Pages - Menu

Pages

1, ఏప్రిల్ 2022, శుక్రవారం

రాహుకేతువుల లీల - 2022

నాస్తికులు, హేతువాదులు ఎన్నైనా మాట్లాడవచ్చు గాక ! కానీ, సయింటిఫిక్ గా ఆలోచించేవారికి చూచేవారికి, కొన్ని విషయాలు కొట్టొచ్చినట్లుగా కనిపిస్తూనే ఉంటాయి. గ్రహస్తితులకు, భూమ్మీదగాని, వ్యక్తిగత జీవితాలలో గాని జరిగే సంఘటనలకు సూటి సంబంధాలు కనిపిస్తూనే ఉంటాయి.

ప్రస్తుతం భూమ్మీద రాహుకేతువుల లీల నడుస్తోంది. ఇంకొక 12 రోజులలో వీరు రాశులు మారబోతున్నారు. నేను పదేళ్లనుంచీ చెబుతున్నాను. ఈ విషయం కొన్ని వందలసార్లు రుజువైంది. పెద్దగ్రహాల మార్పులు జరగబోయేముందు, దానికంటే ముందుగా వాటి సంధ్యాప్రభావం (twilight effect) ఉంటుందని చెప్పాను. అదే ఇప్పుడు జరుగుతోంది.

దేశాలమీద వీరి ప్రభావాలు ఎలా ఉన్నాయో చూద్దామా !

పాకిస్తాన్ పీఎం ఇమ్రాన్ కు మూడిన వైనం

మొన్నమొన్నటిదాకా అంతా బాగానే ఉంది. ఇమ్రాన్ రష్యా వెళ్లి పుతిన్ తో చేతులు కలిపి వచ్చాక, పాకిస్తాన్లో సినిమా మారిపోయింది. రాహుకేతువుల ప్రభావం స్పష్టంగా పనిచెయ్యడం మొదలైంది. కొన్ని రాజకీయపక్షాలు రూలింగ్ పార్టీకి మద్దతును ఉపసంహరించుకున్నాయి. ఇమ్రాన్ పని ఖాళీ అయింది.

దీని వెనుక అమెరికా హస్తం ఉందని ఇమ్రాన్ అంటున్నాడు. అమెరికా వెనుక గ్రహప్రభావం ఉందని నేనంటున్నాను. అమెరికా వెనుకే కాదు, అమ్మమ్మ ఆవకాయ పచ్చడి పెట్టడం వెనుక కూడా అదే ఉంటుంది. చూచే దృష్టితో చూస్తే అర్ధమౌతుంది.

రాహువు మేషంలోకి ప్రవేశించబోతున్నాడు. మేషం పాకిస్తాన్ కూ, బ్రిటన్ కూ సూచిక. కనుక ఆ దేశాలలో మార్పులు చేర్పులు ఖచ్చితంగా ఉంటాయి. 18 ఏళ్ళక్రితం 2004 లో కూడా రాహుకేతువులు ఇదే స్థితిలో ఉన్నాయి. అప్పుడు కూడా పాకిస్తాన్ లో పీ ఎం మారాడు. ఇది కాకతాళీయమెలా అవుతుంది మరి?

కుర్చీని కాపాడుకోడానికి ఇమ్రాన్ క్షుద్రపూజలు చేయిస్తున్నాడని వార్తలొస్తున్నాయి. వేలాది కోళ్లను హోమం చేస్తూ ఏవేవో అర్ధరాత్రిపూజలు చేయిస్తున్నాడట. అసలితని మూడో భార్యే ఒక ఇస్లామిక్ మాంత్రికురాలు.  అప్పట్లో ఈమె దగ్గర జాతకం చెప్పించుకోడానికి వెళ్ళాడు. ఆమె జాతకం బాలేక ఇతని బుట్టలో పడింది. లేదా, ఇతనిమీదే వశీకరణ మంత్రం ప్రయోగించి ఉండవచ్చు. అయితే, గ్రహాలు పిచ్చివి కావు కదా ! ఇలాంటి క్షుద్రపూజలు ఎన్నింటినో అవి చూచి ఉంటాయి. అయినా, అమెరికాకు తెలియనివా ఈ క్షుద్రపూజలు ! ఎన్ని చేస్తే ఈ స్థితికొచ్చింది అది ! కనుక ఇమ్రాన్ అర్జెంట్ గా రాహుకేతు స్తోత్రం చదువుకోవాల్సిన అవసరం ఉన్నది. మరి ఇస్లాం ఒప్పుకుంటుందో లేదో !

కుదేలైన శ్రీలంక 

కర్కాటకం సింహం మధ్యలో శ్రీలంక ఉంటుంది. చతుర్దంలోకి కేతువు ఇంకా రాలేదు. రాబోతున్నాడు. అప్పుడే దేశం అల్లకల్లోలమై పోతోంది గమనించండి. తిండిగింజల్లేవు. డీజిల్ లేదు. డబ్బుల్లేవు. ఇన్ ఫ్లేషన్ ఘోరంగా పెరిగింది. జనాలు పడవలెక్కి తమిళనాడులోకి చొరబడుతున్నారు. తమిళనాడు సీఎం స్టాలిన్, మోడీగారిని కలిసి, వారికి సహాయం చేయడానికి పర్మిషన్ అడిగాడు. ఎందుకంటే, శ్రీలంక సమస్య సూటిగా తమిళనాడును ప్రభావితం చేస్తుంది గనుక !

రష్యా ఉక్రెయిన్ యుద్ధం

2014 నుంచీ ఇది నడుస్తున్నప్పటికీ, ఫిబ్రవరి 2022 లోనే ఇది ఊపందుకుంది, అఫీషియల్ గా మొదలైంది. ఇది కూడా రాహుకేతువుల ముందస్తు ప్రభావమే. ఈ మధ్యనే న్యూక్లియర్ బాంబ్ అమర్చబడిన రష్యా విమానాలు  ఉక్రెయిన్ దగ్గరగా ఎగిరాయి. ఏప్రియల్ 13 న రాహుకేతువులు రాశులు మారాక,  న్యూక్లియర్ వార్ మొదలు కాబోతున్నదా? రష్యా గనుక ఉక్రెయిన్ పైన న్యూక్లియర్ బాంబ్ వేస్తే, ఇక అన్ని దేశాలూ రంగంలోకి దిగుతాయి. అప్పుడు ప్రపంచదేశాలన్నీ రష్యా అనుకూల, ప్రతికూల వర్గాలుగా విడిపోతాయి. ఈ పరిస్థితి, మూడో ప్రపంచ యుద్ధంగా మారబోతున్నదా? ఇజ్రాయెల్ పాలస్తీనాలు దానిని ప్రారంభిస్తాయని అందరూ ఎదురు చూస్తుంటే, రష్యా ఉక్రెయిన్లు తొందరపడ్డాయన్న మాట !  చూద్దాం ఏమౌతుందో !

ఈ గోల ఇలా ఉంటే, ఇంకో పక్కనుంచి WHO వచ్చి, 'ఇంకో భయంకరమైన కరోనా వైరస్ రాబోతోంది'  అని అరుస్తున్నది. ఈ మధ్యన అదొక జోకరైపోయింది. దానిమాటలు ఎవరూ నమ్మడం లేదు. 'వస్తే రానీ వచ్చినపుడు చూద్దాంలే' అని ఎవరూ కరోనాను పట్టించుకోవడం లేదు. ప్రతిరోజూ చచ్చేవాడికి భయమేముంటుంది గనుక ! 

దీనికి తోడు ఏప్రియల్ 26 న శనీశ్వరుని రాశిమార్పు ఉన్నది. దాని ఫలితాలను త్వరలో వ్రాస్తాను. అప్పటివరకూ ప్రపంచదేశాల పరిస్థితులలో మార్పులను గమనిస్తూ, రాహుకేతు స్తోత్రం చదువుకుంటూ ఉండండి !