“అసమర్ధజాతికి ఆత్మగౌరవ అర్హత ఉండదు"

27, జనవరి 2022, గురువారం

'తంత్రసారము' ఈ బుక్ విడుదలైంది

'పంచవటి  పబ్లికేషన్స్' నుండి  వస్తున్నవి మామూలు పుస్తకాలు కావు. అవి జ్ఞానభాండాగారాలు. మన ప్రాచీన విజ్ఞానపు నిధులు. అటువంటి పుస్తకాలలో మరొక్క మహత్తరమైన గ్రంధరాజం ఈ రోజున, అంటే పుష్య బహుళ  దశమి రోజున వెలువడుతున్నది.

దానిపేరు 'తంత్రసారము'.

ఈ పుస్తకం కోసం ఎంతోమంది మేధావులు, తంత్రశాస్త్రాభిమానులు చాలాకాలంగా ఎదురు చూస్తున్నారు. కొందరైతే,  సంస్కృతంలో ఉన్న ఈ గ్రంధానికి తెలుగు వ్యాఖ్యానాన్ని వ్రాయమని నన్ను గతంలో కోరారు కూడా. వారందరి కోరికను తీరుస్తూ 'తంత్రసారము' అనబడే ఈ పుస్తకాన్ని తెలుగులో నేడు విడుదల చేస్తున్నాము. మా సంస్థ నుండి వెలువడుతున్న మిగతా చాలా పుస్తకాలలాగా ఇది కూడా మొదటిసారిగా తెలుగులోకి వస్తున్నది. అదికూడా నా చేతులమీదుగా జరగడం నా అదృష్టంగా భావిస్తున్నాను.

'తంత్రశాస్త్రం' అంటే లోకులలో చాలా అపోహలున్నాయి. దానికి కారణం అసలైన తంత్రమంటే ఏమిటో లోకానికి తెలియకపోవడం. భూతప్రేతాలు, క్షుద్రపూజలు, చేతబడులు మొదలైన పనికిరాని తంతులతో కూడినదే తంత్రమని చాలామంది అనుకుంటూ ఉంటారు. ఇది శుద్ధపొరపాటు. అది క్షుద్రతంత్రం. అసలైన తంత్రం వేరు. అసలైన తంత్రం శుద్ధమైన సాధనామార్గం. 

తంత్రశాస్త్రమనేది ఒక ఆధ్యాత్మిక సాధనామార్గం. దీనికి శాస్త్రప్రామాణికత ఉన్నది. ఆ శాస్త్రములను ఆగమములంటారు. వీటిలో శైవాగమములు, శాక్తాగమములు, వైష్ణవాగమములు ప్రధానములుగా ఉన్నాయి. ఇవన్నీ ద్వైతసిద్ధాంతమును ప్రబోధించే మార్గములే. వీటిలో ఒక్క శైవాగమశాస్త్రములలోనే అద్వైతమార్గం ఉన్నది. అది శివాద్వైతశాస్త్రంలో మాత్రమే మనకు గోచరిస్తుంది. దీనికే త్రికశాస్త్రమని పేరు. నేడు దీనినే కాశ్మీరశైవమని పిలుస్తున్నారు.

పదవశతాబ్దం నుంచి మనదేశం పైన జరిగిన తురకల దండయాత్రలలోను, వారు బుద్ధిలేకుండా మనదేశంలో జరిపిన విధ్వంసకాండలోను, మన దేవాలయాలు గ్రంధాలయాలు వేలాదిగా ధ్వంసమయ్యాయి. వేలాది  విలువైన గ్రంధాలు తగలబెట్టబడ్డాయి. వాటిలోని విలువైన జ్ఞానసంపదంతా నాశనమైపోయింది. మన అదృష్టం బాగుండి కొన్నికొన్ని గ్రంధాలు మాత్రం బ్రతికి బయటపడ్డాయి. వాటిల్లో, మాలినీ విజయోత్తర తంత్రము, తంత్రాలోకము, తంత్రసారము అనే గ్రంధాలు కొన్ని. ఇవి దాదాపుగా  900 వంవత్సరాల తర్వాత క్రీ. శ . 1900 ప్రాంతంలో కాశ్మీర్ లో పురాతన తాళపత్ర గ్రంధాలలో దొరికాయి. వాటిని భద్రపరచిన ఘనత అప్పటి కాశ్మీరరాజైన శ్రీప్రతాపసింహమహారాజు గారికీ, ఆయన ఏలుబడిలో ఉన్న పురాతన తాళపత్రాల గ్రంధాలయాధికారి శ్రీముకుందరామశాస్త్రి గారికీ  చెందుతుంది. నూరేళ్లక్రితం దీనిని హిందీలోకి అనువదించింది ఈయనే. ఈ మహానుభావుల కృషి వల్లనే ఈ గ్రంధాలను మనం ఈనాడు చదువుకోగలుగుతున్నాం.  మనమేకాదు, సంస్కృతం నేర్చుకున్న  వందలాది మంది యూరోపియన్లు, అమెరికన్లు నేడు ఈ పుస్తకాలను చదివి, వాటిలోని అత్యున్నతమైన ఫిలాసఫీకీ, లాజిక్ కీ ముగ్దులైపోయి, శివభక్తులుగా మారారు. మారుతున్నారు.

వీటిలో 'శ్రీ మాలినీ విజయోత్తర తంత్రము' ను తెలుగులో నా వ్యాఖ్యానంతో ఇప్పటికే ప్రచురించాము. ఇప్పుడు, అభినవగుప్తులవారు వ్రాసిన 'తంత్రసారము' ను ప్రచురిస్తున్నాము. త్వరలో ఈయన యొక్క లైఫ్ టైం వర్క్ అయిన 'తంత్రాలోకము' కూడా నా వ్యాఖ్యానంతో  తెలుగులోకి రాబోతున్నది.

క్రీ.శ.1000 కంటే ముందు మనదేశంలో,ముఖ్యంగా శైవాగమాలలో  ప్రచారంలో  ఉన్న, స్పంద, క్రమ, కుల, ప్రత్యభిజ్ఞములనే అన్ని శైవతంత్ర సిద్ధాంతాలనూ ఒకేచోట చేర్చి, వాటిని సతార్కికంగా వివరిస్తూ ఒక బృహద్గ్రంధాన్ని వ్రాయమని తన కౌలాచార గురువైన శ్రీ శంభునాధులవారు తనను ఆదేశించినట్లు, దానిననుసరించి  తానీ గ్రంధాన్ని వ్రాసినట్లు అభినవగుప్తులవారు తన 'తంత్రాలోకము' ముందు మాటలో వ్రాశారు. ఇవన్నీ క్రీ. శ 1000 ప్రాంతంలో కాశ్మీర్ లో జరిగిన సంఘటనలు. ఆ తంత్రాలోకానికే ఈ 'తంత్రసారము' సంక్షిప్తరూపం. ఇదే 550 పేజీలలో ఉందంటే ఇక 'తంత్రాలోకం'  ఎంత పెద్ద గ్రంధమో అర్ధం చేసుకోవచ్చు. ఈ గ్రంధం బ్రతికి బట్ట కట్టబట్టే, ఆయా తాత్వికచింతనలన్నీ ఒకప్పుడు ఉన్నాయని నేడు మనం తెలుసుకోగలుగుతున్నాం. 

ప్రపంచంలోని ఏ మతమైనా తీసుకోండి, వాటన్నిటికంటే ఎంతో గొప్పదీ ఉత్తమమైనదీ శివాద్వైతం. అంతేకాదు, హిందూమతం లోని అన్ని తాత్త్విక చింతనామార్గాలలోకీ శిఖరం లాంటిది ఈ శాస్త్రం. దీనిని వ్రాసిన అభినవగుప్తులవారు మామూలు మనిషి కాదు. అటువంటి మహానుభావులు వెయ్యేళ్లకు ఒక్కరు మాత్రమే పుడతారు. ఈయన సాంఖ్య, బౌద్ధ, వైష్ణవ, శైవశాస్త్రములను క్షుణ్ణంగా అధ్యయనము చేసిన మహాపండితుడు మాత్రమే గాక, మహా తపస్వి, జ్ఞానీ కూడా. నేటి సోకాల్డ్ ప్రవక్తలతో పోలిస్తే ఈయనను 'మహాప్రవక్త' అనవచ్చు. అటువంటి మహాప్రవక్త వ్రాసిన ఈ గ్రంధమును తెలుగులోకి తేవడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను.

ఇందులో 22 అధ్యాయాలున్నాయి. వీటిల్లో ఎంతో నిశితమైన లాజిక్ తో కూడిన సిద్ధాంత భాగమేగాక, అణవోపాయము, శాక్తోపాయము, శాంభవోపాయము, అనుపాయము, శక్తిపాతము, షడధ్వములు, వివిధరకములైన దీక్షలు, విధులు, ఆగమప్రామాణికతలను వివరిస్తూ, వీటన్నిటికీ తలమానికంగా, చివరి అధ్యాయములో ఆరువిధములైన సాధనలతో కూడిన కౌలాచారతంత్రమును కూడా వివరించడం జరిగింది.      

ఈయన దాదాపుగా 50 గ్రంధములను రచించారు. వాటితో బాటు తనకెంతో ఇష్టమైన 'భైరవస్తవము' అనే తొమ్మిది శ్లోకములతో కూడిన స్తోత్రమును కూడా రచించారు.  దానినీ, ఆ శ్లోకములకు నేను వ్రాసిన తెలుగు పద్యములనూ ఈ గ్రంధంలో ఇచ్చాను. దానినాయన  పుష్య బహుళదశమి నాడు వ్రాసినట్లుగా అందులో వ్రాసుకున్నారు. బహుశా అది క్రీ. శ. 1016 సంవత్సరం కావచ్చు. మా గ్రంధం కూడా, అనుకోకుండా అదే తిధికి దగ్గరలోనే, పుష్యమాసంలోనే పూర్తయింది. అలా జరగాలని మేము ప్లాన్ చెయ్యలేదు. అనుకోకుండా అలా జరిగింది. కనుక, అదే పుష్య బహుళ దశమి నాడు, అంటే ఈరోజున, ఈ పుస్తకాన్ని 'ఈ బుక్' గా విడుదల చేస్తున్నాను. దీనిని కాకతాళీయంగా నేను భావించడం లేదు. ఎందుకంటే, ప్రపంచంలో ఏదీ కాకతాళీయం కాదని నాకు తెలుసు కాబట్టి.

'భైరవ స్తవము' చివరలో అభినవగుప్తులవారు వ్రాసిన సంస్కృత శ్లోకము, దానికి నా తెలుగు పద్యమూ, దాని వివరణలూ ఇవి.

శ్లో|| వసురసపౌషే కృష్ణ దశమ్యామ్

అభినవగుప్తః స్తవమిమ మకరోత్ 

యేన విభుర్భవ మరుసంతాపం

శమయతి ఝటితి జనస్య దయాళుః 


ఆ || అరువదెనిమిదేండ్ల యరుదైన దినమందు

స్తవము నభినవుండు చక్కజేసె

దీనినెంచి మిగుల దయతోడ నీశుండు

తాపతతుల నెల్ల దీర్చుగాత 


అష్టవసువులు గనుక, వసు అంటే 8. షడ్రసములు గనుక రస అంటే 6. 'అంకానాం వామతో గతి: (అంకెలన్నీ కుడినుంచి ఎడమకు నడుస్తాయి)' గనుక, వసురస అనేపదం 68 ని సూచిస్తున్నది. అంటే, 'తన 68 వ సంవత్సరంలో పుష్యమాసపు కృష్ణదశమి, మకరసంక్రాంతి నాడు అభినవగుప్తుల వారు ఈ స్తోత్రమును రచించారు. దీనిని పఠించడం వల్ల, దయాళువైన పరమేశ్వరుడు కరుణిస్తాడు. జనులకు కలిగే బాధలను శమింపజేస్తాడు' - అని ఈ శ్లోకం యొక్క అర్ధం.

ప్రస్తుతం మా ఆశ్రమస్థలాన్ని సేకరించే పని అయిపోయింది గనుక, ఇక పుస్తకాల ప్రింటింగ్ మళ్ళీ మొదలౌతుంది. ఆ క్రమంలో 'తంత్రసారము' కూడా పుస్తకంగా వస్తుంది. ఈ లోపల 'ఈ బుక్' ని  చదివి ఆనందించండి మరి !

యధావిధిగా, ఈ పుస్తకాన్ని వ్రాయడంలో త్రిశక్తుల సహాయం నాకు లభించింది. వారు, నా శ్రీమతి సరళాదేవి, నా శిష్యురాళ్ళు అఖిల, శ్రీలలితలు. సంస్కృతశ్లోకాలను, వచనాన్ని తెలుగులో వ్రాయడంలో శ్రీలలిత ప్రధానపాత్ర పోషిస్తే, పుస్తకం టైప్ సెట్టింగ్, ప్రూఫ్ రీడింగ్, పబ్లిషింగ్ మొదలైన పనులలో ఎంతో ఓర్పుతో అఖిల సహాయపడింది. నాకైతే చిన్నప్పటినుంచీ ఆధ్యాత్మిక చింతన ఎక్కువ గనుక నేనీ పనులు చేస్తున్నాను. నాతోబాటు వీరందరూ కూడా ఇంత కష్టపడుతున్నారంటే అది జగజ్జనని అనుగ్రహం కాక మరేమనుకోవాలి?  వీరు ముగ్గురి తోడ్పాటు లేకుంటే నా పుస్తకాలలో ఒక్కటి కూడా వెలుగు చూచేది కాదు. అందుకే వీరికి ఎంతగా కృతజ్ఞతలు చెప్పినా తక్కువే అవుతుంది. అయినా సరే, వీరికి మళ్ళీ నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.

ఇకపోతే, ముఖచిత్రాన్ని యధావిధిగా అద్భుతంగా తీర్చిదిద్దాడు శిష్యుడు ప్రవీణ్. చిరకాలం లోకంలో నిలచిపోయే ఇలాంటి ఉత్తమ గ్రంధాలను  తెలుగు ప్రపంచానికి  అందించే పనిలో, నాకు సహచరులయ్యే అదృష్టం వీరికి పట్టింది. అది వారి సుకృతం. వీరందరికీ ఋణపడి ఉన్నాను. పరమ శివానుగ్రహం వీరికి నిరంతరం ఉండాలని ప్రార్ధిస్తున్నాను.

యధావిధిగా ఈ పుస్తకం కూడా గూగుల్ ప్లే బుక్స్ నుండి ఇక్కడ లభిస్తుంది. ఇంకొక క్రొత్త పుస్తకంతో మళ్ళీ త్వరలో కలుసుకుందాం. అప్పటివరకూ ఈ మహోత్తమగ్రంధాన్ని అధ్యయనం చేయండి.