Pages - Menu

Pages

4, జులై 2021, ఆదివారం

కెనడా అమెరికాలలో అత్యధిక ఎండలు

కెనడా అంటేనే మంచుప్రాంతమని ఒక ఊహ. అమెరికాలో చాలా చోట్లు, ముఖ్యంగా నార్త్ లో  అలాగే ఉంటుంది. కానీ గత నాలుగురోజులనుంచీ అక్కడ ఎండలు మండుతున్నాయి. 50 డిగ్రీల సెల్సియస్ వచ్చిందట, అంటే 122 ఫారెన్ హీట్ అన్నమాట. ఇవి గుంటూరు విజయవాడ వేసవి ఎండలు. గుంటూరు వాసులకు ప్రతేడాదీ 50 డిగ్రీలు మామూలే. మే నెలాఖరులో గుంటూరు వాసులు ఈ ఎండలు చూస్తూనే ఉంటారు ఒక వారం పాటు. మనమే తట్టుకోలేం ఇంత ఎండల్ని, ఆ వేడికి అమెరికన్లు కెనడియన్లు ఏం తట్టుకుంటారు పాపం ! 

ఈ హీట్ వేవ్ దెబ్బకు కెనడాలో 716 మంది హరీమన్నారు. అమెరికా ఆరిగన్ లో 95, వాషింగ్టన్ లో 35 మంది పోయారని అంటున్నారు. కూలింగ్ సెంటర్లనేవి ఎడాపెడా వెలిశాయి. జనాలంతా అక్కడికెళ్లి చెడ్డీలేసుకుని బోర్లాపడుకుని బ్రతికిపోతున్నారు.

గత వెయ్యి సంవత్సరాలలో ఇలాంటి పరిస్థితి రాలేదని అంటున్నారు. అసలింత వేడికి కారణమేంటి? హీట్ డోమ్ అని సైన్స్ వాదులంటున్నారు. కావచ్చు. ఈ హీట్ డోమ్ ఇదే ప్రాంతాన్ని హింసించడానికి కారణం? అది సైన్స్ వాదులకర్ధం కాదు.

కెనడాలో వందలాది పిల్లల సమాధులు బయటపడిన బ్రిటిష్ కొలంబియాలోనే ఇది జరుగుతోంది. అక్కడి సస్కచ్ఛవాన్ ప్రావిన్స్ వైపు ఈ హీట్ వేవ్ పోతోంది. ఈ సూచన ఏమి చెబుతోంది? గత తరం చేసిన ఘోరాలకు ఈ తరం మూల్యం చెల్లిస్తోందని చెబుతోంది. ఈ హీట్ వేవ్ దెబ్బకు ఎవరెవరు పోయారో వాళ్ళందరి కుటుంబ మూలాలు తరచి చూస్తే, గతకాలపు ఘోరాలకు లింకులు దొరుకుతాయి. కానీ అంత స్టాటిస్టికల్ స్టడీ ఎవరు చెయ్యగలరు? డాటా ఎక్కడ దొరుకుతుంది? దొరికినా ఉపయోగమేముంది? మనకు ముందే తెలుసుకదా ఇది కర్మఫలితమని.

అందుకే మన పూర్వీకులనేవారు - 'ఈరోజు విర్రవీగి పిచ్చిపనులు చెయ్యకండిరా ముందుముందు పడాల్సి వస్తుంది అని' - ఎవరు వింటారు?

సరే కెనడా సంగతి, మరి నార్త్ వెస్ట్ అమెరికా వాసులెందుకు పడుతున్నారు హింస? అంటే, వాళ్ళ కారణాలు వాళ్ళకుంటాయి. ఒక్కొక్కళ్ళకీ విడివిడిగా కూచోబెట్టి వడ్డించడం కుదరదు కదా ప్రకృతికి, అందుకే ఒకే రకమైన మనుషులనందర్నీ ఒకే గాటన కట్టి ఒకేసారి బంతిభోజనం వడ్డిస్తోంది. ఇదిలాగే ఉంటుంది.

వ్యక్తిగతంగా, కుటుంబపరంగా, సామూహికంగా ఎక్కడికక్కడే వడ్డన జరుగుతూ ఉంటుంది మానవజీవితంలో . అర్ధం కావాలంటే, చూచే చూపుండాలి మరి !

గత మూడు రోజులుగా కుజుడు, శని యురేనస్ లతో ఖచ్చితమైన డిగ్రీ దృష్టిలోకి వచ్చాడు. ఇదే సమయంలో కెనడా అమెరికాలలో ఈ భయంకర ఎండలు వాయించాయి. కుజుడు ప్రస్తుతం కర్కాటక రాశిలో ఉన్నాడు, ఈ రాశి కెనడాకు సూచిస్తుందని వ్రాశాను. యురేనస్ అగ్నితత్త్వ రాశి అయిన మేషంలో ఉంటూ  తీవ్రమైన వేడిని సూచిస్తున్నాడు. శని వాయుతత్త్వగ్రహం గనుక వేడిగాలులను సూచిస్తాడు. యురేనస్ శని ఇద్దరూ నిదానంగా నడుస్తారు. ఎప్పుడైతే కుజుడు వీరిద్దరితో డిగ్రీ దృష్టిలోకి వచ్చాడో, ఈ రెండు దేశాలలో ఈ పరిస్థితి ఏర్పడింది.

కెనడాలో బయటపడింది 741 మంది పిల్లల సమాధులు. ఈ హీట్ వేవ్ లో చనిపోయింది కూడా దాదాపు 716 మందే. అంటే, వందేళ్లక్రితం చంపబడిన చిన్నపిల్లల ఆత్మలకు యిప్పటికి శాంతి దొరికిందన్నమాట. కర్మ ఇలా పనిచేస్తుంది మరి !

మరీ ఎక్కువగా ఊహిస్తున్నట్లు అనిపిస్తోందా? పోనీ అలాగే అనుకోండి నాదేం పోతుంది?