నిన్నొక శిష్యురాలితో హైద్రాబాద్ మెట్రోలో ప్రయాణిస్తున్నా. వాళ్ళీ మధ్యనే అమెరికానుంచి ఇండియాకు కాపురం మార్చేశారు. మెట్రోలో ప్రయాణం తనకు అలవాటు లేకపోతే, అమీర్ పేట దాకా ఎదురెళ్లా. అక్కడ మెట్రో మారి ఇంటికొస్తున్నాం.
జనం బాగానే ఉన్నారు. కొంతమంది మాస్క్ లు వేసుకున్నారు. కొంతమంది వేసుకోలేదు. ఉన్నట్టుండి శిష్యురాలికి ఒక అనుమానం తలెత్తింది.
'అసలీ మాస్క్ గోలేంటి? ఈ రోగం ఎందుకొచ్చిందో మనుషులకి?' మాస్క్ వేసుకునే అడిగింది.
మాస్కు తియ్యకుండా లోలోపలే నవ్వాను.
'విను మరి. ఏ రోగమైనా లోపలి స్థితిని బట్టే బయటొస్తుంది. మనుషుల మనసులకి మాస్కులు పెరిగాయి. లోపలొకటి బైటకొకటి. మాస్కు లేకుండా ఉన్నదున్నట్టు స్వచ్ఛంగా మాట్లాడేవాళ్ళని నీ జీవితంలో నువ్వసలు చూశావా ఇప్పటిదాకా?' అడిగా.
కాసేపు ఆలోచించి, 'లేనట్టే ఉంది' అంది.
'అందరూ మనసులకి మాస్కులేసుకుని బ్రతుకుతున్నారు కాబట్టి, ముఖాలకు కూడా మాస్కులొచ్చాయి. నువ్వెలా ఉంటే ప్రకృతి కూడా నీకదే ఇస్తుంది. వెరీ సింపుల్' అన్నా.
శిష్యురాలు తెలివైంది.
'మరైతే, ఇంత గోలలో కూడా కొంతమందికి కరోనా సోకలేదు. వాళ్ళు వాక్సిన్ కూడా వేసుకోలేదు. మరి వాళ్ళ మనసులకి మాస్కులు లేనట్టేగా?' అంది.
'అంతేగా. దానికి నేనేగా పెద్ద ఉదాహరణ?' అన్నా సీరియస్ గా.
'సరేలే. నీకున్నన్ని మాస్కులు ఇంకెవరికీ ఉండవేమో లోకంలో?' అంది తను.
'అవును. స్వార్ధంతో అందరూ మాస్కులు వేసుకుంటే, నిస్వార్ధంగా మీకోసం నేను వేసుకుంటాను. అంతే తేడా' అన్నా.
శిష్యురాలికి నాతో చనువెక్కువ.
'అబ్బో. ఇది నీ మాస్కా?' అంది.
'అంతేగా మరి' అన్నా అస్సలు నవ్వకుండా.
'ఇదంతా నిజమేనా అసలు?' అంది అనుమానంగా చూస్తూ.
'నా మాస్కంత నిజం, మెట్టుగూడ వచ్చింది. దిగు' అంటూ డోర్ వైపు నడిచా.
తనేం చేస్తుంది పాపం? తిట్టుకుంటూ నాతోబాటు రైలు దిగింది.