Pages - Menu

Pages

1, ఏప్రిల్ 2022, శుక్రవారం

బుష్రా మనేకా ఖాన్ జాతకంలో మాంత్రిక యోగాలు

ఇవాళ అమావాస్య. కనుక ఇలాంటి పోస్ట్ రాయకపోతే ఎలా మరి? భూతాలు బాధపడతాయి. కాబట్టి చదూకోండి.

పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ మూడోభార్య బుష్రా మనేకా ఖాన్. ఈమె ఇండియా దగ్గరలో ఉన్న పాక్ పట్టణం లో 16-8-1974 న పుట్టింది. ఇక్కడే సూఫీ సాధువు బాబా ఫరీద్ దర్గా ఉంది. ఈయన ఉదారబోధనలను సిక్కుల గ్రంధమైన గురు గ్రంథసాహెబ్ లో కూడా పొందుపరచారు. ఆమె బాబా భక్తురాలైంది. సూఫీ తత్త్వాలను బాగా నేర్చుకుంది.

2017 లో తన మొదటిభర్త అయిన ఖ్వార్ మనేకా కు విడాకులిచ్చి ఇమ్రాన్ ఖాన్ ను 2018 లో పెళ్లాడింది. అప్పుడామెకు 44 ఏళ్ళు. 1952 లో పుట్టిన ఇమ్రాన్ ఖాన్ కు అప్పటికి 66 ఏళ్ళు. ఇద్దరికీ 22 ఏళ్ల తేడా ఉన్నది. అయినా సరే, ఈ పెళ్లి జరిగింది. దానికి వెనుక అనేక కధలున్నాయి.

పాకిస్తాన్ కు ప్రధానమంత్రి కావాలని తపిస్తున్న క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్, అప్పటికే సూఫీ పీర్ గా పేరు పడిన  బుష్రాను ఆశీస్సులకోసం కలిశాడు. ఇమ్రాన్ ఖాన్ గత 30 ఏళ్లుగా సూఫీ తత్వానికి దగ్గరౌతూ వచ్చాడు. బుష్రా అందులో బాగా మునిగితేలుతున్న వ్యక్తి. ఆమె అదుపులో రెండు జిన్ (భూతాలు) ఉన్నాయని, వాటిని కంట్రోల్ చేస్తూ ఆమె పనులు సాధిస్తుందని పుకార్లు ప్రచారంలో ఉన్నాయి. ఏదైనా ఉపాయం చెప్పమని కోరిన అతనికి ఏవేవో ఇస్లామిక్ రెమెడీలు చెబుతూ ఉండేది. అప్పటికే ఆమెకు మొదటి భర్త, అయిదుగురు పిల్లలున్నారు.

మాంసంతో హోమాలు చేయడం వంటి క్షుద్రపూజలు కొన్ని, క్రింది స్థాయి సూఫీలలో ఉంటాయి. వారికి బ్లాక్ మేజిక్ కూడా తెలిసి ఉంటుంది.అలాంటివి ఇమ్రాన్ కోరికను తీర్చలేవని, అతని కోరిక చాలా పెద్దదని, అది తీరాలంటే అతను ఒక సరియైన యువతిని పెళ్లి చేసుకోవాలని, ఒక జిన్ (భూతం) ఈమె కలలో కనపడి రెమెడీ చెప్పిందట. సరేనన్న బుష్రా, తన చెల్లెలిని గాని, కూతురిని గానీ చేసుకోమని ఇమ్రాన్ కు చెప్పిందట.  ఇది భూతానికి నచ్చలేదు. అందుకని మళ్ళీ ఆమె కలలోకొచ్చి, 'వాళ్ళొద్దు నువ్వే ఇతన్ని చేసుకో. లేకపోతే నీ సంగతి చూస్తా' అని ఘంటాపధంగా చెప్పిందట. ఈ విషయమంతా వినిన ఈమె భర్త ఎంతో కుమిలిపోయి, 'అయ్యో, ఇలాంటి ఉత్తమమైన ఆశయానికి నేనెందుకు అడ్డుగా ఉండాల'ని బాధపడి, వెంటనే ఈమెకు విడాకులిచ్చేశాడు. అప్పుడు లైన్ క్లియరైంది. ఇమ్రాన్ ఈమెను పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి అయిన ఆర్నెల్లలోనే అతని కోరిక నెరవేరింది. పాకిస్తాన్ కు ప్రధానమంత్రి అయ్యాడు. రెమెడీలు పనిచేశాయి. భూతాలూ పనిచేశాయి.  ఆ విధంగా బుష్రా, ఇమ్రాన్ కు థర్డ్ లేడీ అయి, పాకిస్తాన్ కు ఫస్ట్ లేడీ అయి కూచుంది.

అంటే, ఈ కధ ప్రకారం. క్షుద్రపూజలతో, భూతాలదయతో ఇమ్రాన్ పాకిస్తాన్ పీఎం అయ్యాడన్నమాట !

ప్రముఖులు స్వామీజీల ఆశీస్సులను తీసుకోవడం, మాంత్రికుల సహాయం తీసుకోవడం చరిత్రలో మామూలే. ఒకప్పటి ఆంధ్రా సీఎం NTR కూడా చీర కట్టుకుని రాత్రిపూట ఏవేవో పూజలు చేసేవాడని పుకార్లున్నాయి. ఇందిరాగాంధీకి కూడా చంద్రస్వామి అని ఒక తాంత్రికసాధువు సహాయం చేసేవాడు. అంతకంటే మొదట్లో ధీరేంద్రబ్రహ్మచారి అని ఇంకొకాయన ఉండేవాడు. అంతెందుకు? ప్రెసిడెంట్ రీగన్ భార్య అయిన నాన్సీ రీగన్ కూడా సైకిక్స్ సహాయం తీసుకునేదని, అలా తీసుకుని, భర్తకు రాజకీయ సలహాలిచ్చేదని అంటారు. అంటే, ప్రపంచదేశాల రాజకీయగతిని అరిజోనా ఎడారిలో ఉన్న సైకిక్స్ నిర్ణయించేవారన్నమాట ! భలేగా ఉంది కదూ వినడానికి ! అతి ప్రాచీనకాలంలో కూడా, యుద్ధానికి పోబోయేముందు రావణాసురుడు స్వయంగా హోమం చేసి మరీ కొట్లాటకు బయలుదేరేవాడని చెబుతారు. కనుక, మానవాతీత శక్తుల సహాయం కోరడం రాజులకు రాజకీయులకు మామూలే. పేర్లెందుకు గాని, ఇది నేటికీ జరుగుతూనే ఉంది.

చూడబోతే లోకం అనుకునేటట్లు బుష్రా దగ్గర ఏవో మాంత్రికశక్తులున్నట్లే ఉంది. చార్ట్ వేసి చూద్దాం !
  • ఈమె అమావాస్యకు ముందురోజున పుట్టింది. కనుక, అలాంటి పోకడలు ఉంటాయి.
  • పుష్యమీ నక్షత్రంలో ఈమె పుట్టింది. ఇది మంచి అదృష్ట నక్షత్రమే. వీరికి పూజలు పునస్కారాలు అలవాట్లు ఉంటాయి. అది ఏ మతమైనా సరే ఈ నక్షత్రం అలా పనిచేస్తుంది !
  • రాహుకేతువులు 5/11 స్థానాలలో నీచస్థితిలో ఉన్నాయి. గురువు నీచస్థితిలో ఉన్నాడు. నవాంశలో శని నీచస్థితిలో ఉన్నాడు. అది, రాశిలగ్నాత్ దశమకేంద్రమైంది. కనుక ఈమెకు మంత్రాలూ, క్షుద్రపూజలలో ప్రవేశం తప్పకుండా ఉంటుంది.
  • చంద్రలగ్నంలో ఇంకో మూడు గ్రహాలున్నాయి. ఇవన్నీ కుజ శనులచేత అర్గల బందీలయ్యాయి. అంటే, ఈమెకు సన్యాసయోగముంది. కానీ భంగమైంది. అందుకే పెళ్లి చేసుకున్నప్పటికీ ఒక సూఫీ గురువుగా చెలామణీ అయింది. ఇది మాంత్రిక యోగమే.
  • పంచమంలో నీచరాహువున్నాడు. కుజుడిని సూచిస్తున్నాడు. లగ్నంలో ఉన్న నాలుగు గ్రహాలకు, రాహువుకు పరస్పరమైన కోణదృష్టి ఉన్నది. ఇదికూడా మాంత్రికయోగమే. కనుక, క్షుద్రపూజలు, రహస్యమైన రెమెడీలు చెయ్యడం మొదలైన అలవాట్లు ఈమెకుంటాయి.
  • సప్తమంలో నీచగురువున్నాడు. అంటే, ఈమె భర్త (లు) కూడా సాంప్రదాయ ఇస్లాం పోకడలకు దూరంగా జరుగుతారని అర్ధం. దీనిని నిజం చేస్తూ, మొదటి భర్తా సూఫీ తత్త్వాన్ని ఇష్టపడేవాడే, రెండో భర్త అయిన ఇమ్రాన్ కూడా గత 20 ఏళ్ళనుంచీ సూఫీ తత్త్వాన్ని ఇష్టపడుతున్నవాడే.
  • చంద్రుడూ శుక్రుడూ దగ్గరగా ఉన్నారు. దీనివల్ల ఈమెకు కలలు, దర్శనాల వంటి భ్రమలు కలుగుతాయి. అందుకే ఈమెకు కలలో జిన్ కనపడి ఇమ్రాన్ని చేసుకోమని చెప్పింది.
  • సూర్యుడూ బుధుడూ చాలా దగ్గరగా ఉన్నారు. నవాంశలో బుధుడు నీచస్థితిలో ఉన్నాడు.  ఈమె ఇంట్రావర్ట్ గా ఉండేది. అమెరికాలో చదువుకున్నప్పటికీ, పెద్దగా ఎవరితోనూ కలిసేది కాదు. స్నేహితుల సర్కిల్స్ లో ఈమెకు 'విచ్' (మంత్రగత్తె) అని పేరుండేది. అవసరమైతే, తనకోసం ఏమైనా చేయడానికి రెడీ అవుతుంది. అందుకే, 44 ఏళ్ల వయసులో, అయిదుగురు పిల్లలను వదిలేసి రెండో వివాహం చేసుకుంది.
సరే, ఇదంతా బాగానే ఉంది. ప్రస్తుత పరిస్థితి ఏంటి? అదీ చూద్దాం.

ప్రస్తుతం ఈమెకు రాహుకేతువులు దశమ చతుర్ధస్థానాలలోకి రాబోతున్నాయి. అంటే, వృత్తి, ఇల్లు, గృహసౌఖ్యాలు ప్రభావితాలౌతాయి. అదేగా జరుగుతోంది మరి !

ఇంటిలో అశాంతి రేగుతోంది. ఇమ్రాన్ పదవి ఏమౌతుందో ఎల్లుండి తెలుస్తుంది. ఫస్ట్ లేడీ అనే పదవి ఊడిపోబోతున్నది. ఏక్షణం ఏమౌతుందో ఎవరు ఎవరిని చంపుతారో తెలియని పాకిస్తాన్లో వీరి భవిష్యత్తు ప్రశ్నార్ధకం !

ఇదే నెలలో ఈమెకు అష్టమశని మొదలు కాబోతున్నది. అది, సెప్టెంబర్ 2024 వరకూ ఉంటుంది. ఇది ఈమెకు మంచిసమయం కాదు. ఖచ్చితంగా ఈమె భర్త అయిన ఇమ్రాన్ కి కూడా మంచిది కాదు. అతని జాతకం విడిగా చూద్దాం !

మరి ఈమె క్షుద్రపూజలు, ఈమె అధీనంలో ఉన్నాయని చెప్పబడే జిన్లు (భూతాలు) ఈమెను రక్షిస్తాయా? అంటే, గ్రహప్రభావం నుంచి ఏ భూతాలూ ఎవరినీ రక్షించలేవు. మనం చేసుకున్న కర్మను మించిన పెద్ద భూతం ఇంకేదీ ఈ సృష్టిలో లేదు. అది పక్వానికి వచ్చినపుడు ఏ క్షుద్రపూజలూ ఏమీ పని చెయ్యవు. అన్నీ ఎదురు తిరుగుతాయి. ప్రస్తుతం ఈమెకూ, ఇమ్రాన్ కూ అదే జరుగుతున్నట్లుంది.

అయినా మన పిచ్చిగాని, అమెరికా అనే పెనుభూతంతో విరోధం తెచ్చుకుంటే భూమ్మీద ఏ భూతమూ మనల్ని రక్షించలేదు. ఎక్కడో తోరాబోరా గుహల్లో దాక్కున్న లాడెన్ అనే భూతాన్ని కూడా వేటాడి మట్టుపెట్టింది అమెరికా భూతం. మరి, రష్యాకి దగ్గరౌతూ, దానితో పెట్టుకుంటే ఊరుకుంటుందా? అదేమైనా మొదటి భర్తా, పోనీలే అని పెద్దమనసుతో డైవోర్స్ కి ఒప్పుకోడానికి? ఇంత చిన్న లాజిక్ బుష్రా కి తెలీకపోవడమేంటి?

చూద్దాం గ్రహాలూ కర్మా గెలుస్తాయో, బుష్రా కంట్రోల్లో ఉన్న జిన్ లు గెలుస్తాయో !