నిత్యజీవితంలో ప్రతిఫలించని జ్ఞానం నిరర్ధకం

24, జులై 2021, శనివారం

Yoga Taravali English E Book విడుదలైంది

ఈ రోజు గురుపూర్ణిమ. 

ఈ సందర్భంగా మరొక పుస్తకాన్ని విడుదల చేస్తున్నాం.
 
'యోగ తారావళి'ని తెలుగులో విడుదలచేసి ఏడాదైంది. అందుకని, అంతర్జాతీయపాఠకుల కోసం ఇప్పుడీ పుస్తకాన్ని ఇంగ్లీష్ భాషలో విడుదల చేస్తున్నాం. మా పుస్తకాలన్నీ తెలుగులోనూ, ఇంగ్లిష్ లోను ఉంటాయి.  ముందు ముందు వేరే భాషలలోకి కూడా వస్తాయి.

శ్రీ రామకృష్ణులిలా అంటారు, 'భగవంతుడే సృష్టికి గురువు. బోధించేది ఆయనే. మానవ గురువులు ఏమి బోధించగలరు? భగవంతుడు వారిద్వారా పనిచేయకపోతే మానవగురువులు అశక్తులౌతారు'.

నిజమైన గురువు భగవంతునితో అనుసంధానమును కలిగి ఉండాలి. నేడు ఎక్కడ చూచినా కనిపిస్తున్న దొంగగురువుల గురించి నేను  మాట్లాడటం లేదు. అలాంటివారిని ఎలా గుర్తించడం? చాలా తేలిక. చెప్పేదొకటి చేసేదొకటి అయినప్పుడు వాడు దొంగగురువు. డబ్బు, అధికారం, సుఖాల వెంట పరుగెత్తుతూ ఉంటె వాడు దొంగగురువు. సాంప్రదాయం నుండి వారిష్టమొచ్చినట్లుగా పక్కకు పోతుంటే వాడు దొంగగురువు. చీప్ గారడీ ట్రిక్స్ చేస్తుంటే వాడు దొంగగురువు. తానే దేవుడి అవతారాన్నని చెప్పుకుంటుంటే వాడు అతి పెద్ద దొంగ గురువు.

ఇలాంటి దొంగగురువులను పక్కనపెట్టి, ఈ రోజున మనం, సృష్టికి ఆదిగురువైన పరమశివుని, మహర్షులైన వ్యాసాదులను, బుద్ధుడు, పతంజలి, శంకరుడు, రామానుజుడు, మధ్వాచార్యుడు, అభినవగుప్తుడు, శ్రీ రామకృష్ణులు, రమణమహర్షి, జిల్లెళ్ళమూడి అమ్మ, మెహర్ బాబా మొదలైన సద్గురువులను స్మరిద్దాం. వీళ్ళు లోకానికి అసలైన గురువులు.

ఆదిశంకరులు అద్వైతజ్ఞానమునకు ప్రాముఖ్యతనిచ్చారు. అందుకని ఆయన యోగమార్గం జోలికి పోలేదు. కానీ యోగసారాన్నంతా ఒకచోటకు చేర్చి  కేవలం 29 శ్లోకములలో 'యోగతారావళి' అనే ఈ పుస్తకాన్ని వ్రాశారు. కంచిమఠం వారు చెప్పేటట్లు ఆదిశంకరుల కాలం BC 1 వ శతాబ్దమైతే, ఈ పుస్తకం వయసు రెండు వేల సంవత్సరాలు. అంతటి ప్రాచీన విజ్ఞానమిది.

జ్యోతిష్యశాస్త్రంలో యోగతారలని ఉంటాయి. నక్షత్రమండలాలలో బాగా కాంతితో వెలిగే తారలనే యోగతారలంటారు. ఆ నక్షత్రమండలాన్ని ఆ తార పేరుతో మనం పిలుస్తాం. అశ్వని అంటే ఒక నక్షత్రం కాదు, మూడు నక్షత్రాల సమూహం. కానీ అందులోని కాంతివంతమైన నక్షత్రాన్ని అశ్వని అని పిలుస్తూ ఆ నక్షత్రమండలాన్ని కూడా అదే పేరుతో పిలుస్తాం. అదే  విధంగా, ఆకాశంలో నక్షత్రాలలాగా, యోగశాస్త్రంలో ఎన్నో సాధనలున్నప్పటికీ, వాటిలో అతి ముఖ్యమైన సాధనలను ఒకచోట వివరిస్తూ దానికి 'యోగ తారావళి' అని పేరు పెట్టారు శంకరులు. దీనికి నా వ్యాఖ్యానంతో ఈ ఇంగ్లీష్ పుస్తకం వ్రాశాను.

హఠ, రాజయోగములలోని ముఖ్యములైన సాధనలు ఇందులో సూచనాప్రాయంగా వివరించబడినాయి.  శ్రద్ధ ఉన్న సాధకులు గురుముఖతా వీటిని ఉపదేశం పొంది సాధన చేస్తే, అవి సూచిస్తున్న అనుభవములను పొందగలుగుతారు.

తెలుగు నుంచి ఇంగ్లీష్ లోకి ఈ పుస్తకాన్ని ఎంతో చక్కగా అనువాదం చేసిన నా శిష్యుడు గణేష్ ఆళ్ల (డెట్రాయిట్) కు ఆశీస్సులు.

ఈ ఇంగ్లీష్ E Book ఇక్కడ దొరుకుతుంది.