నిత్యజీవితంలో ప్రతిఫలించని జ్ఞానం నిరర్ధకం

15, నవంబర్ 2021, సోమవారం

జిల్లెళ్ళమూడి స్మృతులు - 41 (ఆశ్రమస్థలం)

హైదరాబాద్ లో మా ఇంటిని కట్టిన బిల్డర్ స్వగ్రామం కందుకూరు దగ్గర్లోని వర్ధినేనివారిపాలెం. ఆ చుట్టుప్రక్కలలో మా ఆశ్రమానికి మంచి స్థలాలున్నాయని చాలా రోజులనుంచీ అతను పోరు పెడుతుంటే, చూద్దామని కందుకూరు ప్రాంతాలకు మొన్న వెళ్లడం జరిగింది. రాత్రి పదకొండుకు హైద్రాబాద్ లో సింహపురి ఎక్స్ ప్రెస్ ఎక్కి, ఉదయం ఏడింటికి సింగరాయకొండలో దిగాను. అప్పటికే అక్కడ కారుతో సిద్ధంగా ఉన్న మూర్తి స్టేషన్ కు వచ్చి నన్ను కలుసుకున్నాడు. గత వారం రోజులుగా మద్రాస్ లో పడుతున్న భారీవర్షాల ప్రభావంతో ఆ ప్రాంతం కూడా చిత్తడిగా ఉంది. చిరుజల్లులు పడుతూనే ఉన్నాయి. గతంలో ఇంతకంటే ఇంకా భారీవర్షాలతో తడుస్తూ రైల్ ట్రాక్ మీద రోజుల తరబడి పనిచేసి ఉండటంతో, ఇదేమీ పెద్ద వర్షం లాగా నాకనిపించలేదు.

ఒక అరగంట ప్రయాణంతో కందుకూరు చేరుకున్నాం. ముందుగానే బుక్ చేసిన హోటల్లో దిగి స్నానం కానిచ్చి, టిఫిన్ కోసం వెతుకుతుంటే ఎక్కడా ఒక వెజ్ హోటల్ కనిపించడం లేదు. ఉన్న కొన్ని చోట్లా ఎగ్ ఉంది. ఇక తిరిగీ తిరిగీ ఒక హోటల్ ని పట్టుకున్నాం. ఈ తిరుగుడు, ముప్పై ఏళ్ల క్రితం కేరళలోని 'తలిపరంబా 'అనే ఊరిలో ఉదయం టిఫిన్ కోసం, ఒక వెజ్ హోటల్ కోసం, నేను తిరిగిన తిరుగుడును గుర్తుకు తెచ్చింది. ఆ ఊరి మొత్తం మీద ఒక్కటంటే ఒక్క వెజ్ హోటల్ దొరకలేదు.  పొద్దున్నే చక్కగా చికెన్, ఫిష్ తింటున్నారక్కడ. ఆ సంఘటన మళ్ళీ గుర్తుకొచ్చింది. సరే చివరకు ఒక మంచి హోటల్ దొరికింది.

కందుకూరనేది ఒక శుచీ శుభ్రతా లేని చిన్న టౌన్. దాదాపుగా ముప్పై ఏళ్ల క్రితం నుంచీ నాకీ ఊరు తెలుసు. అక్కడ మా బంధువులుండేవారు. ప్రస్తుతం ఆ ఊరినొదిలేసి కావలిలో ఉంటున్నారు.  వాళ్ళున్నపుడు కొన్నిసార్లు అక్కడకొచ్చాను. చిత్తడిగా ఉన్న ఇరుకు బజార్లతో, రోడ్డు మీదే జరుగుతున్న అనేక వ్యాపారాలతో ఊరంతా చిరాకుగా ఉంది. హోటల్ కూడా అలాగే ఉందిగాని, టిఫిన్ రుచిగా ఉంది. తలా ఒక ఉల్లి పెసరట్టు తినేసరికి ఇక మధ్యాన్నం భోజనం కూడా చెయ్యలేమేమో అనిపించేంత బరువుగా తయారైంది పొట్ట. అలాంటి పెసరట్టును గత మూడు దశాబ్దాలలో తిన్న గుర్తు రాలేదు. అంత భారీగా ఉంది.

సరే, టిఫిన్ అయిందనిపించి, పంచదార పానకం లాంటి టీ త్రాగి, సర్వే మొదలుపెట్టాం. ఏంటో ఈ ఖర్మ  ! టీని టీలాగా చెయ్యడం ఎవడికీ రాదు. వేడిగా ఉన్న చక్కెర పానకాన్ని త్రాగుతూ టీ అని భ్రమపడుతున్నారు పిచ్చిజనం !

సాయంత్రం వరకూ చాలా స్థలాలు, పొలాలు చూస్తూ గడిపాము. కానీ ఏవీ మాకు నచ్చలేదు. మాకు కావలసిన లక్షణాలు అక్కడ లేవు. పైగా, ఆ ప్రదేశాల 'ఆరా' నాకు నచ్చలేదు. అందుకని దాదాపు ఒక 60 కిమీ పరిధిలో తిరిగి తిరిగి, సాయంత్రానికి మళ్ళీ హోటల్ కు చేరుకున్నాం. మనలో కావలసినంత సెన్సిటివిటీ ఉంటే, ఊర్లవి, స్థలాలవి, ఇళ్ళవి, మనుషులవి 'ఆరా'లను మనం స్పష్టంగా తెలుసుకోవచ్చు. ఈ విషయం మీద గతంలో వ్రాశాను కూడా. 

అక్కడిదాకా వెళ్లాం కదా అని, దారిలోనే ఉన్న సంగమేశ్వర ఆలయాన్ని దర్శించాం. అది చాలా పాతకాలపు శివాలయమని చాలా కధలు చెప్పారు. కానీ, 'పేరు గొప్ప ఊరు దిబ్బ' అన్నట్లుంది ఆ గుడి. మూడు ఏరులు అక్కడ కలుస్తున్నాయి గనుక సంగమేశ్వర ఆలయమైంది. పూజారులేమో చాలా లేజీగా, మొబైల్లో యూట్యూబ్ చూసుకుంటున్నారు. ఒక పూజారేమో, పంచాయితీలు చేసే ఫెక్షన్ లీడర్ లాగా ఫోన్లో ఎవరితోనో అరుస్తూ తెగ మాట్లాడుతున్నాడు. ప్రధాన ముసలిపూజారికేమో మంత్రాలు రావు. 'కార్తీక మాసం' అంటూ ఏదో వచ్చీరాని మంత్రాలు గొణిగాడు. నాకు భలే నవ్వొచ్చింది. చాలా నిరాశగా వెనక్కు వచ్చేశాం అక్కడనుంచి.  

ఈ ప్రదేశంలో మా ఆశ్రమాన్ని కడితే చాలా బాగుంటుందని మా బిల్డర్ అన్నాడు.

అతనిలా అన్నాడు, 'మీరు ఇక్కడ ఆశ్రమాన్ని కట్టండి సార్. మిగతాది నేను చూచుకుంటాను. అక్కడంతా మాకు పెద్ద సర్కిల్ ఉంది. డొనేషన్లు కుప్పలుగా వచ్చేటట్లు నేను చూస్తాను.  ఈ మధ్యనే భైరవస్వామి అని మా గురువు గారి ఆశ్రమంలో కాలభైరవ హోమం జరిగింది.  ఆ హోమం అయిపోయిన తర్వాత, వచ్చినవాళ్ళందరూ తలా ఒక డొనేషన్ ఇచ్చారు.  కొందరు కాంపౌండ్ వాల్ కట్టించడానికి, కొందరు గోశాలకు, మరి కొందరు బిల్డింగ్ పెంచడానికి ఇలా రకరకాలుగా ముందుకొచ్చారు. ఆయా పనులన్నీ మొదలౌతున్నాయి.  మన ఆశ్రమానికి క్కూడా ఫండ్స్ కొరత ఉండనే ఉండదు. మీరు మొదలు పెట్టండి. మిగతాది మేము చూచుకుంటాము'

నేను నవ్వి ఇలా చెప్పాను.

'మా ఆశ్రమం మిగతా ఆశ్రమాల వంటిది కాదు. దీనిలో హోమాలుండవు. గుళ్లుండవు. పూజలుండవు.  గోశాలలు, సోషల్ సర్వీసులు ఉండవు. సెల్ఫ్ సర్వీస్ మాత్రమే ఉంటుంది. పైగా, డొనేషన్లు తీసుకోవడం మీద నాకస్సలు నమ్మకం లేదు. ఒకరి దగ్గర రూపాయి తీసుకుంటే, వారి కర్మ కూడా దానితో మనవెంట వస్తుందని నమ్మేవాడిని నేను. మేం డొనేషన్లు తీసుకోము. జనాన్ని పోగు చేసుకోము. మందితో పెట్టుకుంటే మంటేనని నాకు బాగా తెలుసు.  ఎవరిని బడితే వారిని మా ఆశ్రమంలోకి రానివ్వం కూడా. డబ్బులిస్తామనే వారికి  మా తలుపులు తెరుచుకోవు. మా ఆశ్రమంలో ప్రవేశానికి వేరే అర్హతలుంటాయి. అవి అందరికీ ఉండవు. కనుక  మా ఆశ్రమం అందరికోసం కాదు. మా కోసం మాత్రమే, మాకు డబ్బులొద్దు, నిజమైన మనుషులు కావాలి'.

అతనికి అర్ధమైందో లేదో నాకు తెలీదు. మౌనంగా ఉండిపోయాడు.

'ఇలా అయితే, ఇక మీరు ఎదిగినట్లే' అని లోలోపల అనుకోని ఉంటాడు. కానీ, నేను కోరుతున్న ఎదుగుదల ఏంటో అతనికి గాని, ఈ పిచ్చి లోకానికి గాని ఎలా అర్ధమౌతుంది?

ఉల్లిపాయ పెసరట్టు దెబ్బకి మధ్యాహ్న భోజనం ఎగిరిపోయింది.

సాయంత్రం నాలుగు ప్రాంతంలో కావలి నుంచి వచ్చిన మా తమ్ముడితో కాసేపు మాట్లాడి, హోటల్ ఖాళీ చేసి, ఒంగోలు దారి పట్టాము. అప్పుడుగానీ ఉదయం నుంచీ మమ్మల్ని చంపుతున్న తలనొప్పి మాయం కాలేదు.  ఆ ఊర్లో అడుగుపెట్టిన దగ్గరనుంచీ మా ఇద్దరికీ తలనొప్పి మొదలైంది.  ఆ ఊరిని వదలిన తర్వాత దానంతట అదే మాయమైంది. మమ్మల్ని వెంటాడుతున్న ఏదో దుష్టశక్తి వదలిపోయినట్లు రిలీఫ్ గా అనిపించింది.

కారు ఒంగోలు దాటుతూ ఉండగా, 'జిల్లెళ్ళమూడికి పోనివ్వు సురేష్', రాత్రికి అక్కడ మనింట్లో ఉందాం' అన్నాను. తనూ ఈ మధ్య నా ఆరాలో ఉంటున్నాడు గనుక, పొద్దుటినుంచీ కందుకూరు వాతావరణమంతా తనకూ ఉక్కిరిబిక్కిరిగానే ఉందని అన్నాడు. తను నెలకు నాలుగైదు సార్లు ఆ ఊరికి వస్తూ ఉంటాడు. కానీ ఈ సారి ఏదో తేడాగా అనిపించిందని అన్నాడు. కారు జిల్లెళ్ళమూడి వైపు తిరిగింది. ఏడు గంటల ప్రాంతంలో చీరాల, బాపట్లల మీదుగా ప్రయాణించి జిల్లెళ్ళమూడి చేరుకున్నాం. అమ్మ దర్శనం చేసుకుని, భోజనం కానిచ్చి విశ్రాంతి తీసుకోవడం మొదలుపెట్టాం. రోజంతా తెగ తిరిగి, పైగా తిండి లేకుండా ఉన్నామేమో, ఒళ్ళు తెలీకుండా నిద్ర పట్టేసింది.

(ఇంకా ఉంది)