నిత్యజీవితంలో ప్రతిఫలించని జ్ఞానం నిరర్ధకం

26, జులై 2021, సోమవారం

ఈ పౌర్ణమి ఏమేం చేసింది?

మనిషి జీవితం పౌర్ణమి అమావాస్యల మధ్యన, గ్రహచలనాల మధ్యన అస్వతంత్రంగా గడిచిపోతుందంటే అతిశయోక్తి కాదు. ఎటువంటి వాడైనా సరే, విర్రవీగుడుకి ఏమాత్రం అవకాశం లేదు. మనిషి జీవితం ఖచ్చితంగా పూర్వకర్మను బట్టే నడుస్తుంది. దానిని అమలు చేసేవి గ్రహప్రభావాలు. ఇది నూటికి నూరుపాళ్ళు నిజం. తెలీనివాళ్ళు ఏదైనా అనుకోవచ్చు. కానీ ఇదే వాస్తవం.

ప్రస్తుతం గురు శనులు, కుంభ, మకరాలలో వక్రస్థితిలో ఉన్నారు. కుజశుక్రులు సింహంలో ఉన్నారు. యధావిధిగా ఈ పౌర్ణమి కూడా అనేక గందరగోళాలు చేసింది. మైక్రో లెవల్లో మనుషుల జీవితాలలో ఎన్నెన్నో సంఘటనలు జరిగాయి. ఆటుపోట్లు కలిగాయి. మేక్రో లెవల్లో ఏమేం జరిగాయో చూద్దాం.

హైదరాబాద్ దగ్గర్లో భూకంపం

ఈ రోజు ఉదయం, హైదరాబాద్ కు 156 కి. మీ దక్షిణంగా 4.0 స్థాయి భూకంపం వచ్చింది. కరోనాకు తోడు ఇది కూడా ఉందన్నమాట. ఇన్నాళ్లూ ఉత్తరాదినే అనుకున్నాం. ఇప్పుడు దక్షిణాదిన కూడా కర్మ మొదలైందన్నమాట.

హిమాచల్ ప్రదేశ్ లో వాన్ పై పడిన బండరాళ్లు

లాండ్ స్లైడ్ వల్ల కొండరాళ్ళు దొర్లుకుంటూ వచ్చి టూరిస్ట్ వాన్ ను గుద్దేసి 9 మందిని హతం చేశాయి. దీనిని కాకతాళీయం అనగలమా? ఇంత ఖచ్చితమైన టైమింగ్ కనబడుతుంటే?

మహారాష్ట్రలో పెనువర్షాలకు 150 మంది హరీ.

ఈ 150 కాక, ఇంకో 100 మంది పైన అడ్రస్ తెలియడం లేదు.

ఆఫ్ఘనిస్తాన్ సంక్షోభం

దాదాపు 22,000 కుటుంబాలు ఆఫ్ఘనిస్తాన్ లోని కాందహార్ ప్రాంతాన్ని విడిచి పారిపోయాయి. కారణం, మళ్ళీ తాలిబాన్ అదుపులోకి వస్తున్న ఈ ప్రాంతంలో ఉండి, ప్రత్యక్ష నరకాన్ని చవిచూడలేక. ఇంతకు ముందు వ్రాసినట్లే, ఆఫ్ఘనిస్తాన్ నిప్పుల కుంపటి కాబోతోంది. దీని సెగ ఖచ్చితంగా ఇండియా మీద ఉంటుంది. అంతేకాదు, అంతర్జాతీయంగా కూడా ప్రకంపనలు కలిగిస్తుంది. అనేక దేశాలు ఇందులో భాగస్వాములౌతాయి.

చైనా వరదలు

200 పైన కార్లు చైనాలోని ఒక టనెల్ లో ఇరుక్కుపోయాయి. వరదనీరు టనెల్ ను పూర్తిగా ముంచేసే స్థాయికి వచ్చింది. చైనా తూర్పు ప్రాంతం వరదలతో భీభత్సంగా ఉంది.

ప్రస్తుతానికి ఇవి చాలు. అసలైనవి ముందుముందు జరుగబోతున్నాయి. వేచి చూద్దాం.