ఉత్సాహభరిత పండుగ రోజులు
24-12-2021 న మా ఆశ్రమస్థలం రిజిస్ట్రేషన్ జరిగింది. ఆ రోజు మార్గశిర బహుళ పంచమి. పంచమిరోజున పంచవటికి పంచ దొరికింది. ఇది చాలా ప్రాముఖ్యత ఉన్న రోజు.
"పెట్టింది ముహూర్తం కాదు, జరిగినదే ముహూర్తం" అనేది జిల్లెళ్ళమూడి అమ్మగారి అమృతవాక్కులలో ఒకటి. అదే విధంగా, ఈ సంఘటన కూడా జరిగింది. ఇది నేననుకొని పెట్టిన ముహూర్తం కాదు. ఆ విధంగా అలా కలసి వచ్చింది. ఒక అద్భుతమైన రోజున, మేము ఊహించనిరీతిలో, శరవేగంగా ఈ రిజిస్ట్రేషన్ జరిగిపోయింది.
ఈ రోజు ప్రాముఖ్యతను వినండి మరి.
24-12-1886 న నరేన్, రాఖాల్,బాబూరామ్, తారక్, శశిభూషణ్, శరత్ మొదలైన యువకులు సన్యాసదీక్షను స్వీకరించి, వివేకానంద, బ్రహ్మానంద, ప్రేమానంద, శివానంద, రామకృష్ణానంద, శారదానంద మొదలైన సన్యాసనామాలను స్వీకరించారు. ఇది బెంగాల్లో అంతపూర్ అనే ఊరిలో జరిగింది. కామార్పుకూరు వెళ్లే దారిలో మేమీ అంతపూర్ అనే ఊరిలో ఆగి ఉపాహారం సేవించాము. అంతపూర్ అనేది ఆ విధంగా ఒక చారిత్రాత్మకమైన ఊరు. అక్కడే రామకృష్ణ మఠానికి పునాది పడింది.
సరిగ్గా 135 ఏళ్ల తర్వాత అదే డిసెంబర్ 24 తేదీన "పంచవటి ఆశ్రమస్థలం" రిజిస్ట్రేషన్ జరిగింది. మర్నాడు క్రిస్మస్, అది కూడా పవిత్రమైన రోజే. క్రీస్ట్ అంటే మాకేమీ ద్వేషం లేదు. క్రిస్టియన్స్ మనల్ని ద్వేషిస్తారు గాని, మనకు వాళ్ళన్నా, క్రీస్ట్ అన్నా వ్యతిరేకభావం ఏమీ ఉండదు. మతమార్పిడులు, హిందూదేవతలను తిట్టడాలంటే మనకు గిట్టదు గాని, క్రీస్ట్ యొక్క ఒరిజినల్ బోధనలంటే మనకిష్టమే. ఎందుకంటే, వాటికీ హిందూమతానికీ ఏ భేదమూ లేదు కాబట్టి. పైగా, క్రీస్ట్ కూడా భారతదేశం వచ్చి యోగసాధన చేసినవాడే. ఆయన నేర్చుకున్నదంతా ఇక్కడే నేర్చుకున్నాడు. హిమాలయాలలో బౌద్ధాన్ని నేర్చుకున్నాడు. కనుక ఆయనంటే మాకేమీ ద్వేషం లేదు.
ఇకపోతే, ఈరోజు శారదామాత జన్మదినం. ఇది క్రిస్మస్ కంటే ఇంకా పవిత్రమైన రోజు. ఆమెను సాక్షాత్తు కాళికాదేవిగా, శ్రీ రామకృష్ణులవారే పూజించారు. కనుక, ఇలాంటి పవిత్రమైన రోజులలో మా ఆశ్రమస్థలం రావడం చాలా శుభసూచకమని నా భావన.
కాళీకటాక్షం - శక్తి ఉపాసన
మా ఆశ్రమస్థలం వచ్చిన ఊరి గ్రామదేవత పేరు అంకమ్మతల్లి. అంకమ్మ. అంకాలమ్మ అనేవి కాళికాదేవి యొక్క గ్రామీణపేర్లు. పల్లెటూర్లలో, అంకమ్మ, అంకయ్య, అంకమ్మరావు మొదలైన పేర్లున్నవారు చాలామంది కనిపిస్తారు. ఈ పేర్లు చాలా మంచివి. శక్తిస్వరూపిణి అయిన కాళికాదేవి పేర్లవి. ఆ పేర్లను పెట్టుకున్న వాళ్ళందరూ జీవితంలో బాగా వృద్ధిలోకి రావడాన్ని నేను గతంలో చాలాసార్లు గమనించాను\. తమిళనాడులో కూడా అమ్మాయిలకు 'అంకి' 'అంకు' అనే పేర్లుంటాయి. అవికూడా అంకమ్మతల్లి పేర్లే.
మన గ్రంధాలలో ఈమెకే "చాముండి" అనే పేరుంది. ఈమెను సప్తమాతృకలలో ఒకరుగా దేవీభాగవతం వర్ణించింది. ఈమెకే మరోపేరు మహిషాసురమర్దిని. విజయవాడలోని దుర్గమ్మతల్లి మూలవిగ్రహం మహిషాసురమర్దినీ రూపంలోనే ఉంటుంది. మైసూరు చాముండీహిల్స్ లో ఉన్న అమ్మవారు ఈమెయే. అమ్మతల్లులుగా మన దేశంలోని పల్లెపట్టులలో పూజించబడేవారు నిజానికి సప్తమాతృకలే. వీరిలో కాళి, చాముండిల గ్రామీణనామమే అంకమ్మతల్లి. ఆ ఊరిలో ప్రవేశిస్తున్నపుడే, అంకమ్మతల్లి గుడి కనిపించింది. చాలా ఆనందం కలిగింది. ఈ విధంగా, ఆశ్రమస్థలంకోసం ఎక్కడెక్కడో తిరిగి, చివరకు మా ఆరాధ్యదేవత కాళికాదేవి పాదాలచెంతకే చేరాం మేము.
తాంత్రికబౌద్ధం
ఏడవ శతాబ్ద సమయంలో తాంత్రికబౌద్ధం పరిఢవిల్లిన కాలంలో ధరణికోట మొదలైన బౌద్ధక్షేత్రాలు తాంత్రికబౌద్ధానికి పట్టుకొమ్మలుగా ఉన్నాయి. చైనా వాడైన హ్యూయన్ సాంగ్ కూడా, ప్రాణాలకు తెగించి, మంచుకొండలలో ప్రయాణించి, చైనానుండి ఆంధ్రాలో ఉన్న ధరణికోటకొచ్చి ఆయా మంత్రసాధనలు నేర్చుకుని వెళ్ళాడు.
తాంత్రికబౌద్ధంలో తారాదేవి, మరీచి, లలిత, ఛిన్నముండ మొదలైన దేవతలున్నారు. వీరందరూ కాళికాదేవికి మారురూపాలే. ఈ ప్రభావంతోనే, దక్షిణాదిన పల్లెలలో అమ్మ తల్లులు వెలిశారు. ఆ విధంగా మలి వేదకాలపు శక్తి ఆరాధన, కాలగమనంలో కనుమరుగై, బౌద్ధతంత్రాలలో మళ్ళీ మొలకలెత్తి, మధ్యయుగాలలో పునరుజ్జీవింపబడిన హిందూమతంలో రకరకాల దేవీరూపాలుగా మళ్ళీ వెలుగులోకి వచ్చింది. అయితే, ఈ విషయాలు సామాన్యజనానికి తెలియవు. సామాన్యులకే కాదు, హిందువులమని చెప్పుకునే కోట్లాదిమందికి కూడా, హిందూమతం యొక్క పరిణామక్రమమూ, పతనోధ్ధానాలూ ఏవీ తెలియవు. గుడికెళ్ళి మొక్కుకోవడం తప్ప వారికేమీ తెలియదు. వారికి వారి మతం యొక్క గొప్పదనం తెలియదు కాబట్టే, మతమార్పిడులు జరుగుతున్నాయి. అమాయక హిందువులు, ఎవరేది చెబితే వాటిని నమ్ముతున్నారు. మతాలు మారుతున్నారు. ఇదొక చేదువాస్తవం.
సరే, ఆ విషయాలనలా ఉంచితే, అప్పట్లో ఒంగోలు ప్రాంతమంతా తాంత్రికబౌద్ధం విలసిల్లింది. నేటికీ ఒంగోలు సిటీకి అధిదేవత రాజరాజేశ్వరీదేవియే. అంటే, లలితాదేవి. నేను వ్రాసిన 'లలితా సహస్రనామ రహస్యార్థ ప్రదీపిక' పుస్తకాన్ని చదివినవారికి, లలితోపాసనా, శక్తి ఆరాధనా రహస్యాలూ, ఆచరణపరంగా కాకపోయినా, కనీసం బౌద్ధికంగా నైనా అర్ధమై ఉంటాయని ఆశిస్తున్నాను.
అదే ఒంగోలు దగ్గరకు, అవే పల్లెటూర్లకు ఇప్పుడు మేమొచ్చి చేరాము. మా ఆశ్రమం ఇక్కడే వస్తున్నది. బయటకు కనిపించని కర్మలింకులు ఆ విధంగా ఉంటాయి మరి !
బుద్ధునితో నా అనుబంధం
బుద్ధునితో నాకున్న అనుబంధం గురించి 'మ్యూజింగ్స్', 'వెలుగు దారులు' పుస్తకాలలో వ్రాశాను. ఆ అనుబంధం ఇప్పటిది కాదు. అనేక వందల సంవత్సరాల క్రిందటిది. అదే లేకపోతే, "ధమ్మపదం", "మహాస్మృతిప్రస్థానం" అనే నా పుస్తకాలు వెలుగు చూచేవి కావు. అవేకాదు, ముందుముందు ఇంకా ఎన్నో బౌద్ధగ్రంధాలు నా కలం నుండి వెలుగుచూడబోతున్నాయి.
రెండువేల సంవత్సరాల క్రితం కృష్ణాతీరమంతటా బౌద్ధం విలసిల్లింది. దీనికి తార్కాణంగా కృష్ణానదీ పరీవాహకప్రాంతమంతటా ఉన్న బౌద్ధారామాలు, స్థూపాల శిధిలాలే నిదర్శనాలు. కృష్ణానదికి ఒక చిన్న పాయలాంటిదైన గుండ్లకమ్మ వాగు తీరమంతటా ఒకప్పుడు బౌద్ధం విలసిల్లింది.
మా ఆశ్రమస్థలం దగ్గర్లో అంటే, రెండు కిలోమీటర్ల దూరంలోనే, వెల్లంపల్లి అనే ఊరుంది. ఇక్కడ గుండ్లకమ్మ రిజర్వాయర్ ఉంది. ఈ రిజర్వాయర్ దగ్గరనే, 1962 లో జరిగిన త్రవ్వకాలలో ఒక బౌద్ధస్థూపం బయటపడింది. ఇది సాంచీ స్థూపాన్ని పోలి ఉంటుంది. అమరావతి కంటే ఇది ప్రాచీనమైనదని అంటున్నారు. ఇక్కడనుండి దొనకొండ దగ్గరలో ఉన్న చందవరం బౌద్ధస్థూపానికి దారి ఉంది. ఇవి రెండూ, ప్రాచీనకాలంలో, అంటే రెండువేల ఏళ్ల నాడు, కాశీ, కంచిల మధ్యన ప్రయాణించే పండితులకు విడిది కేంద్రాలుగా ఉండేవి. ఈ రెండు నగరాలూ ప్రాచీనకాలంలో విద్యా, ఆధ్యాత్మిక కేంద్రాలన్నది మనకు తెలిసినదే కదా !
కనుక, వెల్లంపల్లి బౌద్ధస్తూపం ప్రక్కనే నేడు మా ఆశ్రమం వస్తున్నది. దీని వెనుక కూడా కర్మలింకులు , పూర్వజన్మ సంబంధాలు ఉన్నాయి. వివరించినా, వాటిని అర్ధం చేసుకునే స్థాయి, పాఠకులలో లేనందువల్ల, వాటిని ఇక్కడ వ్రాయడం లేదు. పైగా అటువంటి రహస్యాలను బాహాటంగా చెప్పడం సరి కూడా కాదు. మా ఆశ్రమంలో స్పిరిట్యువల్ రిట్రీట్స్ జరిగినప్పుడు మా శిష్యులకు మాత్రమే వాటిని వివరించి చెప్పడం జరుగుతుంది. వాళ్ళే వాటిని సరియైన రీతిలో అర్ధం చేసుకోగలుగుతారు.
నేను వ్రాసిన మొదటి పుస్తకాలలో ముఖ్యమైనది "తారాస్తోత్రం". ఇది భవతారిణి కాళికాదేవి మీద నేను వ్రాసిన గొప్ప తంత్రగ్రంథం. రాశిలో చిన్నదేగాని వాసిలో చాలా పెద్దది. తంత్రసాధనలో నాకున్న అనుభవమేంటో తంత్రప్రధానమైన నా పుస్తకాలను చదివినవారు, కొంతకాకపోతే కొంతైనా గ్రహించగలరని భావిస్తాను.
ఈ విధంగా మా ఆశ్రమస్థలానికి - బౌద్ధమతంతోనూ, శక్తి ఉపాసనతోనూ సూటి సంబంధాలున్నాయి. అలాంటి ప్రాచీనస్థలం లోనే మా ఆశ్రమం సాకారమౌతున్నది. అవే సాధనలు మళ్ళీ మా ఆశ్రమంలో జరుగబోతున్నాయి. చరిత్ర పునరావృతం కాబోతున్నది.
ఒక స్థలంలో మనం ఉండాలంటే, ఆ స్థలానికి మనకూ కర్మసంబంధాలుండాలి. ఒకచోట తిండి మనం తిని, అక్కడి నీరు త్రాగాలంటే ఆ స్థలానికి మనకూ ఋణానుబంధం ఉండాలి. అలాంటిదే ఈ ఆశ్రమస్థలం. మామూలు కళ్ళతో చూచేవారికి ఈ సంబంధాలు అర్ధం కావు. అవి అర్ధం కావాలంటే ఉండవలసిన దృష్టి వేరు. అదున్నపుడు, ఆ లింకులన్నీ స్పష్టంగా అర్ధమౌతాయి.
మా ఆశ్రమం గురించిన మరిన్ని వివరాలను ముందు ముందు పోస్టులలో చూడండి !