“అసమర్ధజాతికి ఆత్మగౌరవ అర్హత ఉండదు"

3, డిసెంబర్ 2021, శుక్రవారం

'వెలుగు దారులు' ఈ బుక్ విడుదలైంది

'వెలుగు దారులు' ఈ బుక్ నేడు విడుదలైంది.

తెలుగుభాష మాత్రమే తెలిసినవారికి, లేదా, పుస్తకాలను తెలుగులో మాత్రమే చదవడానికి ఇష్టపడేవారికి, తెలుగులోకపు ఆధ్యాత్మిక జిజ్ఞాసువులకు  పాఠకులకు, 'వెలుగుదారులు' అనే ఈ పుస్తకం చేతికందడం ఒక గొప్ప అదృష్టమని సగర్వంగా చెబుతున్నాను. ఎందుకంటే, వేలాది గ్రంధాలలో ఉన్న ఆధ్యాత్మిక మార్గాల సారాన్నంతా ఈ పుస్తకంలో ఒక్కచోటనే మీరు చూడవచ్చు. దీనిలో 360 టాపిక్స్, 1278 పేజీలు ఉన్నాయి.

జూలై 13 2021 న 'MUSINGS' ఇంగ్లీష్ ఈ బుక్ ను విడుదల చేసినపుడు, దాని తెలుగు అనువాదంగా 'వెలుగు దారులు' అనే పుస్తకాన్ని జూలై 2022 లో విడుదల చేస్తామని అన్నాను. ఆ రోజునుంచీ ఆ పుస్తకంలోని ఇంగ్లీషు  వ్యాసాలను తెలుగులోకి అనువాదం చేసే పనిని యుద్ధప్రాతిపదికన స్వీకరించారు తొమ్మిదిమంది నా శిష్యులు. అలుపు సొలుపూ లేకుండా పనిచెయ్యడంలోనూ, పుస్తకాలను వ్రాయడం లోనూ నేనే అనుకుంటే, వీరందరూ నన్ను మించిపోయారు. ఏడాది పడుతుందనుకున్న పనిని మూడు నెలలలో పూర్తి చేసిపారేసి, నవంబర్ కల్లా 'వెలుగు దారులు' పుస్తకాన్ని సిద్ధం చేశారు. అందుకే, వెలుగులను విరజిమ్ముతున్న ఈ గ్రంధాన్ని ఈరోజున 'ఈ బుక్' గా విడుదల చేస్తున్నాం.

ప్రస్తుతానికి ఆశ్రమం మా మొదటి ప్రాధాన్యత గనుక, పుస్తకాల ప్రింటింగ్ పనిని ఆపాము. ఆశ్రమం సాకారమైన తర్వాత, వరుసగా అన్ని పుస్తకాలనూ మళ్ళీ ప్రింట్ చేసే పని మొదలౌతుంది. అప్పుడిది ప్రింట్ పుస్తకంగా వస్తుంది. వచ్చే ఏడాది నుంచీ విజయవాడ, హైదరాబాద్ బుక్ ఎక్జిబిషన్ లలో పెట్టబోయే మా స్టాల్ లో 'పంచవటి' పుస్తకాలన్నీ మీకు దొరుకుతాయి.

ఈ అనువాదాన్ని ఒక రాధనగా భావిస్తూ, ఎంతో భక్తితో, శ్రద్హతో, పట్టుదలతో, 360 వ్యాసాలనూ చక్కని తెలుగులోకి అనువాదం చేసిన నా శిష్యులు, సురేష్ బాబు కదిరి, స్నేహలతారెడ్డి, శ్రీరామమూర్తి, శ్రీభార్గవి, గణేష్ ఆళ్ళ, రంగనాధ్ దరూరి, గిరీష్ సూరపనేని, DVR ప్రసాద్, శ్రీనివాస్ నూకలగార్లకు నా కృతజ్ఞతలను ఆశీస్సులను తెలియజేస్తున్నాను. వీరందరూ వారివారి ఉద్యోగాలు, వృత్తులలో ఎంతో బిజీగా ఉన్న వ్యక్తులు. తీరికసమయం దొరకని వాళ్ళు. వారివారి సమస్యలంటూ వారికెన్నో ఉన్నాయి. కానీ, వారి బిజీ జీవితంలో కూడా ఎక్కువ  సమయాన్ని ఈ పనికోసం కేటాయించి, 'ఇది మన పని' అనే  అంకితభావంతో, దీక్షతో ఈ అనువాదాన్ని పూర్తి చేశారు. అందుకు వారికి ఋణపడి ఉన్నాను.

పోతే, నా పుస్తకాలన్నింటికీ ప్రూఫ్ రీడింగ్, టైప్ సెట్టింగ్ లలో నిరంతరం నాతో సమానంగా శ్రమిస్తున్న డెట్రాయిట్ సిస్టర్స్, అఖిల జంపాల, శ్రీలలితలకు ఎంతగా కృతజ్ఞతలు చెప్పినా తక్కువే అవుతుంది. ముఖ్యంగా, మేమందరం చేసినది ఒక ఎత్తైతే, అఖిల జంపాల చేసిన పని మరొక ఎత్తుగా  ఉన్నది. మేమందరం ఒక్కొక్క పనిని మాత్రమే చేశాం, కానీ, అన్నీ తనే అయి ఈ పనిని చేసింది. ఈ పుస్తకం ప్రతి పేజీలో, ప్రతి లైన్లో, తన పాత్ర ఉన్నదని చెప్పడానికి సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాను. కవర్ పేజీ డిజైన్ చేసిన నా శిష్యుడు ప్రవీణ్ కు ప్రత్యేక కృతజ్ఞతలు. నా పుస్తకాలన్నింటికీ ఎంతో చక్కని కవర్ పేజీలను అతను తయారు చేస్తున్నాడు. వీళ్ళందరూ ధన్యజీవులే. నా మార్గాన్ని స్పష్టంగా అర్ధం చేసుకుని, దానిలో నడుస్తూ, వెలుగుదారులలో శరవేగంతో పురోగమిస్తున్న వీరందరిపైనా జగన్మాత కాళి యొక్క కటాక్షం నిరంతరమూ ఉండాలని ప్రార్ధిస్తున్నాను.

నా శ్రీమతి నిరంతర సహకారం లేనిదే ఇవేవీ సాధ్యమయ్యేవి కావు. మా పుస్తకాల వెనుకా, మా కార్యక్రమాల వెనుకా తన సహాయం, సహకారం ఎంతో ఉన్నాయి. తనకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.  

ఈ పుస్తకం కూడా google play books నుండి ఇక్కడ మీకు లభిస్తుంది. ఈ పుస్తకాన్ని చదవడం ద్వారా, మా మార్గమేంటో, ఇంకా చెప్పాలంటే, అసలైన ఆధ్యాత్మికమార్గమేంటో తెలుసుకోండి. ఆ తర్వాత, మీ జీవితాలు ఎలా మార్పు చెందుతాయో మీరే గమనించండి !