నిత్యజీవితంలో ప్రతిఫలించని జ్ఞానం నిరర్ధకం

13, జనవరి 2022, గురువారం

పంచవటి చిహ్నం

చాలా రోజులనుంచీ పంచవటి చిహ్నాన్ని మా పుస్తకాలమీద మీరు చూస్తున్నారు. ఈమధ్య దానిని మరింత అందంగా తీర్చిదిద్దాము., కానీ దాని వెనుక ఉన్న అర్ధాలు మీకు తెలిసి ఉండక పోవచ్చు. అందుకే ఈ పోస్ట్.

ఈ చిహ్నం చుట్టూ ఆవరించి ఉన్న మూడు వలయాలు త్రిగుణములకు సూచికలు. సత్త్వ, రజో, తమోగుణముల పట్టులోనే ఏ మనిషి జీవితమైనా ఉంటుంది, నడుస్తుంది, ముగుస్తుంది. భూమ్మీద ఉన్న జీవులలో ఎవరూ వీటిని దాటి లేరు.

ఈ వలయాల లోపల పంచభూతములున్నాయి. అవి, పృధివి (నేల), ఆపస్సు (నీరు), తేజస్సు (అగ్ని), వాయువు (గాలి), ఆకాశము (నింగి). ఈ చిత్రంలోని చెట్టుకు ఆధారంగా భూమి ఉంది. పంచవటి అక్షరాలున్న నీలపు ప్రదేశం నీరు. ఆకాశంలో ఉన్న సూర్యకాంతి అగ్ని. ఎగురుతున్న పక్షులు గాలికి సూచికలు. ఆకాశం కనిపిస్తూనే ఉంది. ఈ పంచభూతాలే మనిషి జీవనానికి ఆధారాలు. వీటిలో, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, పంచ తన్మాత్రలు ఇమిడి ఉన్నాయి. ఈ 20 తత్త్వములూ శరీరస్థాయిలో ఉంటాయి. ఇది మా సాధనామార్గంలో బాహ్యాధారం.

పచ్చని పంచవటి వృక్షం ప్రాణశక్తికి సూచిక. శ్రీ రామకృష్ణుల వారు సాధనలు చేసిన పంచవటి వృక్షానికి ఇది నమూనా. ప్రాణంలోనే మనస్సు ఇమిడిపోయి ఉంటుంది. ప్రాణము మనస్సులు మా సాధనామార్గంలోని అంతరిక ఆధారాలు.

దేహము, ప్రాణము, మనస్సు - ఈ మూడింటినీ మా మార్గంలో నేర్పించబడే అనేక సాధనాప్రక్రియల ద్వారా స్థిరపరచి, శుద్దీకరణ చేసి, ఈశ్వరుని వెలుగును శక్తిని వాటిలో ప్రతిక్షేపించే సాధనలను మేము అనుసరిస్తాము.

వీటినెలా చేస్తాము?

శరీరస్థాయి

ఆసనములు, ఇంకా ఇతర హఠయోగ వ్యాయామములను క్రమం తప్పకుండా అభ్యాసం చేస్తాము. ఆహారనియమాన్ని పాటిస్తూ, జీవితాన్ని ప్రకృతి సూత్రాలకనుగుణంగా దిద్దుకుంటాము. మా మార్గంలో దేహాన్ని నిర్లక్ష్యం చేయడం ఎంతమాత్రమూ జరుగదు. 

ప్రాణస్థాయి

తొమ్మిది విధములైన ప్రాణాయామ ప్రక్రియలను అనుసరించడం ద్వారా ప్రాణాన్ని స్థిరపరచి, శుద్దీకరించి, అదుపులోకి తెచ్చుకోవడం ఈ స్థాయిలో జరుగుతుంది. ఈ తొమ్మిది ప్రక్రియలూ, వాటి వాటి కాంబినేషన్లతో కూడి లెక్కలేనన్ని ప్రక్రియలౌతాయి. ఒ మనిషి దేహతత్వాన్ని బట్టి అతనికి మాత్రమే సరిపోయే విధానాలను ఉపదేశించడం జరుగుతుంది. కుండలినీ యోగసాధనలు ఈ స్థాయిలో అంతర్భాగాలుగా ఉంటాయి. 

మానసికస్థాయి

ఈ స్థాయిలో వేదాంత, బౌద్ధ, యోగ, తంత్రమార్గాలకు చెందిన ఎన్నో ధ్యానవిధానాలను అభ్యాసం చేస్తాము. ఇవి కూడా మనిషిని బట్టి మారిపోతూ ఉంటాయి. ఎవరికి సరిపోయే ధ్యానవిధానం వారికి ఉపదేశింపబడుతుంది. అందరినీ ఒకే క్లాసులో కూచోబెట్టడం జరుగదు. వీటివల్ల, మనస్సులోని చేతన, ఉపచేతన, అంతచ్చేతనా స్థాయిలు శుభ్రమై, వెలుగుతో నింపబడతాయి.

వీటిని చేయడం వల్ల ఏం జరుగుతుంది?

ఈ సాధనలవల్ల మనిషి జీవితం మొత్తం మారిపోతుంది. ఎంతో ఔన్నత్యాన్ని, దైవత్వాన్ని సంతరించుకుంటుంది. ఈ సాధనామార్గం ఎంతో గొప్పదైన తృప్తిని మీకు అందిస్తుంది. ఈ తృప్తి మీకు డబ్బు వల్ల రాదు, విలాసాల వల్ల, పదవుల వల్ల, ఇంకా మిగతా దేనివల్లా రాదు. మీ జీవితంలో మీరెంతో సాధించి ఉండవచ్చు. కానీ ఈ సాధనామార్గంలో నడవడం ద్వారా కలిగే తృప్తితో పోల్చుకుంటే, మీరు సాధించిన లౌకికవిజయాలు ఏ మూలకూ సరిపోవు.

చివరగా ఈ చిహ్నంలో మీరు 'ఓం'కారమును చూడవచ్చు. ప్రాణము, మనస్సులలో నిండిన దైవశక్తికి ఇది సూచిక. పరిమితదృష్టితో చూచినప్పుడు ఇది జీవాత్మ అవుతుంది. అపరిమితమైన దృష్టితో చూచినప్పుడు ఇదే ఓంకారము పరబ్రహ్మమౌతుంది. సగుణబ్రహ్మానికీ (రూపంతో ఉన్న దేవునికి), నిర్గుణబ్రహ్మానికీ (రూపం లేని దేవునికి) ఇదే సూచిక. రకరకాల మతాలు రకరకాల దేవుళ్ళ పేర్లతో పూజిస్తూ ఉన్నది దీనినే.

ఈ సాధనామార్గంలో నడవడం మనిషిని జీవన్ముక్తునిగా, సిద్ధునిగా చేస్తుంది. ఇది సనాతన భారతీయ సాధనా మార్గం. దీనికి వేదోపనిషత్తుల ఆధారమూ, ప్రామాణికతా  ఉన్నాయి. మంత్ర, తంత్ర శాస్త్రముల ఆధారం మా సాధనామార్గానికి ఉన్నది. ఇదే మానవజీవితానికి ఉన్న అసలైన గమ్యం. దీనిని అందుకోలేకపోతే, మీరెన్ని సాధించినప్పటికీ, చివరకు మీ జీవితం ఖచ్చితంగా వృధా అవుతుంది. అసంతృప్తితో ముగుస్తుంది.

మా పుస్తకాలపైనా, మా ఫేస్ బుక్ పేజీలోనూ, వెబ్ సైట్లలోనూ ఇదే చిహ్నాన్ని మీరు చూడబోతున్నారు. మా ఆశ్రమంలో ఎగురబోయే జెండా పైన కూడా ఇదే చిహ్నాన్ని మీరు త్వరలో చూస్తారు. పంచవటి సభ్యుల సాధనావిధానాన్ని, జీవనవిధానాన్ని ఈ చిహ్నం క్లుప్తంగా మీకు విశదపరుస్తుంది.

దీనిని అర్ధం చేసుకోవడం ద్వారా మా మార్గం మొత్తం మీకు సులభంగా అర్ధమౌతుంది.