Pages - Menu

Pages

27, మార్చి 2022, ఆదివారం

బుజ్జిపాప తత్వాలు - 7 (ఇదే ఆధ్యాత్మికం)

అందరికీ స్పీచులివ్వడం

ఆచరణ మాత్రం  లేకపోవడం

అంతా మాయేననడం

ఆకు రాలితే అల్లాడిపోవడం

ఇదే ఆధ్యాత్మికం

ఓ బుజ్జిపాపా !


తెలిసినవాడూ తెలియనివాడూ

అన్నీ తమకే తెలుసనుకోవడం

ఎదుటివాడి స్థితి తెలియకుండా

ఏదేదో వాగబోవడం

ఇదే ఆధ్యాత్మికం

ఓ బుజ్జిపాపా !


అరువు తెచ్చుకున్న గేనాన్ని

అందరికీ పంచడం

అన్యుల సొమ్మంతా తనదేనని

అరుస్తూ ఊరేగడం

ఇదే ఆధ్యాత్మికం

ఓ బుజ్జిపాపా !


అందరికీ ప్రవచనాలిస్తూ

ఆరిందాలా మాట్లాడటం

దొంగబ్రతుకు బ్రతుకుతూ

దొరికిపోతామని భయపడటం

ఇదే ఆధ్యాత్మికం

ఓ బుజ్జిపాపా !


అహంకారంతో అలమటిస్తూ

ఆత్మజ్ఞానిననుకోవడం

అందితే జుట్టు లేకపోతే కాళ్ళు

అవసరార్ధం పట్టుకోవడం

ఇదే ఆధ్యాత్మికం

ఓ బుజ్జిపాపా !


ఆత్మా పరమాత్మా అంటూ

ఆశను దాటలేకపోవడం

అచలం అచలం అంటూ

ఎప్పుడూ చలిస్తూనే ఉండటం

ఇదే ఆధ్యాత్మికం

ఓ బుజ్జిపాపా !


అరువు సమాచారంతో

తలంతా ఉబ్బిపోవడం

అడుగేసే శక్తంటూ లేక

ఒళ్ళంతా పుల్ల కావడం

ఇదే ఆధ్యాత్మికం

ఓ బుజ్జిపాపా !


ఆధ్యాత్మికపు అంగడి తెరిచి

అరువు బేరాలు సాగించడం

అష్టకష్టాలు చుట్టుముడితే

అయ్యో అంటూ గుక్కపెట్టడం

ఇదే ఆధ్యాత్మికం

ఓ బుజ్జిపాపా !