Pages - Menu

Pages

26, జులై 2021, సోమవారం

జ్యోతిష్యం నేర్చుకోవడానికి ఎవరు అర్హులు?

ఈరోజుల్లో జ్యోతిష్యం అనేది ఒక సరదా అయిపొయింది. ఒక బిజినెస్ అయిపొయింది. దానికి తోడు ఇంటర్ నెట్ అనేది వచ్చేసి అన్నింటినీ అందుబాటులోకి తెచ్చింది. ముఖ్యంగా ఇంట్లోనే కూర్చుని జ్యోతిష్యాది విద్యలను నేర్చేసుకోవచ్చనే దురభిప్రాయం జనాలలో వచ్చేసింది. ఇది నిజం కాదు.

నా పుస్తకాలు, బ్లాగు పోస్టులు చదివిన చాలామంది నాకు మెయిల్స్ ఇస్తూ ఉంటారు. 'మీ దగ్గర జ్యోతిష్యం నేర్చుకోవాలని ఉంది. నేర్పిస్తారా?' అంటూ. అందరికీ ఓపికగా జవాబులిస్తూ ఉంటాను. ఈ మధ్య చాలా ఎక్కువమంది అడుగుతున్నారు. అందుకని, ఒక్కొక్కరికీ మెయిల్ ద్వారా అదే విషయాన్నీ చెప్పలేక, బ్లాగు ముఖంగా ఈ పోస్టు ద్వారా వారికందరికి జవాబిస్తున్నాను. గమనించండి.

జ్యోతిష్యశాస్త్రం తేలిక విషయం కాదు

జ్యోతిష్యశాస్త్రమనేది మిగతా సైన్సు, ఆర్ట్స్, కామర్స్ లాగా క్లాసుల్లో కూచుని ఆషామాషీగా నేర్చుకునే విద్య కాదు. ఇది కర్మతో చెలగాటం. తేడావస్తే జ్యోతిష్కుని చేతులు కాలిపోతాయి. దీనికి చాలా లోతుపాతులున్నాయి. వీటిని నేర్చుకోవడమూ కష్టమే, చెప్పడమూ కష్టమే. ఎందుకంటే, నేర్చుకోడానికి ఏళ్లకేళ్లు పడుతుంది. ఇది ఒకటి రెండేళ్లలో వచ్చేసే విద్య కాదు.

ఆ తరువాత, దానిని ఉపయోగించి ఇతరుల కర్మలో జోక్యం చేసుకుని, వారికి రెమెడీలు చెప్పేటప్పుడు, జ్యోతిష్కునికి ఆ ఖర్మలో భాగం చుట్టుకుంటుంది. అందుకే, జ్యోతిష్కుల కుటుంబాలలో తీరని శాపాలుంటాయి. ఆషామాషీగా, లెక్కలేనితనంతో, ఇష్టం వచ్చినట్లు ఈ శాస్త్రంతో ఆడుకుంటే, కుటుంబాలకు కుటుంబాలే సర్వనాశనం అవుతాయి. ఈ విషయం చాలా మందికి తెలీక, జ్యోతిష్యమంటే ఏదో పిల్లాట అనుకుంటారు. ఇది అజ్ఞానపు భావన.

డబ్బుకోసం జ్యోతిష్యాన్ని వాడకూడదు

నేడు చాలామంది ఏదో నాలుగుముక్కలు జ్యోతిష్యంలో ఓనమాలు నేర్చుకుని, మాటకారితనంతో, జనాలను మాయచేస్తూ డబ్బులు సంపాదిస్తున్నారు. వారు ముందుముందు పడే బాధలు భయంకరంగా ఉంటాయి. జ్యోతిష్యమంటే విలువలు లేని వ్యాపారం కాదు. డబ్బుకు ఆశపడేవాడు జ్యోతిష్యాన్ని నేర్చుకుంటే, తన గొయ్యి తానే తవ్వుకున్నట్లు అవుతుంది. గమనించండి.

బ్రాహ్మణులే జ్యోతిష్యాన్ని నేర్చుకోవడానికి అర్హులు

ఇలా అన్నానని నేనేదో మళ్ళీ కులపక్షపాతినని అనుకోకండి. నాకు 'నిజమైన' బ్రాహ్మణత్వమంటే అమితమైన గౌరవం ఉన్నమాట నిజమే. కానీ కులాన్ని గృష్టిలో పెట్టుకుని నేనేమాట చెప్పడం లేదు. ఆ మాటకున్న విస్తృతమైన అర్ధాన్ని దృష్టిలో పెట్టుకుని చెబుతున్నాను.

'బ్రాహ్మణుడు' అంటే, పాతకాలపు అర్ధంలో, ఒక ఋషిలాగా బ్రతికేవాడని అర్ధం. డబ్బుకోసం వెంపర్లాడకుండా, సత్యసంధత, నిజాయితీ, మోసంలేని జీవితం, నిరాడంబరత్వం, తపస్సు మొదలైన విలువలకోసం బ్రతికేవాడని అర్ధం.  అటువంటి వాడు మాత్రమే జ్యోతిష్యశాస్త్రాన్ని నేర్చుకోవడానికి అర్హుడు.

ఎందుకంటే, జ్యోతిష్యం ఇతరుల కర్మతో చెలగాటమని ముందే చెప్పాను కదా ! ఎన్నెన్నో పాపాలు చేసిన, ఎంతో పాపఖర్మను మూటకట్టుకున్న జీవులే ఈ జన్మలో నానాకష్టాలూ పడుతుంటారు.  కష్టాలు పడేవాళ్ళే జ్యోతిష్యశాస్త్ర సహాయం కోరుకుంటారు.  మరి వాళ్ళ ఖర్మలో జోక్యం చేసుకున్నప్పుడు, తప్పకుండా దానిలో కొంత వాటాను జ్యోతిష్కుడు అనుభవించవలసి వస్తుంది. అవి తీరని పెద్దపెద్ద పాపాలైతే, ఆ శాపాలు ఘోరంగా జ్యోతిష్కుడికి తగులుతాయి.

రెమెడీలతో పోతాయి కదా అని మీరు అనవచ్చు. ఈ పిచ్చిపిచ్చి రెమెడీలతో ఏ కర్మా పోదు. మీకు డబ్బులు మాత్రమే వదుల్తాయి. తెలిసీ తెలియని అబద్దాలు చెప్పి, డబ్బుకోసం అక్కర్లేని హోమాలు, రెమెడీలు చేయించినందుకు లేనిపోని కర్మ ఆ జ్యోతిష్కుడిని చుట్టుకుంటుంది. ఈ రోజు కాకపోతే రేపు అతను ఆ కర్మను తప్పకుండా అనుభవించవలసి వస్తుంది.

గాయత్రీ జపం చేస్తే రెమెడీలు చెప్పిన దోషం పోతుంది కదా అని కొంతమంది అంటారు. మొక్కుబడిగా చేసే గాయత్రీ జపంతో ఏ దోషమూ పోదు. 15 సార్లు అక్షరలక్షలు జపం చేసిన విద్యారణ్యస్వామికే గాయత్రీ దర్శనం కాలేదు. తూతూమంత్రంగా, ఆదరాబాదరాగా చేసే జపం ఎందుకూ పనికిరాదని గ్రహించండి. 

ఏతావాతా చెప్పేదేమంటే, ఒక ఋషిలాగా ఆశకు అతీతంగా బ్రతికేవాడే జ్యోతిష్యశాస్త్రం జోలికి పోవాలి. లేదా, నానాబాధలనూ అనుభవించక తప్పదని గుర్తుంచుకోండి. జ్యోతిష్కుని మనస్సులో ఏమాత్రం దురుద్దేశం తలెత్తినా, అతనికి వేటు పడుతుంది.  ఇది తప్పదు.

కనుక, ఒక నిజమైన స్వచ్చమైన బ్రాహ్మణునిలా బ్రతకగలవాడు మాత్రమే ఈ విద్యను నేర్చుకోవడానికి అర్హుడు. అంతేగాని, ఎక్కడబడితే అక్కడ తింటూ, విచక్షణ లేకుండా ఏ పని పడితే ఆపని చేస్తూ, కర్మను నమ్మకుండా 'ఈరోజు దక్కింది చాలు. రేపటి సంగతి రేపు చూచుకుందాం' అనుకుంటూ, అబద్దాలు చెబుతూ, మోసాలు చేస్తూ, విలువలు లేని జీవితం గడుపుతూ ఉన్నవారు, ఈ విద్య జోలికి అస్సలు రాకూడదు.

జ్యోతిష్యాన్ని వాడి ఏమేం చేయవచ్చు?

చాలామంది, ఈ శాస్త్రాన్ని సరదాకి, గొంతెమ్మకోరికలు తీర్చుకునే మార్గాలు తెలుసుకోవడానికి, అత్యాశకు వాడుతూ ఉంటారు. ఇది చాలా తప్పు.

లాటరీలకోసం, షేర్ మార్కెట్ కోసం, అప్పనంగా డబ్బు సంపాదించడం కోసం, ఎదుటి మనిషికి హాని చెయ్యడం కోసం, లేకి విషయాల ప్రశ్నలకోసం, ఈ విద్యను వాడకూడదు. తను శుద్ధంగా బ్రతుకుతున్నా సరే, అనుకోని కష్టమొచ్చినపుడు, దానిని దాటే విధానాన్ని తెలుసుకుని, స్వచ్ఛమైన మనసుతో దానిని ఆచరించి, దానిని దాటాలి.

అంతేగాని - 'నా గర్ల్ ఫ్రెండ్ నాతో మాట్లాడటం లేదు. వేరే ఎవడి వలలోనైనా పడిందా? నేనొక డీల్ చేస్తున్నాను. అది సక్సెస్ అయితే, వేరే వాళ్ళ ఆస్తి మొత్తం నాకొస్తుంది. నేను దీనిలో సక్సెస్ అవుతానా లేదా? నేను దొంగ వ్యాపారం చేస్తున్నాను. ఈ మధ్య నష్టాలొస్తున్నాయి. మళ్ళీ మునుపటిలాగా లాభాలు రావాలంటే ఏం చెయ్యాలి? మా ఫ్రెండొకడు మర్డర్ కేసులో ఇరుక్కున్నాడు. ఎలా బయటపడతాడు?' - ఇటువంటి అనైతిక ప్రశ్నలకు జ్యోతిష్యశాస్త్రాన్ని వాడకూడదు. అలా వాడితే, అడిగేవాడికి, చెప్పేవాడికీ కూడా వేటు పడుతుంది. ఎలా పడుతుందో, ఇప్పటికిప్పుడు తెలియకపోవచ్చు, అది పడినప్పుడు తెలుస్తుంది, అప్పుడు కూడా, తెలుసుకునే తెలివుంటే తెలుస్తుంది.  లేకపోతే, అదీ అర్ధం కాదు.

మంచివాళ్లకు, నిస్వార్ధపరులకు,మానవత్వం ఉన్నవాళ్లకు మాత్రమే జ్యోతిష్యశాస్త్రం వాడి సహాయం చెయ్యాలి. అంతేగాని, డబ్బుకోసం ఆశపడి, ఎవరికీ పడితే వారికి, రెమెడీలంటూ ఉన్నవీ లేనివీ మాయమాటలు చెప్పి జ్యోతిష్యంతో ఆడుకుంటే, అది మన జీవితాలతో ఆడుకుంటుంది.

ఒక నిజమైన బ్రాహ్మణుడు ఎలా బ్రతకాలో అలా మీరు బ్రతకగలరా? అలా అయితే, జ్యోతిష్యశాస్త్రాన్ని నేర్చుకోవడానికి మీకు అర్హత ఉంది.

జీవితాంతం నియమనిష్టలను పాటిస్తూ, సుఖాలకు దూరంగా మీరు బ్రతకగలరా? అలా అయితే, జ్యోతిష్యశాస్త్రాన్ని నేర్చుకోవడానికి మీకు అర్హత ఉంది. 

ఒక ఋషిలాగా, ఆశలకు అతీతంగా, నిరాడంబరంగా, నిర్మలంగా, నిస్వార్ధంగా మీరు బ్రతకగలరా? అలా అయితే, జ్యోతిష్య శాస్త్రాన్ని నేర్చుకోవడానికి మీకు అర్హత ఉంది.

లేకపోతే మాత్రం, దాని జోలికి పోకండి. ప్రమాదం ! దానికంటే నిప్పును చేతితో పట్టుకోవడం మంచిది. ఒకవేళ బ్రాహ్మణకులంలో పుట్టినా సరే, ఈ విధంగా బ్రతకలేనివారు కూడా ఈ శాస్త్రం జోలికి పోకూడదు. దీనికి కులంతో సంబంధం లేదు, జీవనవిధానంతో సంబంధం ఉంది.

ఔత్సాహికులైన జ్యోతిష్య విద్యార్థులను నిరాశపరచడం కోసం నేనీ పోస్టు వ్రాయడం లేదు. ఆపని నాకవసరం లేదు. ఉన్న సత్యాన్ని నేను చెబుతున్నాను. వినడం, వినకపోవడం మీ ఇష్టం.

దానిని బట్టి మీ కర్మ ఉంటుంది మరి !