ఉదయాన్నే రవి ఫోన్ చేశాడు.
మళ్ళీ ఏ న్యూస్ చెబుతాడో అనుకుంటూ ఫోనెత్తా. ఎందుకంటే, ప్రపంచంతో నాకున్న ఏకైక సంబంధం అతనే కాబట్టి. ఎక్కడెక్కడి వార్తలన్నీ నాకు తెచ్చి చెబుతూ ఉంటాడు. కొన్ని వింటాను. కొన్ని వినను. టాపిక్ మార్చేయమంటాను. అయినా పాపం ఏమీ అనుకోకుండా చెబుతూనే ఉంటాడు. నేను టీవీ చూడను గనుక, న్యూస్ పేపర్ చదవను గనుక లోకంలో వెనుకబడిపోతున్నానని తన బాధ పాపం ! అందుకని నన్ను అప్ డేట్ లో ఉంచాలని ప్రయత్నిస్తూ ఉంటాడు.
'ఏంటీ సంగతి?' అన్నా
'ఈ వార్త చూశావా? ఎంత వింతగా ఉందో? ప్రముఖ జ్యోతిష్కుడు 'ఫలానా' చనిపోయాడు' అన్నాడు ఎంతో ఆశ్చర్యంగా.
'ఇందులో ఏమిటి వింత? అతను జ్యోతిష్కుడు కావడమా? లేక చనిపోవడమా?' అన్నా నిరాసక్తిగా.
'రెండూనూ' అన్నాడు.
'నాకేమీ వింతగా లేదు' అన్నా
'ఎందుకు పోయాడంటావ్?' అడిగాడు మళ్ళీ
'నూకలు చెల్లాయి, పోయాడు. ఎవడైనా అందుకే పోతాడు' అన్నా
'ఆపు నీ జోకులు. ప్రతిదీ నీకు జోకేనా?' అన్నాడు కోపంగా.
'లేదు నాయనా నేనేమీ జోకెయ్యలేదు. ఉన్నవిషయం చెప్పా. అయినా ఇందులో నీ బాధేంటి?' అడిగా.
'ఏమీ లేదు. తను 96 ఏళ్లపాటు బ్రతుకుతానని, అలా సాయిబాబా చెప్పాడని ఆయనొకసారి చెప్పాడు' అన్నాడు.
'సాయిబాబానా? ఆయనెవరు? ఇంకో జ్యోతిష్కుడా?' అడిగా
'ఛీ కాదు. షిరిడీ సాయిబాబా' అన్నాడు.
'బాబోయ్. ఇదేంటి? ఆయన కూడా జ్యోతిష్యం చెబుతున్నాడా ఈ మధ్య?' అడిగా తెగ ఆశ్చర్యపోతూ.
'ఏమో మరి. ఆయనే టీవీలో చెప్పాడు. మరేమో ఇప్పుడిలా పోయాడు' అన్నాడు.
'ఆయనకు 96 ఉన్నాయేమో నీకేం తెలుసు?' అన్నా.
'ఛా అంత లేవు' అన్నాడు.
'మరి ఆయన ఫాలోయర్స్ ఏమంటున్నారు/' అడిగా.
'ఏవో తిధులు గట్రా లెక్కేస్తే ఆయనకు ఇప్పుడు 96 వచ్చాయట. ఆయన కరెక్ట్ గానే చెప్పిన టైం కే పోయాడంటున్నారు' అన్నాడు.
'ఏ లెక్క ప్రకారం చూసినా 96 తిరగబడి 69 అవడం జరిగే పని కాదు. అలా అనేవాళ్ళని పంచాంగాలు మెడలో వేసుకుని ఊరేగమను' అన్నా.
'లేదు. అలా ముందే చెప్పి పోయినవాళ్లున్నారుట' అన్నాడు.
'అచ్చా ! పోవడంలో కూడా గొప్పలా? చెప్పిన టైం కి పోకపోతే ఏమౌతుంది? భూమి బ్రద్దలౌతుందా? అయినా, చెప్పి పోతే ఏంటి? చెప్పకుండా పోతే ఏంటి? పోవడం తప్పదుగా?' అడిగా.
'అనికాదు. జ్యోతిష్యం ప్రూవ్ అవుతుంది కదా !' అన్నాడు.
'జ్యోతిష్యం ప్రూవ్ కాకపోతే ఏమైందిట?' అన్నా.
ఇలా కాదనుకున్నాడో ఏమో, మాటమార్చి, 'అయినా, మాటమాటకీ సాయిబాబానలా ఎందుకు ఆడిపోసుకుంటావ్?' అన్నాడు కోపంగా.
'ఇదొకటి మళ్ళీ. నేనెప్పుడాయన్ని ఆడిపోసుకున్నాను? ఆయనందరి కలల్లోకొచ్చి ఇలాంటి జ్యోతిష్యాలు చెప్పగా లేనిది, నేనంటే తప్పయిందా? భలే ఉందిలే' అన్నా.
'అయినా సాయిబాబా అలా ఎందుకు చెప్పి ఉంటాడంటావ్?' అడిగాడు.
'రేప్పొద్దున వాకింగ్ లో కలుస్తాడు. అడిగి చెబుతాలే' అన్నా సీరియస్ గా.
'ఎవరు జ్యోతిష్కుడా? సాయిబాబానా?' అన్నాడు తనూ సీరియస్ గానే.
'ఎవరో ఒకర్లే. ఇద్దరిలో ఎవరెదురైనా, నా వాకింగ్ మాత్రం రన్నింగ్ అవుతుంది. అయినా ఇందులో నీ బాదేంటో చెప్పనేలేదు' అన్నా.
'ఏమీ లేదు. నాది పుష్యమీ నక్షత్రం కర్కాటకరాశి అని నీకు తెలుసుకదా. నిన్న రాత్రి యూ ట్యూబ్ లో ఈ జ్యోతిష్కుడు చెప్పినవే వారఫలాలు చూసుకుంటున్నా. మిధున రాశికి ఇలా ఉంటుంది, కర్కాటక రాశికి అలా ఉంటుంది, ఏలినాటి శని పోతోంది. అంతా బ్రహ్మాండంగా ఉంటుంది అని చెబుతున్నాడు. నేను ఆనందంగా వింటున్నా. ఇంతలో పైన స్క్రోలింగ్ వస్తోంది 'ఫలానా జ్యోతిష్కుడు అర్ధాంతర మరణం; అంటూ. బిత్తరపోయా' అన్నాడు.
'ఏలినాటి శని నీ ఇంట్లోంచి ఆయన ఇంట్లోకి అడుగుపెట్టినట్టుంది రెణ్ణెల్ల ముందే' అన్నా.
'జోకులాపు. నా డౌటేంటంటే, అందరికీ రాశిఫలాలు చెప్పేవాడికి తనకు ముంచుకొస్తున్నదని తెలియదా? కరెక్ట్ గా జవాబు చెప్పుము' అన్నాడు హుకుం జారీ చేస్తూ.
'తెలిస్తే ఏమ్ చెయ్యగలడు? ఆపుకుంటాడా? అదేమైనా బాత్రూమా ఆపుకోడానికి? దాన్నికూడా ఎక్కువసేపు ఆపుకుంటే ఏమౌతుందో తెలుసుగా నీకు' అన్నా.
'ప్రపంచం మొత్తానికీ రెమెడీలు చెబుతారుగా జ్యోతిష్కులు. వీళ్ళ జాతకాలు వీళ్లకు తెలియవా మరి' అడిగాడు.
'ఏమో నాకేం తెలుసు? భద్రాచలం భద్రిరాజు అని ఒక కోయజ్యోతిష్కుడున్నాడు. అతను ఆత్మలతో మాట్లాడతాడు. అతని నంబరిస్తా మాట్లాడి చూడు. జ్యోతిష్కుడి ఆత్మను అడిగి చెబుతాడు' అన్నా.
'కోయరాజులూ కొండరాజులూ వద్దులే గాని నువ్వు చెప్పు' అన్నాడు.
'బహుశా సాయిబాబా మాటలని ఓవర్ గా నమ్మేశాడేమో? సాయిబాబా కూడా 69 అనే చెప్పుంటాడు. ఈయనే వర్క్ ప్రెజర్ లో రివర్స్ లో వినుండవచ్చు. తప్పు సాయిబాబాదీ కాదు, జ్యోతిష్యానిదీ కాదు, వర్క్ ప్రెజర్ ది' అన్నా.
'అవున్లే నువ్వూ జ్యోతిష్కుడివేగా అందుకే దానిమీద ఈగ వాలనివ్వవు' అన్నాడు.
'నేనదంతా ఎప్పుడో మానేశాగా, ఇప్పుడు బుద్ధిగా ఉంటున్నా' అన్నా.
'పోయినోళ్ళ జాతకాలు చూడటంలో నువ్వు స్పెషలిస్ట్ వి కదా. చూసి చెప్పు ఎందుకు పోయాడో' అన్నాడు మళ్ళీ పట్టు వదలకుండా.
'దానికి జాతకం ఎందుకు? చెప్తా విను. గతంలో నీతో ఈయన మాట్లాడాడు. నువ్వీయన్ని కలిశావు. అప్పటినుంచే నీకు గుడ్ టైం మొదలైంది. ఆయనకు బ్యాడ్ టైం మొదలైంది. ఇప్పుడది పీక్కొచ్చింది. పోయాడు' అన్నా గెస్ చేస్తూ. ఎందుకంటే రవికి జాతకాల పిచ్చి బాగా ఉంది. విజయవాడ చుట్టుప్రక్కల చాలామంది జ్యోతిష్కులని తన జీతంతో పోషిస్తూ ఉంటాడు కూడా.
'భలే చెప్పావ్. గతంలో సికింద్రాబాద్ స్టేషన్లో అగరబత్తీలు, కుంకాలు మొదలైనవి అమ్మడానికి ఒక స్టాల్ కావాలని ఎలాట్ మెంట్ కోసం నాదగ్గర కొచ్చాడు. అలాట్ చేశాను. అప్పుడు నా జాతకం కూడా వేసిచ్చాడు' అన్నాడు.
'మరెమైంది' అన్నా.
'తర్వాత నా పై ఆఫీసరు ఆ ఎలాట్ మెంట్ ని కేన్సిల్ చేశాడు. ఆ తర్వాత టచ్ పోయింది' అన్నాడు.
'అలా అవుతుందని మరి జ్యోతిష్కుడు గ్రహించలేకపోయాడా? అయినా మీరు పొరపాటు చేశారు. సాయిబాబాను అడిగి ముహూర్తం పెట్టుకుని ఉండాల్సింది. అందుకే అదలా కేన్సిల్ అయింది. చూశారా ఎంత తప్పు చేశారో మీరిద్దరూ?' అన్నా.
'సోదాపు. ఎంతసేపు ఆడిపోసుకుంటావ్ వాళ్ళిద్దర్నీ? అయితే ఎందుకు పోయాడో నీకు తెలీదంటావ్?' అన్నాడు సూటిగా విషయానికొస్తూ.
'తెలీకపోడానికి ఇందులో ఏముంది? ఎంత తెలిసినా తన జాతకం దగ్గరకొచ్చేసరికి జ్యోతిష్కులు కూడా పప్పులో కాలేస్తారు. వాళ్ళేమైనా జ్ఞానులా ఏంటి? అసలు విషయమేమంటే ఈ జ్యోతిష్కులెవరికీ జ్యోతిష్యం పూర్తిగా రాదు. భజనబృందాల అండతో ఏదో అలా కొట్టుకుపోతుంటారంతే. అదీ అసలు సంగతి ! పైగా, ఎక్కువకాలం బ్రతకాలంటే, ఆహారనియమం ఉండాలి, తగినంత వ్యాయామం ఉండాలి, సిగిరెట్లు, త్రాగుడు లాంటి చెడు అలవాట్లు ఉండకూడదు. అత్యాశతో పరుగులు ఉండకూడదు. అప్పుడే ఆరోగ్యం బాగుంటుంది. జాతకానికి దీనికీ సంబంధం లేదు. జాతకంలో కూడా ఈ పోకడలు కనిపిస్తాయి. ఎవడు మార్చుకుంటాడు చెప్పు? ప్రతివాడూ విధిని తనకోసం మారమంటాడు. దేవుణ్ణి తన మాట వినమంటాడు. తను మాత్రం మారడు, మంచిమాట చెబితే వినడు. ఈ లోకమింతే. ఈ మనుషులింతే. అందుకే నాకు మనుషులంటేనే విరక్తి పుట్టి జాతకాలు చూట్టం పూర్తిగా మానేశాను. జ్యోతిష్కుడు దేవుడు కాదు. వాడూ మీలాంటి మనిషే. వాడికీ కష్టాలుంటాయి. నష్టాలుంటాయి. వాడూ పోతాడు. వాడి జాతకమూ వాడికి తెలీదు.'అన్నాను.
'మరి మనుషులందరూ జ్యోతిష్కుల దగ్గరికి ఎందుకు పోతారంటావ్/' అడిగాడు.
'బుద్ధిలేక ! జిల్లెళ్ళమూడి అమ్మగారి మాట ఒకటి చెబుతా విను. 'ఏడుస్తూ పడేవాడు నవ్వుతూ పడేవాడిని సలహా అడుగుతాడు' అన్నది అమ్మ. అర్థమైందా? వాడికి తెలుసని వీడనుకుంటాడు. వీడికి తెలీక తనదగ్గరకొచ్చాడని వాడనుకుంటాడు. జీవితనాటకంలో ఇద్దరూ పావులే. ఏ నాటకానికైనా ఎప్పుడో ఒకప్పుడు ముగింపు తప్పదు. అంతే' అన్నా.
'అయితే పడక తప్పదంటావ్?' అన్నాడు సీరియస్ గా.
'అది పడ్డాక గాని తెలీదు. కాలు జారాకే తెలుస్తుంది, జారినట్లు. ఏంటి ఈ మధ్యేమైనా కాలు జారావా?' అన్నా నవ్వుతూ.
'ఆ ! ఈ వయసులో అదొక్కటే తక్కువ ! ఉంటా మరి ! త్వరగా ఆఫీసుకి పరిగెత్తాలి. బోలెడు పనుంది' అన్నాడు.
'సర్లే ! కార్లో వెళ్ళు. పరిగెత్తకు. కాలుజారగలదు. టీ టైం లో ఫోన్ చెయ్యి. జ్యోతిష్యం చూసి, కాలు జారే అవకాశం నీకెప్పుడుందో చెబుతా' అన్నా నవ్వుతూ.
'ఆపు జోకులు. ఉంటా మరి !' అంటూ ఫోన్ పెట్టేశాడు.
నేనూ ఆఫీసుకి తయారవడం మొదలుపెట్టా.
కద కంచికి మనం ఆఫీసుకి !