ఇది జరగడానికి నాలుగు గంటల ముందు, ఈ విమానం ప్రయాణిస్తున్న దారిలో తీవ్రమైన గాలులు ఉన్నాయన్న హెచ్చరికను ఉజౌ వెదర్ సర్వీస్ వెలువరించింది. కానీ విమానం కూలిపోయిన తీరు చూస్తే విచిత్రంగా ఉంది. దాదాపుగా 30,000 అడుగుల ఎత్తునుంచి 3,000 అడుగుల ఎత్తులోకి కేవలం 3 నిముషాలలో విమానం నిట్టనిలువుగా దిగిపోయింది. ఈ విధంగా కూలిపోవడమనేది, విమానాన్ని నడుపుతున్న పైలట్, దానిని కావాలని కూల్చేస్తే తప్ప జరుగదు. లేదా ఇద్దరు పైలట్లనూ ఎవరో కాల్చేస్తే తప్ప జరుగదు. విమానం రెక్కలు బాగుంటే, గ్లైడింగ్ మోడ్ లో చాలాదూరం దానిని క్షేమంగా తీసుకెళ్లవచ్చు. ఇలా కూలిపోవడం వింతగానే ఉంది.
కనుక ఈ ప్రమాదంలో కుట్రకోణాన్ని కాదనలేము. చైనా విమానం గనుక, ఒకవేళ ఏదైనా కుట్ర ఉన్నప్పటికీ అది బయటకు రాకపోవచ్చు. ఇతర దేశాల సహాయాన్ని చైనా తీసుకోదు. నిజాలు బయటపెట్టదు. కాకపోతే, తైవాన్ దగ్గరగా ఇది జరిగింది గనుక, ఆ రెండుదేశాలకూ మద్యన చాలాకాలంగా నిప్పు రాజుకుంటోంది గనుక, ఆ దేశపరంగా ఏదైనా కుట్ర ఉండే అవకాశం ఉంది. కానీ ఈ మిస్టరీ విడిపోయే అవకాశం మాత్రం లేదు.
జ్యోతిష్యపరంగా చూద్దాం.
- నిన్న మార్చ్ 21 ఈక్వినాక్టియల్ డే. అంటే, ప్రపంచవ్యాప్తంగా పగలూ రాత్రీ సమానంగా ఉండే రోజు. ఇలాంటి మరొక రోజు సెప్టెంబర్ 23 న వస్తుంది.
- లగ్నం సరిగ్గా రాహుకేతువుల ఇరుసులో పడింది. లగ్నంలో రాహువు వల్ల కుట్రకోణం స్పష్టంగా కనిపిస్తున్నది.
- కుజుడు 17 డిగ్రీ మీద, శుక్రుడు 19 డిగ్రీ మీద చాలా దగ్గరగా ఉన్నారు. కుజుడు ఉచ్ఛస్థితిలో ఉన్నాడు. మేషంలో ఉన్న యురేనస్ 18 డిగ్రీలో ఉంటూ వీరిని చాలా దగ్గరి కేంద్రదృష్టితో చూస్తున్నాడు. ఈ గ్రహస్థితి విద్రోహుల కుట్రను, విప్లవచర్యలను సూచిస్తున్నది.
- ఈ చక్రంలో చెప్పుకోవలసిన మరొక్క ముఖ్యమైన గ్రహస్థితి బుధ గురుల డిగ్రీయుతి. వీరిద్దరూ ఖచ్చితంగా కుంభం 24 వ డిగ్రీ మీద కలిసున్నారు. కుంభరాశికి అర్గళం పట్టింది.
- బుధుడు పంచమాధిపతిగా, పైలట్ బుద్ధికి సూచకుడు, గురువు అష్టమాధిపతిగా వినాశాన్ని సూచిస్తున్నాడు. దశమకేంద్రంలో వీరిద్దరి కలయికతో, క్రూ మెంబర్స్ లో బుద్ధి లోపించి, ఊగిసలాట, బలమైన సూయిసైడల్ పోకడలు కనపడుతున్నాయి. ఇదినిజమే కావచ్చు. లేదంటే, విమానం అంత నిట్టనిలువుగా మూడు నిముషాలలో 27 వేల అడుగులు దూకినట్లుగా క్రిందకు పడిపోదు.
- ప్రమాదసమయంలో రాహు - బుధ - శుక్ర జరుగుతున్నది. రాహువు లగ్నంలో ఉంటూ ఉచ్చశుక్రుడిని సూచిస్తున్నాడు. శుక్రుడిని ఆరవ ఆధిపత్యం కూడా ఉండటంతో, పైలట్ తనకు తానే శత్రువైనట్లు కనపడుతున్నది. బుధుడు బుద్ధిని తారుమారు చేశాడని పైన చెప్పాను. విదశలో కూడా శుక్రుడే మళ్ళీ కనిపిస్తూ, నవమ బాధకస్థానంలో ఉఛ్చకుజ శనులతో కూడి బలమైన దుర్ఘటనాయోగం (accident yoga) లో ఉన్నాడు. ఈ యోగం గురించి గతంలో ఎన్నో సార్లు వ్రాశాను. గమనించండి.