నిత్యజీవితంలో ప్రతిఫలించని జ్ఞానం నిరర్ధకం

18, నవంబర్ 2021, గురువారం

జిల్లెళ్ళమూడి స్మృతులు - 45 (మహనీయుల మాటలలోని గూఢార్ధాలు - కర్మనియమం)

వెనుకకు తిరిగి వస్తుండగా మూర్తి ఇలా అన్నాడు.

'మీరు ఆయనతో అలా మాట్లాడుతుంటే చాలా సంతోషం వేసింది గురువుగారు. ఊరకే అలా మీ ఇద్దరినీ చూస్తూ ఉండాలనిపించింది. ఇలాంటి సన్నివేశాలలో పాత్రధారులమైనందుకు మేం అదృష్టవంతులం'

'అది నిజమే. జరుగుతూ ఉన్నపుడే, వారి అదృష్టాన్ని అర్ధం చేసుకునేవారు చాలా తక్కువమంది ఉంటారు. చాలామంది, జరిగిపోయిన తర్వాత ఎప్పుడో వెనక్కు తిరిగి చూచుకొని, 'ఆ సమయంలో మేమూ ఉన్నాం' అని సంతోషపడేవాళ్ళుంటారు. చాలామందికి ఇదే జరుగుతుంది. కానీ అతి కొద్దిమంది మాత్రమే, జీవితం జరుగుతున్నప్పుడే దాని విలువను తెలుసుకుని ఆనందించే వాళ్ళుంటారు. వారి సంఖ్య ఎప్పుడూ తక్కువగానే ఉంటుంది. మొదటివారు గుర్తించలేకపోవడానికి కారణం వారి అహంకారం. అది వాళ్ళ కళ్ళకు పొరలను కమ్మిస్తుంది. జరుగుతున్న దానిని సకాలంలో గుర్తించి, దానిని నిలుపుకోగలిగినవాడే లౌకికంలోనైనా, ఆధ్యాత్మికంలోనైనా అసలైన అదృష్టవంతుడు' అన్నాను. 

సంభాషణను కొనసాగిస్తూ, 'ఇందాక దినకర్ గారు అన్నారు చూడు, 'అమ్మ నాతోనే ఇలా అన్నది "డబ్బు వచ్చేసరికి నేనుండను నాన్నా" అని. ఎందుకలా జరుగుతుందో తెలుసా? ఈ లోకంలో, విత్తనం వేసేవాడొకడు, పంటను తినేవాడొకడు, విత్తేవాడు తినడు, తినేవాడు విత్తడు. ఇదింతే, కర్మనియమం ఎప్పుడూ ఇలాగే ఉంటుంది' అని అంటుండగా ఈ క్రింది పద్యం ఆశువుగా మనసులో ఉద్భవించింది.


ఆ || విత్తువారలొకరు వినియోగమొకరికౌ

పంట నేర్పుగాదె పరమబోధ

కర్మనియమమిద్ది; కనరాదు వినరాదు 

చూచి; తెలియువాఁడె సూక్ష్మజ్ఞాని


అయితే, ఈ పద్యాన్ని బయటకు చెప్పకుండా మనసులోనే ఒక మూలన నిక్షిప్తం చేసి, మాటలను కొనసాగించాను.

'మహనీయులు, వారి కాలానికి చాలా ముందుంటారు. వారు చెప్పేవాటిని సరిగ్గా అర్ధం చేసుకోవడమే వారి కాలపు మనుషులకు వీలు కాదు. ఇక ఆచరించడం మాట దేవుడెరుగు. వాటిని అర్ధం చేసుకునే లోపు, ఆ మహనీయులు మాయమైపోతారు. తరువాతి తరంవారు, వారి ఫోటోలు పెట్టుకుని పూజలు చేస్తూ ఉంటారు. లోకం తీరింతే. ఇదెప్పటికీ మారదు. అందుకే అమ్మగారు ఆ మాటన్నారు.  నిజానికి, అమ్మ ఉన్న కాలంలో డబ్బున్నవాళ్ళు లేరా? బ్లాక్ మనీ కుప్పలు తెప్పలు గా ఉంది. కానీ, ఎవడూ ఇవ్వలేదు. వివేకానందస్వామి ఒక బిచ్చగాడిగా మన దేశంలో పదేళ్లు తిరిగారు. అప్పట్లో 500 పైగా రాజ్యాలున్నాయి, సంస్థానాలున్నాయి. రాజులున్నారు. డబ్బు కోసం ఆయన అమెరికా వెళ్లి వేదాంత ప్రచారం చేయవలసిన ఖర్మ ఏముంది? ఎన్ని కష్టాలు పడ్డారాయన? ఆ విధంగా సంపాదించిన డబ్బుతో బేలూర్ మఠం స్థలాన్ని కొని, మఠాన్ని స్థాపించారాయన. దాని నీడన ఎన్ని లక్షలమంది  సేద తీరుతున్నారిప్పుడు? ఆయన పడిన కష్టమే ఇప్పటివారికి సుఖమైంది. 

అదే విధంగా, జిల్లెళ్ళమూడి అమ్మగారు పోయినప్పుడు, అందరూ ఈ ప్రదేశాన్ని వదిలిపెట్టి వెళ్లిపోయారు.  భక్తులందరూ స్వార్ధపరులే కదా ! వేరే వేరే గురువుల పంచన చేరారు. ఎవడి పబ్బం ఎక్కడ గడుస్తుందనుకుంటే అక్కడకు చేరారు. ఇరవై ఏళ్ల పాటు జిల్లెళ్ళమూడి నిర్మానుష్యమైపోయింది. ఆ ఎడారి సమయంలో ఇక్కడే అంటిపెట్టుకుని దినకర్ గారు, వసుంధర గారు మొదలైనవాళ్ళు కొంతమంది ఉన్నారు చూడు. వాళ్ళు, అసలైన భక్తులు. అలాంటి పరిస్థితిలో కూడా, అమ్మ మీద వాళ్ళ విశ్వాసం ఏమాత్రమూ సడలలేదు. అదీ అసలైన విశ్వాసమంటే ! అదీ అసలైన భక్తంటే ! ఈ ఒక్క కారణం వల్లనే నేను వీరిని గౌరవిస్తాను. వీళ్ళు అమ్మతో కలసి జీవించారని నేను వీళ్ళను గౌరవించను. వీళ్ళ అచంచలమైన విశ్వాసం, నమ్మకం నన్ను కదిలిస్తాయి'

దినకర్ గారు ఇందాక మాట్లాడుతూ ఇంకొక మాటన్నారు. 'అమ్మ ఉన్నపుడు మా దగ్గర డబ్బుల్లేవు. అమ్మ, తన నగలు అమ్మి, అన్నపూర్ణాలయంలో అన్నదానం నడిపింది' అని. అలాంటి తల్లులు ఇప్పుడెవరున్నారు? తన నగలు అమ్మి లోకులకు అన్నం పెట్టింది అమ్మ. ఎంతటి నిస్వార్ధపూరితమైన, ప్రేమమయమైన హృదయం అమ్మది !  అలాంటి మనుషులు అసలుంటారా ఎక్కడైనా? అమ్మ పోయిన తర్వాత ఎన్నో ఏళ్ళు జిల్లెళ్ళమూడి ఆశ్రమం అప్పులలో ఉన్నది. అప్పులు చేసి ఆశ్రమాన్ని నడిపిస్తూ వచ్చారు. తర్వాత దాదాపుగా 36 ఏళ్లకు, ఇప్పుటికి, కొద్దిగా నిలకడ వచ్చింది. ఎందుకలా జరుగుతుంది? నిజంగా మన దగ్గర డబ్బుల్లేవా? ఇండియన్స్ కున్న స్విస్ బ్యాంక్ ఎకౌంట్ల మీద వికీలీక్స్ లిస్టు చూచావా? ఆ లక్షలాది కోట్ల రూపాయల డబ్బంతా ఎవరిదీ? ఎక్కడిదీ? ఎవడి దగ్గర దోచుకున్నదా సొమ్ము? మానవజాతి ఖర్మ ఇంతే. ఇదెప్పటికీ మారేది కాదు.'

'మహనీయులకు మన డబ్బులెందుకు? వారు మనకు వెలుగును చూపడం కోసం వస్తారు. వెళతారు. మన డబ్బులను మనమే తింటాం. వారికక్కర్లేదు. వారి మాటలను తేలికగా తీసుకోకూడదు. వారు చాలా మామూలు మాటలనే  మాట్లాడినట్లు ఉంటారు గాని, వాటిలో చాలా లోతైన గూఢార్ధాలుంటాయి. అమ్మ చెప్పిన మాటకు ఇంకొక అర్ధం కూడా ఉంది. 'డబ్బు' అంటే జ్ఞానం అని అర్ధం. 'ఇక్కడ డబ్బు చేరేసరికి నేనుండను నాన్నా' అంటే, 'మీకందరికీ జ్ఞానం వచ్చేసరికి నేనుండను' అని అసలైన అర్ధం, ఎందుకలా? అమ్మ చెప్పిన అత్యున్నత సత్యాలను, అనుభవపూర్వకంగా తెలుసుకోవాలంటే ఎన్నో ఏళ్ళు పడుతుంది, ఎన్నో జన్మలే పట్టవచ్చు.  అది అంతరిక సాధనామార్గం. ఊరకే బుర్రతో అర్ధం చేసుకునే విషయాలు కావివి.  సాధనామార్గంలో నడచి, నలిగి, పరిణతి చెంది, వాటిని అనుభవంలో తెలుసుకోవాలి. దానినే సాక్షాత్కారం అంటారు. ఆధ్యాత్మిక మార్గంలో కావలసింది 'అర్ధం చేసుకోవడం' కాదు, 'సాక్షాత్కారాన్ని పొందటం'. కొద్దిగా తెలివి తేటలున్నవాడికి కూడా తత్త్వం అర్ధమౌతుంది, విషయం అర్ధమౌతుంది. కానీ అది ఏమూలకూ సరిపోదు. కావలసింది 'సాక్షాత్కారం'.

'ఎప్పుడైనా, ఏ మహనీయుడి భక్తులకైనా ఇదే జరుగుతుంది. ఇది కర్మనియమం. నక్షత్రాల లోకం నుండి  కొందరు ఇక్కడికి వస్తారు. 'అవిగో నక్షత్రాలు' అని మనకు చూపిస్తారు. మనం వాటిని చూస్తూ, 'ఇవేనా నక్షత్రాలు' అని అర్ధం చేసుకునే లోపే వాళ్ళు వెళ్ళిపోతారు. ఆ తరువాత, మనం వాటిని చేరుకునే ప్రయత్నం మొదలు పెట్టాలి. అప్పటికి వాళ్ళు మనతో ఉండరు. వాళ్ళ జ్ఞాపకాలు మాత్రమే మనతో మిగులుతాయి. భూమి పుట్టిన నాటినుండీ ఇది ఇలాగే జరుగుతూ వస్తున్నది.  రేపు మీకైనా ఇదే జరుగుతుంది. ఇదే కర్మనియమం' అన్నాను.

మాటల్లోనే ఇంటి దగ్గరకు చేరుకున్నాం.

అదే రోజు రాత్రికి అక్కడనుంచి బయల్దేరి మర్నాడు పొద్దున్నకి హైద్రాబాద్ వచ్చేశాను.

(ఇంకా ఉంది)