నిత్యజీవితంలో ప్రతిఫలించని జ్ఞానం నిరర్ధకం

5, డిసెంబర్ 2021, ఆదివారం

ధూమావతీ మంత్రం


దశమహావిద్యల మీద మనకున్న మోజు అంతా ఇంతా కాదు. కారణమేమంటే, వాటిని సాధన చేయడం వల్ల కష్టాలు పోతాయని, ఏవేవో లాభాలు వచ్చిపడతాయని గ్రంధాలలో వ్రాయబడి ఉన్న సమాచారమే. దానికితోడు, కొంతమంది స్వామీజీలు అదేపనిగా ఈ పోకడను ప్రజలలో పెంచి పోషిస్తున్నారు. 

ఇంతాచేస్తే, నేటి స్వామీజీలు జనాలకు నేర్పవలసింది ఏమిటి? మంత్రతంత్రాలతో చింతకాయలను ఎలా రాల్చాలి? అన్న విషయం కాదు. మనిషిగా ఎలా బ్రతకాలి? సాటి మనిషితో ఎలా ఉండాలి? అన్న విషయాలనే వారు ముందుగా వారి శిష్యులకు నేర్పాలి. విచిత్రమేమంటే, అదొక్కటి తప్ప మిగతావన్నీ నేర్పుతున్నారు. స్వార్ధంతో కుళ్లిపోతున్న నేటి జనాలేమో అలాంటి గొంతెమ్మ కోరికలనే కోరుతున్నారు.  శుద్ధమైన శిష్యులూ లేరు, శుద్ధులైన గురువులూ లేరు. కలికాలమంటే ఇదేనేమో?

మొన్నొకాయన నుంచి నాకు ఫోనొచ్చింది.

పరిచయాలు అయ్యాక, ఆయనిలా అడిగాడు.

'మీరు వ్రాసిన 'తారాస్తోత్రం' చదివాను. చాలా అద్భుతంగా ఉంది. తారాతత్వాన్ని, ఆ సాధనా విధానాన్నీ ఇంత వివరంగా  ఎవరూ వ్రాయలేదు. అది చదివి అందులో ఉన్న నంబర్ కి ఫోన్ చేస్తున్నాను. ఇది మీ నంబర్ అని నాకు తెలియదు' అన్నాడాయన.

'మీకా పుస్తకం నచ్చినందుకు సంతోషం' అన్నాను.

నా మిగతా పుస్తకాలను చదివి, బాగున్నాయని చాలామంది ఫోన్లు చేస్తుంటారు. కానీ 'తారాస్తోత్రం' గురించి అభినందించేవారు తక్కువగా ఉంటారు. తంత్రసాధన మీద ఆసక్తి ఉన్నపుడే వారు నన్ను సంప్రదించాలని భావిస్తారని నాకుతెలుసు.

'తారాదేవి గురించేనా, లేక మిగతా విద్యల గురించి కూడా వ్రాశారా?' అడిగాడాయన.

'లేదు, ప్రస్తుతానికి అదొక్కటే, మిగతావి ముందుముందు రావచ్చు' అన్నాను.

'మిగతా వాళ్ళు వ్రాసే విధానానికీ మీ విధానానికీ చాలా తేడా ఉన్నది. మిగిలినవి, రకరకాల పుస్తకాల కూర్పు లాగా ఉంటే, మీ వ్రాతలు అనుభవపూర్వకంగా ఉన్నట్లు అనిపిస్తున్నది' అన్నాడాయన.

'థాంక్స్' అన్నాను.

'ఏమీ లేదు. నేను ఫలానా గురువుగారిని అనుసరిస్తుంటాను' అన్నాడు.

'మంచిదే' అన్నాను.

'నాకు చిన్నప్పటినుంచీ ఆధ్యాత్మిక చింతన ఎక్కువ. మాది ఫలానా కులం. నాకు బాలామంత్రమంటే ఇష్టం. దానిని నాకు ఉపదేశించేవారు ఎవరున్నారా అని  వెదుకుతుంటే, మా స్వామీజీని కలిశాను. ఆయన బాలామంత్రాన్ని ఇచ్చారు. తర్వాత కొంతకాలానికి ధూమవతీ మంత్రాన్ని ఇచ్చి జపం చెయ్యమన్నారు. కానీ వివరాలేమీ చెప్పలేదు.  అందుకని, ఆ దేవత గురించి మరింత వివరంగా ఎవరైనా  వ్రాశారా అని వెదుకుతుంటే మీ 'తారాస్తోత్రం' కన్పించింది. చదివి, మీకు ఫోన్ చేశాను' అన్నాడాయన.

'సరే బాగుంది. ఇంత వెదుకులాట మీకెందుకు? మీ గురువుగారినే సూటిగా అడగవచ్చు కదా !' అన్నాను.

'ఆయన చాలా ఫేమస్. ఆయన దర్శనం అంత తేలికగా సాధ్యం కాదు. ఎప్పుడైనా  ఆయన్ను చూడ్డానికి వెళితే, కనీసం రెండువేలమంది క్యూలో ఉంటారు. సందేహాలు తీర్చుకోడానికి వీలుకాదు. అందుకే ఈ ప్రయత్నం' అన్నాడు.

నాకు నవ్వొచ్చింది.

'మరి అంత తీరిక లేనాయన, మీకు మంత్రోపదేశం చేయడమెందుకు? అలాంటాయన దగ్గర మీరు ఉపదేశం తీసుకోవడమెందుకు?' అన్నాను.

'కష్టాలు పోతాయని తీసుకున్నాను. బాలామంత్రం జపం చేసి, కొన్ని కష్టాలను తొలగించుకున్నాను. ఇప్పుడు ధూమావతీ మంత్రం చేస్తున్నాను. ఆరోగ్య  సమస్యలున్నాయి. అవి  పోవడం లేదు' అన్నాడాయన.

'మరి, మీకుపదేశం చేసిన స్వామీజీకి ఎన్నో ఏళ్ల నుంచీ డయాబెటీస్ తగ్గడం లేదెందుకని? ఆ మంత్రాలు ఆయనకు  పనిచేయవా?' అందామని అనుకున్నాను కానీ  బాధపడతాడని ఊరుకున్నాను.

'ధూమావతి గురించి మీకు తెలిస్తే ఒక మంచి పోస్ట్ వ్రాయండి' అని అడిగాడు.

మళ్ళీ నవ్వొచ్చింది.

''తినేది మొగుడి తిండి, పాడేది ఎవడిదో పాట' అన్నట్లు, మంత్రాలను పప్పుబెల్లాల మాదిరి పంచేది ఆయనానూ, దాని లోతుపాతులూ వివరాలూ చెప్పేది నేనా? దశమహావిద్యలు ఎంత చీప్ అయిపోయాయిరా దేవుడా?' అనుకున్నాను.

'నెట్లో వెదుక్కోండి. చాలా సమాచారం లభిస్తుంది. మీకు వీలైతే నా మిగతా పుస్తకాలూ చదవండి. విషయం బాగా అర్ధమౌతుంది. ఇంకా అనుమానాలు మిగిలుంటే, ఆ తర్వాత మళ్ళీ నాకు ఫోన్ చేయండి, మాట్లాడుకుందాం' అని చెప్పి ఫోన్ పెట్టేశాను.

దశమహావిద్యలు తాంత్రికవిద్యలు. నెట్లో  చూచి, లేదా ఎవరో ఒక సెలబ్రిటీ గురువు దగ్గర ఫేన్సీగా ఉపదేశం తీసుకుని వాటిని ఊరకే జపిస్తే ఏమీ రాదు. వాటికి కొన్ని విధానాలుంటాయి. వాటిని అనుసరిస్తేనే అవి ఫలిస్తాయి.

గతంలో ఇదే స్వామీజీ ఇదే ధూమావతీ మంత్రాన్ని నా స్నేహితుడైన ఇంకొక ఆఫీసర్ కి ఇచ్చి  జపించమన్నాడు. ప్రెండ్ భార్యకు బ్రెస్ట్ కేన్సర్ వచ్చింది.  అందుకని ఈ స్వామీజీని కలిస్తే, ధూమావతీ మంత్రం ఇచ్చాడు. ఫ్రెండ్ గాడు జపించడం మొదలుపెట్టాడు.

'ధూమవతీ మంత్రాన్ని సంసారులు జపించకూడదు. భర్తో భార్యో ఒకరు చనిపోయి, ఒంటరిగా ఉంటూ, ప్రపంచం మీద వైరాగ్యంతో, నిరాశతో, ఉన్నవారికే అది సరిపోతుంది. నువ్వు దానిని జపించకు.  మహావిద్యలతో ఆటలాడటం మంచిది కాదు' అని నేను మా ఫ్రెండ్ గాడికి చెప్పాను.

'స్వామీజీ కంటే నీకెక్కువ తెలుసా?' అంటూ ఎగతాళిగా నవ్వాడు మా ఫ్రెండ్.   

ఆ తర్వాత కొద్దికాలానికే మా ఫ్రెండ్ భార్య చనిపోయింది. అప్పటిదాకా ఆ స్వామీజీని మా ఫ్రెండ్ తెగ పొగిడేవాడు. ఆ తర్వాత తిట్టడం మొదలుపెట్టాడు.

'ఎందుకురా ఆయన్ని తిడతావ్?' అన్నాను.

'మరి అలాంటి మంత్రాలివ్వచ్చా? మాకు తెలీక అడుగుతాం. అన్నీ తెలిసిన వాళ్ళు అలా చేయొచ్చా?' అన్నాడు మా ఫ్రెండ్.

'నాకేం తెలుసు? పోయి ఆయన్నే అడుగు. కానీ తిట్టకు' అన్నాను. 

కొన్ని కొన్ని మంత్రాలను జపించడం వల్ల ఇలాంటివి జరుగుతాయి. ఆ మంత్రసాధనకే ప్రత్యేకమైన కొన్ని కొన్ని ఫలితాలు వెంటనే కనిపిస్టాయి. అందుకే, తెలిసీ తెలియకుండా  తాంత్రికమంత్రాలతో ఆటలు పనికిరావు. అందులోనూ, ఒకకోణంలో చూచినపుడు, దశమహావిద్యలందరిలోకీ ధూమావతి మహాశక్తివంతురాలు. ఆమె సాధనను, ఆషామాషీగా, తగిన నియమనిష్టలను పాటించకుండా, పిచ్చి కోరికలు తీరాలన్న సంకల్పంతో చేస్తే, ఫలితాలు దారుణాతి దారుణంగా ఉంటాయి. అప్పుడా శిష్యుడికీ గురువుకీ ఇద్దరికీ వేటు పడుతుంది. కుటుంబాలకు కుటుంబాలే నాశనం అవుతాయి.

ధూమావతీ దేవిని ఒక అందవికారపు ముసలామెగా, విధవరాలిగా, చీపిరి చేటలను దగ్గర పెట్టుకుని,  కాకి వాహనం మీద తిరిగే ఒక బికారి ఆకారంలో ఉన్నట్లుగా చిత్రిస్తారు. ఆమె ధ్యానశ్లోకాలు కూడా ఇదే రూపాన్ని చూపిస్తాయి. విధవలకు(భర్త చనిపోయిన ఆడవారికి), విధురులకు (భార్య చనిపోయిన మొగవారికి),  ఇల్లూ వాకిలీ లేకుండా బ్రతికే సన్యాసులకు, బైరాగులకు, అన్నింటినీ వదలిపెట్టి ఒంటరిగా అడవులలో గుహలలో ఉంటూ సాధన చేసేవారికి, ఈమె సాధన త్వరగా ఫలిస్తుంది.  ఆమె కూడా ఇలాంటివారినే ఇష్టపడుతుంది. సంసారులను ఇష్టపడదు.

ఒక్కమాటలో చెప్పాలంటే ఈమె ధనదేవత కాదు, జ్ఞానదేవత. దరిద్రమే జ్ఞానానికి దారి  గనుక, ఈమె ఇచ్చే మొదటి వరం దరిద్రమే. ఎవరైనా తోడుంటే జ్ఞానం రాదు గనుక, ముందు భర్తనో భార్యనో తీసుకుపోతుంది. ఒంటరిని చేసేస్తుంది. అపుడు వివేకమూ, వైరాగ్యమూ, జ్ఞానమూ, ఆధ్యాత్మిక సిద్దీ అన్నింటినీ ఇస్తుంది.

ఆకలితో ఉన్న ఈమె, తన భర్తయైన శివుడినే తినేసినట్లు, విధవగా మారినట్లు, తాంత్రికగాధలు చెబుతున్నాయి. కనుక దశమహావిద్యలలో భర్త లేని దేవత ఈమె ఒక్కతే. అసలు విషయమేమంటే, శివశక్తులను మించిన కాళరాత్రికి ఈమె సూచిక. అప్పటికి సృష్టి లేదు.  కనుక వైభవమూ ఉండదు. ఆ పైది  పరమేశ్వర తత్వమే. సృష్టిగా ఉన్న శుభస్వరూపుడైన శివుడిని మ్రింగేస్తుంది గనుక, సృష్టిని మించిన మహాప్రళయానికి సూచిక గనుక, ఈమెను విధవరాలిగా చిత్రీకరిస్తాయి ఈమె యొక్క ధ్యానశ్లోకాలు.

ఆయా అంతరికస్థితులను ధ్యానసాధనతో అందుకోవాలని ప్రయతించే సాధకులకు మాత్రమే ఈమె యొక్క సాధన యోగిస్తుంది. ఈ విషయం తెలియని గురువులు, ఏదేదో చెబుతున్నారు. తెలియనివారు నమ్ముతున్నారు. ఆ గురువులు కూడా ఈ మంత్రంలో సిద్ధిని పొందినవారు కారు. ఊరకే ఏదో ఉపదేశం చేస్తుంటారు. శిష్యులు జపిస్తుంటారు. అసలైన సాధనావిధానం అదికాదు గనుక అక్కడేమీ జరుగదు. ఏ ఫలితమూ కనిపించదు.

వేదాలలో ఈమె నిరృతి, జ్యేష్ఠ అనే పేర్లతో పిలువబడింది. క్రీ. శ 10 వ శతాబ్దం ప్రాంతంలో వేదకాలపు నిరృతి, జ్యేష్ఠ అనబడే దేవతలే, తాంత్రిక దేవతయైన ధూమావతిగా అవతరించారు. మామూలు భాషలో అలక్ష్మి, పెద్దమ్మ అని పిలువబడే దేవత ఈమెయే. పోతనామాత్యుడు  తన భాగవత గ్రంధం మొదట్లో 'అమ్మలగన్న యమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాల పెద్దమ్మ' అంటూ 'పెద్దమ్మ' గా వర్ణించింది ఈ ధూమావతీ స్వరూపాన్నే అని నా నమ్మకం. 'పెద్దమ్మ' అంటే జ్యేష్టాదేవి యని, సృష్టికీ, త్రిమూర్తులకూ, ముగ్గురమ్మలకూ ముందున్న పరాత్పరశక్తి యని అర్ధం. అంటే, ధూమావతి. తానే అన్నీ గనుక ఒంటరిది. తనకు వేరుగా ఎవరూ లేరు గనుక, భర్త లేనిది. అటువంటి ఏకైక వైరాగ్యపూరిత జ్ఞానశక్తి ఈ దేవత.

కావ్యకంఠ వాసిష్ఠ గణపతిముని, ధూమావతీ శక్తిని వర్ణిస్తూ, తన 'ఉమాసహస్రం' లో ఇలా అంటారు.

శ్లో || శూన్య ప్రఖ్యాయా చిల్లీనా 

ప్రళయే బ్రహ్మణి జన్మిషు సుప్తౌ:

కబళిత సకల బ్రహ్మాండం

తాం కవయః శ్రేష్టామ్ జ్యేష్టా మాహు:                     (ఉమాసహస్రం 38-13)


చిత్ యందు లీనమవ్వడమే శూన్యమనబడుతుంది. ఇది ప్రళయసమయంలో బ్రహ్మను ఆక్రమిస్తుంది. గాఢనిద్రా సమయంలో అన్ని జీవులనూ ఆక్రమిస్తుంది. బ్రహ్మాండం మొత్తాన్నీ కబళిస్తుంది. శ్రేష్టమైన ఈ శక్తినే జ్ఞానులు' జ్యేష్టా' అంటారు.

శ్లో || నిద్రా విస్మృతి మోహాలస్య 

ప్రవిభేధైస్సా భవమగ్నేషు 

ఏషై వశ్యాద్ద్యున్జ్నౌవేషు

ధ్వస్త వికల్ప: కోపి సమాధి:                                     (ఉమాసహస్రం 38-14)


నిద్ర, మరపు, మోహము, ఆలస్యము అనే భేదములతో లోకవ్యామోహం కలిగిన సంసారులలో  ఈ శక్తి ఉంటుంది. మనస్సు యొక్క చాంచల్యం ధ్వంసమైన యోగులలో అయితే, సమాధిగా ఉంటుంది.

అసలు విషయం ఇదైతే, పనులు కావడానికి, రోగాలు తగ్గడానికి,  కోర్టు కేసులు గెలవడానికి, గర్ల్ ఫ్రెండ్ ని వశం చేసుకోడానికి, ఇలాంటి తుచ్ఛమైన పనులకు మహావిద్యలను వాడుతున్నారు కొందరు. పోనీ వాడారే అనుకుందాం, సరియైన విధానంలో వాడటం లేదు. నేర్పవలసినవారు కూడా ఒక బాధ్యతతో నేర్పడమూ లేదు. వారి శిష్యులకు మంచిబుద్ధినీ నేర్పడం లేదు.  

నా శిష్యులలో కొందరు నన్నిదే అడుగుతారు,

'ఎవరూ సరిగ్గా చేయడం లేదు' అంటారు, మీరేమో చెప్పరు, ఎలా మీతో?' అని.

శుద్ధంగా చేసేవాళ్ళుంటే చెప్పడం నాకిష్టమే. అయితే, గొంతెమ్మ కోరికలు తీరే మార్గాలు కావాలంటే నేను చెప్పను. శుద్ధమైన సాధన కావాలంటే రండి. నేర్పడానికి నేను సిద్ధం. అయితే నా పరీక్షలలో మీరు పాసు కావాలి. ఎవరిని బడితే వారిని నేను నమ్మను. శిష్యునిగా తీసుకోను. అయినా, ఒక ఏడాది ఆగండి. మన ఆశ్రమం వచ్చాక మీ ఓపిక, ఎన్ని విద్యలు కావాలంటే అన్నింటినీ సాధన చేయవచ్చు. అయితే, నా దగ్గరే ఉండి, నేను చెప్పిన రీతిలో ఉంటూ, సాధన చేయాలి. అప్పుడన్నీ నేర్పిస్తాను. సాధనామార్గంలో చెయ్యిపట్టి నడిపిస్తాను. జస్ట్ కొద్దినెలల పాటు ఓపిక పట్టండి' అని వారికి చెబుతూ ఉంటాను.

నిజమైన సాధనామార్గాలు ఉన్నాయి. నిజమైన సాధకులకోసం అవి వేచి చూస్తూనే ఉంటాయి. వాటిని అందుకునే నిజమైన మనుషులే కావాలి. వారేరీ?