Pages - Menu

Pages

30, సెప్టెంబర్ 2021, గురువారం

పనిలేని పయనం

మహాలయపు రోజులలో 

మరుగుపడిన గతమంతా

మళ్ళీ మనసును తడుతూ

మారాకులు తొడిగింది


అదే రంగస్థలంపైన

అవే రంగులద్దుకుంటు

సాగే వేరొక నాటిక

కనులముందు నిలిచింది


ఎగుడుదిగుడు దారులలో 

ఎన్నో సుడి మలుపులలో

పయనించే బ్రతుకునావ

ఎటో సాగిపోతోంది


అపరిచితుల లోకంలో

అంతులేని పయనంలో

అయోమయపు పిచ్చిమనసు

అలసిపోయి తూలింది


కపటనగర వీధులలో

కలల విపణి దారులలో

కరువు యాచనెందుకంటు

కంటినీరు తొణికింది


పగలూ రాత్రులనెన్నో

పరికించిన ఈ హృదయం

పనికిరాని పయనాన్నిక 

పాతరెయ్యమంటోంది


లెక్కలేని మజిలీలను

తట్టుకున్న ఈ బిడారు

మరుమజిలీ వద్దంటూ

పాదాలను పట్టుకుంది