Pages - Menu

Pages

22, మార్చి 2022, మంగళవారం

చైనా విమాన ప్రమాదం - జ్యోతిష్య విశ్లేషణ

విమానయాన చరిత్రలో మరొక ఘోరప్రమాదం నిన్న ఉదయం 10.45 IST కి జరిగింది. దక్షిణ చైనాలో ఒక బోయింగ్ విమానం కూలిపోయింది. దీనిలో 123 మంది ప్రయాణీకులు, 9 మంది సిబ్బంది ఉన్నారు. అందరూ చనిపోయారు. 

ఇది జరగడానికి నాలుగు గంటల ముందు, ఈ విమానం ప్రయాణిస్తున్న దారిలో తీవ్రమైన గాలులు ఉన్నాయన్న హెచ్చరికను ఉజౌ వెదర్ సర్వీస్ వెలువరించింది. కానీ విమానం కూలిపోయిన తీరు చూస్తే విచిత్రంగా ఉంది. దాదాపుగా 30,000 అడుగుల ఎత్తునుంచి 3,000 అడుగుల ఎత్తులోకి కేవలం 3 నిముషాలలో విమానం నిట్టనిలువుగా దిగిపోయింది. ఈ విధంగా కూలిపోవడమనేది, విమానాన్ని నడుపుతున్న పైలట్, దానిని కావాలని కూల్చేస్తే తప్ప జరుగదు. లేదా ఇద్దరు పైలట్లనూ ఎవరో కాల్చేస్తే తప్ప జరుగదు. విమానం రెక్కలు బాగుంటే, గ్లైడింగ్ మోడ్ లో చాలాదూరం దానిని క్షేమంగా తీసుకెళ్లవచ్చు. ఇలా కూలిపోవడం వింతగానే ఉంది.

కనుక ఈ ప్రమాదంలో కుట్రకోణాన్ని కాదనలేము. చైనా విమానం గనుక, ఒకవేళ ఏదైనా కుట్ర ఉన్నప్పటికీ అది బయటకు రాకపోవచ్చు. ఇతర దేశాల సహాయాన్ని చైనా తీసుకోదు. నిజాలు బయటపెట్టదు. కాకపోతే, తైవాన్ దగ్గరగా ఇది జరిగింది గనుక, ఆ రెండుదేశాలకూ మద్యన చాలాకాలంగా నిప్పు రాజుకుంటోంది గనుక, ఆ దేశపరంగా ఏదైనా కుట్ర ఉండే అవకాశం ఉంది. కానీ ఈ మిస్టరీ విడిపోయే అవకాశం మాత్రం లేదు.

జ్యోతిష్యపరంగా చూద్దాం.

  • నిన్న మార్చ్ 21 ఈక్వినాక్టియల్ డే. అంటే, ప్రపంచవ్యాప్తంగా పగలూ రాత్రీ సమానంగా ఉండే రోజు. ఇలాంటి మరొక రోజు సెప్టెంబర్  23 న వస్తుంది.
  • లగ్నం సరిగ్గా రాహుకేతువుల ఇరుసులో పడింది. లగ్నంలో రాహువు వల్ల కుట్రకోణం స్పష్టంగా కనిపిస్తున్నది.
  • కుజుడు 17 డిగ్రీ మీద, శుక్రుడు 19 డిగ్రీ మీద చాలా దగ్గరగా ఉన్నారు. కుజుడు ఉచ్ఛస్థితిలో ఉన్నాడు. మేషంలో ఉన్న యురేనస్ 18 డిగ్రీలో ఉంటూ వీరిని చాలా దగ్గరి కేంద్రదృష్టితో చూస్తున్నాడు. ఈ గ్రహస్థితి విద్రోహుల కుట్రను, విప్లవచర్యలను సూచిస్తున్నది.
  • ఈ చక్రంలో చెప్పుకోవలసిన మరొక్క ముఖ్యమైన గ్రహస్థితి బుధ గురుల డిగ్రీయుతి. వీరిద్దరూ ఖచ్చితంగా కుంభం 24 వ డిగ్రీ మీద కలిసున్నారు. కుంభరాశికి అర్గళం పట్టింది.
  • బుధుడు పంచమాధిపతిగా, పైలట్ బుద్ధికి సూచకుడు, గురువు అష్టమాధిపతిగా వినాశాన్ని సూచిస్తున్నాడు. దశమకేంద్రంలో వీరిద్దరి కలయికతో, క్రూ మెంబర్స్ లో బుద్ధి లోపించి, ఊగిసలాట, బలమైన సూయిసైడల్ పోకడలు కనపడుతున్నాయి. ఇదినిజమే కావచ్చు. లేదంటే, విమానం అంత నిట్టనిలువుగా మూడు నిముషాలలో 27 వేల అడుగులు దూకినట్లుగా  క్రిందకు పడిపోదు.
  • ప్రమాదసమయంలో రాహు - బుధ - శుక్ర జరుగుతున్నది. రాహువు లగ్నంలో ఉంటూ ఉచ్చశుక్రుడిని సూచిస్తున్నాడు. శుక్రుడిని ఆరవ ఆధిపత్యం కూడా ఉండటంతో, పైలట్ తనకు తానే శత్రువైనట్లు కనపడుతున్నది. బుధుడు బుద్ధిని తారుమారు చేశాడని పైన చెప్పాను. విదశలో కూడా శుక్రుడే మళ్ళీ కనిపిస్తూ, నవమ బాధకస్థానంలో ఉఛ్చకుజ శనులతో కూడి బలమైన దుర్ఘటనాయోగం (accident yoga) లో ఉన్నాడు. ఈ యోగం గురించి గతంలో ఎన్నో సార్లు వ్రాశాను. గమనించండి.

రాహుకేతువుల వీడ్కోలు బహుమతి

రాహుకేతువులు మరికొద్ది రోజులలో రాశులు మారబోతున్నారు. దీని గురించి మొన్న పోస్టులో హెచ్చరించాను. దీనిని వీరి వీడ్కోలు బహుమతి (parting gift) అనుకోవచ్చు. కేతువు, చైనాను సూచించే వృశ్చికంలో ఉన్నాడు. ఖవేదాంశ చక్రంలో రాహుకేతువులు చైనాను సూచించే వృశ్చికంలో ఉంటూ, చైనాలో జరుగబోతున్న ఘోరప్రమాదాన్ని స్పష్టంగా సూచిస్తున్నారు. 

మనుషుల అతి ప్రవర్తన

మీరు గమనించారా? నిన్న ఇన్ని గ్రహస్థితులు కూడి వచ్చాయి గనుకనే, చాలామంది మనుషులు మానసికంగా అల్లకల్లోలానికి గురయ్యారు. మీరు గమనించుకుంటే, నిన్న చాలామంది మనుషులు చాలా అతిగా మాట్లాడినట్లు, అతిగా ప్రవర్తించినట్లు గ్రహిస్తారు. అదంతా ఈ గ్రహప్రభావమే.

న్యూమరాలజీ కోణం

విమానం నంబర్ 5735. సంఖ్యాశాస్త్రంలో నేను వాడే పద్ధతి ప్రకారం, ఇది బుధుడు, శుక్రుడు, గురువు, బుధులను సూచిస్తుంది. బుధుడు, గురువు డిగ్రీ కంజంక్షన్ లో ఉన్నారన్న విషయాన్ని పైన చెప్పాను. శుక్రుని పరిస్థితిని పైన వివరించాను.  రూట్ నంబర్ 2 అవుతున్నది. ఇది రాహువుకు సూచిక. రాహువు పాత్రను కూడా పైన వివరించాను.

ప్రయాణీకులు 123 మంది ఉన్నారు. అంటే, సూర్యుడు, రాహువు, గురువు. సూర్యుడు, మరణాన్ని సూచించే ప్లూటో (యమగ్రహం) తో  రెండు డిగ్రీల అతిదగ్గరి లాభదృష్టిలో ఉన్నాడు. రాహువు, గురువుల పరిస్థితిని పైన వివరించాను. సిబ్బంది 9 మంది ఉన్నారు. అంటే, నవగ్రహాలు. మొత్తం 132 మంది అవుతారు. 123 అయినా 132 అయినా రూట్ నంబర్ 6 అవుతుంది. ఇది కుజునికి సూచిక. కుజుడు ఉచ్చస్థితిలో ఉంటూ దుర్ఘటనాయోగంలో ఉన్నాడు. లెక్క సరిపోయింది. 

ఈ విధంగా గ్రహప్రభావాలు మనమీద పనిచేస్తూ ఉంటాయి !