“అసమర్ధజాతికి ఆత్మగౌరవ అర్హత ఉండదు"

2, నవంబర్ 2021, మంగళవారం

రాజ్ కుమార్ - పునీత్ ల జాతకాలలో న్యూమరాలజీ పాత్ర

నేను భారతీయ సంఖ్యాశాస్త్రాన్ని (ఇండియన్ న్యూమరాలజీ) ని అనుసరిస్తాను. ABCD లకు అంకెలకూ ముడిపెట్టే పాశ్చాత్య న్యూమరాలజీని నేను ఒప్పుకోను. అది పూర్తిగా తర్కవిరుద్ధమైన పద్ధతి. దానిని బట్టి పేర్లు మార్చుకుని కొన్ని ఎక్కువ అక్షరాలు కలిపేవారిని చూస్తే నాకు భలే నవ్వొస్తూ ఉంటుంది. అలా మార్చుకొమ్మని ఉపాయాలు చెప్పే న్యూమరాలజిస్ట్ లను చూస్తే జాలి కలుగుతూ ఉంటుంది. ఎందుకంటే, అసలైన భారతీయ విజ్ఞానాన్ని వదిలేసి కుహనా పద్ధతులను వారు అనుసరిస్తున్నారు గనుక !

జాతకాన్ని బట్టి ఒక వంశపు జాతకాలలో పోలికలను, జీన్ కోడ్ ను, కర్మ మ్యాప్ ను కనుక్కున్నట్లే, సంఖ్యాశాస్త్రాన్ని బట్టి కూడా కనుక్కోవచ్చు. ఉదాహరణకు, రాజ్ కుమార్, పునీత్ రాజ్ కుమార్ ల జననతేదీలు గమనిద్దాం.

రాజ్ కుమార్

24-04-1929

2, 4 అంకెలు మళ్ళీ మళ్ళీ రావడాన్ని గమనించండి. ఇవి రాహు, కేతువులకు సూచికలు. ఆ తరువాత 1,9 వచ్చాయి. ఇవి సూర్య చంద్రులకు సూచికలు. ఇప్పుడు ఈయన జాతకాన్ని గమనించండి. సూర్యుడు రాహువుతోనూ, చంద్రుడు కేతువుతోనూ కలిసి ఉన్నారు. లెక్క సరిపోయిందా మరి? ఇది గ్రహణయోగం.

ఈ అంకెలను ఒక మెట్టు క్రిందకు కుదించుదాం.

6-4-3

ఇవి, కుజుడు, కేతువు, గురువులకు సూచికలు. ఈయన జాతకంలో, కుజ కేతువులకు పరస్పర దృష్టి ఉన్నది. కేతు, గురువులకు పరస్పర దృష్టి ఉన్నది. వీటి అర్ధాలను ప్రస్తుతం వివరించబోవడం లేదు. కొన్ని క్రమబద్ధమైన అమరికలను స్పష్టంగా మీకు అర్ధమయ్యేలా చెయ్యడమే ప్రస్తుతం నా ఉద్దేశ్యం.

ఇప్పుడు ఇంకొక మెట్టు క్రిందకు కుదిద్దాం.

4

ఇది కేతువుకు సూచిక. ఆ కేతువు చంద్రునితో కలసి ఉంటూ గుండెకు రక్తప్రసరణ ఆగిపోవడాన్ని, దానిద్వారా మరణాన్ని సూచిస్తున్నాడు.

ఇప్పుడు పునీత్ రాజ్ కుమార్ జనన తేదీని గమనిద్దాం.

17-03-1975

దీనిలో 1, 7 అంకెలు రెండుసార్లు వచ్చాయి. అంటే, సూర్యుడు, శుక్రులకు ఈ జాతకంలో ప్రాముఖ్యత ఉన్నది. 3, 9 ఒకదానికొకటి శ్రుతిలో ఉన్న అంకెలు (3 X 3 =9). అంటే, ఈ జాతకంలో గురువు, శుక్రుడు శ్రుతిలో ఉన్నారు.  జాతకాన్ని గమనించండి. గురువు సూర్యునితోనూ, శుక్రుడు చంద్రునితోనూ కలసి ఉన్నారు. సూర్యచంద్రులిద్దరూ జాతకానికి వెలుగునిచ్చే గ్రహాలూ. వీరు తండ్రి, తల్లిని సూచిస్తారు.  పోతే, జననతేదీలో విడిగా ఉన్న అంకె 5 ఒక్కటే. ఇది బుధునికి సూచిక. జాతకంలో, బుధుడు శనిక్షేత్రంలో ఉంటూ డిప్రెషన్ ను, కుంభంలో ఉంటూ సోషల్ సర్వీస్ మైండ్ ను సూచిస్తున్నాడు. ఇతని కళ్ళను దానం చేయడం వలన, ప్రస్తుతం నలుగురికి చూపు వచ్చిందని చెబుతున్నారు. లెక్క సరిపోయిందా మరి?

మరొక్క మెట్టు క్రిందకు వెళదాం.

8-3-4

శని - గురువు - కేతువు. 4, 8 ఒకదానితో ఒకటి శ్రుతిలో ఉన్నాయి (4x 2=8). ఇది మంచి సూచన కాదు. అర్ధాంతర మరణానికి సూచన.

మరొక్క మెట్టు క్రిందకు వెళదాం.

6

ఇది కుజునికి సూచిక. గుండెను సూచించే చతుర్దంలో మారకుడైన కుజుడు ఉచ్ఛస్థితిలో ఉండటం వల్ల గుండెపోటుతో చనిపోతాడని జననతేదీ మూలసంఖ్యని బట్టి స్పష్టంగా తెలుస్తున్నది.

రెండు జాతకాలలోనూ కేతువు పాత్ర స్పష్టంగా ఉంది. అదే విధంగా ఇద్దరి జననతేదీలలోనూ 4 అంకె మళ్ళీ మళ్ళీ వచ్చింది. సరిపోయిందా లేదా?

ఇప్పుడు మీకొక అనుమానం రావాలి. అదేంటండి? ఇంగిలీషు జననతేదీలు తీసుకుని భారతీయ సంఖ్యాశాస్త్రాన్ని వివరిస్తున్నారు అని. ఇది సరియైన సందేహం ! అసలూ, భారతీయ సంఖ్యాశాస్త్రం ఇది కాదు. ఇది సంకరవిధానం. ఇప్పుడు అసలైన విధానాన్ని వివరిస్తాను వినండి.

మన హిందూ సంఖ్యాశాస్త్రం ప్రకారం సంవత్సరం, నెల, తిధి, వారాలను తీసుకుంటే అది అసలైన జననతేదీ అవుతుంది. దానిప్రకారం చూద్దాం.

రాజ్ కుమార్

24 - 4 - 1929

శుక్ల - చైత్ర - కృష్ణ పాడ్యమి - బుధవారం

3 - 1 - 7 - 4

గురువు - సూర్యుడు - శుక్రుడు - కేతువు

ఉచ్ఛసూర్యునితో కలసిన గురువు వల్ల గొప్ప పేరు ప్రఖ్యాతులు, డబ్బు, అధికారం కలిగాయి. శుక్రుని ఉచ్ఛస్థితివల్ల విలాసజీవితం, కేతువు వల్ల జీవితంలో అకస్మాత్హు మార్పులు కలిగాయి.

ఈ నాలుగంకెలనూ కలుపుదాం.

6

6 అంటే కుజుడు. శని కుజుల దృష్టివల్లా, వారి షష్టాష్టక స్థితివల్లా, అతిశ్రమ (వ్యాయామం) అనేది మరణానికి దారి అవుతుందని సూచన ఉన్నది.

పునీత్ రాజ్ కుమార్

17-03-1975

ఆనంద - ఫాల్గుణ - శుక్ల చతుర్థి - సోమవారం

48 - 12 - 4 - 2

3- 3 - 4 - 2

గురువు - గురువు - కేతువు - రాహువు

సూర్యునితో స్వస్థానంలో ఉన్న గురువు వల్ల తండ్రిలాగానే ప్రజాదరణ, గొప్పపేరు, సంపదలు కలిగాయి. అయితే, గురువు నుంచి తృతీయ (ఆయుష్షు), నవమ (భాగ్య) స్థానాలలో నీచస్థితులలో ఉన్న కేతు రాహువుల వల్ల, గురువు ఇస్తున్న యోగం భంగమైపోయి, అర్ధాయుష్కునిగా మరణించాడు.

మరొక్క మెట్టు క్రిందకు వెళదాం.

3

గురువుకు పైన చెప్పిన ఫలితమే వర్తిస్తుంది.

ఈ విధంగా, భారతీయ విధానంలో సంఖ్యాశాస్త్రాన్ని ఉపయోగించడం జరుగుతుంది. దీనిని బట్టి కూడా, స్థూలంగా జాతకుని జీవనశైలిని, అదృష్టాన్ని, మంచీ చెడులను, మరణాన్ని అంచనా వేయవచ్చు.

ఈ జాతకాలలో చూస్తే, తండ్రీ కొడుకుల ఇద్దరి జాతకాలలోనూ, అదృష్టం, సంపద, కీర్తి అన్నీ ఒకే రకంగా ఉన్నప్పటికీ, మరణ కారణం కూడా ఒక్కటే అయి ఉండటం కనిపిస్తుంది. ఈ విధంగా, జీన్ కోడ్ అనేది, కర్మ అనేది, జాతకాలలోనూ, జనన తేదీలలోనూ ఒక వంశంలోని అన్ని జాతకాలలో  తరతరాలుగా నడుస్తూ ఉంటుంది. ఒళ్ళు దగ్గర పెట్టుకుని బుద్ధిగా బ్రతికితే ఇది  బాగవుతుంది, అహంకారంతో చెడగొట్టుకుంటే తరం నుంచి మరొక తరానికి దిగజారిపోతుంది. ఈ విధంగా కర్మచక్రం నడుస్తూ మనిషి జీవితాన్ని నడుపుతూ ఉంటుంది.