Pages - Menu

Pages

25, ఆగస్టు 2021, బుధవారం

వెలుగుచుక్క

కాలేజీ రోజుల్లో - అమాయకపు మోజుల్లో

నమ్మేవాణ్ణి ఎన్నెన్నో ఆదర్శాలను

ఈ లోకంలో ప్రేమే అసలైన దైవమని

లోకమంతా స్వచ్ఛంగా వెలుగుతోందని

మనుషులందరూ ఎంతో

మంచివాళ్ళని, మర్యాదస్తులని 


మానవత్వమే అసలైన దైవత్వమని

ఆడదంటే అసలు సిసలైన దేవతేనని

ఆదర్శాల బ్రతుకే - అసలైన బ్రతుకని

అన్యాయమూ అమానుషమూ ఒక్కటేనని

అసత్యపు బ్రతుకుకంటే

అణగారిపోవడం మేలని


విద్యాభ్యాసం ఆపి అడుగుపెట్టాక

విశాలవిశ్వంలోకి - అడుసులాంటి బ్రతుకులోకి

మానవమృగాల దానవస్వరాల, అరణ్యంలోకి

అసలైన నిజాలను - అడుగడుగునా చూచాను

ఎంత దరిద్రమో మనిషి బ్రతుకు

ఎప్పటికప్పుడు గమనించాను


అబద్దాలూ అన్యాయాల - అసహ్యపు సమాజాన్ని

మోడుబారిన మోసపు బ్రతుకుల - మోటునిజాలను

అజ్ఞానపు జీవితాల - అవాస్తవ చిత్రాలను

అర్ధంలేని పరుగుల - ఆర్భాటపు అగచాట్లను

అద్దంలో చూచినట్లు

అచ్చంగా ఆస్వాదించాన


అన్ని మతాలూ - అన్ని కులాలూ

అన్ని వర్గాలూ - అన్ని వర్ణాలూ 

అన్ని దేశాలూ - అన్ని ప్రాంతాలూ

అన్ని రోజుల్లోనూ - అన్ని ఋతువుల్లోనూ

అనుసరిస్తున్నదెవరినో 

అర్ధం చేసుకున్నాను


ఆరాధనా మందిరాలన్నీ - ఆర్జనా మందిరాలేనని

అర్చనా విధానాలన్నీ - అర్భకుల ఆరాటాలేనని

నీతిబోధకులందరూ - నీటిమీది బుడగలేనని

మానవతా వాదులందరూ - మాటకారులు మాత్రమేనని

అబ్బురపరిచే వాస్తవంలోకి

అకస్మాత్తుగా మేలుకున్నాను


మానవసంబంధాలన్నీ - మాసిన చొక్కాలేనని

మనుషుల బంధాలన్నీ - మారుజాతి చెక్కలేలని

మనుషులందరూ నటనా సార్వభౌములేనని

మనసుల మూలాలన్నీ - మసిబారిన గోడలేనని

ముచ్చటైన నిజాలను

మునుగుతూ తెలుసుకున్నాను


జీవితమంటే ఒంటరి ప్రయాణమని

నీవారనబడేవారు - నిజానికెవరూ లేరని

ఉన్నారనుకోవడం నీ పిచ్చి భ్రమేనని

ఇక్కడెవరూ ఎవరికీ - అసలేమీ కారని

అసలు సత్యాన్ని

ఆలస్యంగా అవగతం చేసుకున్నాను


అందరూ దొంగలేనని - అన్నీ బుంగలేనని 

అంతటా మోసమేనని - అన్నిటా మాయలేనని

అందరూ పరుగెత్తేది - డబ్బు వెంటేనని

డబ్బుంటే జీవితంలో - అన్నీ ఉన్నట్లేనని

చెప్పే డబ్బుగ్రంధాన్ని

తబ్బిబ్బు పడకుండా రుబ్బుకున్నాను


డబ్బుంటే మనుషులు ప్రేమిస్తారని

డబ్బుంటే మమతలు చూపిస్తారని

డబ్బుంటే కొండమీది దేవుడైనా సరే

కోతిలా దిగి నీ ముందుకొస్తాడని

కొండంత వాస్తవాన్ని - కొంచెంకొంచెంగా

కోతిలా నేర్చుకున్నాను


ఇన్ని తెలుసుకున్నా - ఇన్ని అర్థమైనా

ఏమూలో చావకుండా ఏదో ఆశ

మనిషన్నవాడు ఒక్కడైనా ఉన్నాడని

మనసన్నదాన్ని ఎక్కడైనా చూస్తానని

మరచిపోయిన దారి

మరునాటికైనా మరుగు వీడుతుందని


నిత్యం కనిపిస్తున్నది నిజం కాదని

సత్యం చస్తే బ్రతుకుకే అర్ధం లేదని

నిశిరాత్రి నీరవం శాశ్వతం కాదని

పసితనపు కలలన్నీ కల్లలు కావని

నా గుండె చప్పుడు బోధించడాన్ని

నాలోనే నానాటికీ కన్నాను


చీకటి ఉనికే - వెలుగుకు నిదర్శనమని

అబద్ధపు బ్రతుకే - నీతికి నిరూపణమని

స్వార్ధపు మనసే - నిస్వార్ధతకు దర్పణమని

అబద్దపు అవని నుండే - ఆకాశానికి తర్పణమని

అద్భుత స్వరమొకటి - అంతరంగంలో అనడం

అనవరతం విన్నాను


ఏదో ఆశ - లోలోపల మిణుకుతోంది

ఏదో శ్వాస - ఎదలోపల వణుకుతోంది

సాగుతున్నా - ఎడారిచీకట్లో కాళ్ళీడుస్తూ

తూర్పున జ్వలిస్తున్న - వెలుగుచుక్కను చూస్తూ

మనిషి కోసం, మనసుకోసం,

మౌనంగా ఎదురుచూస్తూ....