కుజ శని ప్లూటో ల విధ్వంసం కొనసాగుతున్నది !
ఈరోజు ఉదయం దక్షిణ పాకిస్తాన్లో రెండు రైళ్లు గుద్దుకుని 40 మంది చనిపోయారు, 120 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇందులో మొదటి రైలు పట్టాలు తప్పగా దాని పెట్టెలు పక్క ట్రాక్ మీద పడ్డాయి. ఎదురుగా వస్తున్న మరో రైలు వాటిని గుద్దుకుని అదీ పట్టాలు తప్పింది. రైల్వే సేఫ్టీ పరంగా ఇది మేజర్ యాక్సిడెంటే.
విధ్వంసానికి కారకుడైన కుజుడు ప్రస్తుతం కర్కాటకం 3 వ డిగ్రీలో సంచరిస్తున్నాడు. చావులకు కారకుడైన ప్లూటో (యమగ్రహం) మకరరాశిలో 2 వ డిగ్రీమీదున్నాడు. ఇద్దరికీ ఖచ్చితమైన సమసప్తక దృష్టి ఉన్నది. పాకిస్తాన్ దేశం ఇండియాకు ఆఫ్ఘనిస్తాన్ కూ మధ్యలో ఉన్నది గనుక అది మకరం 3 వ డిగ్రీమీదున్నదని నా భావన. మకరం భూతత్వ రాశి గనుక పాకిస్తాన్లో భూపరమైన యాక్సిడెంట్ జరిగింది.
విచిత్రంగా ఇదే సమయంలో, శ్రీలంకలో విపరీతమైన వర్షాలు పడుతున్నాయి. కొన్ని వందల ఇళ్ళు దెబ్బతిన్నాయి. 245,000 మంది ఈ వర్షాలవల్ల దెబ్బతిన్నారు. సింహరాశి శ్రీలంకను సూచిస్తుందని వ్రాశాను. దానికి ద్వాదశంలో జలతత్వరాశిలో ఏర్పడిన ఈ యోగం వల్ల అక్కడ విపరీతమైన వర్షాలు పడ్డాయి. కర్కాటకం జలతత్వరాశిగా శ్రీలంకలో జలప్రమాదాన్ని సృష్టించింది.
ఈ రకంగా, ఒకే గ్రహయోగం, ఆ దేశాన్ని బట్టి, ఆ గ్రహాలను బట్టి రకరకాలైన ఫలితాలనిస్తుంది. మనుషులకైనా ఇంతే. చేసుకున్న కర్మ ఎవరినీ వదలదు కదా మరి !