పొద్దున్నే కర్ణపిశాచి ఫోన్ చేసింది.
'ఏంటి చాలా రోజులకి వినిపించావ్?' అడిగా.
'ఉద్యోగంలో ఈ మధ్య కొంచం బిజీగా ఉన్నా. నేనేం నీలాగా పర్మనెంట్ జాబ్ కాదుకదా. కష్టపడాలి తప్పదు' అంది.
'సర్లే ఏంటో చెప్పు' అన్నా.
'ఏం లేదు. నువ్వెప్పుడూ జరిగిపోయిన తర్వాత జ్యోతిష్యాలు రాస్తుంటావు కదా. కనీసం ఒక్కసారైనా ముందు జరగబోయేది చెప్పు' అని ముచ్చటపడింది.
'ఏంటి అవమానిస్తున్నావ్? పాతపోస్ట్ లు చదువు ఒక్కసారి. సత్యసాయిబాబా ఎప్పుడు పోతాడో డేట్స్ తో సహా చెప్పా కరెక్ట్ గా. అలాంటివి బొచ్చెడున్నాయి' అన్నా.
'సర్లే గతం ఎందుకుగాని ఇప్పుడు చెప్పు ప్లీజ్' అని బతిమాలింది.
'సర్లే వినుకో. మే 13 కి అటూ ఇటూగా యూకే లో గాని, పాకిస్తాన్ లో గాని ఒక సంఘటన జరుగుతుంది. అది ఒక ప్రముఖవ్యక్తి మరణం గాని, ఒక దుర్ఘటన గాని అవుతుంది' అన్నా.
'సరే పందెం. జరగకపోతే ఏంటి చెప్పు?' అడిగింది.
'జరగకపోతే, నిన్ను నేను వెకేషన్ ట్రిప్ కి తీసికెళ్తా నువ్వు కోరుకున్న చోటకి' అన్నా సీరియస్ గా.
'జరిగితే?' అంది
'జరిగితే నువ్వు నన్ను తీసికెళ్లాలి' అన్నా.
'అంటే, ఏది జరిగినా నాకు తప్పదన్నమాట?' అంది
'అంతేగా మరి?' అన్నా.
'అలాగా? ఏం మనుషులు చాల్లేదా పిశాచాలతో పెట్టుకుంటున్నావ్?' అంది.
'పొద్దున్నే నా పనేదో నేను చేసుకుంటుంటే ఫోన్ చేసి కదిలించింది ఎవరు?' అన్నా కోపంగా.
'సర్లే నిన్నడిగాను చూడు అది నా తప్పు. ఇప్పుడు చూడు ఇరుక్కుపోయాను. సరే 14 న కలుస్తా మళ్ళీ. మేం మాటిస్తే తప్పం అది మా పిశాచాల రూలు' అంది.
'నేను బ్యాగ్ సర్దుకుని రెడీగా ఉంటా' అన్నా నవ్వుతూ.
'ఖర్మ' అంటూ ఫోన్ కట్ చేసింది కర్ణపిశాచి.
కధ కంచికి మనం పనిలోకి.