, లోకల్స్ కి చదువు, ఇంగిలీషు, పద్ధతులు నేర్పడానికి, క్రైస్తవం నూరిపోయడానికి రెసిడెన్షియల్ స్కూళ్ళు పెట్టారు. నిజానికి అవన్నీ, ఆయా ప్రజల భాషను, సంస్కృతిని, మతాన్ని రూపుమాపడానికి చర్చి చేసిన ప్రయత్నాలు మాత్రమే. ఇది వాళ్ళాక్రమించిన ప్రతి దేశంలోనూ జరిగింది. కొన్ని చోట బాగా సక్సెస్ అయింది, కొన్నిచోట్ల కాలేదు,  అంతే తేడా. ఈ క్రమంలో వాళ్ళు చేసిన అనేక నేరాలు ఘోరాలు ఇప్పుడిప్పుడే వెలుగులోకి వస్తున్నాయి.

ఇకపోతే, ఈ స్కూళ్లలో బలవంతంగా చేర్చబడిన పిల్లల్లో అనేకమంది వెనక్కు తిరిగి రాలేదు. తల్లిదండ్రులు అడిగితే ఫాదర్లు జవాబు చెప్పేవారు కారు. ఆ రోజులలో ఒక కేథలిక్ ఫాదర్ (ప్రిన్సిపాల్) మాత్రం 'డబ్బు లేకపోవడం వల్ల పిల్లలకు తిండి పెట్టలేకపోతున్నాం' అని అన్నాట్ట. అప్పట్లో ఆ స్కూళ్లలో చదివి ప్రాణాలతో బయటపడిన కొందరు అదృష్టవంతులు చెబుతున్నదేమంటే 'ఆ స్కూళ్లలో ఆకలి, భయం, అవమానించబడటం, సెక్స్ హింసకు గురికావడం, రోగాలు వచ్చినా మందులు లేకపోవడం, సరియైన పోషణ లేకపోవడం' సర్వసాధారణంగా జరిగేదట. ఆయా స్కూళ్ల ఆవరణలలో సామూహికంగా పిల్లలను చంపి, లేదా, సాంక్రామిక రోగాలొచ్చినపుడు సరియైన ట్రీట్మెంట్ ఇవ్వకుండా, అలా చనిపోయిన పిల్లలను అక్కడే పాతిపెట్టడం జరిగిందని కెనడాలో చాలా పుకార్లున్నప్పటికీ, ఇప్పటివరకూ ఎవరూ పరిశోధన చెయ్యలేదు. అక్కడున్న ఆదివాసీ ప్రజలు కొందరు పూనుకుని నేల లోపల ఏముందో చూచే రాడార్లు ఉపయోగించి ఈ పరిశోధన చేశారు. ఆ పరిశోధనలో 215 మంది పిల్లల అస్థిపంజరాలు ఒక స్కూల్ ఆవరణలోని ఒక సమాధిలాంటి గుంటలో లభించాయి. కేథలిక్ ఫాదర్లే ఆ పిల్లలను చంపేసి సామూహిక ఖననం చేసేసి ఉంటారని నేడు భావిస్తున్నారు.

ఎంత దారుణమో కదా ! ప్రపంచానికి నీతులు బోధించే మతాల చీకటి గుహలలో ఎన్ని ఇలాంటి దారుణాలు దాగున్నాయో?

నేడు కెనడా అంతా విలపిస్తోంది. కెనడా ఆదివాసీలు తమను తాము 'ఫస్ట్ నేషన్' అని పిలుచుకుంటారు. ఇప్పుడు కెనడా అంతటా అన్ని రెసిడెన్షియల్ స్కూళ్లలోనూ ఇలాంటి రాడార్ తోనే పరిశోధన చెయ్యాలని అక్కడున్న సమాధులన్నీ తవ్వాలని వారు ఒత్తిడి చేస్తున్నారు. ఎందుకంటే గత రెండువందల ఏళ్లలో, ఈ స్కూళ్లకెళ్లిన కొన్ని వేలమంది ఆదివాసీల పిల్లలు మాయమయ్యారట !

ఇప్పుడు జ్యోతిష్య శాస్త్రం ఏమంటున్నదో చూద్దాం !


28-5-2021 న ఈ వార్త వెలుగు చూసినప్పుడు, బుధుడు మిధునరాశి  సున్నా డిగ్రీలలో ఉన్నాడు. బుధుడు చిన్నపిల్లలను సూచిస్తాడని జ్యోతిష్యశాస్త్ర విద్యార్థులకు బాగా తెలుసు కదా ! అలాగే, మిధునరాశి కూడా పిల్లలను విద్యార్ధులను సూచిస్తుంది. రాశిసంధిలో ఉండటం ఒక దుర్ఘటనను, దానివల్ల కలిగే మానసిక వేదనను సూచిస్తుంది.

నా వ్రాతలు చదివేవారికి మరో విషయం కూడా తెలిసుండాలి. అదేంటంటే, మిధునరాశి అమెరికాకు సూచికని. కనుక దాని క్రిందనున్న కర్కాటక రాశి కెనడాను సూచిస్తుంది. జాతకంలో కర్కాటకరాశి బలంగా ఉన్నవారికి కెనడా దేశంతో తప్పనిసరిగా సంబంధం ఉంటుంది. వాళ్ళు అక్కడికి పోకపోతే కనీసం వాళ్ళ పిల్లలైనా అక్కడ సెటిలౌతారు. ఇది ఎన్నో జాతకాలలో చూశాను. కనుక కర్కటకాన్ని కెనడా లగ్నంగా తీసుకుంటాను. మిగతా జ్యోతిష్కులు వేరే లగ్నాలు తీసుకోవచ్చు. అది వారిష్టం. కానీ నా ఉద్దేశ్యంలో కర్కాటకరాశి లక్షణాలు కెనడాతో బాగా సరిపోతాయి. అవేంటంటే, మెత్తని మనస్తత్వం, జాలిగుండె, ఉదారస్వభావం, మంచితనం మొదలైన లక్షణాలు. ఈ లక్షణాలు కెనడాలో పుష్కలంగా ఉన్నాయి. కనుక, ఇప్పుడు కర్కాటకలగ్నం నుంచి గ్రహస్థితిని చూద్దాం.

  • చిన్నపిల్లలకు, ముఖ్యంగా విద్యార్థులకు కారకుడైన బుధుడు సున్నా డిగ్రీలలో చావుకు సూచికైన ద్వాదశభావంలో ఉన్నాడు. ఇది రాశిసంధి. అంటే, ఈ పిల్లలు చావుబ్రతుకుల మధ్యన ఊగిసలాడే దుర్భర పరిస్థితిని ఆ స్కూల్లో చవిచూశారని అర్ధం.
  • ద్వాదశభావంలో కుజబుధుల యుతి వల్ల, ఆ పిల్లలు హింసాత్మకంగా చంపబడ్డారని తెలుస్తోంది.
  • వక్రశని ధనుస్సులోకొచ్చి చందుని కలుస్తాడు. అంటే, మానసిక వేదనని అర్ధం. అది రోగస్థానం. అక్కణ్ణించి మిధునంలో ఉన్న కుజ బుధులను చూస్తున్నాడు. అంటే, అనేక రోగాలద్వారా పిల్లలు చనిపోయారని, నేడు ఆ పిల్లల బలవంతపు చావులు బయటపడి, సమాజానికి తెలిసి, దానివల్ల ఆయా  కుటుంబాలకు కలిగే దుర్భరవేదనకు సూచిక.
  • ఇకపోతే, ఉపాధ్యాయులకు సూచకుడైన గురువు, రహస్యాలను, చావులను సూచించే అష్టమంలో ఉంటూ, అక్కణ్ణించి సమాధులను సూచించే ద్వాదశరాశి మిధునాన్ని చూస్తున్నాడు. కనుక స్కూలు అధికారులైన కాథలిక్ ఫాదర్లే పిల్లల చావులకు సామూహిక సమాధికి కారకులని తెలుస్తోంది.
  • లాభస్థానంలో ఉన్న  రవి,శుక్ర, రాహువుల వల్ల విద్యార్ధినుల పైన జరిగిన సెక్స్ పరమైన అమానుషకాండ కనిపిస్తోంది. అప్పట్లో ఇవి చాలా జరిగాయని ఎందరో కెనడియన్లు అంటున్నారు కూడా.
  • సంతానాన్ని, శిష్యులను సూచించే పంచమస్థానమైన వృశ్చికంలో మరణాన్ని, సమాధులను సూచించే ఉచ్ఛకేతువున్నాడు. వృశ్చికం రహస్యప్రదేశానికి సూచిక.
  • ఇంతకంటే ఇంకే వివరాలు కావాలి? అని గ్రహాలడుగుతున్నాయి. ఇకచాలు, అంతా అర్థమైందని గ్రహాలకు చెప్పాను.
కెనడా ఆదివాసీలకు నా సానుభూతి తెలియజేస్తున్నాను. అలాగే, మానవతావాదిగా పేరున్న కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడ్ కి అభినందనలు, వెంటనే స్పందించి, తగిన చర్యలకు ఆదేశించినందుకు.

ఈ సంఘటనపై క్షమాపణ చెప్పాలని పోప్ ను కెనడా కోరింది. 2018 లో కూడా ఇలాంటి క్రైస్తవనేరాలకు కొన్నింటికి కెనడా క్షమాపణ కోరితే, పోప్ ఇంతవరకూ స్పందించలేదు. బహుశా ఇంకా నిద్రపోతున్న ప్రభువు అనుమతి కోసం వేచి చూస్తున్నాడేమో? ఆయన లేవాలి. పర్మిషన్ ఇవ్వాలి. కనీసం అప్పుడైనా పోప్ స్పందిస్తాడని ఆశిద్దాం.

శాంతిని బోధించే ఓ మతాల్లారా !
మీ పద్దుల్లో ఎన్ని రహస్య నేరచిట్టాలున్నాయో?
అడవిమనుషులకు నాగరికతను బోధించే
ఓ సమాజసేవకుల్లారా! మీ బీరువాలలో
ఎన్ని కంపుకొడుతున్న అస్థిపంజరాలున్నాయో?