Pages - Menu

Pages

27, జనవరి 2022, గురువారం

'తంత్రసారము' ఈ బుక్ విడుదలైంది

'పంచవటి  పబ్లికేషన్స్' నుండి  వస్తున్నవి మామూలు పుస్తకాలు కావు. అవి జ్ఞానభాండాగారాలు. మన ప్రాచీన విజ్ఞానపు నిధులు. అటువంటి పుస్తకాలలో మరొక్క మహత్తరమైన గ్రంధరాజం ఈ రోజున, అంటే పుష్య బహుళ  దశమి రోజున వెలువడుతున్నది.

దానిపేరు 'తంత్రసారము'.

ఈ పుస్తకం కోసం ఎంతోమంది మేధావులు, తంత్రశాస్త్రాభిమానులు చాలాకాలంగా ఎదురు చూస్తున్నారు. కొందరైతే,  సంస్కృతంలో ఉన్న ఈ గ్రంధానికి తెలుగు వ్యాఖ్యానాన్ని వ్రాయమని నన్ను గతంలో కోరారు కూడా. వారందరి కోరికను తీరుస్తూ 'తంత్రసారము' అనబడే ఈ పుస్తకాన్ని తెలుగులో నేడు విడుదల చేస్తున్నాము. మా సంస్థ నుండి వెలువడుతున్న మిగతా చాలా పుస్తకాలలాగా ఇది కూడా మొదటిసారిగా తెలుగులోకి వస్తున్నది. అదికూడా నా చేతులమీదుగా జరగడం నా అదృష్టంగా భావిస్తున్నాను.

'తంత్రశాస్త్రం' అంటే లోకులలో చాలా అపోహలున్నాయి. దానికి కారణం అసలైన తంత్రమంటే ఏమిటో లోకానికి తెలియకపోవడం. భూతప్రేతాలు, క్షుద్రపూజలు, చేతబడులు మొదలైన పనికిరాని తంతులతో కూడినదే తంత్రమని చాలామంది అనుకుంటూ ఉంటారు. ఇది శుద్ధపొరపాటు. అది క్షుద్రతంత్రం. అసలైన తంత్రం వేరు. అసలైన తంత్రం శుద్ధమైన సాధనామార్గం. 

తంత్రశాస్త్రమనేది ఒక ఆధ్యాత్మిక సాధనామార్గం. దీనికి శాస్త్రప్రామాణికత ఉన్నది. ఆ శాస్త్రములను ఆగమములంటారు. వీటిలో శైవాగమములు, శాక్తాగమములు, వైష్ణవాగమములు ప్రధానములుగా ఉన్నాయి. ఇవన్నీ ద్వైతసిద్ధాంతమును ప్రబోధించే మార్గములే. వీటిలో ఒక్క శైవాగమశాస్త్రములలోనే అద్వైతమార్గం ఉన్నది. అది శివాద్వైతశాస్త్రంలో మాత్రమే మనకు గోచరిస్తుంది. దీనికే త్రికశాస్త్రమని పేరు. నేడు దీనినే కాశ్మీరశైవమని పిలుస్తున్నారు.

పదవశతాబ్దం నుంచి మనదేశం పైన జరిగిన తురకల దండయాత్రలలోను, వారు బుద్ధిలేకుండా మనదేశంలో జరిపిన విధ్వంసకాండలోను, మన దేవాలయాలు గ్రంధాలయాలు వేలాదిగా ధ్వంసమయ్యాయి. వేలాది  విలువైన గ్రంధాలు తగలబెట్టబడ్డాయి. వాటిలోని విలువైన జ్ఞానసంపదంతా నాశనమైపోయింది. మన అదృష్టం బాగుండి కొన్నికొన్ని గ్రంధాలు మాత్రం బ్రతికి బయటపడ్డాయి. వాటిల్లో, మాలినీ విజయోత్తర తంత్రము, తంత్రాలోకము, తంత్రసారము అనే గ్రంధాలు కొన్ని. ఇవి దాదాపుగా  900 వంవత్సరాల తర్వాత క్రీ. శ . 1900 ప్రాంతంలో కాశ్మీర్ లో పురాతన తాళపత్ర గ్రంధాలలో దొరికాయి. వాటిని భద్రపరచిన ఘనత అప్పటి కాశ్మీరరాజైన శ్రీప్రతాపసింహమహారాజు గారికీ, ఆయన ఏలుబడిలో ఉన్న పురాతన తాళపత్రాల గ్రంధాలయాధికారి శ్రీముకుందరామశాస్త్రి గారికీ  చెందుతుంది. నూరేళ్లక్రితం దీనిని హిందీలోకి అనువదించింది ఈయనే. ఈ మహానుభావుల కృషి వల్లనే ఈ గ్రంధాలను మనం ఈనాడు చదువుకోగలుగుతున్నాం.  మనమేకాదు, సంస్కృతం నేర్చుకున్న  వందలాది మంది యూరోపియన్లు, అమెరికన్లు నేడు ఈ పుస్తకాలను చదివి, వాటిలోని అత్యున్నతమైన ఫిలాసఫీకీ, లాజిక్ కీ ముగ్దులైపోయి, శివభక్తులుగా మారారు. మారుతున్నారు.

వీటిలో 'శ్రీ మాలినీ విజయోత్తర తంత్రము' ను తెలుగులో నా వ్యాఖ్యానంతో ఇప్పటికే ప్రచురించాము. ఇప్పుడు, అభినవగుప్తులవారు వ్రాసిన 'తంత్రసారము' ను ప్రచురిస్తున్నాము. త్వరలో ఈయన యొక్క లైఫ్ టైం వర్క్ అయిన 'తంత్రాలోకము' కూడా నా వ్యాఖ్యానంతో  తెలుగులోకి రాబోతున్నది.

క్రీ.శ.1000 కంటే ముందు మనదేశంలో,ముఖ్యంగా శైవాగమాలలో  ప్రచారంలో  ఉన్న, స్పంద, క్రమ, కుల, ప్రత్యభిజ్ఞములనే అన్ని శైవతంత్ర సిద్ధాంతాలనూ ఒకేచోట చేర్చి, వాటిని సతార్కికంగా వివరిస్తూ ఒక బృహద్గ్రంధాన్ని వ్రాయమని తన కౌలాచార గురువైన శ్రీ శంభునాధులవారు తనను ఆదేశించినట్లు, దానిననుసరించి  తానీ గ్రంధాన్ని వ్రాసినట్లు అభినవగుప్తులవారు తన 'తంత్రాలోకము' ముందు మాటలో వ్రాశారు. ఇవన్నీ క్రీ. శ 1000 ప్రాంతంలో కాశ్మీర్ లో జరిగిన సంఘటనలు. ఆ తంత్రాలోకానికే ఈ 'తంత్రసారము' సంక్షిప్తరూపం. ఇదే 550 పేజీలలో ఉందంటే ఇక 'తంత్రాలోకం'  ఎంత పెద్ద గ్రంధమో అర్ధం చేసుకోవచ్చు. ఈ గ్రంధం బ్రతికి బట్ట కట్టబట్టే, ఆయా తాత్వికచింతనలన్నీ ఒకప్పుడు ఉన్నాయని నేడు మనం తెలుసుకోగలుగుతున్నాం. 

ప్రపంచంలోని ఏ మతమైనా తీసుకోండి, వాటన్నిటికంటే ఎంతో గొప్పదీ ఉత్తమమైనదీ శివాద్వైతం. అంతేకాదు, హిందూమతం లోని అన్ని తాత్త్విక చింతనామార్గాలలోకీ శిఖరం లాంటిది ఈ శాస్త్రం. దీనిని వ్రాసిన అభినవగుప్తులవారు మామూలు మనిషి కాదు. అటువంటి మహానుభావులు వెయ్యేళ్లకు ఒక్కరు మాత్రమే పుడతారు. ఈయన సాంఖ్య, బౌద్ధ, వైష్ణవ, శైవశాస్త్రములను క్షుణ్ణంగా అధ్యయనము చేసిన మహాపండితుడు మాత్రమే గాక, మహా తపస్వి, జ్ఞానీ కూడా. నేటి సోకాల్డ్ ప్రవక్తలతో పోలిస్తే ఈయనను 'మహాప్రవక్త' అనవచ్చు. అటువంటి మహాప్రవక్త వ్రాసిన ఈ గ్రంధమును తెలుగులోకి తేవడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను.

ఇందులో 22 అధ్యాయాలున్నాయి. వీటిల్లో ఎంతో నిశితమైన లాజిక్ తో కూడిన సిద్ధాంత భాగమేగాక, అణవోపాయము, శాక్తోపాయము, శాంభవోపాయము, అనుపాయము, శక్తిపాతము, షడధ్వములు, వివిధరకములైన దీక్షలు, విధులు, ఆగమప్రామాణికతలను వివరిస్తూ, వీటన్నిటికీ తలమానికంగా, చివరి అధ్యాయములో ఆరువిధములైన సాధనలతో కూడిన కౌలాచారతంత్రమును కూడా వివరించడం జరిగింది.      

ఈయన దాదాపుగా 50 గ్రంధములను రచించారు. వాటితో బాటు తనకెంతో ఇష్టమైన 'భైరవస్తవము' అనే తొమ్మిది శ్లోకములతో కూడిన స్తోత్రమును కూడా రచించారు.  దానినీ, ఆ శ్లోకములకు నేను వ్రాసిన తెలుగు పద్యములనూ ఈ గ్రంధంలో ఇచ్చాను. దానినాయన  పుష్య బహుళదశమి నాడు వ్రాసినట్లుగా అందులో వ్రాసుకున్నారు. బహుశా అది క్రీ. శ. 1016 సంవత్సరం కావచ్చు. మా గ్రంధం కూడా, అనుకోకుండా అదే తిధికి దగ్గరలోనే, పుష్యమాసంలోనే పూర్తయింది. అలా జరగాలని మేము ప్లాన్ చెయ్యలేదు. అనుకోకుండా అలా జరిగింది. కనుక, అదే పుష్య బహుళ దశమి నాడు, అంటే ఈరోజున, ఈ పుస్తకాన్ని 'ఈ బుక్' గా విడుదల చేస్తున్నాను. దీనిని కాకతాళీయంగా నేను భావించడం లేదు. ఎందుకంటే, ప్రపంచంలో ఏదీ కాకతాళీయం కాదని నాకు తెలుసు కాబట్టి.

'భైరవ స్తవము' చివరలో అభినవగుప్తులవారు వ్రాసిన సంస్కృత శ్లోకము, దానికి నా తెలుగు పద్యమూ, దాని వివరణలూ ఇవి.

శ్లో|| వసురసపౌషే కృష్ణ దశమ్యామ్

అభినవగుప్తః స్తవమిమ మకరోత్ 

యేన విభుర్భవ మరుసంతాపం

శమయతి ఝటితి జనస్య దయాళుః 


ఆ || అరువదెనిమిదేండ్ల యరుదైన దినమందు

స్తవము నభినవుండు చక్కజేసె

దీనినెంచి మిగుల దయతోడ నీశుండు

తాపతతుల నెల్ల దీర్చుగాత 


అష్టవసువులు గనుక, వసు అంటే 8. షడ్రసములు గనుక రస అంటే 6. 'అంకానాం వామతో గతి: (అంకెలన్నీ కుడినుంచి ఎడమకు నడుస్తాయి)' గనుక, వసురస అనేపదం 68 ని సూచిస్తున్నది. అంటే, 'తన 68 వ సంవత్సరంలో పుష్యమాసపు కృష్ణదశమి, మకరసంక్రాంతి నాడు అభినవగుప్తుల వారు ఈ స్తోత్రమును రచించారు. దీనిని పఠించడం వల్ల, దయాళువైన పరమేశ్వరుడు కరుణిస్తాడు. జనులకు కలిగే బాధలను శమింపజేస్తాడు' - అని ఈ శ్లోకం యొక్క అర్ధం.

ప్రస్తుతం మా ఆశ్రమస్థలాన్ని సేకరించే పని అయిపోయింది గనుక, ఇక పుస్తకాల ప్రింటింగ్ మళ్ళీ మొదలౌతుంది. ఆ క్రమంలో 'తంత్రసారము' కూడా పుస్తకంగా వస్తుంది. ఈ లోపల 'ఈ బుక్' ని  చదివి ఆనందించండి మరి !

యధావిధిగా, ఈ పుస్తకాన్ని వ్రాయడంలో త్రిశక్తుల సహాయం నాకు లభించింది. వారు, నా శ్రీమతి సరళాదేవి, నా శిష్యురాళ్ళు అఖిల, శ్రీలలితలు. సంస్కృతశ్లోకాలను, వచనాన్ని తెలుగులో వ్రాయడంలో శ్రీలలిత ప్రధానపాత్ర పోషిస్తే, పుస్తకం టైప్ సెట్టింగ్, ప్రూఫ్ రీడింగ్, పబ్లిషింగ్ మొదలైన పనులలో ఎంతో ఓర్పుతో అఖిల సహాయపడింది. నాకైతే చిన్నప్పటినుంచీ ఆధ్యాత్మిక చింతన ఎక్కువ గనుక నేనీ పనులు చేస్తున్నాను. నాతోబాటు వీరందరూ కూడా ఇంత కష్టపడుతున్నారంటే అది జగజ్జనని అనుగ్రహం కాక మరేమనుకోవాలి?  వీరు ముగ్గురి తోడ్పాటు లేకుంటే నా పుస్తకాలలో ఒక్కటి కూడా వెలుగు చూచేది కాదు. అందుకే వీరికి ఎంతగా కృతజ్ఞతలు చెప్పినా తక్కువే అవుతుంది. అయినా సరే, వీరికి మళ్ళీ నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.

ఇకపోతే, ముఖచిత్రాన్ని యధావిధిగా అద్భుతంగా తీర్చిదిద్దాడు శిష్యుడు ప్రవీణ్. చిరకాలం లోకంలో నిలచిపోయే ఇలాంటి ఉత్తమ గ్రంధాలను  తెలుగు ప్రపంచానికి  అందించే పనిలో, నాకు సహచరులయ్యే అదృష్టం వీరికి పట్టింది. అది వారి సుకృతం. వీరందరికీ ఋణపడి ఉన్నాను. పరమ శివానుగ్రహం వీరికి నిరంతరం ఉండాలని ప్రార్ధిస్తున్నాను.

యధావిధిగా ఈ పుస్తకం కూడా గూగుల్ ప్లే బుక్స్ నుండి ఇక్కడ లభిస్తుంది. ఇంకొక క్రొత్త పుస్తకంతో మళ్ళీ త్వరలో కలుసుకుందాం. అప్పటివరకూ ఈ మహోత్తమగ్రంధాన్ని అధ్యయనం చేయండి.

24, జనవరి 2022, సోమవారం

జ్యోతిష్కుని జాతకం

ఉదయాన్నే రవి ఫోన్ చేశాడు.

మళ్ళీ ఏ న్యూస్ చెబుతాడో అనుకుంటూ ఫోనెత్తా. ఎందుకంటే, ప్రపంచంతో నాకున్న ఏకైక సంబంధం అతనే కాబట్టి. ఎక్కడెక్కడి వార్తలన్నీ నాకు తెచ్చి చెబుతూ ఉంటాడు. కొన్ని వింటాను. కొన్ని వినను. టాపిక్ మార్చేయమంటాను. అయినా పాపం ఏమీ అనుకోకుండా చెబుతూనే ఉంటాడు. నేను టీవీ చూడను గనుక, న్యూస్ పేపర్ చదవను గనుక లోకంలో వెనుకబడిపోతున్నానని తన బాధ పాపం ! అందుకని నన్ను అప్ డేట్ లో  ఉంచాలని ప్రయత్నిస్తూ ఉంటాడు.

'ఏంటీ సంగతి?' అన్నా 

'ఈ వార్త చూశావా? ఎంత వింతగా ఉందో? ప్రముఖ జ్యోతిష్కుడు 'ఫలానా' చనిపోయాడు' అన్నాడు ఎంతో ఆశ్చర్యంగా.

'ఇందులో ఏమిటి వింత? అతను జ్యోతిష్కుడు కావడమా? లేక చనిపోవడమా?' అన్నా నిరాసక్తిగా.

'రెండూనూ' అన్నాడు.

'నాకేమీ వింతగా లేదు' అన్నా

'ఎందుకు పోయాడంటావ్?' అడిగాడు మళ్ళీ

'నూకలు చెల్లాయి, పోయాడు. ఎవడైనా అందుకే పోతాడు' అన్నా

'ఆపు నీ జోకులు. ప్రతిదీ నీకు జోకేనా?' అన్నాడు కోపంగా.

'లేదు నాయనా నేనేమీ జోకెయ్యలేదు. ఉన్నవిషయం చెప్పా. అయినా ఇందులో నీ బాధేంటి?' అడిగా.

'ఏమీ లేదు. తను 96 ఏళ్లపాటు బ్రతుకుతానని, అలా సాయిబాబా చెప్పాడని ఆయనొకసారి చెప్పాడు' అన్నాడు.

'సాయిబాబానా? ఆయనెవరు? ఇంకో జ్యోతిష్కుడా?' అడిగా

'ఛీ కాదు. షిరిడీ సాయిబాబా' అన్నాడు.

'బాబోయ్. ఇదేంటి? ఆయన కూడా జ్యోతిష్యం చెబుతున్నాడా ఈ మధ్య?' అడిగా తెగ ఆశ్చర్యపోతూ.

'ఏమో మరి. ఆయనే టీవీలో చెప్పాడు. మరేమో ఇప్పుడిలా పోయాడు' అన్నాడు.

'ఆయనకు 96 ఉన్నాయేమో నీకేం తెలుసు?' అన్నా.

'ఛా అంత లేవు' అన్నాడు. 

'మరి ఆయన ఫాలోయర్స్ ఏమంటున్నారు/' అడిగా.

'ఏవో తిధులు గట్రా లెక్కేస్తే ఆయనకు ఇప్పుడు 96 వచ్చాయట. ఆయన కరెక్ట్ గానే చెప్పిన  టైం కే పోయాడంటున్నారు' అన్నాడు.

'ఏ లెక్క ప్రకారం చూసినా 96 తిరగబడి 69 అవడం జరిగే పని కాదు. అలా అనేవాళ్ళని పంచాంగాలు మెడలో వేసుకుని ఊరేగమను' అన్నా.

'లేదు. అలా ముందే చెప్పి పోయినవాళ్లున్నారుట' అన్నాడు.

'అచ్చా ! పోవడంలో కూడా గొప్పలా? చెప్పిన టైం కి పోకపోతే ఏమౌతుంది? భూమి బ్రద్దలౌతుందా? అయినా, చెప్పి పోతే ఏంటి? చెప్పకుండా పోతే ఏంటి? పోవడం తప్పదుగా?' అడిగా.

'అనికాదు. జ్యోతిష్యం ప్రూవ్ అవుతుంది కదా !' అన్నాడు.

'జ్యోతిష్యం ప్రూవ్ కాకపోతే ఏమైందిట?' అన్నా.

ఇలా కాదనుకున్నాడో ఏమో, మాటమార్చి, 'అయినా, మాటమాటకీ సాయిబాబానలా  ఎందుకు ఆడిపోసుకుంటావ్?' అన్నాడు కోపంగా.

'ఇదొకటి మళ్ళీ. నేనెప్పుడాయన్ని ఆడిపోసుకున్నాను? ఆయనందరి కలల్లోకొచ్చి ఇలాంటి జ్యోతిష్యాలు చెప్పగా లేనిది, నేనంటే తప్పయిందా? భలే ఉందిలే' అన్నా.

'అయినా సాయిబాబా అలా ఎందుకు చెప్పి ఉంటాడంటావ్?' అడిగాడు.

'రేప్పొద్దున వాకింగ్ లో కలుస్తాడు. అడిగి చెబుతాలే' అన్నా సీరియస్ గా.

'ఎవరు జ్యోతిష్కుడా? సాయిబాబానా?' అన్నాడు తనూ సీరియస్ గానే. 

'ఎవరో ఒకర్లే. ఇద్దరిలో ఎవరెదురైనా, నా వాకింగ్ మాత్రం రన్నింగ్ అవుతుంది. అయినా ఇందులో నీ బాదేంటో చెప్పనేలేదు' అన్నా.

'ఏమీ లేదు. నాది పుష్యమీ నక్షత్రం కర్కాటకరాశి అని నీకు తెలుసుకదా. నిన్న రాత్రి యూ ట్యూబ్ లో ఈ జ్యోతిష్కుడు చెప్పినవే వారఫలాలు చూసుకుంటున్నా. మిధున రాశికి ఇలా ఉంటుంది, కర్కాటక రాశికి అలా ఉంటుంది, ఏలినాటి శని పోతోంది. అంతా బ్రహ్మాండంగా ఉంటుంది అని చెబుతున్నాడు. నేను ఆనందంగా వింటున్నా. ఇంతలో పైన స్క్రోలింగ్ వస్తోంది 'ఫలానా జ్యోతిష్కుడు అర్ధాంతర మరణం; అంటూ. బిత్తరపోయా' అన్నాడు.

'ఏలినాటి శని నీ ఇంట్లోంచి ఆయన ఇంట్లోకి అడుగుపెట్టినట్టుంది రెణ్ణెల్ల ముందే' అన్నా.

'జోకులాపు. నా డౌటేంటంటే, అందరికీ రాశిఫలాలు చెప్పేవాడికి తనకు ముంచుకొస్తున్నదని  తెలియదా? కరెక్ట్ గా జవాబు చెప్పుము' అన్నాడు హుకుం జారీ చేస్తూ.

'తెలిస్తే ఏమ్ చెయ్యగలడు? ఆపుకుంటాడా? అదేమైనా బాత్రూమా ఆపుకోడానికి? దాన్నికూడా ఎక్కువసేపు ఆపుకుంటే ఏమౌతుందో తెలుసుగా నీకు' అన్నా.

'ప్రపంచం మొత్తానికీ రెమెడీలు చెబుతారుగా జ్యోతిష్కులు.  వీళ్ళ జాతకాలు వీళ్లకు తెలియవా మరి' అడిగాడు.

'ఏమో నాకేం తెలుసు? భద్రాచలం భద్రిరాజు అని ఒక కోయజ్యోతిష్కుడున్నాడు. అతను ఆత్మలతో మాట్లాడతాడు. అతని నంబరిస్తా మాట్లాడి చూడు. జ్యోతిష్కుడి ఆత్మను అడిగి చెబుతాడు' అన్నా.

'కోయరాజులూ కొండరాజులూ వద్దులే గాని నువ్వు చెప్పు' అన్నాడు.

'బహుశా సాయిబాబా మాటలని ఓవర్ గా నమ్మేశాడేమో? సాయిబాబా కూడా 69 అనే చెప్పుంటాడు. ఈయనే వర్క్ ప్రెజర్ లో రివర్స్ లో వినుండవచ్చు. తప్పు సాయిబాబాదీ కాదు, జ్యోతిష్యానిదీ కాదు, వర్క్ ప్రెజర్ ది' అన్నా.

'అవున్లే నువ్వూ జ్యోతిష్కుడివేగా అందుకే దానిమీద ఈగ వాలనివ్వవు' అన్నాడు.

'నేనదంతా ఎప్పుడో మానేశాగా, ఇప్పుడు బుద్ధిగా ఉంటున్నా' అన్నా.

'పోయినోళ్ళ జాతకాలు చూడటంలో నువ్వు స్పెషలిస్ట్ వి కదా. చూసి చెప్పు ఎందుకు పోయాడో' అన్నాడు మళ్ళీ పట్టు వదలకుండా.

'దానికి జాతకం ఎందుకు? చెప్తా విను. గతంలో నీతో ఈయన మాట్లాడాడు. నువ్వీయన్ని  కలిశావు. అప్పటినుంచే నీకు గుడ్ టైం మొదలైంది. ఆయనకు బ్యాడ్ టైం మొదలైంది. ఇప్పుడది పీక్కొచ్చింది. పోయాడు' అన్నా గెస్ చేస్తూ. ఎందుకంటే రవికి జాతకాల పిచ్చి బాగా ఉంది. విజయవాడ చుట్టుప్రక్కల చాలామంది జ్యోతిష్కులని తన జీతంతో పోషిస్తూ ఉంటాడు కూడా.

'భలే చెప్పావ్. గతంలో సికింద్రాబాద్ స్టేషన్లో అగరబత్తీలు, కుంకాలు మొదలైనవి అమ్మడానికి ఒక స్టాల్ కావాలని ఎలాట్ మెంట్ కోసం నాదగ్గర కొచ్చాడు. అలాట్ చేశాను. అప్పుడు నా జాతకం కూడా వేసిచ్చాడు' అన్నాడు.

'మరెమైంది' అన్నా.

'తర్వాత నా పై ఆఫీసరు ఆ ఎలాట్ మెంట్ ని  కేన్సిల్ చేశాడు. ఆ తర్వాత టచ్ పోయింది' అన్నాడు.

'అలా అవుతుందని మరి జ్యోతిష్కుడు గ్రహించలేకపోయాడా? అయినా మీరు పొరపాటు చేశారు. సాయిబాబాను అడిగి ముహూర్తం పెట్టుకుని ఉండాల్సింది. అందుకే అదలా  కేన్సిల్ అయింది. చూశారా ఎంత తప్పు చేశారో మీరిద్దరూ?' అన్నా.

'సోదాపు. ఎంతసేపు ఆడిపోసుకుంటావ్ వాళ్ళిద్దర్నీ? అయితే ఎందుకు పోయాడో నీకు తెలీదంటావ్?' అన్నాడు సూటిగా విషయానికొస్తూ.

'తెలీకపోడానికి ఇందులో ఏముంది? ఎంత తెలిసినా తన జాతకం దగ్గరకొచ్చేసరికి జ్యోతిష్కులు కూడా పప్పులో కాలేస్తారు. వాళ్ళేమైనా జ్ఞానులా ఏంటి? అసలు విషయమేమంటే ఈ జ్యోతిష్కులెవరికీ జ్యోతిష్యం పూర్తిగా రాదు. భజనబృందాల అండతో ఏదో అలా కొట్టుకుపోతుంటారంతే. అదీ అసలు సంగతి ! పైగా, ఎక్కువకాలం బ్రతకాలంటే, ఆహారనియమం  ఉండాలి, తగినంత వ్యాయామం ఉండాలి, సిగిరెట్లు, త్రాగుడు లాంటి చెడు అలవాట్లు ఉండకూడదు. అత్యాశతో పరుగులు ఉండకూడదు. అప్పుడే ఆరోగ్యం బాగుంటుంది. జాతకానికి దీనికీ సంబంధం లేదు. జాతకంలో కూడా ఈ పోకడలు కనిపిస్తాయి. ఎవడు మార్చుకుంటాడు చెప్పు? ప్రతివాడూ విధిని తనకోసం మారమంటాడు. దేవుణ్ణి తన మాట వినమంటాడు. తను  మాత్రం మారడు, మంచిమాట చెబితే వినడు. ఈ లోకమింతే. ఈ మనుషులింతే. అందుకే నాకు మనుషులంటేనే విరక్తి పుట్టి జాతకాలు చూట్టం పూర్తిగా మానేశాను. జ్యోతిష్కుడు దేవుడు కాదు. వాడూ మీలాంటి మనిషే. వాడికీ కష్టాలుంటాయి. నష్టాలుంటాయి. వాడూ పోతాడు. వాడి జాతకమూ వాడికి తెలీదు.'అన్నాను.

'మరి మనుషులందరూ జ్యోతిష్కుల దగ్గరికి ఎందుకు పోతారంటావ్/' అడిగాడు.

'బుద్ధిలేక ! జిల్లెళ్ళమూడి అమ్మగారి మాట ఒకటి చెబుతా విను. 'ఏడుస్తూ పడేవాడు నవ్వుతూ పడేవాడిని  సలహా అడుగుతాడు' అన్నది అమ్మ. అర్థమైందా? వాడికి తెలుసని వీడనుకుంటాడు. వీడికి తెలీక తనదగ్గరకొచ్చాడని వాడనుకుంటాడు. జీవితనాటకంలో ఇద్దరూ పావులే. ఏ నాటకానికైనా ఎప్పుడో ఒకప్పుడు ముగింపు తప్పదు. అంతే' అన్నా.

'అయితే పడక తప్పదంటావ్?' అన్నాడు సీరియస్ గా.

'అది పడ్డాక గాని తెలీదు. కాలు జారాకే తెలుస్తుంది, జారినట్లు. ఏంటి ఈ మధ్యేమైనా కాలు జారావా?' అన్నా నవ్వుతూ.

'ఆ ! ఈ వయసులో అదొక్కటే తక్కువ ! ఉంటా మరి ! త్వరగా ఆఫీసుకి పరిగెత్తాలి. బోలెడు పనుంది' అన్నాడు.

'సర్లే ! కార్లో వెళ్ళు. పరిగెత్తకు. కాలుజారగలదు. టీ టైం లో ఫోన్ చెయ్యి. జ్యోతిష్యం చూసి, కాలు జారే అవకాశం నీకెప్పుడుందో చెబుతా' అన్నా నవ్వుతూ.

'ఆపు జోకులు. ఉంటా మరి !' అంటూ ఫోన్ పెట్టేశాడు.

నేనూ ఆఫీసుకి తయారవడం మొదలుపెట్టా.

 కద కంచికి మనం ఆఫీసుకి !

16, జనవరి 2022, ఆదివారం

బికనీర్ ఎక్స్ ప్రెస్ ఘోరప్రమాదం - గ్రహాల పాత్ర ఏమిటి?

క్రొత్త సంవత్సరం రైలుప్రమాదంతో మొదలైంది. 13-1-2022 గురువారం సాయంత్రం 5 గంటలకు ఒక ఘోర రైలు ప్రమాదం జరిగింది. రాజస్థాన్ లోని బికనీర్ నుండి అస్సాం లోని గౌహతికి వెళుతున్న ఎక్స్ ప్రెస్ రైలు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో జల్పాయిగురి జిల్లాలో ఉన్న మైనగురి అనే ఊరి దగ్గర పట్టాలు తప్పింది. రైల్లో 18 పెట్టెలుంటే వాటిలో 12 పట్టాలు తప్పి చిందరవందర అయ్యాయి. S - 5 మరియు S - 6 పెట్టెలు ఒకదానిపైకి ఒకటి ఎక్కాయి. తొమ్మిదిమంది చనిపోయారు. 36 మంది గాయాలపాలయ్యారు. యధావిధిగా రైల్వే మంత్రిగారు, ఇతర అధికారులు వచ్చారు. చూచారు. రైలు ఇంజన్లో లోపం ఉందన్న ప్రాధమిక సమాచారాన్ని రైల్వేమంత్రిగారే స్వయంగా వెల్లడించారు. బాధితులకు  నష్టపరిహారం ప్రకటించారు. ఎంక్వైరీ వేశారు. విచారణ జరుగుతోంది.

గ్రహాలేమంటున్నాయి?

భారతదేశానికి సూచికైన మకరరాశిలో శని బుధులు మూడు డిగ్రీల తేడాలో ఉన్నారు.  బుధుడు వేగంగా శనిని సమీపిస్తున్నాడు. వీరిద్దరికీ సూర్య గురువుల ద్వారా అర్గలదోషం పట్టింది.  శుక్రునికి గల వక్రత్వం వల్ల వృశ్చికంలోకి పోతున్నాడు. కనుక అర్గలదోషంలో ఈయన పాత్ర లేదు. శనిబుధులపైన హటాత్తు సంఘటనలకు విద్రోహచర్యలకు కారకుడైన యురేనస్  ఖచ్చితమైన డిగ్రీ కేంద్రదృష్టి ఉన్నది. కనుక ఈ కోణాన్ని కాదనలేము. వీరిపైన రాహుచంద్రుల కోణదృష్టి కూడా ఉన్నది. రాహుచంద్రులు కూడా విద్రోహచర్యలను సూచిస్తారు. కనుక ఈ అనుమానానికి బలం ఏర్పడుతున్నది. కానీ రైల్వేమంత్రిగారు మాత్రం, ఇంజన్ లోని భాగాలలో లోపమున్నదని అంటున్నారు. మకరరాశిలో శనిబుధుల డిగ్రీ స్థితి, వాయవ్యదిక్కును సూచిస్తున్నది. కానీ ప్రమాదం జరిగింది ఈశాన్యదిక్కులో. కనుక మకరరాశిని కేంద్రంగా చేసుకున్న ఈ విశ్లేషణ కరెక్ట్ కాకపోవచ్చు.

మరొక్క కోణం నుంచి పరిశీలిద్దాం.  భారతదేశాన్ని సూచించే వృషభరాశి నుంచి చూద్దాం.
  • లగ్నము సూర్యుడూ ఒకే డిగ్రీమీదుంటూ ఈ చక్రంలో సూర్యుని పాత్రను స్పష్టంగా సూచిస్తున్నారు.
  • హోరాధిపతి శుక్రుడయ్యాడు. కనుక ధనుస్సుకు ప్రాముఖ్యత ఏర్పడుతూ ఇదే విశ్లేషణకు కేంద్రమని చూపిస్తున్నది.
  • యాక్సిడెంట్ ను సూచించే అష్టమంలో ఉన్న సూర్యుడికి పాపార్గలం పట్టింది. డిగ్రీ పరంగా సూర్యుడు ఈశాన్యదిక్కును సూచిస్తూ అస్సాం ప్రాంతంలో జరుగబోతున్న యాక్సిడెంట్ ను ఖచ్చితంగా సూచిస్తున్నాడు.
  • నవమంలో ఉన్న శనిబుధులపైన ఉన్న యురేనస్ దృష్టిని బట్టి ఇందులో దూరదేశపు విద్రోహకోణం ఉన్నట్లు, ధనుస్సు నుండి కుటుంబస్థానము కావడంతో ఇంటిదొంగల పాత్ర కూడా ఉందని అనుమానించవలసి వస్తున్నది.
  • సూర్యుడంటే శరీరానికి గుండెకాయ. రైలుకైతే ఇంజన్. కనుక ఇంజన్లో లోపం నిజమే కావచ్చు. అయితే, ఆ లోపం ఏర్పడటానికి కారణమేంటనేది అసలు ప్రశ్న. 
  • అర్గల గ్రహాలను పరిశీలిద్దాం. శనిబుధుల వలన పాతబడిపోయిన వైర్లు, లింకులు, ఇంజన్లోని స్టీలుపార్టులు సూచింపబడుతున్నాయి. వృశ్చికంలోని కుజకేతువుల యుతివల్ల, చేయవలసిన దానికంటే ఎక్కువకాలం పాటు ఓవర్ లోడై పనిచేసిన ఇంజన్ విడిభాగాలు, అవికూడా ఇంజన్లో బయటగా కాకుండా బాగా లోపలగా ఉన్న భాగాలు సూచింపబడుతున్నాయి. ఈ రెండు కారణాలవల్ల, ఇంజన్ లో లోపం ఏర్పడినట్లు కనిపిస్తున్నది.
అలాంటప్పుడు, భారతీయ రైల్వేలలో ఇంజన్లకు జరుగవలసిన మెయింటెనెన్స్ సరిగా జరగడంలేదా? కనీసం ఈ ఇంజన్ కు జరగలేదా? అన్న అనుమానం తలెత్తుతుంది. ఈ అనుమానాన్ని నివృత్తిచేయవలసింది శాఖాపరమైన విచారణ మాత్రమే.

అయితే, విచారణలో ఏమి తేలినప్పటికీ, పోయిన ప్రాణాలు తిరిగొస్తాయా? నష్టపరిహారంగా ఇచ్చిన ఎక్స్ గ్రేషియా, వ్యక్తుల లోటును పూడుస్తుందా? బాధ్యులకు శిక్షలు పడతాయా? లోపభూయిష్టమైన మన వ్యవస్థలో తిరిగి ఇవే తప్పులు జరుగకుండా ఉంటాయా? అన్న ప్రశ్నలు మాత్రం  జవాబులు లేని శేషప్రశ్నలు గానే మిగిలిపోతాయి.

13, జనవరి 2022, గురువారం

పంచవటి చిహ్నం

చాలా రోజులనుంచీ పంచవటి చిహ్నాన్ని మా పుస్తకాలమీద మీరు చూస్తున్నారు. ఈమధ్య దానిని మరింత అందంగా తీర్చిదిద్దాము., కానీ దాని వెనుక ఉన్న అర్ధాలు మీకు తెలిసి ఉండక పోవచ్చు. అందుకే ఈ పోస్ట్.

ఈ చిహ్నం చుట్టూ ఆవరించి ఉన్న మూడు వలయాలు త్రిగుణములకు సూచికలు. సత్త్వ, రజో, తమోగుణముల పట్టులోనే ఏ మనిషి జీవితమైనా ఉంటుంది, నడుస్తుంది, ముగుస్తుంది. భూమ్మీద ఉన్న జీవులలో ఎవరూ వీటిని దాటి లేరు.

ఈ వలయాల లోపల పంచభూతములున్నాయి. అవి, పృధివి (నేల), ఆపస్సు (నీరు), తేజస్సు (అగ్ని), వాయువు (గాలి), ఆకాశము (నింగి). ఈ చిత్రంలోని చెట్టుకు ఆధారంగా భూమి ఉంది. పంచవటి అక్షరాలున్న నీలపు ప్రదేశం నీరు. ఆకాశంలో ఉన్న సూర్యకాంతి అగ్ని. ఎగురుతున్న పక్షులు గాలికి సూచికలు. ఆకాశం కనిపిస్తూనే ఉంది. ఈ పంచభూతాలే మనిషి జీవనానికి ఆధారాలు. వీటిలో, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, పంచ తన్మాత్రలు ఇమిడి ఉన్నాయి. ఈ 20 తత్త్వములూ శరీరస్థాయిలో ఉంటాయి. ఇది మా సాధనామార్గంలో బాహ్యాధారం.

పచ్చని పంచవటి వృక్షం ప్రాణశక్తికి సూచిక. శ్రీ రామకృష్ణుల వారు సాధనలు చేసిన పంచవటి వృక్షానికి ఇది నమూనా. ప్రాణంలోనే మనస్సు ఇమిడిపోయి ఉంటుంది. ప్రాణము మనస్సులు మా సాధనామార్గంలోని అంతరిక ఆధారాలు.

దేహము, ప్రాణము, మనస్సు - ఈ మూడింటినీ మా మార్గంలో నేర్పించబడే అనేక సాధనాప్రక్రియల ద్వారా స్థిరపరచి, శుద్దీకరణ చేసి, ఈశ్వరుని వెలుగును శక్తిని వాటిలో ప్రతిక్షేపించే సాధనలను మేము అనుసరిస్తాము.

వీటినెలా చేస్తాము?

శరీరస్థాయి

ఆసనములు, ఇంకా ఇతర హఠయోగ వ్యాయామములను క్రమం తప్పకుండా అభ్యాసం చేస్తాము. ఆహారనియమాన్ని పాటిస్తూ, జీవితాన్ని ప్రకృతి సూత్రాలకనుగుణంగా దిద్దుకుంటాము. మా మార్గంలో దేహాన్ని నిర్లక్ష్యం చేయడం ఎంతమాత్రమూ జరుగదు. 

ప్రాణస్థాయి

తొమ్మిది విధములైన ప్రాణాయామ ప్రక్రియలను అనుసరించడం ద్వారా ప్రాణాన్ని స్థిరపరచి, శుద్దీకరించి, అదుపులోకి తెచ్చుకోవడం ఈ స్థాయిలో జరుగుతుంది. ఈ తొమ్మిది ప్రక్రియలూ, వాటి వాటి కాంబినేషన్లతో కూడి లెక్కలేనన్ని ప్రక్రియలౌతాయి. ఒ మనిషి దేహతత్వాన్ని బట్టి అతనికి మాత్రమే సరిపోయే విధానాలను ఉపదేశించడం జరుగుతుంది. కుండలినీ యోగసాధనలు ఈ స్థాయిలో అంతర్భాగాలుగా ఉంటాయి. 

మానసికస్థాయి

ఈ స్థాయిలో వేదాంత, బౌద్ధ, యోగ, తంత్రమార్గాలకు చెందిన ఎన్నో ధ్యానవిధానాలను అభ్యాసం చేస్తాము. ఇవి కూడా మనిషిని బట్టి మారిపోతూ ఉంటాయి. ఎవరికి సరిపోయే ధ్యానవిధానం వారికి ఉపదేశింపబడుతుంది. అందరినీ ఒకే క్లాసులో కూచోబెట్టడం జరుగదు. వీటివల్ల, మనస్సులోని చేతన, ఉపచేతన, అంతచ్చేతనా స్థాయిలు శుభ్రమై, వెలుగుతో నింపబడతాయి.

వీటిని చేయడం వల్ల ఏం జరుగుతుంది?

ఈ సాధనలవల్ల మనిషి జీవితం మొత్తం మారిపోతుంది. ఎంతో ఔన్నత్యాన్ని, దైవత్వాన్ని సంతరించుకుంటుంది. ఈ సాధనామార్గం ఎంతో గొప్పదైన తృప్తిని మీకు అందిస్తుంది. ఈ తృప్తి మీకు డబ్బు వల్ల రాదు, విలాసాల వల్ల, పదవుల వల్ల, ఇంకా మిగతా దేనివల్లా రాదు. మీ జీవితంలో మీరెంతో సాధించి ఉండవచ్చు. కానీ ఈ సాధనామార్గంలో నడవడం ద్వారా కలిగే తృప్తితో పోల్చుకుంటే, మీరు సాధించిన లౌకికవిజయాలు ఏ మూలకూ సరిపోవు.

చివరగా ఈ చిహ్నంలో మీరు 'ఓం'కారమును చూడవచ్చు. ప్రాణము, మనస్సులలో నిండిన దైవశక్తికి ఇది సూచిక. పరిమితదృష్టితో చూచినప్పుడు ఇది జీవాత్మ అవుతుంది. అపరిమితమైన దృష్టితో చూచినప్పుడు ఇదే ఓంకారము పరబ్రహ్మమౌతుంది. సగుణబ్రహ్మానికీ (రూపంతో ఉన్న దేవునికి), నిర్గుణబ్రహ్మానికీ (రూపం లేని దేవునికి) ఇదే సూచిక. రకరకాల మతాలు రకరకాల దేవుళ్ళ పేర్లతో పూజిస్తూ ఉన్నది దీనినే.

ఈ సాధనామార్గంలో నడవడం మనిషిని జీవన్ముక్తునిగా, సిద్ధునిగా చేస్తుంది. ఇది సనాతన భారతీయ సాధనా మార్గం. దీనికి వేదోపనిషత్తుల ఆధారమూ, ప్రామాణికతా  ఉన్నాయి. మంత్ర, తంత్ర శాస్త్రముల ఆధారం మా సాధనామార్గానికి ఉన్నది. ఇదే మానవజీవితానికి ఉన్న అసలైన గమ్యం. దీనిని అందుకోలేకపోతే, మీరెన్ని సాధించినప్పటికీ, చివరకు మీ జీవితం ఖచ్చితంగా వృధా అవుతుంది. అసంతృప్తితో ముగుస్తుంది.

మా పుస్తకాలపైనా, మా ఫేస్ బుక్ పేజీలోనూ, వెబ్ సైట్లలోనూ ఇదే చిహ్నాన్ని మీరు చూడబోతున్నారు. మా ఆశ్రమంలో ఎగురబోయే జెండా పైన కూడా ఇదే చిహ్నాన్ని మీరు త్వరలో చూస్తారు. పంచవటి సభ్యుల సాధనావిధానాన్ని, జీవనవిధానాన్ని ఈ చిహ్నం క్లుప్తంగా మీకు విశదపరుస్తుంది.

దీనిని అర్ధం చేసుకోవడం ద్వారా మా మార్గం మొత్తం మీకు సులభంగా అర్ధమౌతుంది.

5, జనవరి 2022, బుధవారం

న్యూస్ లో పంచవటి - 1

ప్రజలలోకి మరింతగా చొచ్చుకు పోయే కార్యక్రమంలో భాగంగా 'పంచవటి స్పిరిట్యువల్ ఫౌండేషన్' చురుకుగా అడుగులు వేస్తోంది. మా కార్యక్రమాలు ముమ్మరం అయ్యేకొద్దీ మీడియా ద్వారా మరింతగా ప్రజలకు చేరువ కావడం జరుగుతుంది. పంచవటి అందించే జ్ఞానసంపదను, ఆచరణాత్మక ఆధ్యాత్మిక విజ్ణానాన్నీ అందిపుచ్చుకునేవారికోసం సోషల్ మీడియాను కూడా బాగా ఉపయోగించడం జరుగుతుంది. ఈ దిశగా 'పంచవటి ఎగ్జిక్యుటివ్ బోర్డు కమిటీ' లో నిర్ణయాలను తీసుకోవడం జరిగింది.

దీనిలో భాగంగా ఈరోజు 'ఆంద్రప్రభ' దినపత్రికలో వచ్చిన ఈ న్యూస్ ఐటం ను చూడండి.

3, జనవరి 2022, సోమవారం

విజయవాడ బుక్ ఎగ్జిబిషన్ లో 'పంచవటి' పుస్తకాలు

విజయవాడ బుక్ ఎగ్జిబిషన్ లో 'పంచవటి' పుస్తకాలు లభిస్తున్నాయి. ఈ ఎగ్జిబిషన్ 1 వ తేదీ నుండి 11 వ తేదీ వరకు ఉంటుంది.

2022 వ సంవత్సరంలో 'పంచవటి స్పిరిట్యువల్ ఫౌండేషన్' వేస్తున్న అడుగులలో మొదటిది, బుక్ ఎగ్జిబిషన్ లో మా పుస్తకాలను ప్రదర్శించడం. ప్రస్తుతానికి స్టాల్ నంబర్ 103, 104 (భారతీయ గ్రంథమాల) లో మా పుస్తకాలు లభిస్తాయి. ఆసక్తి గలవారు ఈ అవకాశాన్ని వినియోగించుకుంటారని ఆశిస్తున్నాం.

బుక్ ఎగ్జిబిషన్ లో మా పుస్తకాల స్టాల్ కోసం చాలామంది మెయిల్స్ ఇస్తున్నారు. అందుకని ఈ ఏడాదికి తాత్కాలికమైన ఈ ఏర్పాటును చేస్తున్నాం. వచ్చే ఏడాదినుంచీ విజయవాడ, హైదరాబాద్ బుక్ ఎగ్జిబిషన్లలో ప్రత్యేకంగా మా స్టాల్ ను పెట్టడం జరుగుతుంది. 

గమనించండి !