నిత్యజీవితంలో ప్రతిఫలించని జ్ఞానం నిరర్ధకం

23, జులై 2021, శుక్రవారం

బయట జలప్రళయం - లోపల అగ్ని


చైనా జలమయమైంది. గత వెయ్యేళ్ళలో ఎన్నడూ లేనంత వాన చైనాను ముంచెత్తింది. హెనాన్ ప్రావిన్స్ లోని సిటీలన్నీ నీళ్లలో మునిగి ఉన్నాయి. ఒక సబ్ వే లో ఆగిపోయిన మెట్రో రైల్లోకి నీళ్లు ప్రవేశించి 12 మంది చనిపోయారు. మొత్తం ఈ వరదలలో కేవలం 33 మంది చనిపోయారని చైనా న్యూస్ బయట ప్రపంచానికి చెబుతోంది. అంటే, వినేవాళ్ళు వెర్రివెంగళప్పలని అనుకుంటోంది కదూ !

చైనా రిలీజ్ చేసిన కొన్ని వీడియోల నుంచి, న్యూస్ నుంచి ఈ విషయాలు తెలుస్తున్నాయి. బయటకు వచ్చినది గోరంత, రానిది కొండంత.

కుజశుక్రులు సింహరాశిలోకి ప్రవేశించారు. అక్కడనుంచి కుజుని చతుర్ధదృష్టి వృశ్చికరాశిపైన పడుతుంది. వృశ్చికం చైనాను సూచిస్తుందని గతంలోనే చెప్పాను. అది జలతత్వరాశి, అక్కడ కుజుడిని సూచిస్తున్న ఉచ్ఛకేతువున్నాడు. కేతువు హఠాత్ విధ్వంస సంఘటనలకు కారకుడు. కుజుడేమో విధ్వంసానికి విలయానికి సూచకుడు. లెక్క సరిపోయిందా మరి !

అగ్రదేశాన్నంటూ చైనా ఎంత విర్రవీగినా, తైవాన్ విషయంలో జపాన్ మీద ఆటంబాంబు వేస్తానని బెదిరించినా, ప్రకృతి ముందు చైనాయే కాదు ఏ దేశమూ నిలబడలేదు. అన్నింటినీ అదుపుచేసేది ప్రకృతి అన్నది మనం మర్చిపోకూడదు. అది చల్లగా ఉన్నంతవరకూ  మనం కూడా ఉంటాం. అది కన్నెర్ర చేస్తే మనం ఏమౌతామో ఎవరికీ తెలీదు. చైనా దాకా ఎందుకు, ప్రస్తుతం మన ముంబాయిగాని, హైదరాబాద్ గాని ఎలా ఉన్నాయి? ఈ వానలకు నీటిమయం కాలేదూ? ప్రతిసారీ వానాకాలంలో ముంబాయి జలమయం అవుతూనే ఉన్నది గత ముప్పై ఏళ్లుగా. ఇంత వ్యవస్థా, ఇంత యంత్రాఙ్గమూ పెట్టుకుని మనమేం చెయ్యగలుగుతున్నాం?

అంతా తన చేతిలోనే ఉందని మనిషి అనుకోవచ్చు గాక, కానీ అలా లేదన్నది వాస్తవం. రెండేళ్ళనుండి వెంటాడుతున్న కరోనా అయినా, నేటి వరదలైనా మనిషికి నేర్పుతున్న గుణపాఠం ఇదే. నేర్చుకోవడమా లేదా అన్నది అతనిష్టం మీద ఆధారపడి ఉంది.

కుజశుక్రులు ప్రస్తుతం అగ్నితత్వరాశి అయిన సింహంలో ఉన్నారు. దీనివల్ల, లోకులలో సెక్స్ పరమైన నేరాలు ఘోరాలు ఎక్కువగా జరుగుతాయి. ఈ ట్రెండ్ ఇంకో నెలరోజులుంటుంది. ఒకవైపున ప్రపంచం నీళ్లలో మునిగిపోతూ ఉంటే, సందట్లో సడేమియా అన్నట్లు ఇంకోపక్క ఈ రకం పిచ్చి వెర్రితలలేస్తోంది. గ్రహప్రభావం విచిత్రంగా లేదూ?

కుజశక్రులు సింహరాశిలో అడుగు పెట్టీ పెట్టకముందే, బ్లూ సినిమాలు తీస్తున్నాడన్న నేరం మీద శిల్పాశెట్టి మొగుడు రాజ్ కుంద్రాను అరెస్ట్ చేశారు.  ఆధారాలు చాలా గట్టిగా ఉన్నాయని, ఇది చాలాపెద్ద నెట్ వర్క్ అని  పోలీసులంటున్నారు. ఇది కుట్ర, మమ్మల్ని బద్నాం చేస్తున్నారని యధావిధిగా వీళ్లంటున్నారు. ఈ పాట ఎప్పటినుంచో మనం వింటూనే ఉన్నాం కదా ! పెద్దవాళ్ళ గోత్రాలు పోలీసులకెరుక ! కానీ ఈగోలలో ఎవరెవరి పేర్లు బయటపడతాయో నని ముంబాయి సినీఫీల్డులో చాలామంది వణికి చస్తున్నారు.

తన కొడుకుతో అశ్లీల డాన్స్ వేసిన ఒక తల్లి, ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. 'ఏం? లైకులు లేకపోతే చస్తావా? మరీ ఇంత దిగజారుడా?' అని, దాన్ని చెడామడా తిడుతున్నారు నెటిజెన్స్. సోషల్ మీడియా అనేది డ్రగ్స్ ను మించిన వ్యసనమైందన్నది వాస్తవం.  డబ్బు సంపాదించడానికి ఇదొక మార్గమని తెలిసేసరికి, ఇక నానా గడ్డీ తింటున్నారు జనం.

పాకిస్తాన్ లో ఆఫ్ఘనిస్తాన్ రాయబారి కూతురు కిడ్నాప్ కు గురైందన్న కొద్దీ రోజులకే, మొన్న మంగళవారం నాడు, పాకిస్తాన్ లోనే పాతరాయబారి కూతురు ఇంకొకామె హత్యకు గురైంది. దీనివెనుక ఏయే కుట్రలున్నప్పటికీ బలౌతున్నది మాత్రం అమ్మాయిలే నన్నది ఇక్కడి పాయింట్ ! సింహరాశిలో కుజశుక్రులు దీనినే సూచిస్తున్నారు.

ఇంకొక నెలరోజులపాటు మన్మధుడు ప్రపంచాన్ని శాసించబోతున్నాడు. సెక్స్, డ్రగ్స్, మాఫియా సంబంధిత సంఘటనలు వెల్లువెత్తబోతున్నాయి. వేచి చూడండి మరి !