Pages - Menu

Pages

7, మార్చి 2022, సోమవారం

రాజమండ్రి స్మృతులు - 2

రాజమండ్రిలో పని ముగించుకుని కడియం కు బయలుదేరాము. ఆ దారిలో పోతుంటే చిన్నప్పటి సంగతులు మరికొన్ని గుర్తొచ్చాయి.

మొదటిసారి నేను సత్యసాయిబాబాను గురించి విన్నది రాజమండ్రిలోనే. ఇదే దారిలోనే ఉన్న ఒక స్కూల్ లో ఆయన దిగారు. అందరూ తండోపతండాలుగా పోయి చూస్తున్నారు. నేనూ ఇంకా నలుగురు పిల్లలమూ కలసి ఆయన్ను చూద్దామని వెళ్ళాము. ఆ స్కూలు బిల్డింగు లోపలెక్కడో ఆయనున్నారు. మామూలుగా వెళ్లి, అందరినీ చూచినట్లు చూడటమే అని అమాయకంగా అనుకున్నా. అక్కడ పరిస్థితి అలా లేదు. కాసేపు చూచి విసుగుపుట్టి అక్కడనుంచి వచ్చేశాము. తర్వాతకాలంలో అఫీషియల్ డ్యూటీ మీద ధర్మవరం వెళ్ళినపుడు చాలాసార్లు ఆయన్ను చూచాను. చివరాఖరికి అలా పోయాడు పాపం !

అక్కడే ఆయన బొమ్మలున్న ఉంగరాలు, గొలుసులు అమ్ముతున్నారు. వాటిని కాసేపు చూచి, అక్కణ్ణించి బయలుదేరి వస్తూ పక్కనే ఉన్న చెరుకుతోటలలోకి వెళ్ళాము. ఎక్కడనుంచో బెల్లం వాసన వస్తుంటే, దానిని వెదుక్కుంటూ ఆ చెరుకుతోట మధ్యలోకి వెళ్లి చూచాము. ఒక పెద్దగుంటలో చెరుకురసాన్ని పోసి, కాస్తున్నారు. అప్పట్లో మనుషులలో మంచితనం ఇంకా బ్రతికి ఉండేది. నడుచుకుంటూ పల్లెలు దాటి పోతుంటే, ఎక్కడికి పోతున్నారని వివరాలు కనుక్కుని మంచినీళ్లు, మజ్జిగ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడన్నిటినీ ఖరీదు కడుతున్నారు. ఆ చెరుకుతోటలో ఉన్న రైతు ఎవరోగాని, ఉడుకుతున్న చెరుకురసాన్ని మాకు తలాకాస్తా గ్లాసులో పోసి ఇచ్చాడు త్రాగమని. భలే రుచిగా ఉంది చెరుకుపానకం..

ఈ విషయం చెబుతుంటే వింటున్న జానకిరామ్, 'ఈ ఊర్లలో పెద్దవాళ్ళు ఇప్పటికీ అదే తింటారు.  దిబ్బరొట్టి, బెల్లంపాకం కలిపి తింటారు. అదే వాళ్ళ ఆహారం' అన్నాడు.

మా కారు డ్రైవరేమో, 'మనం వెళ్లే చోటకు దగ్గరలోనే రావులపాలెం అనే ఊరిలో RK Hotel అని ఉంటుంది.  అందులో దిబ్బరొట్టి, బెల్లంపాకం దొరుకుతాయి. టేస్ట్ చూస్తారా?' అన్నాడు.

'ఆ బెల్లం పాకాన్ని మన ఇంట్లో తయారు చేసుకోవచ్చా?' అడిగాను నేను.

నవ్వాడతను.

'కుదరదండి. చెరుకురసాన్ని తీగపాకంలాగా కాయాలి. దానికొక పద్దతుంటుంది. అలా చేస్తేనే అది వస్తుంది. అలాంటి తిండ్లు మా గోదారి జిల్లాల్లో చాలా ఉన్నాయి. పనస ఆకుల్లో  ఇడ్లీ ఉడకబెట్టి చేస్తారు. రెండిడ్లీ తిన్నారంటే మధ్యాన్నం దాకా మీకు ఆకలి వెయ్యమన్నా వెయ్యదు. పనసఆకులోని ప్రోటీన్ అంతా ఇడ్లీలోకి దిగి, ఇడ్లీ రంగు పసుపు పచ్చగా మారిపోతుంది. చాలా బాగుంటుంది' అన్నాడు.

అవన్నీ వింటుంటేనే నోరూరేలాగా ఉంది గోదారిజిల్లా యాసలో అతను చెప్పిన వర్ణన.

మెహర్ బాబా గారిని గురించి కూడా మొదటిసారిగా రాజమండ్రిలోనే విన్నాను. మేమక్కడున్నపుడే ఆయన రాజమండ్రికి వచ్చారు. మాకు దగ్గర్లోనే ఉన్నారు కూడా. కానీ, ఆయన గురించి పెద్దగా తెలియకపోవడం, నేను బాగా చిన్నపిల్లాడిని కావడాల వల్ల ఆయన్ను చూడలేకపోయాను. కొంచం పెద్దయిన తర్వాత, ఆయన సాహిత్యం చదివాక ఈ విషయంపైన చాలా బాధపడ్డాను కూడా. కానీ, సాధనలో నలిగిన తర్వాత, ఆ బాధ పోయింది. 

అప్పట్లో శ్యామలా టాకీసులో సినిమాకెళితే ఇంటర్వెల్ లో స్లైడ్స్ వేసేవాళ్ళు. వాటిలో మెహర్ బాబా స్లైడ్ కూడా ఉండేది. Dont worry Be happy అని దానిమీదుండేది. అది చూచి అమ్మను అడిగాను, 'ఆయనున్న చోటకెళ్లి చూద్దామా?' అని. అమ్మకు స్వతంత్రం లేదు. నవ్వి ఊరుకుంది పాపం. ఆ విధంగా మెహర్ బాబా గారిని దేహంతో చూడలేకపోయాను.

కడియంలో పని ముగించుకుని వెనక్కు వస్తుంటే, దారిలో అనేక మొక్కల నర్సరీలు కనిపించాయి. 'మన ఆశ్రమానికి కావలసిన మొక్కలన్నీ ఇక్కడనుంచి తీసుకోవచ్చు, మనకు కనీసం రెండులారీల మొక్కలు కావలసివస్తాయి. కొన్ని వేలరకాల మొక్కలు ఇక్కడుంటాయి' అని వాళ్ళన్నారు. అలాగే చేద్దామని, మళ్ళీ ఒకసారి పర్సనల్ గా వచ్చినపుడు, ఆ నర్సరీలన్నీ నిదానంగా చూచి, మన ఆశ్రమానికి కావలసిన మొక్కలను కొందామని నిర్ణయించాము.

మీ ఊరికి వెళ్ళొచ్చామని ఒక శిష్యునితో అంటే, 'మీకెలా అనిపించింది?' అనడిగాడు.

'బానే ఉంది. గోదారి జిల్లాలంటే నాకు ఇష్టమే' అని అన్నాను.

'మనుషులెలా అనిపించారు?' అన్నాడు నవ్వుతూ.

'బాగుంటుందని ప్రకృతిని గురించి నేనన్నాను. నీళ్లు, పచ్చదనం ఎక్కడ చూచినా ఉంటాయి. అవి నాకు నచ్చుతాయి. అదే మనుషులలో అయితే, కావలసినన్ని అవలక్షణాలు అగుపించాయి. మగాళ్లలో అయితే అత్యాశ, అనుమానం, భయం, డబ్బుయావలు బాగా ఎక్కువ. ఆడాళ్ళలో అయితే ఓవర్ పొసెసివ్ నెస్, భయం, జెలసీలు ఎక్కువ. అన్ని ప్రాంతాలలో అన్నీ ఉంటాయి గాని, కొన్ని చోట్ల కొన్ని ఎక్కువగా ఉంటాయి. గోదారిజిల్లాలలో ఇవి ఎక్కువ' అని చెప్పాను. 

రకరకాలైన వంటలకు, మంచితిండికి గోదావరిజిల్లాలు పెట్టింది పేరు. ఆ మాటకొస్తే కోస్తాజిల్లాలన్నీ మంచి తిండిపుష్టి ఉన్నవే. విశాఖనుంచీ నెల్లూరు వరకూ ఏ ప్రాంతపు తిండి ఆ ప్రాంతానికుంది. కానీ దారిలో చాలాచోట్ల హైద్రాబాద్ బిర్యానీ అని హోటళ్లు చాలా కనిపించాయి.  అదేంటి అనడిగితే, 'ఇప్పుడెక్కడ చూసినా ఇదెక్కువైంది' అని వాళ్ళు చెప్పారు. నిజమే అనిపించింది. నాన్ వెజ్ తిండి ఇప్పుడు బాహాటం అయిపోయింది. పాతకాలంలో అయితే, ఎక్కడో మిలటరీ హోటల్ అని ఒక్కటి ఉండేది. ఇప్పుడు శాకాహారహోటల్ని వెతుక్కోవాల్సి వస్తోంది. నేను నిజామాబాద్ వెళ్ళినపుడు అదే జరిగింది. ఒక వెజ్ హోటల్ కోసం గంటపాటు ఆటోలో వెతుక్కుంటూ తిరిగాం. ఎక్కడచూచినా సిగ్గులేకుండా రోడ్లమీద పెట్టి, ఫ్లెక్షీలలో బొమ్మలు పెట్టి, మరీ మాంసాహారం అమ్ముతున్నారు. సమాజంలో పేట్రేగిపోతున్న విచ్చలవిడితనానికి, నీతీనియమాలు లోపించడానికి, పెడపోకడలు, క్రైమ్ రేట్లు పెరగడానికి, విపరీతమైన ఈ మాంసాహారపు వాడకం కూడా ఒక కారణమని నా ఊహ.

అదే విధంగా, త్రాగటం కూడా ఇప్పుడు చాలా ఎక్కువైంది. ఒకప్పుడు భయం భయంగా దాక్కొని త్రాగేవాళ్ళు. ఇప్పుడు బాహాటంగా త్రాగుతున్నారు. కాలేజి అమ్మాయిలు అబ్బాయిలు త్రాగుతున్నారు. దిగజారుతున్న సమాజానికి ఇది నిదర్శనం.

ప్రస్తుతం అందరిదగ్గరా డబ్బులు ఎక్కువయ్యాయి. కానీ నీతీ నియమాలు తగ్గిపోయాయి. కదిలిస్తే అందరూ నీతులు చెబుతున్నారు. కానీ పాటిస్తున్నవాళ్ళు ఎక్కడా లేరు. అందరికీ ఈగోలు ఎక్కువయ్యాయి. ఇది మంచికి కాదు. కరోనా అందుకే వచ్చి ఒక దులుపుడు దులిపింది. అయినా మనుషులలో మార్పు రావడం లేదు. అందుకే, ముందు ముందు దీని బాబులాంటిది ఇంకోటి రాబోతోంది.

ఆలోచనలలో పడ్డాను. అందరూ మౌనంగా ఉన్నారు. కారు ముందుకు దూసుకుపోతోంది.

వెళ్ళినపని చూచుకొని, రాజమండ్రికి తిరిగివచ్చి లంచ్ చేసి కొద్దిగా విశ్రాంతి తీసుకున్నాము. సాయంత్రం ఖాళీ దొరికితే, రామకృష్ణమఠానికి వెళ్లాలని ప్లాన్.

(ఇంకా ఉంది)