Pages - Menu

Pages

12, ఆగస్టు 2021, గురువారం

GSLV F-10 రాకెట్ ఫెయిల్ - జ్యోతిష్య కారణాలు

ఈ రోజు ఉదయం 5.43 కి శ్రీహరికోటనుండి ప్రయోగించిన GSLV రాకెట్ ఫెయిలైంది. ఇది  విజయవంతమైతే, EOS (Eye on Sky)  అనే ఉపగ్రహాన్ని భూకక్ష్యలో ప్రవేశపెట్టి ఉండేవాళ్ళం. కానీ, మూడోదశలో అంటుకోవలసిన క్రయోజెనిక్ ఇంజన్ అంటుకోకపోవడంతో ఈ రాకెట్ అనుకున్న పనిని చెయ్యలేకపోయింది. ఇదిలా ఫెయిలవడానికి జ్యోతిష్య కారణాలేంటో వినండి మరి !

ఏ ముహూర్తానికైనా సూర్యోదయ లగ్నం మంచిది కాదు. దానిని సూర్యలగ్నదోషమంటారు. సూర్యుడు లగ్నంలో ఉండటం వల్ల ఆ లగ్నం దగ్ధమైపోతుంది. అంటే కాలిపోతుంది. ఈ ముహూర్తానికి లగ్నము సూర్యుడూ చాలా దగ్గరగా ఉన్నారు.  కనుక, రాకెట్ ప్రయోగానికి ఇది మంచి సమయం కాదు.

ఈ రాకెట్ ఆకాశంలో చాలా దూరం ప్రయాణించవలసి ఉంటుంది. నవమస్థానాధిపతి అయిన గురువు అష్టమంలో ఉంటూ, అక్కడనుంచి వక్రించి సప్తమమకరంలోకి వచ్చినట్లు అవుతాడు. అది ఆయనకు నీచస్థితి. అక్కడనుంచి ఆయన దృష్టి సూటిగా కర్కాటక  లగ్నాన్ని చూస్తుంది. కనుక దూరప్రయాణం ఫెయిల్ అవుతుందన్న సూచన ఈ ముహూర్తంలో ఉంది.

విమానాలకు రాకెట్లకు కారకగ్రహం శుక్రుడు. ఈ శుక్రుడు ఇప్పుడే, సింహాన్ని వీడి, కన్య సున్నా డిగ్రీలలోకి అడుగుపెడుతూ నీచస్థితిలో చాలా బలహీనంగా ఉన్నాడు. కనుక రాకెట్ ప్రయోగానికి ఇది మంచి సమయం కాదు.

ఈ సమయంలో ఉన్న, అన్నింటినీ మించిన చెడు గ్రహయోగం ఏమిటో చెబుతా వినండి.

యమగ్రహం అనబడే ప్లూటో మకరం సున్నా డిగ్రీలలో ఉంటూ శుక్రుడితో ఖచ్చితమైన కోణదృష్టిని కలిగి ఉన్నాడు. యముడంటే నాశనమే కదా? పైగా ప్లూటో, సౌరమండలంలో అత్యంత బయటగా కటికచీకటిలో ఉన్న గ్రహం. అది యమలోకమే. అక్కడ మైనస్ 240 సెంటీగ్రేడ్ డిగ్రీల చలి ఉంటుంది. కనుక అది స్వతహాగా క్రయోజెనిక్ స్థితిలో ఉన్న గ్రహమే. ఈ యమగ్రహం దృష్టి, రాకెట్లకు కారకుడైన నీచ బలహీన శుక్రునిమీద ఉన్నపుడు, క్రయోజెనిక్ ఇంజన్ స్టేజి ఫెయిల్ అవక ఇంకేం జరుగుతుంది? ఖచ్చితంగా  అదే జరిగింది చూడండి మరి !

పైగా, అష్టమాధిపతిగా నాశనాన్ని సూచిస్తున్న శనియొక్క దశమ దృష్టి శుక్రునిమీద ఉంది. ఇది ప్లూటో దృష్టికి ఆజ్యం పోస్తుంది. 

ఇప్పుడు దశను చూద్దాం. ముహూర్తంలో దశ ఏంటని కొంతమంది కుహనా జ్యోతిష్కులు సందేహం లేవనెత్తవచ్చు.  మీకు శాస్త్రం తెలీకపోతే నా దగ్గర నేర్చుకోండి. ఇదే వారికి నా సమాధానం.

పోతే, ఆ సమయానికి, రవి - శుక్ర - రవి - శని - శుక్రదశ జరుగుతున్నది. రవి శుక్రుల ప్రాముఖ్యత స్పష్టంగా కన్పిస్తున్నది. రవి ఏ విధంగా లగ్నాన్ని పాడుచేశాడో పైన చెప్పాను. శుక్రుడు ఏ విధంగా నీచ బలహీన స్థితిలో ఉన్నాడో, ఏ విధంగా యమగ్రహ దృష్టికి లోనయ్యాడో చెప్పాను. ఇక శని, ఆరింటిలోకి వచ్చి దశమదృష్టితో శుక్రుడిని చూస్తున్నాడు. మరి ఈ సమయంలో చేసిన పని విఫలమవక, ఎలా విజయవంతమౌతుందో చెప్పండి?

ఇప్పుడు సందేహాసుందరాలకు మరో సందేహం రావచ్చు. మరి గతంలో సక్సెస్ అయిన ప్రతి ప్రయోగమూ సక్సెస్ ఎందుకయింది? అపుడు కూడా వారు ముహూర్తం చూసుకుని లాంచ్ చెయ్యలేదు కదా? అని. వినండి.

ఆయా సమయాలలో, అనుకోకుండా వారికి మంచి ముహూర్తాలు కలసి వచ్చాయి. అదే కాలం కలసి రావడమంటే. ప్రస్తుతం అది ఎదురు తిరిగింది. అందుకే ఇలా జరిగింది.

ఎప్పుడైనా సరే, మనం చేసే పని ఒక్కదానివల్లనే మనం సక్సెస్ అవ్వం. దానికి దైవానుగ్రహం తోడైనప్పుడే ఆ సక్సెస్ మనకు అందుతుంది. సక్సెస్ వెనుక మన కృషి ఒక్కటే కాదు, ఇంకా చాలా కనిపించని అంశాలుంటాయి. అవన్నీ కలసివచ్చినపుడే సక్సెస్ అనేది చేతికి అందుతుంది. దానినే మనవాళ్ళు యోగం అనీ, విధి అనీ, దైవం అనీ అన్నారు. మరి ముహూర్తబలమంటే ఏమిటి? ముహూర్తబలమంటే మనకు చేతనైనంతలో మంచి సమయాన్ని ఎన్నుకోవడం మాత్రమే.

మనం సౌరమండలంలో ఉన్నాం. సౌరమండలంలోని గ్రహాలు మనమీద ప్రభావం చూపించవనడం, 'భూమ్యాకర్షణ శక్తి నామీద పనిచేయదు' అనడంలా ఉంటుంది.