Pages - Menu

Pages

17, నవంబర్ 2021, బుధవారం

జిల్లెళ్ళమూడి స్మృతులు - 44 (సివిల్ సర్వీస్ - ఆధ్యాత్మిక చర్చ)

దినకర్ గారు కొనసాగించారు.

'అమ్మ 1923 లో పుట్టారు. 2023 కి నూరేళ్లవుతున్నాయి. అందుకని 2023 లో అమ్మ శతజయంతి ఉత్సవాలు జరపాలని అనుకుంటున్నాం. దానికి అందరు స్వామీజీలను, పీఠాధిపతులను ఆహ్వానించి వారిచేత ఒకే వేదికపైనుంచి మాట్లాడించాలని మా సంకల్పం. మీ 'పంచవటి' నుండి మిమ్మల్ని కూడా వేదికమీదకు ఆహ్వానిస్తాం. మీరు కూడా అమ్మ గురించి మాట్లాడాలి' అన్నారాయన.

నేనిలా అన్నాను. 

'మంచి ఆలోచనే. 2022 లో నేను పదవీ విరమణ చేస్తున్నాను. 2023 కి మా ఆశ్రమంలోనే ఉంటాను. మా 'పంచవటి' తరఫున మాట్లాడమంటే నాకేమీ అభ్యంతరం లేదు. కానీ, ఒక మాట. నన్ను మాట్లాడమంటే మాత్రం, ఉన్న విషయాన్ని ఉన్నట్లుగా చెబుతాను. వేదికమీదున్న స్వామీజీలను కూడా నిర్మొహమాటంగా విమర్శిస్తాను. మరి వాళ్ళు తట్టుకోగలరో లేదో, ఆలోచించండి. అయితే నా విమర్శ అసభ్యంగా ఏమీ ఉండదు. తార్కికంగా, శాస్త్రప్రమాణాలను చూపిస్తూనే విమర్శిస్తాను. వారు అమ్మను అర్ధం చేసుకోవడంలో ఎక్కడ తప్పు దోవ పడుతున్నారో, సమాజానికి సరియైన దిశానిర్దేశాన్ని చేయడంలో ఎక్కడ విఫలమౌతున్నారో స్పష్టంగా చెబుతాను. మీకభ్యంతరం లేకుంటే, నన్నూ వేదికనెక్కించండి. నాకేమీ అభ్యంతరం లేదు.

మరొక్క విన్నపం ! ఆ స్వామీజీలకు ముందుగానే మీరు సూచన చేయండి. అతిశయోక్తులతో కూడిన సోది మాట్లాడకుండా, వారి వారి మహిమలు, గొప్పలు, మంత్రాలు, శక్తులు, పూర్వజన్మలు, లోకాలు ఇలాంటి చెత్త మాట్లాడకుండా, అమ్మ తత్వాన్ని ఉన్నదున్నట్లుగా చెప్పమని స్టేజి ఎక్కబోయేముందే వారికి స్పష్టంగా చెప్పండి. మీకు వారందరూ గత 50 ఏళ్లుగా తెలుసు గనుక, వారికి చెప్పే చనువు మీకుంటుంది. అందుకని నా సూచనను స్వీకరించండి' అన్నాను.

'అవును. నేను జిల్లెళ్ళమూడికి వచ్చి, వచ్చే ఏడాదికి 50 ఏళ్ళు అవుతున్నాయి. నిజమే. కానీ నాలో ఇంకా రేషనల్ థింకింగ్ పోలేదు' అన్నారాయన.

నేనిలా అన్నాను.

'రేషనల్ థింకింగ్ అవసరమే. అది ఉండాలి. అది ఆధ్యాత్మికానికి సహాయకారే గాని అడ్డు కాదు. వివేకానందస్వామి లండన్లో ఒక ఉపన్యాసాన్నిచ్చారు. దానిపేరు Reason and Religion. అందులో ఆయనంటారు, ఇంద్రియాల పరిధిలో మనకు తెలిసిన రేషనల్ థింకింగూ, లాజిక్కూ, రీజనూ అవసరములే. అవి లేకుంటే మనం బ్రతకలేం. కానీ, ఇంద్రియాల పరిధిని దాటిన చోట, అవి పనిచేయవు. వాటికక్కడ మనుగడలేదు. వాటి అవసరం కూడా అప్పుడు లేదు' అని.

'అవును, కానీ అక్కడ పనిచేసే రీజనూ లాజిక్కూ అక్కడుంటాయి' అన్నారు దినకర్ గారు.

'అదే అన్నయ్యా. ఇందాక మీరన్నారే Law of Karma అని. అదే ఇంద్రియాల పరిధిలో పనిచేసే లాజిక్. ఇంద్రియాలను దాటిన పరిధిలో ఉండేది Grace. దీనినే కరుణ లేదా అనుగ్రహం అంటాం. మొదటిది కర్మనియమం, రెండవది అనుగ్రహం. కర్మను దాటించేది అనుగ్రహమే' అన్నాను నేను.

'అవును. ప్రెంచి రచయిత్రి ఒకామె ఒక పుస్తకాన్ని వ్రాసింది. అందులో తను, గ్రేస్ ని గ్రావిటీతో పోల్చింది' అన్నారాయన.

'కావచ్చు. సరియైన పరితాపం మనలో ఉన్నపుడు గ్రేస్ అనేది దానంతట అదే మనవైపు ఆకర్షింపబడుతుంది. నిజమే, అది గ్రావిటీ లాంటిదే. ఆమె ఆ కోణంలో చెప్పి ఉండవచ్చు' అన్నాను.

దినకర్ గారు చెప్పడాన్ని కొనసాగించారు.       

'1967 లో నేను సివిల్ సర్వీస్ పరీక్షను 68 శాతం మార్కులతో పాసయ్యాను. IAS ఖచ్చితంగా రావలసింది. కానీ ఆరోగ్య కారణాల వల్ల నేను ఇంటర్వ్యూ కు హాజరు కాలేకపోయాను. శీత్కారీ ప్రాణాయామాన్ని ఎక్కువగా చేయడం వలన అనారోగ్యం పాలయ్యాను. అందుకని ఇంటర్వ్యూ చేయలేదు. తరువాత నాకు జీవితం మీద ఇంటరెస్ట్ పోయి, అదొక రకమైన నిరాసక్తతలో పడి, అప్పీల్ కూడా చేయలేదు. అమెరికా వెళ్ళిపోయాను. తర్వాత టీచింగ్ ప్రొఫెషన్ లో చేరాను. అప్పట్లో మా జీతాలు వందలలో ఉండేవి. లోన్లు తీసుకుని పిల్లల్ని చదివించుకున్నాము. We never touched a foul penny. అయితే పిల్లలు బాగా చదువుకున్నారు. అమెరికాలో సెటిలయ్యారు' అన్నారాయన.

'అందుకే మీలో ఆ ఇంటలెక్చువల్ ఫ్లేవర్ ఉన్నది. మనిద్దరం ఒకే పడవలో ఉన్నాం. నేనూ 1988 లో సివిల్స్ ఇంటర్వ్యూ కెళ్ళాను. ఎలాంటి కోచింగు తీసుకోకుండానే, మొదటి అటెంప్ట్ లోనే ప్రిలిమ్స్, మెయిన్స్ క్లియర్ చేశాను. అయితే నేను త్రూ కాలేదు. అప్పట్లో 132 పోస్టులు పడ్డాయి. అదికూడా ఒక కారణం కావచ్చు. ఇప్పుడు వెయ్యి పోస్టులు కూడా ఒక్కోసారి పడుతున్నాయి. నిరాశపడకుండా రైల్వేలో చేరాను. ఇక్కడ IRTS వచ్చింది. IAS చేజారినా, IRTS ఆఫీసర్ నయ్యాను. సివిల్స్ క్లియర్ చెయ్యాలంటే ఎంత కష్టపడాలో నాకు తెలుసు. ఆ కష్టం ఊరికే పోదు. అది మీకు టీచింగ్ ఫీల్డ్ లో ఉపయోగపడింది. నాకు ఇంకెన్నో రకాలుగా ఉపయోగపడింది. రేషనల్ థింకింగ్ ని అది పెంచుతుంది. కాన్సెప్చువల్ గా ఆలోచించడాన్ని పెంచుతుంది. ఇవి రెండూ ఆధ్యాత్మికంలో చాలా అవసరమైనవే' అన్నాను.

'ఆధ్యాత్మికంగా మీరు ఎవరిని ఫాలో అవుతారు?' అడిగారాయన.

'ప్రాధమికంగా నేను శ్రీ రామకృష్ణులవారి భక్తుడిని. ఆయనే నా దైవం. అయితే, రమణులనూ, (జిల్లెళ్ళమూడి) అమ్మగారి బోధలనూ ఇష్టపడతాను. మెహర్ బాబా గారినీ, అరవిందులనూ కూడా ఇష్టపడతాను. శ్రీ రామకృష్ణులవారు బోధించిన - కులమతాలకు, ప్రాంతీయ భేదాలకు , అన్ని విభేదాలకు అతీతమైన విశ్వజనీన మౌలిక సత్యాలంటే నాకిష్టం.  వాటినే వీరు కూడా చెప్పారు గనుక, వీరిని కూడా ఆరాధిస్తాను' అని చెప్పాను.

'ఊరకే ఆయన భక్తులా లేక వారి మార్గంలో ఇనీషియేటెడా?' అడిగారు అన్నయ్య.

'1987 లో ఇనీషియేషన్ తీసుకున్నాను. స్వామీ గంభీరానంద గారు మా గురువుగారు' అన్నాను.

'ఓ ! ఆదిశంకరుల బ్రహ్మసూత్ర భాష్యాన్ని ఇంగిలీషులో వ్రాశారు. ఆయనేగా? చాలా స్టాన్దర్డ్ బుక్ అది' అన్నారాయన.

'అవునన్నయ్యా ! దానినాయన 1965 లో వ్రాశారు. ఆయన సంస్కృతం, బెంగాలీ, ఇంగిలీషులలో మహా పండితుడు. ఆయన వ్రాసిన పుస్తకాలన్నీ ఉద్గ్రంధాలే. The Eight Upanishads అనే వారి గ్రంధాన్ని మీరు చూచారా? అదికూడా చాలా స్టాన్దర్డ్ కలిగినది. గంభీరానంద గారు, శివానందస్వామివారి శిష్యులు. శివానందస్వామి శ్రీ రామకృష్ణుల ప్రత్యక్ష భక్తులు' అన్నాను.

'స్వామి శివానంద గారి పుస్తకం చదివే నేను శీత్కారీ ప్రాణాయామాన్ని ఎక్కువగా చేసి దెబ్బ తిన్నాను. సివిల్స్ ఇంటర్వ్యూకు హాజరు కాలేకపోయాను, అయితే, ఆ ప్రాణాయామ ఫలితంగా కుండలిని హృదయస్థానం నుండి క్రిందకు పడిపోవడం నాకు స్పష్టంగా తెలిసింది' అన్నారాయన.

'శివానందగారు The Science of Pranayama అనే పుస్తకాన్ని వ్రాశారు. అదేనా మీరు చదివింది?' అడిగాను.

అవునన్నారాయన.

'మా పరమగురువులైన శివానందస్వాములవారు వేరు, మీరు చెబుతున్నాయన వేరు. మీరు చెబుతున్నది  Divine Life Society స్వామి శివానందగారి గురించి. మా పరమగురువులు అలాంటి పుస్తకాలను వ్రాయలేదు. ఆయనకలాంటి  ప్రాణాయామాల అవసరం లేదు. ఆయన శ్రీ రామకృష్ణుల వారిని దర్శించి సాక్షాత్తూ ఆయన కరుణను పొందిన వ్యక్తి' అన్నాను.

'రామకృష్ణా మిషన్ వారి పుస్తకాలు చాలా స్టాన్దర్డ్ గా ఉంటాయి. ఉపనిషత్తులు 18 అని కొందరంటారు. వాటిల్లో పదే స్టాన్దర్డ్ అయినవని కొందరంటారు. అమ్మ మాటలను  ఉపనిషత్ వాక్యాలతో పోల్చి చూచినవాళ్లున్నారు. వాటిల్లో ఉన్నవాటినే అమ్మ చాలా తేలిక మాటలలో చెప్పిందని చాలామంది అన్నారు. ఉదాహరణకు,  అమ్మ మాటైన ' అంతా అదే' అనే దానికి, ఈశావాశ్యోపనిషత్ లో చెప్పబడిన మంత్రం సరిపోతుందని కొందరన్నారు' అని ఆయనంటుంటే, 'ఈశావాస్యమిదం సర్వం యత్కిఞ్చ జగత్యాం జగత్ ...' అనే మంత్రం నా మనస్సులో మెదిలింది.

'అదే విధంగా, 'అదికానిదేదీ లేదు నాన్నా' అన్న అమ్మ వాక్యాన్ని కేనోపనిషత్ లోని ఒక మంత్రంలో పోలుస్తారు కొందరు' అని ఆయనంటుండగా 'శ్రోత్రస్య శ్రోత్రం మనసో మనో యద్వాచో హ వాచమ్...' అనే కేనోపనిషత్తు మంత్రం మెరుపులా స్పురించింది.    

'కానీ, అమ్మ బోధలను చాలామంది సరిగ్గా అర్ధం చేసుకోలేదు' అని ఆయన ఏదో అనబోతుండగా నేను  అడ్డుకుని 'అవును. అతి సింపుల్ గా ఉండేవాటినే అందరూ మిస్సవుతారు. అది సహజమే. ఉదాహరణకు, అమ్మ 'పునర్జన్మ లేదన్నారు కదా' అన్నాను.

ఆయన అందుకుని 'అవును. కానీ అమ్మ ఆ మాటను ఏ సందర్భంలో ఎవరితో అన్నారో వదిలేసి దానిని జెనెరలైజ్ చేశారు. అది సరికాదు. అమ్మ ఉద్దేశమేమంటే... ' అని ఇంకా చెప్పబోతున్నారు.

నేను మధ్యలోనే అందుకుని 'ఎందుకంటే, సముద్రంలో ఒకే అల రెండుసార్లు ఎప్పుడూ రాదు. అలాగే ఈ జన్మలు కూడా, అనే అర్ధంలో అమ్మ ఆ మాటన్నారు' అన్నాను.

'కరెక్ట్. జన్మల విషయంలో శ్రీ రామకృష్ణులు కూడా చెప్పారు. వివేకానందుడు కాయస్థుడు. శ్రీ రామకృష్ణుల మిగతా భక్తులు చాలామంది బ్రాహ్మణులు. కానీ వారికి లేని వెసులుబాట్లు నరేంద్రుడికి ఇచ్చేవారాయన. ఉదాహరణకు, తిండి విషయంలో వివేకానందునికి ఏ విధమైన కట్టుబాట్లూ ఉండేవి కాదు.  అదే, మిగతా శిష్యులు బయట హోటల్లో ఒక్క పూట తింటే ఆయన  ఊరుకునేవారు కారు. ముఖం వాచేటట్లు తిట్టేవారు. మరి, వివేకానందునికి ఈ నియమాలు వర్తించవా అని వారు ప్రశ్నిస్తే, 'అతను అగ్నివంటివాడు. అగ్నిలో పడినదేదైనా సరే దగ్దమైపోతుంది' అనేవారాయన. వివేకానందుడు, సప్తఋషుల లోకం నుండి తన పని కోసం దిగి వచ్చిన మహర్షి అని  ఆయన అనేవారు.  అంటే, జన్మ ఉన్నదని ఆయనన్నారు.' అన్నారు దినకర్ గారు.

'అవును. బుద్ధునికి తనయొక్క గత 500 జన్మలు గుర్తొచ్చాయి. అక్కడిదాకా ఎందుకు 1950 లలో నార్త్ ఇండియాలో గగ్గోలు పుట్టించిన శాంతిదేవి కేస్ చూడండి. ఆ పిల్లకు  పదేళ్లు వచ్చేదాకా, తన పూర్వజన్మ చక్కగా గుర్తుంది. తన పాత ఫెమిలీలో అందరినీ ఆ అమ్మాయి గుర్తు పట్టింది. గత జన్మలో తన భర్తకు ఇప్పుడు 70 ఏళ్ళు, అతనికి కొన్ని ఇంటిమేట్ విషయాలను గుర్తు చేసింది. ఇంటిలో తన గదిని, తన వస్తువులను గుర్తు పట్టింది. ఇది రికార్డ్ అయిన కేస్. అయితే ఆ తర్వాత ఆ జ్ఞాపకాలు అతివేగంగా ఆమెలోనుండి మాసిపోయాయి.  ముందు గుర్తుపట్టిన అందరినీ మర్చిపోయింది' అన్నాను.

'అలా మర్చిపోకపోతే ఆమె జీవనం దుర్భరం అవుతుంది కదా' అన్నారన్నయ్య.

'మనం కూడా అంతేగా. మన గతజన్మలన్నీ గుర్తుంటే మనకు పిచ్చెక్కుతుంది. అందుకే, ప్రకృతి మనకు మరపు అనేదానిని ఇచ్చింది, మనిషికి మరపే అసలైన వరం. పోతే, జన్మల గురించి చెప్పాలంటే, విశ్వచైతన్యపు స్థాయి నుంచి చూచినా జన్మ లేదు, పూర్తి భౌతికస్థాయి నుంచి చూచినా అదే జన్మ మళ్ళీ రాదు. జన్మ లేదని అమ్మగారనడంలోని మర్మం ఇంతే. కానీ జన్మలున్నాయి. పునర్జన్మ సత్యమే' అన్నాను.

'చాలా బాగుంది మీతో సంభాషణ. ఉంటారా కొన్నాళ్ళు?' అన్నారాయన.

'లేదు, రాత్రికి హైదరాబాద్ వెళుతున్నాను. మళ్ళీ ఎప్పుడో ఇలాగే కలుస్తాను. వచ్చే ఏడాది నుంచీ, రెండు మూడు నెలలు ఇక్కడే మనింట్లో తపస్సులో ఉంటాను. కొన్ని నెలలు అమెరికా వెళ్తాను. అక్కడి ఆశ్రమాన్నీ శిష్యులనీ చూచుకోవాలి. కొన్నాళ్లపాటు ఇండియాలోని మా ఆశ్రమంలో ఉంటాను. మిగతా సమయమంతా, కొన్ని క్షేత్రాలలో ఉంటూ తపస్సు చెయ్యాలి. ఇదీ నా ప్లాన్' అంటూ లేచి, 'నమస్తే, మళ్ళీ కలుద్దాం' అంటూ సెలవు తీసుకున్నాను.

బయటకొస్తుండగా భాస్కర్ కన్పించాడు.

'అయితే, మార్షల్ ఆర్ట్ షార్ట్ ఫిలిం చూచారన్నమాట' అన్నాను.

'అవును. చాలా  బాగుంది' అన్నాడు.

'అందులో మీరు చూచినది ఒక శాతం మాత్రమే. అందులో నావి చాలా షాట్స్ కట్ అయిపోయాయి. అసలైన నా టెక్నిక్స్ ని 2022 తర్వాత రాబోయే ఫిలిమ్స్ లో చూద్దురుగాని' అన్నాను.

'ఎదురుచూస్తుంటాము' అన్నాడు భాస్కర్.

చిరునవ్వుతో మా ఇంటివైపు దారితీశాను. మూర్తీ, సురేషూ మౌనంగా అనుసరించారు.