Pages - Menu

Pages

31, మార్చి 2022, గురువారం

శూన్యసింహాసనం

ఆకాశంలో వాకిళ్ళకోసం

అల్లాడతావెందుకు నేస్తం?

నీ మనసు వాకిళ్లు

మాయమౌతుంటే !


సుదూర తారలకోసం

చూస్తున్నావెందుకు నేస్తం?

సితారనాదం లోలో

చిగురిస్తూ ఉంటే !


వినిపించుకోని వారికోసం

విలపిస్తావెందుకు నేస్తం?

జీవితం విసుగెత్తేవరకూ

ఎవ్వరూ వినరంతే !


నింగిలో దారులకోసం

నిలుచున్నావెందుకు నేస్తం?

నిత్యజీవితంలో ప్రతిదీ

రహదారే అయితే !


నడిబజారులో నిన్ను

అమ్ముకుంటావెందుకు నేస్తం"

హృదయాలలో  నీకెందరో

గుడికట్టుకుంటే !


ఎడారిలో బికారిలా

నడుస్తావెందుకు నేస్తం?

శూన్యసింహాసనం నీకు 

సిద్ధమౌతుంటే...