ఈరోజు ఉదయం ఏడున్నరకి, స్నేహితుడొకాయన ఫోన్ చేశాడు. అతని గొంతులో ఆదుర్దా ధ్వనించింది.
'ఒక ముఖ్యమైన విషయం పైన నీ సహాయం కావాలి' అన్నాడు.
'చెప్పు' అన్నా ఇదేదో జ్యోతిష్యప్రశ్నే అయి ఉంటుందని ఊహిస్తూ.
నేనూహించినదాన్ని నిజం చేస్తూ తనిలా అడిగాడు, 'మా ఫ్రెండ్ బాబాయొకాయన నాలుగేళ్ల క్రితం చనిపోయాడు. ఎందుకు చనిపోయాడో మాకు తెలియాలి. కాస్త ప్రశ్న చూచి చెప్పు'
నేను నవ్వుతూ, 'ఎవరైనా ఎందుకు పోతారు. కాలం తీరితే తప్ప. ఆయనా అందుకే పోయాడు. దీనికి ప్రశ్న చూడటం అవసరమా?' అన్నాను.
'బాబ్బాబు. అదికాదు. ఇది చాలా ముఖ్యం. వాళ్ళ ఫెమిలీకి మా ఫెమిలీకి కూడా' అన్నాడు బ్రతిమాలుతూ.
సరే ఇంతగా బ్రతిమాలుతున్నాడు కదా చూద్దాంలే అనుకుని, ప్రశ్న చక్రం వేసి చూచాను.
'ఇంటిదగ్గర కాకుండా దూరప్రాంతంలో ఇతను చనిపోయాడు', అన్నా చార్ట్ చూస్తూనే.
'నిజమే' అన్నాడు.
'ఇతనొక యాక్సిడెంట్ లో పోయాడు' అన్నా.
'అవును' అన్నాడు.
'చనిపోయిన సమయంలో ఇతను త్రాగి ఉన్నాడు' అన్నా.
'అవును' అన్నాడు.
'ఆ సమయంలో అతను తన అఫీషియల్ పనిమీద ఎక్కడికో పోతున్నాడు' అన్నాను.
'అవును' అన్నాడు.
'వీళ్ళ కుటుంబంలో ఒక అక్రమసంబంధపు గొడవ ఉంది' అన్నాను.
'అదేగా ఇప్పుడు గోల. అందుకే నిన్నీ ప్రశ్న అడగడం' అన్నాడు.
'ఇతనికి చెడు స్నేహాలున్నాయి. వాళ్ళే ఇతని చావుకు కారణమయ్యారు' అన్నాను.
'అదే మేమూ అనుమానిస్తున్నాం. కానీ ప్రూవ్ చేయలేము' అన్నాడు.
'వాళ్ళతన్ని తెలివిగా త్రాగించి, ఈ యాక్సిడెంట్ లో ఇరికించారు. తరువాత తప్పుకున్నారు. నిరూపించడం మీ వల్లకాదు' అన్నాను.
'కావచ్చు' అన్నాడు.
'ఇతను చాలా మూర్ఖుడు. ఎవరు చెప్పినా వినే రకం కాదు. బాగుపడటానికి ఎన్ని అవకాశాలొచ్చినా కాలదన్నుకొని చివరకు ఇలా చనిపోయాడు' అన్నాను.
'నిజమే. మహా మొండి మనిషి' అని ఒప్పుకున్నాడు.
నువ్వడగక పోయినా ఇంకో విషయం చెబుతా విను. వీళ్ళ వంశంలో భయంకరమైన గురుదోషం ఉన్నది. వీళ్ళ పూర్వీకులొక గుడిని కట్టించి దాని ఆలనా పాలనా చూడకుండా వదిలేశారు. ఆ శాపం వీళ్ళను వెంటాడుతున్నది. అందుకనే వీళ్ళు ధర్మభ్రష్టులుగా జీవితాలను గడుపుతూ, చివరకు అర్ధాంతరంగా చస్తుంటారు' అన్నాను.
అవును. వీళ్ళ పేమిలీలో అన్నీ అలాంటి చావులే. వీళ్ళ తాతలెప్పుడో శివాలయం కట్టించి తరువాత ఆ ఊరొదిలేశారు. ఇప్పుడది పాడుపడిపోయిన స్థితిలో ఉంది. వీళ్ళ బ్రదర్ కూడా సూయిసైడ్ చేసుకుని చనిపోయాడు. అందుకే అడుగుతున్నాము. ఇది కూడా అలాంటి కేసేనా అని' అన్నాడు.
'ఇది సూయిసైడ్ కాదు. హత్య, తెలివిగా చెయ్యబడిన హత్య. ఇతనికి అక్రమసంబంధాలున్నాయి. చెడుస్నేహాలున్నాయి. త్రాగుడు అలవాటుంది. స్నేహితులే ఇతని చావుకు కారకులు. చెప్పా కదా, మీరు ప్రూవ్ చెయ్యలేరు' అన్నాను.
'చివరగా మరో ప్రశ్న. ఇవన్నీ ఎలా చెప్పావు?' అడిగాడు.
'ఎలా చెప్పగలననుకొని అడిగావో అలాగే చెప్పా' అన్నాను.
'మరిప్పుడేం చెయ్యాలి? రెమెడీస్ ఏమైనా ఉన్నాయా?' అడిగాడు.
'అవి నీకెందుకు? రెమెడీస్ చెయ్యడం నీపని కాదు. అతనికి సంతానం ఉందా?' అడిగాను.
'ఉన్నారు. ఒక కొడుకు ఇద్దరు కూతుళ్లు' అన్నాడు.
'ఆ అబ్బాయిని వచ్చి నన్ను కలవమని చెప్పు. అతన్ని పరిశీలించి, అతను మంచివాడనుకుంటే, చెయ్యగలడనుకుంటే, అతనికి చెబుతాను. నీకు చెప్పను. ఆ అబ్బాయి కూడా అంత తేలికగా నన్ను కలవలేడు. ఎన్నో ఆటంకాలొస్తాయి. దాటి రావాలి. వచ్చినప్పుడు చూద్దాం' అన్నాను.
'సరే ఉంటా. థ్యాంక్స్' అంటూ ప్రెండ్ ఫోన్ పెట్టేశాడు.
అదీ సంగతి. ఎప్పుడో జరిగిన సంఘటనల గురించి కూడా ఈ విధంగా ప్రశ్నశాస్త్రాన్ని ఉపయోగించి తెలుసుకోవచ్చన్నమాట !