నిత్యజీవితంలో ప్రతిఫలించని జ్ఞానం నిరర్ధకం

23, జులై 2021, శుక్రవారం

ఒకటి పోతే ఇంకొకటి

హమ్మయ్య ! కుజుని సింహరాశి ప్రవేశంతో శనికుజ ప్రభావం అయిపొయింది కదా, 50 రోజుల శాపం అయిపోయింది. ఇక ఒడ్డెక్కాం అనుకోకండి. ఇది పోతే దీని తాతలాంటిది ఇంకోటొస్తుంది. ఇప్పటికే వచ్చింది కూడా ! అందుకే వేరే రకమైనవి జరుగుతున్నాయి.

కాలచక్రం అనంతంగా తిరుగుతూనే ఉంటుంది. పెద్దవో చిన్నవో జరిగేవి జరుగుతూనే ఉంటాయి. మనుషులకు మాత్రం బుద్ధి రాదు. నేర్చుకోరు. ఎదగరు. అదే రొంపిలో పడి దొర్లుతూనే ఉంటారు. అదే మాయంటే, అదే సృష్టినియమం, కర్మనియమం అంటే.

అనంతమైన కాలచక్రంలో గ్రహగమనం నిరంతరం జరుగుతూనే ఉంటుంది. దాని ఫలితంగా రకరకాల గ్రహయోగాలు నిరంతరం వస్తూనే ఉంటాయి, రకరకాల సంఘటనలు తలెత్తుతూనే ఉంటాయి. ఈ భూమ్మీద మానవజీవితం విచిత్రాతి విచిత్రాలుగా  నడుస్తూనే ఉంటుంది. ఒక తరం పోతే, ఇంకొక తరమొస్తుంది. మారిన పరిస్థితులలో, కొత్తగా వచ్చిన వసతులు, టెక్నాలజీల ఆసరాతో మళ్ళీ ఇదే డ్రామా నిరంతరంగా సరికొత్తగా మొదలౌతూనే ఉంటుంది. నడుస్తూనే ఉంటుంది.

క్రొత్తసీసాలో పాతసారా. అంతే !

ప్రపంచం మారదు. మనం మారాలి. సృష్టి నియమాలను, జీవిత నియమాలను అర్ధం చేసుకుంటూ ఎదగాలి. ఈ డ్రామానుంచి బయటపడాలి.

ముళ్ళదారిలో నడుస్తూ, ముళ్ళు తొక్కుకుంటూ, ఒక ముల్లుతో ఇంకొక ముల్లును తీసుకుంటూ, మళ్ళీ అవే ముళ్ళను తొక్కుకుంటూ - ఈ విధంగా నడుస్తూ ఉండటం కాదు మనం చేయవలసింది. ఏ ముళ్ళూ తొక్కకుండా ఎలా నడవాలో నేర్చుకోవాలి. అసలు నడకే ఆపేసి హాయిగా ఉండటం నేర్చుకోవాలి. అవసరమైతే, అదే దారిలో తెలివిగా ఎలా నడవాలో నేర్చుకోవాలి.

ఈ విషయాన్ని స్పష్టంగా అర్ధం చేసుకోవడమే నేను బోధించే స్పిరిట్యువల్ అస్ట్రాలజీలో మొదటి మెట్టు.