Pages - Menu

Pages

23, ఏప్రిల్ 2022, శనివారం

విటుల సంఖ్య

 నిన్నొక శిష్యుడు ఇలా అడిగాడు.

'గురూజీ. ఫలానా  జ్యోతిష్కుడు మీకు తెలుసా? యూట్యూబ్ లో బాగా పాపులర్ అయ్యాడు'.

నాకు జాలి, నవ్వు, కోపం, అసహ్యం ఒకేసారి కలిగాయి. ఇంత చెప్పినా మళ్ళీ ఇలాంటి చొప్పదంటు ప్రశ్నలే.

'నువ్వూ పోయి ఆ యూట్యూబ్ లో దూకు. ఇంకోసారి నా దగ్గరకి రాకు. గెట్ లాస్ట్'  అన్నాను.

శిష్యుడు  నొచ్చుకున్నాడు. 

'అదికాదు. మీరు కూడా తారాదేవిని  గురించి వ్రాశారుకదా? అతనుకూడా తారాదేవి హోమం చేసి ఎవరో నటికి మరిన్ని సినిమా ఛాన్సులు వచ్చేలా చేశాడట. అందుకని అడిగాను' అన్నాడు.

'తారాదేవి అంటే నీకర్థమైంది అదా?' అన్నాను.

'అంటే, అదికాదు ఇదికాదు'  అంటూ నసుగుతున్నాడు.

'తారాస్తోత్రం చదివావా?' అడిగాను.

'చదివాను' అన్నాడు. 

'చదివితే ఇలాంటి అనుమానాలొస్తున్నాయా? ఇదేనా నీకర్థమైంది? మీలాంటి మట్టిబుర్రలకి అర్ధంకావాలంటే అంతకంటే ఇంకా సింపుల్  గా ఎలా చెప్పాలి? ఎలా వ్రాయాలి?' అన్నాను.

'అంటే మన కష్టాలు తీరడానికి అమ్మను అడగవచ్చని మీరే ఇంకోచోట వ్రాశారు కదా?' తెలివి ఉపయోగించాడు శిష్యుడు.

'ఏంటి నీకొచ్చిన కష్టం? తింటానికి ఉంటానికి ఉందిగా? ఇంకేం కావాలి? లేకపోతే, నీక్కూడా సినిమా ఛాన్సులు కావాలా?' అడిగాను.

'ఆబ్బె నాకెందుకు?' అన్నాడు.

'మరి నన్నెయ్యమంటావా సినిమాలో వేషాలు?' అన్నా.

'చచ అదికాదు. కష్టాలు తీరాలికదా?' అన్నాడు.

ఈ రకంగా నెమ్మదిగా చెబుతుంటే వినేట్టు లేడనిపించి భాష మార్చాను.

'చూడమ్మా ! కష్టాలు తీర్చమని అడగవచ్చు. సుఖాలు పెంచమని అడగకూడదు. నీ స్థాయిలో అర్ధమయ్యేలా చెబుతా విను. ఒక బ్రోతల్ ఉందనుకో. 'నన్నీ నరకంలో నుంచి బయటపడెయ్యి' అని అమ్మను కోరవచ్చు. అంతేగాని 'ప్రతిరోజూ బోలెడుమంది విటుల్ని తీసుకురా' అని ప్రార్ధించకూడదు. నువ్వు బ్రోతల్ వే. కానీ, మరింతమంది విటుల్ని నీకోసం తేవడానికి దేవుడు నీ బ్రోకర్ కాదు. అర్థమైందా?' అన్నాను.

శిష్యుడు ఖంగుతిన్నాడు.

'అయితే మన మార్గంలో కోరికలు కోరకూడదా? వాటికోసం ప్రయత్నాలు చేయకూడదా?' అడిగాడు  వీలైనంత సౌమ్యంగా.

'కోరుకోవచ్చు. బ్రోతల్ హౌస్ నుంచి బయటపడెయ్యమని కోరుకో. ఎక్కువమంది విటుల్ని తీసుకురమ్మని కోరకు' అన్నా మళ్ళీ.

మౌనంగా చూస్తున్నాడు.

'నీ సందేహం అర్ధమైంది. ఈయనేం గురువు? ఇలాంటి ఛండాలమైన ఉదాహరణలు చెబుతున్నాడు?  అనేగా నీ సందేహం?' అడిగా.

'అబ్బే అదికాదు' అని నసుగుతున్నాడు.

'కాదని బయటకు నటించినా, లోపల నువ్వు అనుకుంటున్నది అదేనని నాకు తెలుసు. కావాలంటే సౌమ్యంగా నూరుసార్లు  వివరించి చెబుతాను. అప్పటికీ ఇలాంటి ప్రశ్నలు అడిగితే ఇలాగే వస్తాయి జవాబులు. నీకు పడే ఖర్మ ఉన్నపుడు వెళ్లి అలాంటి యూట్యూబ్ జ్యోతిష్కులనే సంప్రదించు. నన్ను విసిగించకు' అని ముగించాను.

ఇదీ లోకం తీరు. గొంతెమ్మ కోరికలు తీరడానికి దేవతాసహాయం కావాల్ట ! ఖర్మకొద్దీ బుద్ధులు ! ఈ లోకాన్ని ఎవడూ మార్చలేడు !