ఈ రోజు గురుపూర్ణిమ.
ఆదిశంకరులు అద్వైతజ్ఞానమునకు ప్రాముఖ్యతనిచ్చారు. అందుకని ఆయన యోగమార్గం జోలికి పోలేదు. కానీ యోగసారాన్నంతా ఒకచోటకు చేర్చి కేవలం 29 శ్లోకములలో 'యోగతారావళి' అనే ఈ పుస్తకాన్ని వ్రాశారు. కంచిమఠం వారు చెప్పేటట్లు ఆదిశంకరుల కాలం BC 1 వ శతాబ్దమైతే, ఈ పుస్తకం వయసు రెండు వేల సంవత్సరాలు. అంతటి ప్రాచీన విజ్ఞానమిది.
జ్యోతిష్యశాస్త్రంలో యోగతారలని ఉంటాయి. నక్షత్రమండలాలలో బాగా కాంతితో వెలిగే తారలనే యోగతారలంటారు. ఆ నక్షత్రమండలాన్ని ఆ తార పేరుతో మనం పిలుస్తాం. అశ్వని అంటే ఒక నక్షత్రం కాదు, మూడు నక్షత్రాల సమూహం. కానీ అందులోని కాంతివంతమైన నక్షత్రాన్ని అశ్వని అని పిలుస్తూ ఆ నక్షత్రమండలాన్ని కూడా అదే పేరుతో పిలుస్తాం. అదే విధంగా, ఆకాశంలో నక్షత్రాలలాగా, యోగశాస్త్రంలో ఎన్నో సాధనలున్నప్పటికీ, వాటిలో అతి ముఖ్యమైన సాధనలను ఒకచోట వివరిస్తూ దానికి 'యోగ తారావళి' అని పేరు పెట్టారు శంకరులు. దీనికి నా వ్యాఖ్యానంతో ఈ ఇంగ్లీష్ పుస్తకం వ్రాశాను.
హఠ, రాజయోగములలోని ముఖ్యములైన సాధనలు ఇందులో సూచనాప్రాయంగా వివరించబడినాయి. శ్రద్ధ ఉన్న సాధకులు గురుముఖతా వీటిని ఉపదేశం పొంది సాధన చేస్తే, అవి సూచిస్తున్న అనుభవములను పొందగలుగుతారు.
తెలుగు నుంచి ఇంగ్లీష్ లోకి ఈ పుస్తకాన్ని ఎంతో చక్కగా అనువాదం చేసిన నా శిష్యుడు గణేష్ ఆళ్ల (డెట్రాయిట్) కు ఆశీస్సులు.
ఈ ఇంగ్లీష్ E Book ఇక్కడ దొరుకుతుంది.