Pages - Menu

Pages

3, మార్చి 2022, గురువారం

రాజమండ్రి స్మృతులు - 1

మొన్నీ మధ్యన 
ఇనస్పెక్షన్ల కోసం రాజమండ్రి, కడియం వెళ్ళటం జరిగింది. ఉదయాన్నే రైలు దిగాము. స్టేషన్ మేనేజరు, ఇనస్పెక్టర్లు వచ్చి రిసీవ్ చేసుకున్నారు. స్టేషన్ బయటే ఉన్న గెస్ట్ హౌస్ లో బస. ఈలోపు శిష్యుడు జానకిరామ్ వచ్చి కలిశాడు. ఫ్రెష్ అయ్యి, ఎదురుగా ఉన్న కన్నమ్మతల్లి గుళ్ళోకి వెళ్లి నమస్కారం చేసుకున్నాం. ప్రక్కనే ఉంటుంది, AMH School. అందులోనే నేను ఆరునుంచి ఎనిమిది మధ్య వరకూ చదూకున్నాను. అది దాదాపు ఏభై ఏళ్ల క్రితం.

1973 వ సంవత్సరంలో నేనీ స్కూల్లో ఆరోతరగతిలో చేరాను. అప్పట్లో కార్పొరేట్ స్కూళ్ళు లేవు. కనీసం ట్యుటోరియల్ కాలేజీలు కూడా లేవు. అప్పట్లో ఈ స్కూల్ ని, 'ఆల్కట్ గార్డెన్స్ మునిసిపల్ స్కూల్' అని పిలిచేవారు. ఇప్పుడు 'శ్రీనివాస రామానుజం కార్పొరేషన్ స్కూల్' అని పిలుస్తున్నారు. కల్నల్ ఆల్కాట్ పేరు మీద అప్పట్లో అలా పిలిచేవారనుకుంటా.

ఆరోజుల్లో, నిక్కరూ చొక్కా వేసుకుని పుస్తకాలను భుజం మీద పెట్టుకుని నడుచుకుంటూ స్కూల్ కెళ్ళేవాడిని. దారిలో కన్నమ్మతల్లి గుడిలో దణ్ణం పెట్టుకుని, బొట్టు పెట్టుకుని బడికెళ్ళడం అలవాటు. అప్పట్లోనే డౌటు, 'అమ్మవారేంటి ఇంత భయంకరంగా ఉంది? ఎందుకిలా భయపెడుతుంది? అని'. 

మొదటిసారిగా మేకను అమ్మవారికి బలివ్వడం అక్కడే చూశా. ఆ తిరణాలకోసం మూగిన జనాన్ని చూచి, ఏదో అనుకుని లోపలకు దూరి చూస్తే, కనిపించిన సీన్ చూచి, అప్పట్లో ఎంత భయమూ అసహ్యమూ వేసిందో చెప్పలేను. ఒక మేక మెడలో దండ వేసి ఉంది. దానికి బొట్టు పెట్టి ఉంది. అందరూ డప్పులు వాయిస్తూ దానిచుట్టూ  ఎగురుతున్నారు. అదేమో భయంతో బిక్కచచ్చిపోయి ఉంది. దాన్నేం చేస్తున్నారని ఆ గుంపులో ఒకడ్ని అడిగా. బలిస్తారన్నాడు. బలంటే ఏంటని అడిగా. దానిని చంపుతారని చెప్పాడు. నేను బిగుసుకుపోయా.

ఇలాంటి బలులు స్వీకరించవద్దని, మేక ప్రాణాన్ని కాపాడమని కన్నమ్మతల్లిని ఎంతో దణ్ణం పెట్టుకున్నా.  కానీ నా మొరను తల్లి వినలేదు. లేదా, జనం వినలేదేమో? ఏదైతేనేం, బలి అయిపోయింది. అసలీ బలులేంటి? అమ్మవారు నిజంగా ఇలాంటి జంతుబలులు కోరుతుందా? అనే ఆలోచన నాలో ఆరోజున మొదలైంది. అప్పుడు నాకు 10 ఏళ్ళు. అదంతా గుర్తొచ్చి నవ్వొచ్చింది.

అప్పట్లో అమ్మవారి విగ్రహం చాలా భీకరంగా ఉండేది. గుడికూడా డౌన్లో ఉండేది.  రోడ్డుకోసం గుడిని పైకి లేపారల్లే ఉంది. క్రొత్త విగ్రహం లో అంత కళా లేదు, అంత భీకరత్వమూ లేదు. గుడి కూడా మోడరన్ గా ఉంది.

అదే సందులో గోదారి గట్టు దగ్గరగా మేం ఉండేవాళ్ళం. అప్పుడు మేమున్న ఇంటి స్థలమంతా ప్రస్తుతం ఖాళీగా ఉంది.  ఆ జాగా అమ్ముతామని ఒక బోర్డు పెట్టి ఉంది. గోదారి గట్టు అప్పట్లో ఎర్రమట్టి రోడ్డుగా, దరిద్రంగా ఉండేది. జనమంతా దానిని బహిర్భూమిగా వాడేవాళ్లు. ఇప్పుడు సిమెంట్ రోడ్డు పడింది. నీట్ గా ఉంది.

ఆ ఇంట్లో ఉన్నపుడే, సాయంత్రాలలో గోదారిగట్టు చివరలో ఉన్న పంప్ హౌసు దగ్గర కెళ్ళి, ఊరకే ఆకాశంలోకి నీళ్ళలోకి చూస్తూ చాలాసేపు కూచునేవాడిని. గోదారి తీరమంటే ఏదో తెలియని ఆకర్షణ ఆ వయసులోనే మొదటిసారిగా నాకు కలిగింది.  అదిప్పటికీ అలాగే ఉంది.  గోదారిగట్టుమీద కూచుని, గోదాట్లోకి చూస్తూ ఎన్ని గంటలైనా అలా ఉండిపోవచ్చు. గోదారిలో ఏదో తెలియని మహత్యం ఉంది.

ఏ సాధనా చేయకముందే, 10 ఏళ్ల వయసులో నాకు కలిగిన మొదటి ఆధ్యాత్మిక అనుభవాలు ఈ గోదారి గట్టుమీదే కలిగాయి. అవిప్పటికీ నాకు బాగా గుర్తున్నాయి. అయితే, అవి ఆధ్యాత్మిక అనుభవాలన్న విషయం అప్పట్లో తెలీదు.

అప్పట్లో స్కూల్ నుంచి సరాసరి ఇంటికెళ్ళకుండా, గోదాట్లో దిగి ఈతలు కొట్టి, ఒంటికి మట్టి పూసుకుని ఇంటికెళ్లినా, అమ్మ కనిపెట్టి వీపు వాయించిన రోజులు గుర్తొచ్చాయి. అదంతా శ్రీమతికి, జానకిరామ్ కి చెప్పాను. అందరం నవ్వుకున్నాం.

అదే వీధిలో సినీహీరో రంగనాధ్ తన ఫెమిలీతో ఉండేవారు. ఆయనా, మా నాన్నా స్నేహితులు కావడంతో, అప్పుడప్పుడూ నేను వాళ్ళింటికి వెళుతూ ఉండేవాడిని. అత్తయ్య, మామయ్య అని వాళ్ళను పిలిచేవాడిని. ఆ ఇంటిని మా వాళ్లకు చూపించాను.

నన్ను ఆరో తరగతిలో చేర్పించింది రంగనాధ్ మామయ్యే. ఆరోజున మా నాన్నకు ఆఫీసు పనుండి రాలేకపోతే, మామయ్యే నన్ను రిక్షాలో ఎక్కించుకుని వెళ్లి, స్కూల్లో చేర్పించాడు. ఆ సంగతి ఇంకా నాకు బాగా గుర్తుంది. ఆ సందులు గొందులన్నీ నేను తిరిగి ఆడుకున్నవే.

మొదటిసారిగా లతామంగేష్కర్ పాడిన, 'ఎ దిల్ ఔర్ ఉన్కి, నిగాహొంకే సాయే, బనాకే క్యో బిగాడా రే' మొదలైన  సోలో పాటలను అక్కడే విన్నాను. వేరే లోకానికి తీసుకుపోయేవి ఆ పాటలు. సంగీతమంటే అభిమానం అక్కడే మొదలైంది.

ఆ వయసులోనే ఒక వీధి డ్రామాలో ఒక చిన్నపిల్లాడి వేషం వేశాను. శివరాత్రిపూట జాగారం చేస్తూ ఆ వీధిడ్రామా వేశాం. ఆ రకంగా, స్టేజిమీద నటించడానికి కూడా రాజమండ్రిలోనే మనకు అక్షరాభ్యాసం ! రాజమండ్రి నాకు అనేక విషయాలలో ఓనమాలను దిద్దించింది.

గెస్ట్ హౌస్ కి తిరిగి వచ్చి, ఉపాహారం సేవిస్తుండగా, ఇంకా కొన్ని విషయాలు మా వాళ్ళతో చెప్పాను.

'AMH స్కూలు ఈ గెస్ట్ హౌస్ ముందే ఉంటుంది. లీజర్లో, ఇదే గెస్ట్ హౌస్ కాంపౌండ్ వాల్ గోడల మీదెక్కి, అక్కడనుంచి అందే చింతచెట్టు కొమ్మల్ని పట్టుకుని ఊగేవాళ్ళం. వాచ్ మేన్ అరిచేవాడు. ఇప్పుడు, అదే గెస్ట్ హౌస్ లో నేను  అధికారిక హోదాలో దిగాను. ఏభై ఏళ్ల క్రితం నిక్కర్లు వేసుకుని తిరిగే రోజుల్లో, స్టేషన్ మేనేజర్ని చూస్తే భయం. ఇప్పుడదే స్టేషన్ మేనేజర్ వచ్చి నన్ను రిసీవ్ చేసుకుని ప్రొటోకాల్ ఇచ్చాడు. కాలప్రభావం ఇలా ఉంటుంది !

కొన్నాళ్ళు ఈ సందులో ఉన్న తర్వాత, మెయిన్ రోడ్డు మీదగా శ్యామలా టాకీస్ కి వెళ్లే దారిలో ఒక ఇంటికి మారాం. ఆ దారిలోనే నేను చిన్నప్పుడు చేరిన వ్యాయామశాల ఉండేది. అప్పట్లో గౌతమీ వ్యాయామశాల బయట నిలబడి, ఆంజనేయస్వామి విగ్రహాన్ని సంభ్రమంగా చూసేవాడిని. ఒకసారి, భయం భయంగా అక్కడ గేట్లో ఉన్న అతన్ని అడిగి లోపలికెళ్ళి, లోపల మనుషులు ఎలా వ్యాయామాలు చేస్తున్నారా? అని చూశాను. గదుల్లో అద్దాలున్నాయి. వాటిముందు నిలబడి కండలు చూచుకుంటూ డంబెల్స్, బార్ బెల్స్ చేస్తున్నారు. అప్పట్లో వాటి పేర్లు కూడా నాకు తెలీవు. వాళ్లేంటి రాక్షసుల మాదిరి ఉన్నారని వాళ్ళను చూసినా భయమే !

ఆంజనేయపాత్రధారి ఆర్జా జనార్దనరావు అక్కడ శిక్షణ పొందినవాడే. అక్కడున్న ఒకాయన్ని నాకూ వ్యాయామాలు నేర్పమని అడిగితే, 'చిన్నపిల్లాడివి. నీకెందుకు? ఇంకా నాలుగేళ్లు ఆగి రా. అప్పుడు చూద్దాం' అన్నాడు. పైగా, ఫీజు ఉంటుందని చెప్పాడు. అప్పట్లో మనదగ్గర డబ్బులెక్కడివి? పుస్తకాలు కొనుక్కోడానికే డబ్బుల్లేవు. అందుకని, మా ఫ్రెండ్ వాళ్ళన్నయ్య నడిపే ఒక గోదాకెళ్ళాను, అక్కడ కుస్తీలు పట్టేవాళ్ళు. సాముగరిడీలు  చేసేవాళ్ళు. వాళ్ళే నాకు మొదటిసారిగా దండీలు, బస్కీలు ఎలా తియ్యాలో నేర్పించారు. 'మరీ పీలగా గాలికి ఎగిరిపోయేలా ఉన్నావు, కోడిగుడ్లు తిను. బలమొస్తుంది' అని చెప్పింది వాళ్ళే. కోడిగుడ్లను తింటారని మొదట్లో అక్కడే విన్నాను. పదేళ్ళోచ్చేవరకూ మనకా విషయం తెలీదు ! కోడి గుడ్డును పెడుతుందని, దానిని తింటారని తెలిసినప్పుడు ఎంత ఆశ్చర్యమూ, అసహ్యమూ వేసిందో ! అప్పట్లో అంత తెలివితేటలుండేవి మరి !

ఆ తర్వాత, రాజమండ్రి వదిలెయ్యడమూ, పూనూరు, నర్సరావుపేటలకు మారడమూ, కరాటే నేర్చుకోవడమూ, 21 ఏళ్లకు మొదటి బ్లాక్ బెల్ట్ సాధించడమూ అన్నీ జరిగాయి. ఆ విధంగా, కోడిగుడ్డును తినకుండానే బ్లాక్ బెల్ట్ వచ్చింది.

ఇవన్నీ చెబుతుంటే వింటున్న మా ఇనస్పెక్టర్ ఒకాయన ఇలా అడిగాడు, ' కరాటే వస్తే కయ్యానికి కాలు దువ్వాలి కదా ! మీరేంటి శాంతమూర్తిగా ఉన్నారు మరి?' అని.

నవ్వాను. అతనికి మనలోని ఆధ్యాత్మిక కోణం తెలియదు.

'అదే పొరపాటు ! అది మీ ఊహ మాత్రమే. మార్షల్ ఆర్ట్స్ బాగా వచ్చినవాళ్లు కయ్యానికి ఎట్టి పరిస్థితిలోనూ కాలు దువ్వరు. ఒకవేళ ఎవరైనా అలా దువ్వుతుంటే, వారికి మార్షల్ ఆర్ట్ లోతుపాతులింకా అర్ధం కానట్లే. అవసరమైతే వారొక దెబ్బ తింటారు గాని, కొట్టరు, ఎందుకంటే, కొడితే ఏం జరుగుతుందో వారికి తెలుసు. వారి స్కిల్ వారికి తెలుసు. మేము కొట్టే దెబ్బలు ఆషామాషీగా ఉండవు. ఆయువుపట్ల మీద తగులుతాయి. అవతలివాడు చచ్చాడంటే అదొక కేసౌతుంది. అందుకే, మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటే మీకు నిగ్రహం పెరుగుతుంది. దూకుడు తగ్గుతుంది. సినిమాలలో చూచేది నిజమనుకోకండి'.

మాటల్లో ఉండగానే ఉపాహారం ముగించాము. వచ్చిన పని చూచుకోవాలి గనుక, ఇనస్పెక్షన్ పనిమీద బయలుదేరాము.

(ఇంకా ఉంది)