Pages - Menu

Pages

21, నవంబర్ 2021, ఆదివారం

నవంబర్ 2021 పౌర్ణమి ప్రభావం - పెనువర్షాలు

ఈ సృష్టిలో మనం అదుపు చెయ్యలేనివి పంచభూతాలూ, నవగ్రహాలే. అందుకే మనమెంతగా విర్రవీగినా, మన జీవితాలు మన చేతులలో ఉండవు.  

మొన్న పౌర్ణమి. రాహుకేతువుల ఇరుసుతో చంద్ర సూర్యుల ఇరుసు ఒకటైంది. చంద్రుడు ఉచ్ఛస్థితిలో ఉన్నాడు, సూర్యుడిప్పుడే నీచస్థితినుంచి బయటపడ్డాడు.

జలతత్వరాశైన వృశ్చికానికి అర్గళం పట్టింది.లాల్ కితాబ్ సిద్ధాంతం ప్రకారం కుజబుధులు కలిస్తే శుక్రుడౌతాడు. కనుక వృశ్చికరాశికి రెండుప్రక్కలా శుక్రునితో అర్గళం పట్టింది. శుక్రుడు జలతత్వ గ్రహం. వృశ్చికం జలతత్వ రాశి. రాహుచంద్రుల కోణదృష్టి భారతదేశానికి సూచికైన మకరం మీదుంది. ఇక ఫలితాలను చూడండి.

అన్నమయ్య జలాశయం, పోచి జలాశయాల గట్లు తెగి, కడపజిల్లాలోని నందలూరు - రాజంపేటల మధ్యన రైల్వే ట్రాక్ ఒక కిలోమీటరు పొడుగునా కొట్టుకుపోయింది. పనిలో పనిగా ఒక రైల్వే బ్రిడ్జి కూడా కొట్టుకుపోయింది. ముంబాయి చెన్నై రూట్లో రైళ్లు స్తంభించాయి. వర్షంలో తడుస్తూ, భయంకరంగా ఉన్న బురదలో 500 మంది స్టాఫ్ రాత్రింబగళ్ళూ పనిచేస్తూ ట్రాక్ ను వేసే పనిలో, బ్రిడ్జిని మళ్ళీ కట్టే పనిలో ఉన్నారు.

కడపజిల్లా గందరగోళమైంది. వరదలలో 40 మంది గల్లంతయ్యారు. వరదమధ్యలో ఇరుక్కుపోయిన బస్సు మీదనున్న జనాన్ని IAF హెలికాఫ్టర్ ఎయిర్ లిఫ్ట్ చేసింది.

చెన్నైలో, తిరుపతిలో కుండపోత వర్షాలతో రోడ్లు జలమయాలయ్యాయి. తిరుమలలో కురిసిన వర్షాలకు , కపిలతీర్థం మునిగింది. తూర్పు కోస్తా అంతటా వర్షాలు పడుతున్నాయి. సౌత్ మొత్తం గందరగోళమైంది. మకరం దక్షిణదిక్కును సూచిస్తుందని మర్చిపోకండి.

ఒక్క మనదేశమేనా దెబ్బతినేది? అన్న చొప్పదంటు అనుమానాన్ని రానివ్వకండి.

కెనడాలో బ్రిటిష్ కొలంబియా గుర్తుందా? వందలాది మంది పిల్లల సమాధులు ఒక చర్చి స్కూల్ ఆవరణలో  బయటపడ్డాయి కొంతకాలం క్రితం ! అదే ప్రావిన్స్ లో ఇప్పుడు భయంకరమైన వరదలు ముంచెత్తుతున్నాయి. వృషభరాశి కెనడాను సూచిస్తుందని గతంలో వ్రాశాను గమనించండి. వేలాదిగా పశువులు చనిపోయాయి. కనీసం 18000 మంది వరదలలో చిక్కుకుని అల్లాడుతున్నారు. బ్రిటిష్ కొలంబియా ఎమర్జెన్సీని ప్రకటించింది. అక్కడ జలగ్రహమైన చంద్రుడు ఉచ్ఛస్థితిలో ఉంటూ, రాహుగ్రస్తుడైన ఈ సమయంలోనే అక్కడ వరదలెందుకొచ్చాయో అర్థమైందా మరి? 

తిరుమలలో ఇలాంటి వర్షాలు గత 500 ఏళ్లలో లేవని అంటున్నారు. ఈ గ్రహణం కూడా దాదాపు  7 గంటలపాటు ఉంది. గత 600 ఏళ్లలో ఇలాంటి చంద్రగ్రహణమూ రాలేదని అంటున్నారు.  కనుక లెక్క సరిపోయిందా మరి?

గ్రహణాలూ, అమావాస్యా పౌర్ణములూ ఇలా భూమిని ప్రభావితం చేస్తూ ఉంటాయి. గత పదేళ్లుగా నా పోస్టులు చూడండి. ఎన్ని సార్లు రుజువైందో గమనించారా?

మనపైన గ్రహప్రభావం లేదని  ఎలా అనగలం చెప్పండి?