Pages - Menu

Pages

18, ఆగస్టు 2021, బుధవారం

కర్ణపిశాచి చెప్పిన తాలిబాన్ అసలు కథ

అర్ధరాత్రి ఎవరో తలుపు కొడుతున్న చప్పుడైంది.

అసలే ఆఫ్ఘనిస్తాన్ న్యూస్ చూసి చాలా చిరాగ్గా ఉన్నానేమో, 'ఈ టయిములో ఎవరబ్బా మనింటి తలుపు కొడుతున్నది? అంత ధైర్యం ఎవరికుంది?' అనుకుంటూ లేచి తెలుపు తీశా.

ఎదురుగా బురఖా వేసుకుని ఒకమ్మాయి నిలబడి ఉంది.

నిద్రమత్తంతా ఒక్కసారి ఎగిరిపోయింది.

'ఎవరు నువ్వు?' అడిగా భయం భయంగా.

ముఖం మీద ముసుగు తొలగించి పకపకా నవ్విందా అమ్మాయి.

'ఓ నువ్వా? ఏంటీ ప్రాక్టికల్ జోక్స్? భయపడి చచ్చా ఎవరో అనుకుని' అన్నా నిట్టూర్పు విడుస్తూ'.

'లోపలికి రానిస్తావా లేదా?' అంటూ చొరవగా తోసుకుని లోపలకొచ్చేసింది కర్ణపిశాచి.

'ఏయ్ ఆగాగు. అవతల మా ఆవిడ నిద్రపోతోంది బెడ్రూమ్ లో' అన్నా కంగారుగా.

'ఆవిడని పడుకోనియ్, మనం హాల్లో కూచుందాం. చాలా విషయాలు చెప్పాలి నీకు' అంది.

'మొన్నేదో న్యూయార్క్ వెళ్లి వస్తానని అదే పోత పోయావ్, ఇప్పుడేమో అర్ధరాత్రి ఈ వేషంలో ప్రత్యక్షమయ్యావ్.  ఏంటిది? అన్నా కోపంగా.

'ఏం చేయమంటావ్ చెప్పు. అటునించటే ఆఫ్ఘనిస్తాన్ కూడా వెళ్లి, అంతా చూసి వస్తున్నా. దారిలో నీ పోస్ట్ కూడా చదివా. పెద్ద సోది రాశావ్ లే గాని, అసలు సంగతులు నీకూ తెలియవు. వెర్రి నాగన్న ! చెప్తా కూచో' అంది సోఫాలో కూలబడుతూ.

'అసలు సంగతులా? అవేంటి?' అడిగా.

'చెప్తా కాస్త రిలాక్స్ అవనీయ్. అది సరేగాని, నీకసలు బుద్ధి లేకుండా పోతోంది. ఆడకూతురు అర్ధరాత్రి ఇంటికొచ్చిందే, కాస్త టీనో కాఫీనో ఇద్దామన్న ఇంగితజ్ఞానం కూడా లేకుండా పోతోంది నీకు' అంది కోపంగా.

కోరగా చూసి, వంటింట్లోకి దారితీశా, టీ పెట్టి తేవడానికి.

నేను టీ కలుపుకుని తెచ్చేసరికి, కాళ్ళు బారజాపుకుని కూచొని, టీవీ ఆన్ చేసి CNN న్యూస్ చూస్తోంది కర్ణపిశాచి. నన్ను చూస్తూనే ' పిచ్చి ఛానల్స్, పిచ్చి ప్రేక్షకులు. అన్నీ అబద్దాలే. అసలు నిజాలు ఎవరికీ తెలియవు' అంది నవ్వుతూ.

టీ కప్పు తనకందిస్తూ 'అలా ఊరించకపోతే ఆ నిజాలేంటో చెప్పి చావచ్చు కదా' అన్నాను, నా కప్పుతో నేనూ సోపాలో కూలబడుతూ.

'ఉండు ప్రశాంతంగా టీ త్రాగనీయ్. ఎప్పుడో రెండు గంటల క్రితం కాబూల్లో త్రాగా, నోరెండిపోతోంది' అంటూ టీ త్రాగడం మొదలుపెట్టింది.

నేనూ టీ త్రాగుతూ 'అవునే పిశాచి? నువ్వింత అందగత్తెవి కదా ! కరువుబట్టిన తాలిబన్లు, నిన్ను బ్రతకనిచ్చారే' అడిగాను.

చులకనగా నవ్వింది పిశాచి.

'మీ మనుషుల సత్తా మాకు తెలీకపోతే కదా. ఒంటూపిరిగాళ్లు ! నాకేం భయం లేదు. నేను పిశాచినని మర్చిపోకు' అంది కోరపళ్ళు కనిపించేలా నవ్వుతూ.

'బాబోయ్ ఆ టాపిక్ ఒద్దులే గాని, విషయాలు చెప్పు' అన్నా టీ కప్పు పక్కన పెడుతూ.

'అలా రా దారికి. ఇప్పుడు విను' అంటూ కర్ణపిశాచి చెప్పసాగింది.

నువ్వు నిన్న రాసిందంతా అబద్దాలే. నీకు అసలు విషయాలు తెవీవు. నీకేకాదు, ప్రపంచంలో ఎవరికీ తెలీవు. మీరు చూస్తున్న న్యుసంతా పైపైన ట్రాష్. అసలు విషయాలు వేరే ఉన్నాయి. 

ఆఫ్గనిస్తాన్ లో జరిగిందంతా పెద్ద గ్లోబల్ కుట్ర. ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వమూ, తాలిబాన్లూ, పాకిస్తానూ, అమెరికా, చైనా అందరూ ఈ కుట్రలో భాగస్వాములే. ఇదొక గ్లోబల్ వ్యాపారం. ఇందులో లాభం అందరికీ ఉంటుంది' అంది.

'వార్నీ నిజంగానా?' బోలెడు హాచ్చర్యపోయా నేను.

'అవును. ఇప్పుడు చూడు నీకొక చిన్న ఉదాహరణ చెబుతా. మీ దేశంలో ఒకడొక చర్చి పెడతాడు. వెంటనే అమెరికా నుంచి డబ్బులొస్తాయి. గుడిసె మేడౌతుంది. నడిచి తిరిగే పాస్టర్, కార్లో తిరుగుతుంటాడు. ఎలా జరుగుతుంది ఇది?' అడిగింది.

'ఏముంది? మతాన్ని చూపించి డబ్బులు పోగేసుకోడమే' అన్నా.

'అవునా. ఆఫ్ఘనిస్తాన్ లో జరిగింది కూడా అదే. అక్కడి ప్రభుత్వమూ తాలిబానూ ఇద్దరూ ఈ వ్యాపారంలో  పార్ట్ నర్సే. తాలిబాన్ని చూపించి, అమెరికా దగ్గర, ఘనీ డబ్బులు లాగుతాడు. రాత్రికి ఇద్దరూ కూచుని, డబ్బులు పంచుకుని మందు కొడతారు. లేకపోతే, హెలీకాఫ్టర్లో డబ్బు సంచులు వేసుకుని ఘనీ ఎలా పారిపోతాడు? తాలిబన్లేమో, ఏదో ఖాళీగా ఉన్న ఇంట్లోకి అద్దెకొచ్చినట్లు తాపీ ధర్మారావుల్లాగా నడుచుకుంటూ ప్రెసిడెంట్ పేలస్ కొచ్చి , ప్రెస్ మీట్ ఎలా పెడతారు? ఆర్మీ ఏమైంది? అమ్రికా ఇచ్చిన 2 లక్షల కోట్ల డాలర్లేమయ్యాయి? చెప్పు' అడిగింది.

నాకు గుండాగినంత పనైంది.

'ఇంకా ఉంది విను. ఈ మొత్తం వ్యవహారంలో అమ్రికా వెఱ్ఱిపప్ప అయిందని అందరూ అనుకుంటున్నారు కదా. వెర్రిపప్పలయింది అమ్రికా ప్రజలు, ఇతర దేశాల ఉద్యోగులు. అమ్రికా  ప్రభుత్వం కాదు. వాళ్ళు చెబుతున్న రెండు ట్రిలియన్లు ఆఫ్ఘనిస్తాన్ కి రాలేదు. అందులో సగం పైన అమ్రికా వాళ్ళే నొక్కేశారు. అదక్కడ బ్లాక్ మనీగా మారి, అమ్రికా పెద్దవాళ్ళ ఎకౌంట్ లోకి చేరిపోయింది', అంది మెల్లిగా టీ సిప్ చేస్తూ.

ఈ సారి నాకు బ్రెయినాగిపోయింది.

'మరేమనుకున్నావ్? యూట్యూబు చూసి పోస్టులు రాయడం కాదు. నిజాలు తెలుసుకో. ఆఫ్ఘనిస్తాన్ కొచ్చిన సగం డబ్బులో, ప్రభుత్వమూ, తాలిబానూ చెరిసగం నొక్కేశారు. ఆఫ్ఘన్ ప్రజలూ, అమ్రికా ప్రజలూ వెర్రిపప్పలయ్యారు' అంది.

నేను తేరుకుని ' మరి, ఇప్పుడేంటి ఈ డ్రామా?' అడిగా.

'ఒకే డ్రామా ఎన్నిరోజులని ఆడతారు? అక్కడ అమ్రికా ప్రజలు గోలపెడుతున్నారు? ఇంకెన్నాళ్లు ఈ యుద్దానికి మేము స్పాన్సర్ చెయ్యాలి? అని. వాటాలు రాని సెనేటర్లు గోలపెడుతున్నారు.  అందుకని సైన్యాన్ని వెనక్కు రప్పించక తప్పదు. దానికోసం నాలుగు నెలలనుంచే ప్లాన్ చేసి, అందరూ కలసి మాట్లాడుకుని, అంచెలవారీగా పధకాన్ని అమలు చేశారు' అంది.

'ఏంటా పధకం?' అన్నా.

'విను. ముందు ఆర్మీకి జీతాలివ్వడం ఆపేశారు. దాంతో వాళ్ళు బ్రతకలేక, తాలిబాన్ కి అమ్ముడుపోయారు. ఆయుధాలు అప్పజెప్పారు. ఒక్కొక్క ఊరూ ఆక్రమించుకుంటూ తాపీగా కాబూల్ దాకా వచ్చారు. ఈలోపల మిగిలిన డబ్బు సంచులతో ప్రెసిడెంట్ ఘనీ హాయిగా ఎగిరిపోయాడు. ఇదంతా అమ్రికాకీ తెలుసు, పెద్దతలకాయలందరికీ తెలుసు. ప్లాన్ వేసింది వాళ్ళే అసలు. అందరూ కలసి ప్రపంచప్రజలని చూస్తూ, న్యూస్ ఛానళ్లలో వస్తున్న అబద్దాలను చూస్తూ, స్కాచ్ త్రాగుతూ విరగబడి నవ్వుకుంటున్నారు. ఇదీ అసలు నిజం' అన్నది.

'ఏమో నాకు నమ్మకం కలగడం లేదు' అన్నా.

'అంతేలే. నిజం చెబితే ఎవడు నమ్ముతాడు మీ మనుషుల్లో. మీరింతే, ఎప్పటికీ మారరు. ఈ గేమ్ అప్పుడే అయిపోలేదు. ఇప్పుడింకొడు తయారయ్యాడు. వాడి పేరు అమ్రుల్లా సాలే. నేనే ఆఫ్ఘనిస్తాన్ కు అసలైన ప్రెసిడెంట్ నంటున్నాడు. వీడు కూడా ఈ కుట్రలో కొత్త పావే, ఎందుకంటే, ఏదో ఒక రకంగా గొడవలు రగులుతూ ఉండాలి. విలన్ ఒకడుండాలి. బాధితులుండాలి.  వాళ్లను చూచి బాధపడి డబ్బులిచ్చేవాళ్ళుండాలి, ఆ డబ్బుల్ని అందరూ కలసి పంచుకోవాలి.  అవేమో ప్రజలు టాక్స్ కట్టిన డబ్బులు. ఇలా అయితేనే కదా, లక్షల కోట్లు తేరగా సంపాదించగలిగేది. నీలా జన్మంతా ఉద్యోగం చేస్తే ఏమొస్తుంది చివరకు? ఇవన్నీ, ప్రజల సొమ్ము కాజెయ్యడానికి నాయకులేసే రకరకాల ప్లాన్సన్నమాట. ఎలా ఉంది వీళ్ళ ప్లాన్' అంది పిశాచి. 

'వామ్మో' అంటూ కళ్ళు తిరిగినట్లు క్రింద పడబోయా.

'మరీ అంత నటించకు. నీ శిష్యులు కూడా నమ్మరు' అంది పిశాచి.

'ఏయ్ పిశాచి ! అంటే గింటే నన్నను పడతా, కానీ నా శిష్యులనంటే మాత్రం ఊర్కోను' అరిచా కోపంగా.

'ఈ యాక్షన్లే ఆపమని నీకు చెప్పేది. బయటకి ఉత్త అరుపులే గాని, నీలోపల ఏమీ ఉండదని నాకు బాగా తెలుసులే, కూచో' అంది కూల్ గా.

'నీక్కూడా తెల్సిపోయిందా? సరే ఇప్పుడేమంటావ్?' అడిగా కూచుంటూ.

'రగులుతోంది మొలిపొద అన్నట్లు ఎప్పుడూ ఆఫ్ఘనిస్తాన్ రగులుతూనే ఉండాలి. ప్రపంచదేశాలు డబ్బులిస్తూనే ఉండాలి. వాళ్ళు పంచుకుంటూనే ఉండాలి. మొగలిపొద ఆరిపోతే డబ్బులెవడిస్తాడు? అందుకని, సాలేతో క్రొత్తడ్రామాకు తెరతీశారు ఆఫ్గీ-పాకీ మూక. పాకిస్తాన్ లో కూడా ఇదే జరుగుతోంది గత డెబ్భై ఏళ్లుగా. ముందున్న ప్రధానమంత్రిని తరవాతొచ్చిన ప్రధానమంత్రి చంపుతాడు. లేదా వాళ్ళే ఉరితీస్తారు. లేదా, వాడు పారిపోయి అప్పటిదాకా సంపాయించిన డబ్బుల్తో ఏ లండన్ లోనో తల దాచుకుంటాడు. ఈలోపల కొత్త ప్రెసిడెంటో, ప్రధానమంత్రో తన దోపిడీ మొదలుపెడతాడు. మధ్యలో నోరెత్తకుండా ముస్లిం తీవ్రవాదులకు కొన్ని కుక్కబిస్కెట్లు పడేస్తుంటారు. ఇదెప్పటినుంచో జరుగుతున్న డ్రామానే. ఇదంతా తెలీక, మీలాంటి దేశభక్తులు తెగబాధపడిపోతుంటారు. అసలు పిచ్చోళ్ళు మీరు. ఈసారి ఆఫ్ఘనిస్తాన్లో జరగబోతున్న కొత్త డ్రామాకి, ఏ దేశం వెర్రిపప్ప అవుతుందో చూద్దాం' అంది నవ్వుతూ.

'ఆమ్మో ! ఎంత ఘోరం ఎంత ఘోరం', అంటూ పాత సినిమాలలో సూర్యకాంతం లాగా గుండెలు బాదుకుందామని అనిపించినా, బాగోదని ఆగిపోయా.

ఇంతలో మావిడ బాత్రూంకని లేచి, హాల్లోకొచ్చి, గాల్లో మాట్లాడుతూ గుండెలు బాదుకోబోయి ఆగిపోయిన నన్ను చూడనే చూసింది. ముందు అనుమానంగానూ తరువాత జాలిగానూ నావైపు చూచి బాత్రూం వైపు వెళ్ళిపోయింది. ఇలాంటి సీన్లు తానెన్ని చూసిందో ఈ ముప్పై ఏళ్లలో పాపం !

నా అవస్థ చూచి నవ్వుతూ, 'కంగారుపడకు, నేనావిడకు కనిపించన్లే. అబ్బ ! నాల్రోజుల్నించీ రెస్టు లేక ఒళ్ళంతా పులిసిపోయింది. ఇక రెస్టు తీస్కుంటా, నువ్వూ పడుకో ఒక గంట, మళ్ళీ ఆఫీసు కెళ్ళి నిద్రపోవాలి కదా?' అంది కర్ణపిశాచి, బురఖా తీసేసి ఒళ్ళు విరుచుకుంటూ.

ఆమె బురఖా తీసేసరికి, నేనప్పటిదాకా విన్నదంతా గాలిలోకి ఆవిరైపోయింది 'ఏమైనా పిశాచాలు మంచి అందగత్తెలే' అనుకున్నా మనసులో.

యధావిధిగా నా వైపు గుర్రుగా చూసి బురఖాను విసిరేసి మాయమైపోయింది పిశాచి.  ఆ బురఖా సరిగ్గా హాలు మధ్యలో పడుంది.

ఇప్పుడు మావిడకి ఈ బురఖామీద ఏమి సంజాయిషీ ఇచ్చుకోవాలో దేవుడా? అనుకుంటూ నేనూ ఇంట్లోకి దారితీశా.