Pages - Menu

Pages

1, నవంబర్ 2021, సోమవారం

యురేనస్ సూర్యుల సమసప్తక యోగం - ప్రభావాలు


యురేనస్ - సూర్యుల మధ్యన ఏర్పడుతున్న సమసప్తకదృష్టి వల్ల ప్రస్తుతం అనేక మార్పులు ప్రపంచవ్యాప్తంగా జనజీవనంలో చోటు చేసుకుంటున్నాయి. వాటిలో కొన్నింటిని గమనిద్దాం.


జపాన్ మెట్రో రైల్లో కత్తిపోట్లు


పాశ్చాత్యసంస్కృతిలో ఉన్న దరిద్రపు పండగలు ఆసియాలో కూడా ప్రవేశించి జరుపుకోబడుతున్నాయి. మితిమీరిన డబ్బే దీనికి కారణం. అలాంటి ఒకానొక పండుగైన, హాలోవీన్ అనే దరిద్రపు పాశ్చాత్య పండుగ సందర్భంగా, జపాన్ లో మెట్రో రైల్లో, జోకర్ లాగా వేషం వేసుకున్న ఒకడు 17 మందిని కత్తితో పొడిచిపారేశాడు. 'ఎందుకురా ఇలా చేశావ్?' అంటే, 'నాకు చచ్చిపోవాలనుంది. ఇలా చేస్తే, పట్టుకుని చంపేస్తారని ఇలా చేశాన' ని చల్లగా సమాధానం చెబుతున్నాడు.

మనుషుల తలకాయలలో యురేనస్ పుట్టించే పెడబుద్ధులు ఇలా ఉంటాయి. తులారాశి చరరాశి కావడమూ, అక్కడే హింసకు కారకుడైన కుజుడు ఉండటం వల్ల, నడుస్తున్న రైల్లో ఈ హింసాత్మక సంఘటన జరిగింది.


బ్రిటన్ లో గుద్దుకున్న రైళ్లు


నైరృతి బ్రిటన్ లోని శాలిస్ బరీ టౌన్ లోని సొరంగంలో రెండు రైళ్లు గుద్దుకుని చాలామంది గాయపడ్డారు. అయితే, ఎవరూ చనిపోలేదని అంటున్నారు. బహుశా, ACD వంటి నవీన బోగీ టెక్నాలజీ దీనికి కారణం కావచ్చు. హఠాత్ ప్రమాదాలకు యురేనస్ కారకుడనీ, ఆయన ప్రస్తుతం, బ్రిటన్ ను సూచించే మేషరాశిలో ఉన్నాడనీ గుర్తుంటే, ఇదెందుకు జరిగిందో తెలుస్తుంది.

ఇప్పుడు ఇండియావైపు దృష్టి సారిద్దాం.

పునీత్ రాజకుమార్ మరణం

కన్నడ నటుడు రాజ్ కుమార్ తనయుడైన పునీత్ 46 ఏళ్లకే కార్డియాక్ అరెస్ట్ తో కన్నుమూశాడు. యురేనస్ హఠాత్ సంఘటనలకు కారకుడు. సూర్యుడు తులారాశిలో నీచస్థితిలో ఉంటూ, ప్రముఖులకు పడుతున్న నీచస్థితిని సూచిస్తున్నాడు. సూర్యుడు గుండె పనితీరుకు, సెలబ్రిటీలకు సూచకుడు. సెలబ్రిటీలను, ముఖ్యంగా సినిమా నటులను సూచించే తులా రాశిలో ప్రస్తుతం ఉన్నాడు. ఇవన్నీ కలుపుకుని చూడండి, అతిగా చేసిన వ్యాయామాల ఫలితంగా పునీత్ ఎందుకు చనిపోయాడో అర్ధమౌతుంది.

ఆఫ్కోర్స్. తల్లిదండ్రులు చనిపోయినట్లే వారి పిల్లలు కూడా చాలావరకూ చనిపోతూ ఉంటారు. ఇది జీన్ కోడ్ ప్రకారం జరిగే ఒక విచిత్రం. రాజ్ కుమార్ కూడా ఇదే విధంగా వ్యాయామం చేసిన రెండు గంటలకు, ఊరకే సోఫాలో కూచున్నవాడు కూచున్నట్లే హార్ట్ ఎటాక్ తో చనిపోయాడు. ఇప్పుడు, పునీత్ కూడా అదే విధంగా చనిపోయాడు. ఈ విషయాన్ని వాళ్ళ ఫెమిలీ డాక్టర్ స్వయంగా చెప్పాడు.

ఈ సందర్భంగా కొన్ని విషయాలను చెప్పదలచుకున్నాను.

గత 40 ఏళ్లుగా నేను రకరకాల మార్షల్ ఆర్ట్స్ అభ్యాసం చేస్తున్నాను. 35 ఏళ్ల క్రితమే నేను కరాటే స్కూల్స్ నడిపాను. చిన్నప్పటినుంచీ యోగాభ్యాసం నాకు అలవాటుంది.  అందుకని, ఈ విషయాలమీద అధికారికంగా నేను మాట్లాడగలను.

సరిగ్గా చెయ్యకపోతే, వ్యాయామం కూడా ప్రాణం తీస్తుంది. అందులోనూ 40 దాటాక అందరూ అన్ని రకాల వ్యాయామాలూ చెయ్యకూడదు.  జిమ్ వ్యాయామాలు అస్సలు మంచివి కావు. మన యోగాభ్యాసం మరియు గ్రౌండ్ ఎక్సర్ సైజులే మంచివి. వెయిట్ లిఫ్టింగ్, బాక్సింగ్ లు మంచివి కావు.  అవి ఖచ్చితంగా గుండెను దెబ్బతీస్తాయి. ఇలా దెబ్బతిన్నవాళ్లను గత 40 ఏళ్లలో ఎంతో మందిని నేను చూచాను. 1990 లలో నా ఫ్రెండ్స్ లోనే కొందరు బాడీ బిల్డర్లు, బాక్సర్లు హార్ట్ సమస్యలకు గురయ్యారు. వారిలో ఒకరికి హార్ట్ ఎన్లార్జ్ అయింది. ఇంకొకరికి హార్ట్ వాల్వులు దెబ్బతిన్నాయి. ఈ విషయాలు నేటి జిమ్ ట్రెయినర్లకు ఎంతమాత్రం తెలీవు. డబ్బుకోసం వాళ్ళు నానామాటలు చెబుతారు. నానా మాంసాలు తినమంటారు. ఎక్కడలేని వ్యాయామాలు చెయ్యమంటారు. ఏమీ పరవాలేదంటారు. వాటిని విని సెలబ్రిటీలు, సినిమానటులు దెబ్బ తింటున్నారు. దురదృష్టవశాత్తూ, నేటి యువతలో కండలమీద మోజు చాలా ఎక్కువగా ఉంది. ఇది చాలా పొరపాటు. ఈ చెడు సంస్కృతిని సినిమాలు పెంచి పోషిస్తున్నాయి. అమ్మాయిలముందు కండలు ప్రదర్శించడం పెద్ద గొప్ప విషయం కాదు. అలాంటి చీప్ ట్రిక్స్ వల్ల ఏమీ ఉపయోగం ఉండదు. పైగా, ఆ కండల కోసం నానా చెత్తా తింటారు. అవి రక్తనాళాలలో అడ్డుగా ఏర్పడి  హార్ట్ ఎటాక్స్ కు కారణమౌతాయి.

జిమ్ అనేది వెస్ట్రన్ విధానం. దానికి మూలాలు గ్రీకు - రోమన్ కల్చర్ లో ఉన్నాయి. లాంగ్ రన్ లో అది మంచిది కాదు. యోగాభ్యాసం, వీరవిద్యలు  మన భారతీయ విధానాలు.  వీటిని పాటిస్తే నూరేళ్లయినా ఫిట్ గా, ఆరోగ్యంగా ఉండవచ్చు. నేటి యువత ఈ విషయాన్ని తెలుసుకోవాలి. మాంసాలు తింటూ, జిమ్ చేస్తూ కండలు పెంచితే చాలన్న భ్రమనుండి ఎంత త్వరగా బయటపడితే యువతకు అంత మంచిది.

ఆరోగ్యానికీ కండలకూ ఎలాంటి సంబంధమూ లేదని గ్రహించండి. జిమ్ములు చెయ్యకండి. ఒళ్ళు గుల్లచేసుకోకండి. గుండెజబ్బులకు గురికాకండి. అదే విధంగా, జీరో సైజు అంటూ, అమ్మాయిలు రోజుల తరబడి ఉపవాసాలు చేస్తుంటారు. ఇది చాలా ప్రమాదం. వారి ఆరోగ్యాలు కోలుకోలేని విధంగా దెబ్బతింటాయి. మితిమీరిన వ్యాయామాలు ఎంత ప్రమాదమో, మితిమీరిన ఉపవాసాలూ అంతే ప్రమాదం. ఈ మాటను మళ్ళీ మళ్ళీ చెబుతున్నాను.

కేరళ అందగత్తెల మరణం

2019 మిస్ కేరళ అంసి కబీర్, రన్నరప్ అంజనాలు నిన్న రాత్రి ఎర్నాకులం లో జరిగిన రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. ఈ హఠాత్ సంఘటన కూడా యురేనస్ - సూర్యుల సమసప్తక ప్రభావమే. జపాన్లో, డుస్తున్న రైల్లో దుర్ఘటన జరిగితే, వీరి కేసులో, వేగంగా నడుస్తున్న కారు బోల్తా కొట్టి, వీరిద్దరూ స్పాట్లో చనిపోయారు. రెండూ, రవాణా వాహనాలు కావడం తులారాశి యొక్క చరకారకత్వపు ప్రభావం.

ఇలా వ్రాస్తూ పోతే, అంతర్జాతీయ, జాతీయ, వ్యక్తిగతరంగాలలో లెక్కలేనన్ని సంఘటనలున్నాయి. మచ్చుకి ఈ నాలుగింటిని వ్రాస్తున్నాను. ఈ గ్రహయోగం ఇంకొక వారంపాటు ఉంటుంది. కనుక, ఈ లోపల ప్రముఖులకు, సినిమా సెలబ్రిటీలకు సంబంధించిన ఎన్నో ఇలాంటి సంఘటనలు జరుగబోతున్నాయి. వేచి చూడండి.